General Studies | హిమాలయ పర్వతాలు.. భూపాతాల కేంద్రాలు
హిమ పాతాలు
ఎవలాంచ్ (హిమపాతం)
- మంచు పర్వతం విరిగి పడటాన్ని హిమపాతం అంటారు. ఇవి సహజ కారణాల వల్ల రావచ్చు లేదా మానవ తప్పిదాల వల్ల రావచ్చు. మంచుతోపాటు బండరాళ్లు చెట్లు కూడా వెంట పెట్టుకుని రావచ్చు ఇవి వసంతకాలంలో కాని శీతాకాలంలో కాని సంభవిస్తాయి. కానీ గ్లేసియర్స్ పెద్ద పెద్ద బ్యాంక్ స్లయ్డ్ అంటే కొండ చరియలు విరిగిపడటం, కొండల మధ్య రవాణా ఆగిపోవడమే గుర్తుకు వస్తుంది.
- దేశంలో హిమాలయ పర్వత సానువుల్లో, పాకిస్థాన్, నేపాల్, భూటాన్‌లో ఈ సమస్య ప్రబలంగా ఉంది. కానీ భూపాతం అంటే ఇదొక్కటే కాదు. తీర ప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగి భూమి కోతకు గురికావడం కూడా భూపాతం కిందకే వస్తుంది. బంగ్లాదేశ్, శ్రీలంకలోను ఈ సమస్య ఉంది.
- ప్రపంచంలో 30 శాతం భూపాతాలు హిమాలయ పర్వత శ్రేణుల్లోనే సంభవిస్తాయి. ప్రపంచంలో చాలా పర్వతాలు ఉన్నాయి. కానీ హిమాలయాలు ఏర్పడిన తీరులోని విలక్షణత వల్ల ఇంకెక్కడా లేనంత ఎక్కువగా మంచు చరియలు ఇక్కడ విరిగిపడతాయి. అశాస్త్రీయ నిర్మాణాలు, అరణ్యాల నిర్మూలన, మైనింగ్, క్వారీయింగ్ వంటి మానవ తప్పిదాలు కూడా దీనికి దోహదపడుతున్నాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వచ్చినప్పుడు కొంత మట్టి కొట్టుకు పోవడం వల్ల భూపాతాలకు అనువైన వాతావరణం నెలకొంటుంది.
- హిమాలయ ప్రాంతాల్లోనే కాకుండా పశ్చిమ కనుమల్లో ముఖ్యంగా కొంకణ్ నీలగిరి ప్రాంతాల్లో భూపాతాలు ఏర్పడతాయి. దేశంలో 15 శాతం భూభాగంలో భూపాతానికి అవకాశం ఉంది. వీటి కారణంగా ప్రాణ నష్టం జరుగుతుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభావితమవుతుంది. జనావాసాల్లో ఆస్తినష్టం జరుగుతుంది. పంటభూములు, అడవులు నాశనమవుతాయి. భూపాతాలకు కారణాలను పరిశీలిస్తే కొండల్లో ఇంకిన నీరు ఏటవాలుగా ఉన్న మంచు చరియల్లో అస్థిరతను ఏర్పరుస్తుంది. ఇందువల్ల భూపాతాలు ఏర్పడతాయి.
వడగాలి - వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగి వడగాలులు వీస్తాయి. ఈ పరిస్థితి రుతుపవనాలు ప్రవేశించే జూన్ మాసం వరకు కొనసాగుతుంది. వాయవ్య భారతదేశంలో జూలై వరకు కూడా ఉంటుంది. ఇటీవల కాలంలో వడగాలుల వల్ల సంభవించే మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి.
- పట్టణీకరణ కారణంగా పగటి ఉష్ణోగ్రత శ్రేణిలో అంతరం తగ్గిపోవడం మరణాల సంఖ్య పెరగడానికి దారితీస్తుంది.
- వడదెబ్బ వల్ల మృతుల సంఖ్య పెరుగుతుండటంతో దీన్ని కూడా ప్రధానమైన ప్రకృతి విపత్తుగా గుర్తించాలనే డిమాండ్ వస్తుంది.
శీతల గాలులు, పొగమంచు - అసాధారణ అత్యల్ప ఉష్ణోగ్రతలతోపాటు ఉత్తర దిక్కు నుంచి భారత ఉపఖండంలోకి పొడి శీతల గాలులు ప్రవేశించడాన్ని శీతల పవనాలుగా పేర్కొంటారు. దేశంలోని ఉత్తర భాగం ముఖ్యంగా పర్వత ప్రాంతాలు వాటి పక్కనే ఉన్న మైదానాలు శీతల పవనాల ప్రభావానికి గురవుతాయి. శీతల పవనాలు కొన్నిసార్లు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి.
- శీతల పవనాల వల్ల సంభవిస్తున్న మరణాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ర్టాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
పిడుగులు, వడగళ్లు, ఇసుక తుఫాను - శీతాకాలం ముగిసి వేసవి కాలం ప్రవేశించినప్పుడు తొలుత భారతదేశ దక్షిణ భాగంలో ఉష్ణోగ్రతలు పెరిగి పిడుగుపాటులు ఎక్కువగా సంభవిస్తాయి. దక్షిణ భారతదేశంతోపాటు కోల్‌కతా, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లలో సైతం పిడుగుపాట్లు అధికంగా ఉంటాయి.
- దేశంలోని మధ్యప్రాంతం, ఈశాన్య ప్రాంతం, వాయవ్య ప్రాంతాల్లో వడగళ్లు, ఇసుక తుఫానులు తరచూ సంభవిస్తుంటాయి. వడగళ్లు అసోం లోయలో అత్యధికంగా వస్తుంటాయి. ఆ తర్వాత ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో వడగళ్లు ఎక్కువగా ఉంటాయి.
- ఇసుక తుఫాన్లు వాయవ్య భారతదేశం, పాకిస్థాన్‌లో ఎక్కువగా సంభవిస్తాయి. మనదేశంలోని రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో అత్యధికంగా సంభవిస్తాయి. రుతుపవనాలకు ముందు సమయంలో ఇసుక తుఫాన్లు సింధూ-గంగా పరీవాహక ప్రాంతంలోని విభిన్న ప్రాంతాల్లో వస్తాయి.
- పిడుగుపాటుతో జీవితాలు తలకిందులయ్యే పేదలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విపత్తుల జాబితాలో పిడుగుపాటుకు స్థానం లేనప్పటికీ దాన్ని విపత్తుల జాబితాలో చేర్చడం ద్వారా మృతుల కుటుంబాలకు ఆర్థిక పరమైన భరోసా ఇవ్వాలని 2015 మే 30న ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అగ్ని పర్వతం
- అగ్ని పర్వతం అంటేనే మనకు జపాన్. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మెక్సికో వంటి దేశాలు గుర్తుకొస్తాయి. వీటిని పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌గా పిలుస్తారు. అయితే భారత దేశం విషయానికి వస్తే అండమాన్‌లో పోర్ట్ బ్లెయిర్‌కు 135 కి.మీ. దూరంలో బారన్ అగ్ని పర్వతం ఉంది. రికార్డుల ప్రకారం ఇది 1787లో తొలిసారిగా బయటపడింది. ఇటీవల కాలంలో 2010లో మరోసారి బద్దలై 4 నెలలపాటు నిప్పులు కక్కింది.
- సాధారణంగా భూమిలో టెక్టోనిక్ ప్లేట్లు కలిసే చోట లేదా విడిపోయే చోటగానీ అగ్ని పర్వతాలు బయల్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు భూమి ఉపరితలం సాగిపోయి పల్చబడి పోతుంది. అందువల్ల లోపల ఉన్న లావా బయటకు ఉబికి వస్తుంది. అగ్ని పర్వతాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
1) చురుగ్గా ఉన్నవి 2) చల్లబడి పోయినవి 3) ప్రస్తుతానికి స్తబ్దంగా ఉన్నవి. - ప్రపంచంలో 500 అగ్ని పర్వతాలు చురుగ్గా ఉన్నట్లు అంచనా. వాటిలో చాలా భాగం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నాయి. వాటిలో 50 ప్రతి సవంత్సరం బద్దలవుతూనే ఉంటాయి. అమెరికాలో 50 చురుగ్గా ఉండే అగ్నిపర్వతాలున్నాయి. శక్తిమంతమైన అగ్నిపర్వతాలు దాదాపు 1500 వరకు ఉన్నాయి. వాటి పరిసరాల్లో 50 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఎక్స్టింట్ వల్కనోస్ గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పానకాల స్వామి ఆలయాన్ని దానిపైననే కట్టారని చెప్పుకుంటారు. దీనికి శాస్త్రీయమైన ఎలాంటి ఆధారం, రికార్డులూ లేవు.
మానవకారక విపత్తులు
సామూహిక విధ్వంసక ఆయుధాలు
ప్రాణాలకు, ఆస్తికి, పర్యావరణానికి భారీ నష్టాన్ని తెచ్చే ఆయుధాలను సామూహిక విధ్వంసక ఆయుధాలు అంటారు.
- అణు, బయోలాజికల్ రసాయన (ఎస్.బి.సి) ఆయుధాలతోపాటు రేడియోలాజికల్ ఆయుధాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి.
- 2003లో ఇరాక్‌పై అమెరికా సంయుక్త రాష్ర్టాల సారథ్యంలోని మిత్రపక్ష రాజ్యాల దాడి సందర్భంగా సామూహిక విధ్వంసక ఆయుధాలు (డబ్ల్యూ.ఎం.డి) అనే పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.
- సామూహిక విధ్వంసక ఆయుధాలు మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
1) అణ్వాయుధాలు 2) రసాయన ఆయుధాలు 3) జీవాయుధాలు
అణ్వాయుధాలు
- తన విధ్వంసక శక్తిని విచ్ఛిత్తి, సంలీన కేంద్రక చర్యల ద్వారా పొందే ఒక తరహా విస్ఫోటక ఆయుధాన్ని అణ్వాయుధం అంటారు.
- తక్కువ సామర్థ్యం ఉన్న అణుబాంబు సైతం అతిపెద్ద సంప్రదాయ ఆయుధాల కంటే కూడా ఎంతో శక్తిమంతంగా ఉంటుంది. ఒకే ఒక ఆయుధం మొత్తం నగరాన్నే విధ్వంసం చేయగల శక్తి కలిగి ఉంటుంది.
- అణ్వాయుధాల్లో రెండు ప్రాథమిక తరహా ఆయుధాలు ఉన్నాయి.
- మొదటి తరహా ఆయుధాలు తమ విస్ఫోటక శక్తిని కేంద్రక విచ్ఛిత్తి చర్యల ద్వారా మాత్రమే పొందుతాయి. వీటిని అణుబాంబులు, ఎ-బాంబులు లేదా ఫిజన్ బాంబులు అని అంటారు.
- రెండో తరహా అణ్వాయుధాలు కేంద్రక సంలీన చర్యల ద్వారా పెద్ద మొత్తంలో శక్తిని విడుదల చేస్తాయి. ఒక యూనిట్ ద్రవ్యరాశికి విచ్ఛిత్తి చర్యల కంటే సంలీన చర్యలు చాలా ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. అందువల్ల ఫిజన్ బాంబులు అంటే ఫ్యూజన్ బాంబులు లేదా థర్మో న్యూక్లియర్ బాంబులు అంటారు.
హిరోషిమా నాగసాకిపై అణుబాంబుదాడి - రెండో ప్రపంచ యుద్ధకాలంలో 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా వేసిన హైడ్రోజన్ బాంబు వల్ల హిరోషిమాలో 66 వేల మంది నాగసాకిలో 39వేల మంది మరణించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో వందల సంవత్సరాల వరకు జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. హిరోషిమాపై వేసిన బాంబు పేరు ‘లిటిల్‌బాయ్’ నాగసాకిపై వేసిన బాంబు ‘ఫ్యాట్‌మ్యాన్’.
అణు విపత్తులు
- అనాది కాలం నుంచి మానవజాతి సహజ సిద్ధంగా సంభవించే అయానీకరణ రేడియోధార్మిక శక్తి ప్రభావానికి లోనవుతుంది.
- 1942లో ఎన్రికో ఫెర్మి ఒక గ్రాఫైట్ దొంతర లోని సహజసిద్ధ యురేనియం ఆక్సైడ్ దానంతట అదే జరుగుతున్న గొలుసుకట్టు చర్యను కనుగొన్నారు. అప్పటి నుంచి విద్యుత్ ఉత్పత్తి, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయ పరిశోధన, రక్షణ రంగాల్లో అణుశాస్ర్తాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని అనువర్తింపజేయడం గణనీయంగా పెరిగింది. అణ్వాయుధ పేలుడు కారణంగా అణుధార్మికత అసాధారణంగా విడుదలయితే దాన్ని అణు అత్యవసర పరిస్థితి/ విపత్తుగా పేర్కొంటారు. దీని వల్ల పర్యావరణంలోకి హానికరమైన అణుధార్మికతలు అకస్మాత్తుగా విడుదలవుతాయి.
చెర్నోబిల్ అణు విస్ఫోటనం - 1986 ఏప్రిల్ 26న ఉక్రెయిన్ (రష్యా)లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కర్మాగారంలో సంభవించిన ప్రమాదంవల్ల 56 మంది అక్కడికక్కడే మరణించారు. వాతావరణంలో కలిసిపోయిన రేడియోధార్మికత వల్ల ఆ ప్రాంతంలో వేలాదిమంది మరణానికి ఈ సంఘటన పరోక్ష కారణమైంది.
కారణాలు - యుద్ధాల సందర్భంగా అణ్వాయుధాలను ఉద్దేశ పూర్వకంగా ఉపయోగించడం
- అణు విద్యుత్ ప్రాజెక్ట్‌ల్లో ప్రమాదాలు
- రేడియోధార్మికత వనరుల నిర్వహణలో ప్రమాదాలు
- 2015 జూలై 1 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో సుమారు 391 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. మరో 62 నిర్మాణాల్లో ఉన్నాయి.
- భారతదేశంలో 2015 జూలై 1 నాటికి 20 విద్యుత్ రియాక్టర్లు, అయిదు పరిశోధన రియాక్టర్లు నిర్వహణలో ఉండగా ఆరు విద్యుత్ రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి.
- భారతదేశం రేడియోధార్మిక శక్తిని వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, పరిశోధనలకు సంబంధించిన విభిన్న రంగాల్లో ఉపయోగిస్తోంది. 3.5 శాతం విద్యుత్ అవసరాలను అణు విద్యుత్ ద్వారా తీర్చుకుంటున్నాయి.
అణు రేడియోలాజికల్ అత్యవసర పరిస్థితుల విచారణకు మార్గదర్శకాలు - మార్గదర్శకాల లక్ష్యాల్లో సమాజంలోని అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేస్తూ ప్రణాళికలను అభివృద్ధి చేయాలి. దానివల్ల సమాజంలో అణు రేడియోలాజికల్ అత్యవసరమైన పరిస్థితులు సంభవించకుండా నిరోధించడం జరుగుతుంది. అరుదైన సందర్భాల్లో సంభవించినా మానవ ఆరోగ్యం జీవితానికి, పర్యావరణానికి ముప్పు తగ్గించడమవుతుంది.
- సహజసిద్ధమైన లేదా మానవుని నియంత్రణలోలేని మానవ కారక కారకాల వల్ల అణు రేడియోలాజికల్ అత్యవసర పరిస్థితులు ఏర్పడినట్లయితే వాటిని నిర్దిష్టమైన ముందు జాగ్రత్త ప్రణాళికలు, వ్యవస్థాపితమైన నిర్మాణ, నిర్మాణేతర చర్యల ద్వారా నియంత్రించాలి.
- అణ్వాయుధ దాడివల్ల భారీ అణు విపత్తు సంభవించడానికి అన్ని వేళలా అవకాశం ఉంది అందువల్ల స్పష్టమైన కారణాల కోసం అలాంటి పరిస్థితికి స్పందించడం కోసం నోడల్ మినిస్ట్రీ ప్రత్యేక శాంపిల్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ)ను ప్రత్యేకంగా వర్గీకృత డాక్యుమెంట్స్ రూపంలో ఉండాలి.
- అధిక శక్తి ఉన్న రేడియోధార్మిక పదార్థాల రవాణాకు ఉపయోగించే కంటెయినర్లను విఘాతాలు, అగ్ని ప్రమాదాలు, ఎత్తు నుంచి కిందకు పడిపోవడం వంటి వాటిని తట్టుకునే విధంగా రూపొందించాలి.
- వాటిని రవాణా చేసే వాహనాల వేగంపై పరిమితి విధించాలి. అన్ని రకాల ముప్పుల నుంచి జాగ్రత్త తీసుకునేందుకు ప్రత్యేక భద్రతా దళాల ద్వారా తగిన భౌతిక రక్షణ ఏర్పాటు చేయాలి.
- స్థానిక స్థాయిలో ప్రతిస్పందన అవసరమయ్యే రేడియోధార్మిక అత్యవసర పరిస్థితులు అణువిపత్తుల నిర్వహణలో అనుసరించే బాటమ్ -ఆఫ్ దృక్పథంతో కాకుండా అణుదాడుల విషయంలో సమర్థవంతమైన యంత్రాంగంతో కూడిన టాప్ డౌన్ వైఖరిని అనుసరించాలి. ఇందులో నేచురల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ కీలక పాత్ర వహించాలి. అలాంటి పరిస్థితిలో స్పందించడం కోసం నోడల్ మినిస్ట్రీ ప్రత్యేక శాంపిల్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్ఓపీ)ను ప్రత్యేకంగా వర్గీకృత డాక్యుమెంట్ రూపంలో ఉంచాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అణ్వాయుధ దాడి లేదా అణు ప్రమాదం జరిగినప్పుడు భయపడరాదు. రేడియోధార్మికత వల్ల ఎలాంటి వాసన లేని వేడి తరంగం ఒకటి తాకినట్లు ఉండి వికారంగా ఉండటం, కళ్లు తిరగడం, స్థితి భ్రాంతి కలుగడం వంటివి జరుగుతాయి.
- అణు విస్ఫోటనం జరగడానికి ముందు పుట్టగొడుగు లాంటి మేఘం ఒకటిపైకి ఎగసి పేలుతుంది.
- పేలుడు జరిగే వైపు చూడకూడదు అలా చూడటం వల్ల చూపు పోవచ్చు. ప్రభుత్వం నుంచి తదుపరి సమాచారం వచ్చేవరకు అన్ని తలుపులు, కిటికీలు మూసివేసి, ఇంటిలోపలే ఉండాలి. మంటల వల్ల భవనాలకు నష్టం కలుగవచ్చు. కానీ రేడియోధార్మికత దృఢమైన నిర్మాణాలు లోనికి చొచ్చుకు రాలేదు
- ఆహార పదార్థాలను, నీటిని కప్పి ఉంచాలి. అణు విస్ఫోటనం జరిగిన తర్వాత లభించే నీటిని, పాలను , ఆహార పదార్థాలను వినియోగించకూడదు.
- ఇంటి నుంచి బయటకు వెళ్లాలనుకున్నప్పుడు ప్రభుత్వ సూచనలు, సమాచారాన్ని పాటించాలి.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
Previous article
Human Nervous System | మానవ దేహంలో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు