Current Affairs May 17 | తెలంగాణ
తెలంగాణ
రోబోటిక్ ఫ్రేమ్‌వర్క్
టీ-హబ్‌లో ఐటీ శాఖ రూపొందించిన రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మంత్రి కేటీఆర్ మే 9న ప్రారంభించారు. ఇది దేశంలోనే తొలి రోబోటిక్స్ ఫ్రేమ్‌వర్క్. ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో రోబోటిక్స్ విధానం అమలు, సుస్థిర రోబోటిక్స్ వ్యవస్థ అభివృద్ధి, వ్యవసాయం, ఆరోగ్య రంగం, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, కన్జ్యూమర్ రోబోటిక్స్‌పై దృష్టి, ల్యాబొరేటరీలతో కూడిన రోబో పార్కుల ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, ఇంక్యుబేటర్లు, పరిశ్రమ, భాగస్వామ్యాలతో ఉత్పత్తి కేంద్రాలు, పని ప్రదేశాల ఏర్పాటు, ప్రపంచ స్థాయి ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటివి దీని లక్ష్యాలు.
గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్
హైదరాబాద్‌లో జూలైలో నిర్వహించనున్న గ్లోబల్ రోబోటిక్స్ సమ్మిట్ పోస్టర్‌ను మంత్రి కేటీఆర్ మే 10న ఆవిష్కరించారు. ఈ సదస్సులో రోబోటిక్స్‌లో అత్యాధునిక మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించనున్నట్లు ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ (ఏఐఆర్ఏ) చైర్మన్ పీఎస్వీ కిషన్ వెల్లడించారు. 25 దేశాల నుంచి పెట్టుబడిదారులు, సైంటిస్టులు, ఎకోసిస్టమ్ భాగస్వాములు హాజరు కానున్నారు.
ఓడీఎఫ్ ప్లస్
స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జలశక్తి శాఖ మే 10న వెల్లడించింది. భారత్‌ను బహిరంగ మల విసర్జనరహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) దేశంగా మార్చేందుకు స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ పథకం ఫేజ్-1ను 2014లో భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఫేజ్-2లో భాగంగా ఇప్పటికే 50 శాతం వరకు గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌గా మారాయి. దేశవ్యాప్తంగా 2,96,928 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్‌లో ఉన్నాయి. ఇందులో అన్ని గ్రామ పంచాయతీలు ఓడీఎఫ్ ప్లస్‌గా కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ (100 శాతం) తొలిస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో కర్ణాటక (99.5 శాతం), తమిళనాడు (97.8 శాతం), ఉత్తరప్రదేశ్ (95.2 శాతం) ఉన్నాయి. చివరి స్థానంలో గుజరాత్ ఉంది. చిన్న రాష్ర్టాల్లో గోవా (95.3 శాతం), సిక్కిం (69.2 శాతం) ఉత్తమ పనితీరు కనబరిచినట్లు జలశక్తి శాఖ పేర్కొంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, లక్షద్వీప్‌లలో 100 శాతం గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ హోదా పొందాయి.
శంషాబాద్ ఎయిర్పోర్ట్
ప్రపంచంలోనే అత్యంత సమయపాలన పాటించే విమానాశ్రయంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ గుర్తింపు పొందిందని జీఎంఆర్ సంస్థ మే 11న వెల్లడించింది. ఏవియేషన్ అనలిటికల్ సంస్థ సిరియం ఈ ఏడాది మార్చికి గాను ఇచ్చిన నివేదికలో సమయపాలన పాటిస్తున్న ఎయిర్‌పోర్టుల్లో రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐఏ) మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 90 శాతం విమానాలు సరైన సమయానికి గమ్యస్థానాలకు చేరుకున్నట్లు తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా మార్చిలో 50 లక్షల విమానాల రాకపోకలను సమీక్షించి ఈ నివేదిక రూపొందించింది. దీనిలో ఎప్పుడూ ముందుండే జపాన్ ఎయిర్‌పోర్టులను అధిగమించి తొలిసారి ఓ భారతీయ ఎయిర్పోర్ట్ నిలిచింది. ఈ నివేదికలో బెంగళూరు ఎయిర్పోర్ట్ 2, కొలంబియా 3, ఫిలడెల్ఫియా 4, హనెడా 5వ స్థానాల్లో నిలిచాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు