Current Affairs | అంతర్దృష్టి అనే పదం ఏ వ్యవస్థకు సంబంధించింది?
1. ఎంవీ ఎంప్రెస్ దేనికి సంబంధించింది? (3)
1) నూతన పార్లమెంట్ భవనంలో ఒక గది పేరు
2) భారత దేశపు తొలి స్వదేశీ పరిజ్ఞాన క్షిపణి
3) భారత దేశపు తొలి అంతర్జాతీయ పర్యాటక క్రూయిజ్
4) భారత దేశపు అత్యంత వేగవంతమైన కంప్యూటర్
వివరణ: ఎంవీ ఎంప్రెస్ అనేది ఒక క్రూయిజ్ వెసెల్. అలాగే ఇది అంతర్జాతీయ పర్యాటక నౌకగా చెప్పవచ్చు. చెన్నై నుంచి శ్రీలంకకు తొలిసారిగా వెళ్లింది. దీంతో దేశంలో తొలిసారిగా అంతర్జాతీయ పర్యాటక క్రూయిజ్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని రూ.17.21 కోట్లతో నిర్మించారు. జూన్ 5న దీన్ని ప్రారంభించారు. ఆ రోజు పర్యాటక దినోత్సవం అయినందున చెన్నై పోర్ట్‌లో 2500 మొక్కలను కూడా నాటారు. ఈ క్రూయిజ్ ప్రారంభానికి 2022లో చెన్నై పోర్ట్ అలాగే వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదిరింది. దేశీయ, అంతర్జాతీయ క్రూయిజ్ సేవలను అందించే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.
2. భారత్ ఏక్తా విన్యాసం ఏ దేశంతో నిర్వహిస్తుంది? (4)
1) నేపాల్ 2) బంగ్లాదేశ్
3) భూటాన్ 4) మాల్దీవులు
వివరణ: భారత్, మాల్దీవుల మధ్య ఏక్తా విన్యాసం నిర్వహిస్తున్నారు. ఇది జూన్ 4న ప్రారంభమయ్యింది. జూలై 3 వరకు కొనసాగుతుంది. ఈ రెండు దేశాల మధ్య ఈ విన్యాసం ఆరోది. ఇరు దేశాలకు చెందిన నావికా కమాండోల మధ్య ఈ విన్యాసం నిర్వహిస్తున్నారు. అలాగే రెండు దేశాల మధ్య ఈకువెరియన్ అనే పేరుతో కూడా విన్యాసాలు జరుగుతున్నాయి. ఈకువెరియన్ అంటే స్నేహితులు అని అర్థం. ఈ పదం దివేహి అనే భాషకు సంబంధించింది. ఈ విన్యాసం ఇరు దేశాల మధ్య 2009లో ప్రారంభమయ్యింది.
3. ఏ దేశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చెయిన్ ఆఫ్ ది యెల్లో స్టార్’ అవార్డ్ ఇచ్చింది? (3)
1) పపువా న్యూగినియా 2) ఈస్ట్ తైమూర్ 3) సురీనామ్ 4) లావోస్
వివరణ: భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ద్రౌపది ముర్ము తొలి విదేశీ పర్యటన సురీనామ్, సెర్బియా దేశాల్లో చేపట్టారు. జూన్ 4 నుంచి జూన్ 9 వరకు ఇది కొనసాగింది. రెండు దేశాలతో వివిధ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. పలు ఒప్పందాలు కూడా కుదిరాయి. అలాగే రాష్ట్రపతికి సురీనామ్ దేశం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చెయిన్ ఆఫ్ ది యెల్లో స్టార్’ అనే బిరుదును ఇచ్చింది. సురీనామ్ అధ్యక్షుడు చంద్రికా పెర్సాద్ సంటోకి. ఈ ఏడాది ఇండోర్‌లో నిర్వహించిన 17వ ప్రవాస భారతీయ దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా చంద్రికా పెర్సాద్ హాజరయ్యారు.
4. ఇటీవల భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏ అంశంపై నివేదిక ఇచ్చింది? (1)
1) సుస్థిరాభివృద్ధికి రహదారుల
2) రహదారి ప్రమాదాలు
3) గత పదేళ్లలో చేపట్టిన రహదారుల విస్తరణ
4) పైవేవీ కాదు
వివరణ: జాతీయ రహదారుల అభివృద్ధి ఏ విధంగా సుస్థిరాభివృద్ధిని చేపట్టిందన్న అంశంపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) 2021-22 సంవత్సరానికి ఒక నివేదికను సమర్పించింది. జాతీయ రహదారుల నిర్మాణంలో రీసైక్లింగ్ పరికరాలను వినియోగించడం, ప్లాస్టిక్ వృథాతో పాటు ఫ్లైయాష్ వంటివి వినియోగించారు. అలాగే రహదారుల నిర్మాణంలో జంతు సంరక్షణను భాగం చేశారు. 100 వైల్డ్‌లైఫ్ క్రాసింగ్స్ ఏర్పాటు చేయడం ద్వారా అటవీ జంతువులు స్వేచ్ఛగా వెళ్లేలా నిర్మాణాన్ని చేపట్టారు. రహదారులకు పక్కన మొక్కలు నాటడం, ఇందుకు మహిళల సేవలను వినియోగించడంతో సంపద పంపిణీ కూడా జరిగిందని నివేదిక వెల్లడించింది.
5. న్యాయ వికాస్ పోర్టల్ దేనికి సంబంధించింది? (3)
1) న్యాయ వ్యవస్థ పనితీరును తెలుపుతుంది
2) న్యాయ వ్యవస్థ పురోగతిని తెలుపుతుంది
3) కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించింది
4) న్యాయ విద్యకు సంబంధించింది
వివరణ: కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు సంబంధించింది న్యాయ వికాస్ పోర్టల్. పథకానికి సంబంధించిన నిధులు, అనుమతులు తదితర అంశాలన్నీ ఇందులో అందుబాటులో ఉంచుతారు. ఈ పథకాన్ని 1993-94లో ప్రారంభించారు. న్యాయ వ్యవస్థలో అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది.
6. అంతర్దృష్టి అనే పదం ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ వ్యవస్థకు సంబంధించింది? (3)
1) సెబీ
2) సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్
3) ఆర్బీఐ 4) ఐఆర్డీఏ
వివరణ: అంతర్దృష్టి అనే డ్యాష్ బోర్డును జూన్ 6న రిజర్వ్ బ్యాంక్‌లో ప్రారంభించారు. ఇది ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు ఉద్దేశించింది. సమ్మిళిత వృద్ధిని సాధించే క్రమంలో భాగంగా అవసరమైన ప్రమాణాలను వివరిస్తుంది. ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు, అందుకు మార్గాలను తెలియజేసేలా తీర్చిదిద్దారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ దీన్ని ప్రారంభించారు. నిజానికి ఆర్థిక సమ్మిళిత వృద్ధి సూచీని 2021లో ఆర్బీఐ ప్రారంభించింది. బ్యాంకింగ్, పెట్టుబడులు, బీమా, పోస్టల్ సర్వీసులు తదితర అంశాలను ఇది సూచిస్తుంది.
7. 78వ యూఎన్జీఏ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? (4)
1) సబా కొరోసీ 2) అలైస్టర్
3) ఐండ్రేజా 4) డెన్సిస్ ఫ్రాన్సిస్
వివరణ: ఐక్యరాజ్య సమితి 78వ సాధారణ సభకు ట్రినిడాడ్ టొబాగో దేశానికి చెందిన డెన్నిస్ ఫ్రాన్సిస్ ఎన్నికయ్యారు. ఈ దేశం నుంచి ఈ బాధ్యతను స్వీకరించనున్న తొలి వ్యక్తి ఆయన. ఐక్యరాజ్య సమితికి ఆరు అంగాలు ఉంటాయి. సభ్యత్వం పరంగా అందులో అతి పెద్దది యూఎన్జీఏ. 193 దేశాలు ఇందులో ఉంటాయి. ఈ సభ సమావేశాలు ఏటా సెప్టెంబర్ మూడో మంగళవారంలో ప్రారంభమై, తర్వాతి సంవత్సరం మూడో సోమవారంతో ముగుస్తాయి. 2023 సెప్టెంబర్‌లో 78వ సమావేశం ప్రారంభమై, 2024 సెప్టెంబర్‌లో ముగుస్తుంది. దీనికి డెన్నిస్ ఫ్రాన్సిస్ నేతృత్వం వహిస్తారు. 77వ సమావేశానికి హంగేరీకి చెందిన సబా కొరోసీ నేతృత్వం వహించారు. ఈ సభకు ఇప్పటి వరకు భారత్ నుంచి కేవలం విజయలక్ష్మీ పండిట్ మాత్రమే నేతృత్వం వహించారు. ఆమె ఈ ఘనతను దక్కించుకున్న ప్రపంచ తొలి మహిళ.
8. ఐయూసీఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్‌ను 2025లో ఎక్కడ నిర్వహించనున్నారు? (2)
1) సౌదీ అరేబియా 2) యూఏఈ
3) ఫ్రాన్స్ 4) స్పెయిన్
వివరణ: ఐయూసీఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ వ్యవస్థకు సంబంధించిన ‘వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్’ను 2025లో అబు ధాబీలో నిర్వహించనున్నారు. ఆ సంవత్సరం అక్టోబర్ 9 నుంచి 15 వరకు ఇది కొనసాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రపంచ పరిరక్షణ సమావేశం కానుంది. ఐయూసీఎన్ ను 1948 అక్టోబర్ 5న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్‌లోని గ్లాండ్‌లో ఉంది. సహజ వనరులు సుస్థిర వినియోగం, ప్రకృతి పరిరక్షణ కోసం పాటు పడుతుంది ఈ సంస్థ.
9. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఓవరాల్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్న విద్యావ్యవస్థ ఏది? (3)
1) ఐఐఎస్సీ 2) ఐఐటీ మద్రాస్
3) జేఎన్‌యూ
4) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వివరణ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అన్ని విద్యావ్యవస్థల ఓవరాల్ ర్యాంకింగ్‌లో జేఎన్‌యూ అగ్రస్థానంలో ఉంది. రెండు, మూడు స్థానాల్లో వరుసగా బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం, జామియా మిలియా ఇస్లామియా విద్యాలయాలు ఉన్నాయి. ఇంజినీరింగ్‌లో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే ఉన్నాయి. కళాశాలల్లో మిరిండా హౌజ్ (ఢిల్లీ యూనివర్సిటీ), హిందూ కాలేజీ, ప్రెసిడెన్సీ కాలేజ్, పరిశోధన విభాగంలో బెంగళూర్‌లోని ఐఐఎస్సీ అగ్రస్థానంలో ఉండగా, ఇన్నోవేషన్‌లో ఐఐటీ కాన్పూర్ మొదటి స్థానంలో ఉంది. మేనేజ్మెంట్లో ఐఐఎం అహ్మదాబాద్ ప్రథమ స్థానంలో ఉంది. ఫార్మసీలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అలాగే న్యాయ శాస్ర్తానికి సంబంధించి బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో నిలిచాయి.
10. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఎవరు డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు? (1)
1) జనార్దన్ప్రసాద్ 2) విశాల్ త్రిపాఠి
3) వంశీ కౌశిక్ 4) సుదర్శన్ రాఘవ
వివరణ: పశ్చిమబెంగాల్లోని కోల్‌కతా కేంద్రంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పనిచేస్తుంది. 1851లో దీన్ని స్థాపించారు. దీనికి కొత్త డైరెక్టర్‌గా జనార్దన్ప్రసాద్ నియమితులయ్యారు. జూన్ 2న ఆయన బాధ్యతలను స్వీకరించారు.
11. ప్రపంచ వాతావరణ సంస్థ (వరల్డ్ మెటీరియోలాజికల్ ఆర్గనైజేషన్)కు కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? (2)
1) మృత్యుంజయ్ మొహపాత్ర
2) అబ్దుల్లా అల్ మండౌస్
3) సెలెస్టే సౌలో 4) స్టీఫెన్
వివరణ: ప్రపంచ వాతావరణ సంస్థకు అబ్దుల్లా అల్ మండౌస్ నేతృత్వం వహించనున్నారు. 2023 నుంచి 2027 వరకు నాలుగు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే దీనికి వైస్ ప్రెసిడెంట్‌గా మృత్యుంజయ్ మొహపాత్ర ఎన్నికయ్యారు. ఆయనను సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అలాగే ఈ వ్యవస్థకు సెక్రటరీ జనరల్‌గా సెలెస్టే సౌలో అనే మహిళ బాధ్యతలు స్వీకరించనుంది. ఈ ఘనతను దక్కించుకున్న తొలి మహిళ ఆమె. ఆమెది అర్జెంటీనా దేశం.
12. యూనివర్సల్ పోస్టల్ యూనియన్‌కు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ప్రారంభించనున్నారు? (3)
1) బెంగళూరు 2) చెన్నై
3) న్యూఢిల్లీ 4) గువాహటి
వివరణ: యూనివర్సల్ పోస్టల్ యూనియన్ను 1874లో ఏర్పాటు చేశారు. బెర్న్ ఒప్పందంలో భాగంగా ఇది ఏర్పాటయ్యింది. ప్రధాన కేంద్రం కూడా స్విట్జర్లాండ్‌లోనే ఉంది. ఈ సంస్థకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా పోస్టల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు వీలుంటుంది.
13. పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్‌ను ఏ జట్టు గెలుచుకుంది? (4)
1) బంగ్లాదేశ్ 2) చైనా
3) ఇండోనేషియా 4) భారత్
వివరణ: పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది. గతంలో ఈ టోర్నీని భారత్ 2004, 2008, 2015లో గెలుచుకుంది. ఈ టోర్నీ ఒమన్‌లోని సలాలాహ్లో నిర్వహించారు. ఆసియా హాకీ సమాఖ్య దీన్ని ఏర్పాటు చేస్తుంది.
14. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? (1)
1) అమరేందు ప్రకాశ్
2) వినయ్ రాయ్
3) ఘని రాజ్ 4) ప్రభాకర్
వివరణ: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అమరేందు ప్రకాశ్ నియమితులయ్యారు. మే 31న ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన బొకారో స్టీల్ ప్లాంట్‌కు ఇన్చార్జి డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు.
15. ప్రపంచ బ్యాంక్‌కు ప్రస్తుతం ఎవరు సారథ్యం వహిస్తున్నారు? (3)
1) ఇందర్మిత్ గిల్ 2) అన్షులా కాంత్
3) అజయ్ బంగా 4) డేవిడ్ మాల్పస్
వివరణ: ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి ప్రస్తుతం అజయ్ బంగా సారథ్యం వహిస్తున్నారు. ఆయన భారత సంతతికి చెందిన వ్యక్తి. జూన్ 2న బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డేవిడ్ మాల్పస్ ఈ పదవిలో ఉన్నారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ప్రపంచ బ్యాంక్ లేదా ఐఎంఎఫ్‌కు భారత్‌కు చెందిన లేదా భారత సంతతికి చెందిన వ్యక్తులు సారథ్యం వహించడం ఇదే ప్రథమం. అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్స్ సీఈవోగా కూడా విధులు నిర్వహించారు. ప్రపంచ బ్యాంకుకు ఆయన 14వ డైరెక్టర్‌గా ఉన్నారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
21st సెంచరీ ఐఏఎస్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు