అందమంతా.. ఇంటీరియర్తోనే..
ఆధునిక గృహస్తులు ఇంటి అలంకరణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. నిర్మాణం పూర్తికాగానే తమ అభిరుచికి తగ్గట్టు గృహాలంకరణ చేసుకుంటున్నారు. మారుతున్న కాలానికి తగ్గ్గట్టుగా, ఎప్పటికప్పుడు తమ కలలసౌధాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. అధునాతన గృహానికి ‘ఇంటీరియర్ డిజైన్’తో సరికొత్త సొబగులు అద్దుతున్నారు. ‘ఇంటిని చూసి ఇంటీరియర్ డిజైన్‌ను చూడాలి’ అంటున్నారు.
సరైన ఇంటీరియర్ లేకుంటే కోట్లు వెచ్చించి కట్టినా ఇంటికి అందం రాదు. అందుకే, ‘ఇల్లు నిర్మించడం ఒక ఎత్తయితే ఆ ఇంటిని అద్భుతంగా తీర్చిదిద్దడం మరోఎత్తు’ అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ఇంటీరియర్ డిజైన్లు ఉన్నాయని, వాటిపై సరైన అవగాహన ఉండాలని, లేకుంటే ఎంత ఖర్చు పెట్టినా ఇల్లంతా బోసిపోయినట్టు కనిపిస్తుందని అంటున్నారు. అందుకే, ఇంటిని నిర్మించే సమయంలోనే గృహ యజమానులకు నచ్చినట్టుగా ఇంటీరియర్‌ను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అందరిలోకి తమ ఇల్లు ప్రత్యేకంగా కనిపించేలా మలుచుకోవాలని సలహా ఇస్తున్నారు. గృహనిర్మాణంలో ఇండిపెండెంట్ ఇండ్లు, విల్లాలు, డూప్లెక్స్ హౌజ్‌లు, రో హౌజ్‌లు.. ఇలా అనేక రకాలున్నాయి. పేరేదైనా, రూపమేదైనా అన్నిటినీ అందంగా చూపించేది మాత్రం ఇంటీరియర్ డిజైన్ మాత్రమే. అయితే, ఇంటీరియర్ డిజైనింగ్‌లో కీలకమైంది మెటీరియల్. దాని గురించి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలనీ, ఆ తర్వాతే ఇంటీరియర్ డిజైనింగ్ గురించి ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడే ఖర్చును తగ్గించుకోవడంతోపాటు మన్నికైన ఇంటీరియర్‌ను పొందవచ్చని వారంటున్నారు.
అనేక రకాలు..
ఇంటీరియర్ డిజైనింగ్కోసం రకరకాల మెటీరియల్‌ను వాడుతున్నారు. ఇందులో పార్టికల్ బోర్డు, ఎండీఎఫ్ బోర్డు, ైైప్లెవుడ్ బోర్డు, స్టెయిన్లెస్ స్టీల్, డబ్ల్యూపీసీ షీట్స్, టేక్‌వుడ్, మారుజాతి.. ఇలా అనేక రకాలున్నాయి. ఇందులో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నది. కొన్ని ఇంటి లోపలి భాగాలను అందంగా చూయిస్తే, మరికొన్ని ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
పార్టికల్ బోర్డు
తక్కువ బడ్జెట్లో లభించే మెటీరియల్‌లో పార్టికల్ బోర్డు ఒకటి. అతి తక్కువ రేటులో ఇంటీరియర్ డిజైన్ కావాలనుకొనేవారు ఈ మెటీరియల్‌వైపు మొగ్గు చూపవచ్చు. అయితే, ఇది కేవలం డెకరేటివ్కు సంబంధించిందే. ఎక్కువగా బెడ్రూమ్, లివింగ్ ఏరియాల్లో దీన్ని వాడుకోవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్కాదు కాబట్టి కిచెన్, బాత్రూమ్, వాష్ ఏరియాల్లో వాడకూడదు.
ఎండీఎఫ్ బోర్డు
మీడియం నుంచి ప్రీమియం రేంజ్లో ఇంటీరియర్ డిజైన్ కావాలనుకొనేవారికి ఎండీఎఫ్ బోర్డు మంచి ఆప్షన్. ఇది ఒక చదరపు అడుగుకు రూ.30 నుంచి ప్రారంభమై రూ.100కు పైగానే పలుకుతున్నది. అయితే, ఇదికూడా వాటర్ ప్రూఫ్కాదు. కిచెన్, బాత్రూం, వాష్ ఏరియాల్లో వాడక పోవడమే ఉత్తమం. బెడ్రూమ్, లివింగ్ ఏరియాలకు మంచిది.
స్టెయిన్లెస్ స్టీల్
ఇది పూర్తిగా ప్రీమియం రేంజ్ కిందకే వస్తుంది. ఈ మెటీరియల్‌ను ప్రస్తుతం కిచెన్లలోనే ఎక్కువగా వాడుతున్నారు. కప్ బోర్డులు, వార్డ్‌రోబ్‌లకు వాడే అవకాశమున్నా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ మౌల్డింగ్ అనేది చాలా కష్టమైన వ్యవహారం.
టేక్‌వుడ్
చెక్క జాతికి చెందిన ఈ మెటీరియల్ కూడా ప్రీమియం రేంజ్‌లోనే ఉన్నది. బాత్రూం, వాష్ ఏరియాలు మినహాయిస్తే కిచెన్, బెడ్రూమ్, డెకరేషన్, లివింగ్ ఏరియాల్లో ఎక్కడైనా దీన్ని వాడుకోవచ్చు. ఇందులో ఫినిషింగ్ లిమిటెడ్‌గా ఉంటుంది. చూసేందుకు అందంగా కనిపించకపోయినా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
డబ్ల్యూపీసీ
ఇప్పటి వరకు చెప్పుకొన్న అన్ని మెటీరియల్స్‌కు ఎక్కడో ఒకచోట పరిమితులున్నాయి. కానీ, డబ్ల్యూపీసీ మెటీరియల్స్‌కు ఎలాంటి పరిమితులూ లేవు. దీనిని ఎక్కడైనా వాడుకోవచ్చు. కిచెన్, బెడ్రూమ్, డెకరేషన్, లివింగ్ రూమ్, బాత్రూమ్, వాష్ ఏరియా.. ఇలా అన్ని చోట్ల డబ్ల్యూపీసీ మెటీరియల్‌తో ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. అయితే, ఇందులో ఎకానమీ మెటీరియల్ కాకుండా దాని డెన్సిటీని ఆధారంగా చేసుకొని నాణ్యతను పరిగణలోకి తీసుకోవాలి. ఇది మీడియం- ప్రీమియం రేంజ్ మధ్యలోనే లభిస్తుంది. ైైప్లెవుడ్కు పెట్టే ఖర్చుతోనే డబ్ల్యూపీసీతో ఇంటీరియర్ డిజైనింగ్ పూర్తవుతుంది. ఇది చెదలు పట్టదు. వాటర్ ప్రూఫ్‌గానూ ఉంటుంది. వేడిని తట్టుకోగలదు. మొత్తంగా జీవితకాలం మన్నుతుందని ఇంటీరియర్ డిజైనర్లు చెబుతున్నారు. ఇందులోనూ పలు రకాలున్నాయి. గ్లోసీ, మ్యాట్, పీయూ, పాలిష్, లామినేట్స్.. వంటివి ప్రధానమైనవి.
బరిగెల శేఖర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు