What title did Tanisha give to Madanna | మాదన్నకు తానీషా ఇచ్చిన బిరుదు? హిస్టరీ
కుతుబ్‌షాహీల న్యాయవ్యవస్థ
– కుతుబ్‌షాహీల న్యాయవ్యవస్థలో ప్రజలకు న్యాయం అందించడంలో ముస్లిం మతపెద్దలు, హిందూ పండితులు సుల్తాన్‌కు సాయం చేసేవారు. న్యాయ విచారణ రాజధానిలో, స్థానికంగా కూడా కాజీలు, పండితులు నిర్వహించేవారు. సుల్తాన్ కూడా ఈ విషయంలో ఎంతో ఆసక్తి కనబరిచేవాడు. న్యాయం అందించే విషయంలో ప్రత్యేకంగా మహ్మద్ కులీ కుతుబ్‌షాకు ఎంతో పేరుంది. ఈ విషయంలో అతడిని విదేశీ పర్యాటకులు కూడా మెచ్చుకున్నారు.
– అతడు ‘దాద్ మహల్’ అనే న్యాయ మందిరాన్ని ప్రత్యేకంగా దీనికోసమే కట్టించాడు. ఆ తరువాత తుఫానువల్ల ఈ భవనం దెబ్బతినగా మహ్మద్ కులీ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన సుల్తాన్ మహ్మద్ దానిని బాగు చేయించాడు. అతడు మరో భవంతి ‘అమన్ మహల్’ కూడా ఇదే ప్రయోజనార్థం కట్టించాడు.
– ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ అబ్దుల్లా కుతుబ్‌షా ఎలా న్యాయాన్నందించేవాడో వివరించాడు. మరో యాత్రికుడు థెవ్నాట్ అబ్దుల్లాను ఎంతో న్యాయపండితుడని కీర్తించాడు. అమీరులు కూడా చట్టపు బలమైన హస్తాన్నుంచి తప్పించుకోలేడంటాడు. దౌర్జన్యంతో ఓ షరాబు నుంచి ఓ అమీరు గుంజుకున్న రూ.5000లను బలవంతంగా తిరిగి ఇప్పించిన వైనం అతడు వివరించాడు.
l ఎల్చీబేగ్ కొంతమంది వర్తకుల నుంచి డబ్బు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టగా ఈ విషయాన్ని వర్తకులు సుల్తాన్ అబ్దుల్లాకు నివేదించినప్పుడు అతడు ఎల్చీబేగ్ ఆదాయం నుంచి 30 లేక 40 హణాల డబ్బును స్వాధీనపర్చుకొని దానిని వర్తకులకు తిరిగి ఇప్పించి మిగిలిన దానిని ప్రభుత్వ ఖజానా నుంచి భర్తీ చేశాడు. ఈ విధంగా కుతుబ్‌షాహీల న్యాయవ్యవస్థ సమకాలీన ఇతర ముస్లిం రాజ్యాల కంటే ఎంతో ఆదర్శవంతమైనది. గోల్కొండ సుల్తానులు ‘బసాతిన్-సలాతిన్’ గ్రంథంలో మీర్జా ఇబ్రహీం జుబేరి న్యాయ నిర్వహణలో సుల్తాన్ పాటించాల్సిన నియమాలను వివరించగా దానిని ఆచరించారు.
సమాజం-మతం
-మెజారిటీ ప్రజలు హిందువులు, పాలకులు మాత్రం ముస్లింలు. సమకాలీన చరిత్రకారులు, రచయితలు, విదేశీ బాటసారుల ఆనాటి సమాజ స్థితిగతులను, ప్రజల మత విశ్వాసాలను తమ రచనల్లో వర్ణించారు. హిందూ-ముస్లిం సఖ్యతకు కుతుబ్‌షాహీలు కృషిచేశారు. స్థానిక ప్రజల సామాజిక వ్యవస్థను, మత ఆచారాలను వారు గౌరవించారు. ఈ అంశమే వారి విజయానికి, ఖ్యాతికి కారణమైందని పండితుల అభిప్రాయం.
-వీరి కాలం నాటి సామాజిక వ్యవస్థను వర్ణించే రచనల్లో ‘తారీఖ్-ఇ-పెరిష్టా, తారీఖ్-ఇ-కుతుబ్‌షాహీ, తారీఖ్-ఇ-ఫిరోజ్‌షాహీ, బుర్హాన్-ఇ-మాసిర్’, తెలుగు రచనలైన ‘తపతీసంవరణోపాఖ్యానం’, ‘యయాతి చరిత్ర, వైజయంతీ విలాసం, దాశరథీ శతకం, శుకసప్తతి, హంసవింశతి’, విదేశీ బాటసారులైన టావెర్నియర్, బెర్నియర్, థెవ్నాట్, విలియం మెథోల్డ్ల వర్ణనలు పేర్కొనదగినవి.
– ‘పాలవేకరి కదిరీపతి’ తన రచన ‘శుకసప్తతి’లో తెలంగాణ జీవితాన్ని వర్ణించాడని షేర్వాణీ పేర్కొన్నాడు. అతడు సమాజంలోని బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇతర ఉపకులాల వారి వేషభాషలను, ఆహారపు అలవాట్లను, ఇళ్లను, వారి వివాహ పద్ధతులను నిత్యం నిర్వహించే కార్యకలాపాలను, కోమట్ల వ్యాపారాన్ని, కరణం, రెడ్డి మొదలైన వారి కార్యకలాపాలను, వేషాలను వర్ణించాడు. ఉదాహరణకు ఆ నాటి బ్రాహ్మణుల్లో కొందరు పౌరోహిత్యం చేసి విద్యలు బోధించారు. మరికొందరు వ్యవసాయం చేశారు. మరి ఆకులతో విస్తళ్లు కుట్టి, కూరగాయలు పండించి విక్రయించి జీవితం వెళ్లదీసేవారని పేర్కొన్నాడు కదిరీపతి.
– సమాజంలో చదువుకున్నవారు కాబట్టి బ్రాహ్మణుల జ్ఞానం, నైపుణ్యం పరిపాలనలో అవసరమయ్యేవి కాబట్టి వారిని మహమ్మదీయులు ఉద్యోగాల్లో నియమించుకునేవారనీ, శుభ ముహూర్తాలు నిర్ణయించిన సమర్థులైన జ్యోతిష్యులు కాబట్టి వారి ప్రయోజనం ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతో ఉండేదని ‘మోర్లాండ్’ చెప్పాడు. మహమ్మదీయులు కూడా వీరిని సంప్రదించి, ముహూర్తం నిర్ణయించుకోకుండా ప్రయాణం చేసేవారు కాదని చెప్పాడు. ఆ కాలపు పురోహితుడు ఎలా ఉండేవాడో సురవరం ప్రతాపరెడ్డి తన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’లో వివరించాడు. పూటకూళ్ల ఇళ్లను అధికంగా నడిపించేది బ్రాహ్మణ వితంతువులే. అక్కడికి పలు ప్రాంతాల కవి గాయక పండితులు, ఉద్యోగులు, పధికులు వెళ్లి ‘మినుములు’ ఇచ్చి భోజనం చేసేవారు.
-అబుల్ హసన్ తానీషా అక్కన్న, మాదన్నలకు పెద్ద పదవులిచ్చాడని మనకు తెలుసు. మాదన్న పనితీరును గమనించిన సుల్తాన్ మెచ్చుకొని అతడికి ‘ఆలంపనా’ అనే బిరుదు కూడా ఇచ్చాడు. గ్రామస్థాయిలో కరణం పెద్ద స్థాయి అధికారి. వీరు బ్రాహ్మణులై ఉండేవాళ్లు. కదిరీపతి తన రచనలో కరణం వేషాన్ని వర్ణించాడు. ఇంకా గోల్కొండ దర్బార్లోను, పెద్ద పదవుల్లోనూ ఉండే హిందూ నాయకుల గురించి చెప్పాడు కదిరీపతి.
-కోమటి వేషాన్ని ‘మల్హణ చరిత్ర’ రచయిత ‘పెదపాటి ఎరనార్యుడు’ రెండో అశ్వాసంలో వర్ణించాడు. వర్తక వ్యాపారమే వీరి వృత్తి. వీరి పేర్లు గౌరయ్య, గౌరమ్మ ప్రముఖంగా ఉండేవి. కోమట్లు ధనవంతులని సమకాలీన రచనలు తెలియజేస్తున్నాయి. ఇంకా గ్రామాల్లో కాపు, రెడ్డి, నేత, వెలమ, చాకలి, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి మొదలైన కులాలవారు ఉన్నారు.
-కుతుబ్‌షాహీల నాటి హిందూ వివాహ తంతును ‘తపతీసంవరణోపాఖ్యానం’లో, గంగాధరుడు ‘వైజయంతీ విలాసం’లో, సారంగతమ్మయ్యలు వర్ణించారు. నాటి పండుగలను, పిల్లలు, పెద్దలు ఆడుకునే ఆటలను శుకసప్తతి, హంసవింశతి వర్ణించాయి. సమాజంలో శూద్రుల స్థితి దీనంగా ఉండేది. వీరు గ్రామాల్లో వ్యవసాయం చేసేవారు. గ్రామాల్లో రెడ్డి, కరణం, వైశ్య మొదలైనవారికి సేవలు, కూలీ చేసేవారు. నగరాల్లో ప్రభువులకు, ఉన్నతాధికారులకు నౌకర్లుగా పనిచేసేవారు. సైన్యంలో వీరే ఎక్కువగా ఉండేవారు.
– ఆనాటి సమాజంలో హిందువుల్లో, ముస్లింల్లోనూ మూఢవిశ్వాసాలు అనేకం ఉండేవి. జాతకాలు చెప్పించుకొనేవారు. ‘పూరీజగన్నాథ’ యాత్రలో రథచక్రాల కింద బలవంతంగా పడి ప్రాణాలు వదిలితే మోక్షం లభిస్తుందని నమ్మేవారని ఫ్రెంచ్ బాటసారి ఫ్రాంకోయిస్ బెర్నియర్ రాశాడు. దీన్నే ప్రేయర్ కూడా పేర్కొన్నాడు.
సతీసహగమన దురాచారం
-అన్నింటికంటే భయంకరమైనది సతీసహగమనం. భర్త చనిపోయాక స్త్రీలకు నచ్చజెప్పి, పుణ్యం ఆశ చూపి, బలవంతంగానూ, మాదక ద్రవ్యాలనిచ్చి ఈ ఆచారాన్ని ప్రోత్సహించేవారని ‘థామస్ బౌరీ’, ‘బెర్నియర్’ వంటి విదేశీ యాత్రికులు రాశారు. భర్తను కోల్పోయిన స్త్రీ ముందు నాలుగు ప్రత్యామ్నాయాలు ఉంటాయని మరో విదేశీ యాత్రికుడు థెవ్నాట్ చెప్పాడు. ఒకటి ఇష్టపూర్వకంగా సతీసహగమనం ఆచరించడం, రెండు పట్నాల్లో ఉంపుడుగత్తె అయి బతకడం, మూడు తల్లిదండ్రుల ఇంట్లో దాసిగా జీవించడం, నాలుగు ధాన్యం లాంటివి అమ్ముకుని బతకడం.
-అయితే ఏ స్త్రీకి అయినా బతుకు మీద ఆశ ఉంటే ఆమెను బలవంతంగానైనా మంటలకు ఆతి చెయ్యకపోతే జనాలకు నిద్రపట్టదు. ఈ స్త్రీలు తమ సర్వాభరణాలతో అగ్గిలో ఆతవుతారు. ఆ తర్వాత బ్రాహ్మణుడు బూడిద నుంచి బంగారం, వెండి తీసుకుంటాడు. కాబట్టి ఈ ఆచారాన్ని ప్రోత్సహిస్తుంటాడు అని టావెర్నియర్ చెప్పాడు. స్త్రీ బంధువులే ఆమెకు మాదక ద్రవ్యాలనిస్తే ఆమె సగం పిచ్చిలో మంటల్లోకి దూకుతుందని ప్రేయర్ చెప్పాడు.
-టావెర్నియర్ తను ఒక స్త్రీని సతీసహగమనం చేయకుండా ఒక స్థానిక అధికారి జోక్యం చేసుకోవడాన్ని చూశానని, కానీ లంచగొండితనానికి అలవాటుపడిన ఆ అధికారి లంచం తన ఉద్యోగులకు అందగానే ఆమెను సతీసహగమనం చేయడానికి అనుమతిచ్చాడని పేర్కొన్నాడు. ఇంకా స్థానిక అధికారులు సతిని ప్రోత్సహించారని థామస్ బెరి పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఆ రోజుల్లో అవినీతి, లంచగొండితనం ఉందని తెలుస్తుంది. అయితే కుతుబ్ షాహీలకు కూడా హిందువుల మతాచారాల్లో జోక్యం చేసుకొని అధిక సంఖ్యాకులైన వారి అసంతృప్తిని పెంచడం ఇష్టంలేదు. అందుకే దాన్ని మాన్పించే ప్రయత్నం చేయలేదు.
స్త్రీల హోదా
– గోల్కొండ రాజ్యంలో స్త్రీ హోదా, స్థితి దీనంగానే ఉన్నట్లు సాహిత్యంలో వర్ణించబడింది. ‘పొన్నగంటి తెలగనార్య’ తన రచన ‘యయాతి చరిత్ర’లో ‘యయాతి’ని అత్తగారింటికి పంపే సందర్భంగా ఆమెను ఉద్దేశించి చెప్పిన మాటలు, హితవు స్త్రీకి ఏ మాత్రం స్వేచ్ఛ, స్వాతంత్య్రం లేదని భర్త, అత్త ఆధీనంలో ఆమె బతికేదని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ప్రేయర్ వివరిస్తూ హిందూ స్త్రీలు పరదా వాడరని, ముస్లిం స్త్రీలు తప్పనిసరిగా పరదాలోనే బయటికి వెళ్లాలని వారి మగవారు ఆదేశించేవారని పేర్కొన్నాడు.
– స్త్రీని భోగపు వస్తువుగా చూశారని విలియం మెథోల్డ్ వాపోయాడు. రాజకీయ లబ్ధి కోసం సుల్తాన్లు వివాహ సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. బలవంతపు పెళ్లిండ్లు ఆచరణలో ఉండేది. దేవదాసి వ్యవస్థ కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉండేది. బభార్యత్వం, బాల్యవివాహాలు సాధారణం. సామాన్య స్త్రీలు వ్యవసాయ పనులు, కూలి, నేత మగ్గాలపై, నిర్మాణాల దగ్గర పనిచేసి జీవితం గడిపేవారు. సామాన్య స్త్రీలకు విద్య అందుబాటులో లేదు. అయితే రాజపరివారపు బాలికలు, స్త్రీలు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం మొదలైన కళలు నేర్చుకునేవారు.
వేశ్యా వ్యవస్థ
– వేశ్యలు తమ పేర్లను నమోదు చేయించుకొని అనుమతి తెచ్చుకోవల్సి ఉంటుందని తెలిపాడు షేర్వాణీ. అబ్దుల్లా కాలంలో టావెర్నియర్ కథనం ప్రకారం దారోగా పుస్తకంలో ఇరవైవేల వరకు నమోదు చేయించుకున్న వేశ్యలు ఉన్నారు. ఈ గృహాలకు పావనం చేసేవారి పట్ల సామాజిక కళంకమేమీ ఉండదు. టావెర్నియర్ వీరి గురించి మరింత భావాత్మకంగా చెప్పాడు. ‘సాయంత్రం చల్లటివేళ వేశ్యలు తమ గుమ్మాల వద్ద నిల్చునేవారు. చీకటిపడ్డాక కొన్వొత్తో, దీపమో చిహ్నంగా వెలిగించేవారు. ఇంకా మాంసం ఎలా అందరికీ అనుభవయోగ్యమో అలాగే వారూ అందరికీ అనుభవయోగ్యమని మెథోల్డ్ చెప్పాడు. అబుల్ హసన్ కాలంలో ఈ భోగం స్త్రీలు ప్రభుత్వ ఖజానా నుంచి మూడు లక్షల ఇరవై నాలుగువేల వార్షికం పొందేవారని తెలుస్తుంది. వేశ్యలు మద్యం మత్తులో విటులను అన్ని విధాలుగా దోపిడీ చేసేవారని థామస్ బెరీ రాశాడు.
కుతుబ్‌షాహీల పోషణలో తెలుగు భాషావికాసం
– గోల్కొండ కేంద్రంగా తెలుగు ప్రజలను సుమారుగా రెండు శతాబ్దాల పాటు పరిపాలించిన కుతుబ్‌షాహీ సుల్తానులు స్థానిక ప్రజల మాతృభాష తెలుగును ఆదరించారు. వీరిలో కొందరు తెలుగు భాషలో పట్టు సాధించారు. వీరి పోషణలో రాజ్య ఆదరణ పర్షియన్, అరబిక్, ఉర్దూ భాషలకు లభించింది. అనేకమంది తెలుగు కవులను, పండితులను వీరు ఆదరించారు. మధ్యయుగ దక్కన్ చరిత్రలో మిగతా ఏ ముస్లిం పాలకులు ఈ రకమైన ఔదార్యాన్ని ప్రదర్శించలేదు. ముఖ్యం ఇబ్రహీం కులీ కుతుబ్‌షా కాలంలో గోల్కొండ సుల్తాన్ దర్బార్ తెలుగు భాషా పండితులకు, కవులకు భువన విజయంగా మారింది. ఈ సుల్తాన్ పోషణను అద్దంకి గంగాధర కవి అందుకున్నాడు. తన రచన తపతీసంవరణోపాఖ్యానాన్ని సుల్తాన్‌కు అంకితమిచ్చాడు. కందుకూరి రుద్రకవి పాండిత్యం వల్ల ప్రభావితుడైన సుల్తాన్ అతడికి ‘చింతలపాలెం’ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
– ఇబ్రహీం కులీ కుతుబ్‌షా అధికారులు కూడా సుల్తాన్ సేవల వల్ల ప్రభావితులయ్యారు. పఠాన్‌చెరువు ప్రాంతానికి అధికారిగా ఉన్న అమీర్‌ఖాన్ పొన్నగంటి తెలగనార్యను ఆదరించగా అతడు తన గ్రంథం ‘యయాతి చరిత్ర’ను అమీర్‌ఖాన్‌కు అంకితమిచ్చాడు. అచ్చ తెలుగులో రాసిన మొట్టమొదటి తెలుగు గ్రంథం ‘యయాతి చరిత్ర’.
-మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో తెలుగు భాష మరింత వికాసం పొందింది. ఇతడి ఆస్థాన కవి ‘గణేశ పండితుడు’. ఇతని ఆస్థానానికి చెందిన మరో తెలుగు కవి సారంగ తమ్మయ్య. ఇతని రచన వైజయంతీ విలాసం. ఇంకా అబ్దుల్లా కుతుబ్‌షా కాలానికి చెందిన క్షేత్రయ్య సుల్తాన్ ఆస్థానాన్ని సందర్శించి అతనిపై వేయికి పైగా పదకీర్తనలు పాడాడు. అబుల్ హసన్ తానీషా కాలంలో ఖమ్మం ప్రాంతానికి తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన కంచర్ల గోపన్న భక్త రామదాసుగా కీర్తిపొందాడు. ఇతని రచన దాశరథీ శతకం తెలుగు సాహిత్యంలో శాశ్వత కీర్తిని పొందింది. ఈ విధంగా గోల్కొండ సుల్తానులు విజయనగర సామ్రాజ్య పతనానంతరం తెలుగు భాషా వికాసానికి విశేష కృషి చేశారన్నది చారిత్రక సత్యం.
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?