జీసెక్ భద్రతకు భరోసా
బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై అపారమైన నమ్మకం. భద్రత, రాబడికి పెట్టింది పేరు మరి. అయితే ఇప్పుడు ఈ ఎఫ్డీలపై వడ్డీరేట్లు బాగా తగ్గిపోయాయి. డిపాజిట్ల మీద వచ్చే వడ్డీ నెలసరి ఖర్చులకూ సరిపడా రాని పరిస్థితి. దీంతో సొమ్ముకు భద్రతతోపాటు కాస్త ఎక్కువ రాబడితో, లిక్విడిటీ ఉండే సాధనాలు ప్రస్తుతం చాలామందికి ఓ పజిల్ అయిపోయింది. ఒకప్పుడు 14 శాతం వడ్డీ ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు అందులో సగం కూడా ఇవ్వడం లేదు. ఈ పరిస్థితి కేవలం స్థిరాదాయాలపై ఆధారపడేవారికి శరాఘాతంగా మారింది. ముఖ్యంగా రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చే వివిధ దీర్ఘకాల పొదుపు లేదా గ్రాట్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఎక్కడ మదుపు చేయాలనేది పెద్ద ప్రశ్న. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీ (జీసెక్)ల్లో మదుపు ఓ చిన్న ఆశా కిరణంలా కనిపిస్తున్నది.
ఒకప్పుడు కేవలం బ్యాంకులు లేదా పెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమైన గిల్ట్‌లు, జీసెక్‌లు ఇటీవలే రిటైల్ ఇన్వెస్టర్లకూ అందుబాటులోకి వచ్చాయి. వీటికి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాల సావరిన్ గ్యారంటీ ఉంటుంది. కనుక భద్రతకు ఢోకా లేదు. ఈ కారణంగా వీటికి రేటింగ్ కూడా ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వివిధ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం జీసెక్‌లు, గిల్ట్ల ద్వారా నిధులను సమీకరిస్తాయి. కనీసం ఐదేండ్ల నుంచి 40 ఏండ్ల కాలపరిమితితో వీటిని జారీ చేస్తాయి.
గిల్ట్ ఫండ్లు
నేరుగా జీసెక్‌లలో మదుపు చేయాలంటే కనీసంగా రూ.10 లక్షలు చేయాల్సి ఉంటుంది. అయితే గిల్ట్ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం. మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలంటే అంత పెద్ద మొత్తం అవసరం కూడా ఉండదు. రూ.5,000 కూడా మదుపు చేయవచ్చు. వీటిలో ఎస్ఐపీల ద్వారా కూడా మదుపు చేయవచ్చు. ఇవి కూడా మిగతా మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా పనిచేస్తాయి. ఫండ్ మేనేజర్ వడ్డీరేట్ల మార్పులు, చేర్పులకు అనుగుణంగా ఏయే సెక్యూరిటీలలో మదుపు చేయాలో నిర్ణయాలు తీసుకుంటారు. జీసెక్లో మదుపు చేయడం వల్ల ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా ఉంటుంది. బ్యాంక్, పోస్టల్ డిపాజిట్లలో ఈ సౌలభ్యం లేదు.
ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే..
ఇండెక్సేషన్ అంటే కొనుగోలు ధరను ద్రవ్యోల్బణ ప్రభావాన్ని జోడించి మార్చడం. కొనుగోలు ధర అధికంగా ఉంటే లాభం తక్కువ. అంటే తక్కువ పన్ను చెల్లించడం. ఇండెక్సేషన్ బెనిఫిట్ వల్ల దీర్ఘకాల మూలధన లాభాల పన్నును తగ్గించుకునే వీలుంటుంది. డెట్ ఫండ్లన్నింటికీ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది.
వడ్డీరేట్లలో మార్పులు
వడ్డీరేట్లలో మార్పులు జరిగినప్పుడల్లా మనం చేసిన మదుపు సాధనాలన్నింటిపైనా ప్రభావం పడుతుంది. నిజానికి వడ్డీరేట్ల ప్రభావం బాండ్లు, ఇతర స్థిరాదాయ పథకాలపై ఎక్కువగా పడుతుంది. అందుకే ఈ పథకాల్లో మదుపు చేసేవారు వడ్డీరేట్ల మార్పులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. వడ్డీరేట్లు పెరిగితే సెక్యూరిటీ ధర తగ్గుతుంది. అలాగే వడ్డీరేట్లు తగ్గితే సెక్యూరిటీల ధరలు పెరుగుతాయి.
జీసెక్‌లను కొనడం ఎలా?
జీసెక్‌లను నేరుగా బ్రోకర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. స్టాక్ బ్రోకర్లు చాలామంది ఆఫ్ మార్కెట్ డీల్స్ ద్వారా వీటిని ఆఫర్ చేస్తుంటారు. కొనుగోలు చేయాలనుకున్నప్పుడు బ్రోకర్ కొటేషన్ అడిగి, దానికి అంగీకారమైతే కేవైసీ డాక్యుమెంట్లు సమర్పించి, అవసరమైన నిధులను కేటాయించి కొనుగోలు చేయవచ్చు. సెటిల్మెంట్ సైకిల్ ప్రకారం జీసెక్‌లు మీ డీమ్యాట్ అకౌంట్లో జమ అవుతాయి.
ప్రయోజనాలేమిటి?
గవర్నమెంట్ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తే వచ్చే ప్రయోజనాల్లో ముఖ్యమైనవి భద్రత, రాబడి. ప్రభుత్వమే సావరిన్ హామీతో జారీ చేస్తున్నది కనుక సొమ్ము భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. ఇక బ్యాంకులు, పోస్టాఫీసులు ఇచ్చే వడ్డీకన్నా కాస్త ఎక్కువ రాబడిని అందించడం వీటి ప్రత్యేకత. ఒకవేళ 10 నుంచి 15 ఏండ్ల మెచ్యూరిటీ బాండ్ 7 శాతం వరకు రాబడిని (ఈల్డ్ టు మెచ్యూరిటీ) ఇస్తే అది మంచి మదుపే. సమీప భవిష్యత్తు వడ్డీరేట్లు మరింత తగ్గే అవకాశం ఉన్నందున, 15 ఏండ్ల కోసం ఇప్పుడున్న వడ్డీనే పొందడం అంటే అదొక మంచి అవకాశమే. ఈ కాలంలో వడ్డీ మార్పులున్నా మనం మదుపు చేసిన జీసెక్ల రాబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు. అత్యవసర సమయాల్లో సొమ్మును విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉన్నందున లిక్విడిటీకి ఢోకా లేదు.
జయంత్ కుమార్
కార్వీ కంట్రీ హెడ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు