Disaster management TSPSC Group 2 Special | విపత్తుల్లో జీఐఎస్ కీలకం.. ఉపయోగాలు అనేకం
భౌగోళిక సమాచార వ్యవస్థ భూమి మీద ఉన్న అనేక విషయాలను, జరగబోయే దృగ్విషయాలను గురించి విశ్లేషించే వ్యవస్థ. ఇది రిమోట్ సెన్సింగ్ అందించిన సమాచారం ఆధారంగా రూపొందించిన ఒక సాఫ్ట్వేర్. ఏదైనా ప్రాంతంలో నూతనంగా వ్యాపార సంస్థను ప్రారంభించాలన్నా, ప్రణాళికా వ్యూహాల తయారీకి, విపత్తుల నిర్వహణకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరం.
భౌగోళిక సమాచార వ్యవస్థ
- భౌగోళిక ఉపరితలానికి సంబంధించిన అన్ని వివరాలు, లక్షణాలు సమాచారాన్ని భద్రపరిచే కంప్యూటర్ వ్యవస్థనే భౌగోళిక సమాచార వ్యవస్థ అని అంటారు. జీఐఎస్ ఒక ప్రాంతంలోని పర్వతాలు, నదులు, వాగులు వంటి సహజ భౌగోళిక స్వరూపాలను, కృత్రిమమైన రోడ్లు, విద్యుత్ వ్యవస్థల ద్విపరిమాణ, త్రిపరిమాణ త్రీడీ చిత్రాలను రూపొందించగలదు. ఈ జీఐఎస్ చిత్రాలను శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో నమూనాలుగా గణాంక సమీకరణకు కొత్త పథకాలను ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి ఉపయోగిస్తున్నారు.
- భౌగోళిక సమాచార వ్యవస్థ ద్వారా విపత్తు ప్రభావిత పటాలను తయారు చేసుకోవచ్చు. సమాచారాన్ని సమగ్రంగా పొందవచ్చు. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సరికొత్త భావాలను రూపొందించుకోవచ్చు. ఇది వ్యక్తులకు సంస్థలకు విద్యాలయాలకు ప్రభుత్వాలకు ఎంతో ఉపయోగం.
- జీఐఎస్‌లో వివిధ రకాల సమాచారాన్ని లేయర్లుగా విభజించి భ్రదపరుస్తారు. మనకు కావలసిన సమాచారాన్ని బట్టి ఆయా లేయర్లను ఓపెన్ చేయాలి. ఉదా: ఒక ప్రాంతంలోని రహదారుల గురించిన సమాచారం తెలుసుకోవాలంటే అందుకు సంబంధించిన లేయర్ ఒకటి ఉంటుంది.
- మరో లేయర్లో ఆ ప్రాంతం మట్టి తీరుతెన్నుల సమాచారాన్ని, మరోదానిలో భూ ఉపరితల స్వరూపాన్ని గురించిన వివరాలు పొందుపరుస్తారు. జీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ను వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని గ్రహించడానికి వీలుగా రూపొందిస్తారు. భౌగోళిక పటాలు (మ్యాపులు) ఉపగ్రహాలు పంపే ఫొటోలు ముద్రిత సమాచారం, గణాంకాలు ఏవైనా జీఐఎస్లోకి ఇమిడి పోతాయి. జీఐఎస్ ఏదో ఒక ప్రోగ్రాంపై కాకుండా నిర్దిష్ట భౌగోళిక సమాచారంతో ఒకటిగా పనిచేసే కొన్ని ప్రోగ్రాంల సముచ్ఛయంపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాంతానికి చెందిన వివిధ భౌగోళిక విశేషాల సమాచారం లేయర్లతో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి వివిధ అవసరాలకు సమగ్రంగా వాడుకోవడానికి అనువుగా ఉంటుంది.
జీఐఎస్లోని భాగాలు
హార్డ్‌వేర్ : భౌగోళిక సమాచార వ్యవస్థ ఆపరేట్ అయ్యే కంప్యూటర్‌నే హార్డ్‌వేర్ అంటారు. ప్రస్తుత కాలంలో జీఐఎస్ సాఫ్ట్వేర్ అనేది ఎలాంటి హార్డ్‌వేర్ రకంలో అయినా పనిచేస్తుంది. కేంద్రీకృత కంప్యూటర్ సర్వర్ల నుంచి డెస్క్‌టాప్ కంప్యూటర్ల వరకు దేని మీదైనా జీఐఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చు.
సాఫ్ట్వేర్ : సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్‌తో పనిచేయించుకోవడానికి కావలసిన కమాండ్స్, వీటి ద్వారానే సమాచారాన్ని నిల్వచేయడం, విశ్లేషించడం, సమాచారాన్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో డేటాబేస్ సిస్టమ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్‌లు ఉంటాయి.
దత్తాంశం: భౌగోళిక సమాచార వ్యవస్థ లో అతి ముఖ్యమైన అంశం దత్తాంశం. ఈ దత్తాంశం సంఖ్యల రూపంలోగాని, వాక్యాల రూపంలో, పటాల రూపంలో, బొమ్మల రూపంలో గానీ ఉండవచ్చు.
ప్రజలు : ప్రజలు కూడా ఈ భౌగోళిక సమాచార వ్యవస్థలో భాగమే. ఎందుకంటే కంప్యూ టర్ సమాచారం అందించాలన్నా, కంప్యూటర్‌తో పనిచేయించాలన్నా వ్యక్తులు అవసరం.
పద్ధతులు: ఒక విజయవంతమైన భౌగోళిక సమాచార వ్యవస్థ అనేది సమగ్రంగా వ్యవస్థీకరించిన పద్ధతుల మీద, విధానాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధానాలు ప్రతి సంస్థకు ప్రత్యేకంగా ఉంటాయి.
భౌగోళిక సమాచార వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
భౌగోళిక సమాచార వ్యవస్థ ప్రపంచానికి సంబంధించిన దత్తాంశాన్ని తీసుకొని వాటన్నింటికి సంబంధాలు ఏర్పాటు చేస్తూ ఒక క్రమపద్ధతిలో అమరుస్తుంది. అయితే ఈ వ్యవస్థ అక్షాంశం, రేఖాంశాలను, గ్రాటిక్యూల్ను, వివిధ మ్యాపులను (ప్రపంచ, దేశాలు, అడవులు, రోడ్డు మార్గాలు, విపత్తు ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన మ్యాపులు) ఆయా ప్రాంతాలకు సంబంధించి సంఖ్యా రూపంలో పదాల రూపంలో ఉన్న సమాచారాన్ని నిల్వచేస్తుంది. ఈ భౌగోళిక సమాచార వ్యవస్థ రెండు రకాలు
1) వెక్టార్ నమూనా 2) రాస్టార్ నమూనా
వెక్టార్ నమూనా: వెక్టార్ నమూనాలో సమాచారం బిందువుల రూపంలో, రేఖల రూపంలో, బహుభుజి రూపంలో నిల్వ చేస్తారు. ఉదా: నీటి బావిని బిందువు రూపంలో రోడ్డు మార్గాన్ని లైను రూపంలో చూపిస్తారు.
రాస్టార్ నమూనా: రాస్టార్ నమూనాలో సమాచారం అనేది వివిధ పిక్సెల్స్ రూపంలో ఉంటుంది. ఈ పిక్సెల్స్‌ను వివిధ అడ్డువరుసల్లో నిలువు వరుసల్లో అమరుస్తారు. వాటిని రిమోట్ సెన్సింగ్ సహాయంతో పొందుతారు. అయితే అనలాగ్ రూపంలో గల దత్తాంశాన్ని డిజిటల్ సహాయంతో డిజిటల్ దత్తాంశాన్ని కంప్యూటర్లో నమోదు చేసుకుంటుంది.
- ఇలా సేకరించి నిల్వ చేసే దత్తాంశాలకు సంబంధాలు ఏర్పరుస్తుంది. అంటే పటాలకు సంబంధించిన పట్టిక రూపం దత్తాంశాన్ని జోడించడం జరుగుతుంది. ఉదా: భారతదేశ పటం కంప్యూటర్లో నమోదు చేసి వివిధ రాష్ర్టాల్లో విపత్తు ప్రభావిత ప్రాంతాలు, వైశాల్యం, జనాభా వనరులకు సంబంధించిన పట్టికలను ఆ పట్టికలతో జోడించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఎవరైనా భారతదేశ పటం చూసినపుడు ఏదైనా రాష్ట్ర జనాభా గాని, వైశాల్యంగాని, వనరులు గాని తెలుసుకునే వీలుంటుంది. ఇలా వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. అంటే జనాభా, అడవుల, నదుల ఆధారంగా సమాచారం నిల్వ చేయడం వల్ల ఈ వ్వవస్థను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుంది.
జీఐఎస్ Vs కార్టోగ్రఫీ
జీఐఎస్‌లో కింది నాలుగు అంశాలు ఉంటాయి.
1) ఇన్పుట్
2) డేటాబేస్
3) అనాలసిస్
4) ఔట్పుట్ దీనికి ప్రతిగా మ్యాపింగ్ వ్యవస్థలో మూడు అంశాలే ఉంటాయి. ఇవి
1) ఇన్పుట్
2) మ్యాప్డిజైన్
3) ఔట్పుట్ - కార్టోగ్రఫీ మనకు భౌగోళిక స్వరూప స్వభావాల చిత్రాన్ని మాత్రమే అందిస్తే జీఐఎస్ డేటాబేస్ సమాచారం ఆధారంగా స్వరూప స్వభావాలకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. మామూలు మ్యాపింగ్ వ్యవస్థలో మనం కేవలం సగటున 50 మీటర్ల ఎత్తున్న చెట్లతో బాగా విస్తరించిన అటవీ భాగాన్ని మాత్రమే చూపమంటే వీలుకాదు అదే జీఐఎస్ వ్యవస్థ అయితే ఆ ప్రదేశాన్ని వెతికి పట్టి మనకు చూపగలదు. సరైన జీఐఎస్‌కు కింది లక్షణాలు కూడా ఉంటాయి.
డేటాబేస్ విశ్లేషణాత్మక జియో రిఫరెన్సింగ్ గ్రాఫిక్ అవుట్‌పుట్
జీఐఎస్ అందించే సమాచారం
- ఒక నదివల్ల సంభవించే వరదల కారణంగా ఏ గ్రామాలు ముంపునకు గురవుతాయి ఎంత విస్తీర్ణంలో పంటనష్టం, పశునష్టం, ప్రాణనష్టం జరిగాయో అంచనా వేస్తుంది.
- విపత్తు సంభవించిన ప్రదేశం, ఉనికి, దాని తీవ్రత, దాని తరచుదనం మొదలైన అంశాలను గురించి వివరాలను అందిస్తుంది. ఉదా: భూపాతాలు, వరదలు, భూకంపాలు మొదలైనవి.
- విపత్తు సంభవించిన ప్రదేశం భూ స్థలాకృతి, స్వభావం, భూ విజ్ఞాన చరిత్ర, నేలల స్వరూపం, జలస్థితి, భూ వినియోగ రీతి, ఇక్కడి వృక్ష సంపద మొదలైన వాటికి సంబంధించిన డేటాను అందిస్తుంది.
- విపత్తు కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతులు, నివాసాలు, నిరాశ్రయులైన ప్రజలు వారి సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి, విపత్తు సంభవించిన ప్రాంతంలో అత్యవసర ఉపశమన చర్యలు చేపట్టడానికి తగిన వనరులు ఆ ప్రాంతంలో ఏమున్నాయనే విషయంపై డేటాను అందిస్తుంది.
- దేశంలో భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కడ ఉందో తెలుపుతుంది. భూకంపాన్ని తట్టుకోగల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూకంప ప్రభావానికి లోతైన ప్రాంతాల్లో చేపట్టవలసిన ఉపశమన, పునరావాస, పునర్ నిర్మాణానికి సంబంధించి తగిన ప్రణాళికలను రూపొందించడంలో సహాయపడుతుంది.
- ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు, కాలగతిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకు న్నాయనే విషయాలను తెలుసు కోవచ్చు.
- జీఐఎస్ సమాచారాన్ని చుక్కలు, గీతలు, చాపాలు, బహుభుజాలు/ ప్రాంతాలను పొందుపరుస్తారు. ప్రతి ఒక లేయర్ లేదా థీమ్‌లో నేలతీరు, నేలవాడటం, మురుగునీటి పారుదల లాంటి వివిధ అంశాలకు చెందిన ప్రత్యేక సమాచారం పొందు పరిచి ఉంటుంది. జియో రిఫరెన్సింగ్ ఫలితంగా ఈ లేయర్లు పరస్పరం కచ్చితమైన అనుసంధానాన్ని కలిగి ఉంటాయి. వాటి మధ్య విశ్లేషణకు వీలు కల్పించేవిగా ఉంటాయి. జీఐఎస్ సమాచారాన్ని రెండు విభాగాలుగా విభజించవచ్చు.
- ప్రాదేశిక సమాచారం ఫలానా ప్రదేశం/ చోటు ఎక్కడ ఉంది? లాంటి ప్రశ్నలకు జవాబును అందిస్తుంది.
- జీఐఎస్ ఆధారంగా వ్యూహాత్మకమైన సుస్థిరాభివృద్ధి పథకాలపై దృష్టి కేంద్రీకరించడంతో ఒక ప్రాంతం నుంచి మనిషి పూర్తిస్థాయి లబ్ధిని పొందే అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఆ ప్రయత్నంలో బాధ్యతారహితంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతినే పనులు చేపట్టకుండా పథక రచనలో జాగ్రత్త వహిస్తున్నారు.
జీఐఎస్ ఉపయోగాలు
- జీఐఎస్‌ను ఒక ప్రాంతంలో విపత్తుల నిర్వహణ కోసం, విధి నిర్వహణ సమస్యల పరిష్కారానికి, ఒకచోట నెలకొన్న అనేక పరిశ్రమల ప్రభావ పరిశీలనకు, వివిధ రకాల గృహనిర్మాణ ప్రభావ పరిశీలనకు, ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాల పరిశీలనకు ఉపయోగిస్తారు. జీఐఎస్ అనువర్తనం ఎంతో విస్తృతిని కలిగి ఉండటమే కాకుండా పెరిగే అవకాశం ఉంది.
- ఏదైనా సంభవించగలిగే దృగ్విషయాలను తెలుపుతుంది. అంటే నదిలో నీటి పరిమాణం 10వ వంతు పెరిగితే ఏయే ప్రాంతాలు మునిగిపోతాయి? ఏ ప్రాంతంలో భూపాతాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉంది? అనే విషయాలను తెలుపుతుంది.
- జీఐఎస్ పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు పర్యావరణంలో మార్పులను అధ్యయనం చేయవచ్చు.
- ఇంజినీర్లు రహదారి వ్యవస్థను చక్కగా రూపొందించవచ్చు
- ప్రభుత్వాలు వివిధ రకాల అవసరాల స్థల సేకరణకు జీఐఎస్ మీద ఆధారపడవచ్చు.
- గమ్యాన్ని వేగంగా చేరాల్సి ఉన్నప్పడు అగ్నిమాపక దళం, పోలీసులు అతిసమీప మార్గాన్ని వెతుక్కోగలరు.
- ప్రైవేట్ వ్యాపార వర్గాలవారు ఎందరో తమ వ్యాపారాభివృద్ధికి జీఐఎస్‌ను ఉపయోగించుకుంటున్నారు.
- ఉపగ్రహాలు అందిస్తున్న వివిధాంశాల సమాచారాన్ని జీఐఎస్ కంప్యూటర్లు విశ్లేషించి భూమి గణాంకాలను తెలియజేస్తాయి. భూసారం, తేమ, లోటుపాట్లు, వాలు, సూక్ష్మ వాతావరణం తదితర వివరాలను విశ్లేషించి ఆ స్థలాన్ని చక్కగా ఎలా వినియోగించుకోవచ్చో చెబుతాయి.
- సరిహద్దులను గుర్తించడం జీఐఎస్ వల్ల సులభమవుతుంది. తత్ఫలితంగా సరిహద్దు వివాదాలకు ఆస్కారం ఉండదు. స్థల చిత్రాలను రూపొందించడంలో పురాతత్వ శాస్త్రవేత్తలకు ఈపరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది. పురాతన నగరాల చిత్రపటాలను రూపొందించడంలో, దట్టమైన అడవుల్లోని శిథిల ప్రదేశాలను పురాతత్వ ప్రదేశాలను కనుగొనడంలో కూడా పరిజ్ఞానం కీలకపాత్ర పోషిస్తుంది.
రిమోట్ సెన్సింగ్ వల్ల విపత్తుల విషయంలో కలిగిన ప్రయోజనాలు - 1984 నుంచి 1992 మధ్య హిమాలయ ప్రాంతాల్లో మంచు కరిగే రేటును అధ్యయనం చేశారు.
- ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో ఉన్న వివిధ కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యాన్ని, వాటి పరిమాణాన్ని ఐఆర్ఎస్ ఉపగ్రహ సమాచారం ద్వారా అంచనా వేశారు.
- ఉత్తరప్రదేశ్‌లోని మహేశ్వరం ఆనకట్టను నిర్మించ డానికి అనువైన నేల కోసం ఐఆర్ఎస్ ఉపగ్రహ సమాచారం ఆధారంగా సర్వే నిర్వహించారు.
- మురుగునీటిలో కాలుష్యం బారిన పడిన శారదా నదిని అధ్యయనం చేశారు.
- రుతుపవనాలకు ముందు, తర్వాత పంజాబ్ భూభాగంలో శీతోష్ణ పరిస్థితుల్లో కలిగే మార్పులను అధ్యయనం చేయడానికి ఐఆర్ఎస్ ఉపగ్రహ సమాచారాన్ని వినియోగించారు.
- రాజస్థాన్ భూగర్భంలో అంతర్దానమైన సరస్వతి నది ఆనవాళ్లను ఐఆర్ఎస్ ఉపగ్రహ చిత్రాల ద్వారా కనుగొన్నారు.
- గుజరాత్ సముద్రతీర ప్రాంతంలోని సముద్ర గర్భంలో ద్వారకా పట్టణ శిథిలాలను కనుగొన్నారు.
- మహారాష్ట్రలో 1993 లాతూర్, 2001 జనవరి 26న గుజరాత్ భుజ్‌లో వచ్చిన భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.
- 2004లో సునామీ సృష్టించిన నష్టాన్ని సముద్రంలో మునిగిపోయిన తీరప్రాంతాలపై అధ్యయనం చేశారు.
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు