BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి
- స్త్రీ, పురుష బీజకణాల కలయిక వల్ల నూతన జీవి ఏర్పడినట్లయితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఈ రకమైన ప్రత్యుత్పత్తి మొక్కల్లో, జంతువుల్లో జరుగుతుంది. భూమిపైన దాదాపు 2,75,000 పైగా జాతులున్నాయి. దానిలో కొన్ని మినహా అన్నీ ఫలాలతో కూడిన విత్తనాలనే ఉత్పత్తి చేస్తాయి. హిమాలయ పర్వతాల్లో పెరిగే సాల్ వృక్షాలు, సహారా ఎడారిలో పెరిగే జైంట్ కాక్టస్, అడవుల్లో వృక్షాల శాఖలపై పెరిగే చిన్న చిన్న ఆర్కిడ్లు మొదలగు పుష్పించే మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.
- పుష్పించే మొక్కల్లోని పుష్పాల్లో ప్రత్యుత్పత్తి భాగాలు ఉంటాయి. పుష్పంలో ఆకర్షక పత్రావళి, రక్షక పత్రావళి, కేసరావళి, అండకోశం అనే భాగాలుంటాయి.
- కొన్ని పుష్పాలు కేసరావళి గాని, అండకోశం గాని ఏదో ఒక ప్రత్యుత్పత్తి భాగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ విధమైన పుష్పాలను ఏకలింగ పుష్పాలు అంటారు.
ఉదా: సొరకాయ, బొప్పాయి - కొన్ని పుష్పాలు కేసరావళి, అండకోశం రెండింటిని కలిగి ఉన్న పుష్పాలను ద్విలింగ పుష్పాలు అంటారు.
ఉదా: ఉమ్మెత్త, మందార
పురుష పుష్పాలు: కేసరావళి మాత్రమే ఉంటుంది. అండకోశం ఉండదు.
స్త్రీ పుష్పాలు: అండకోశం మాత్రమే ఉంటుంది. కేసరావళి ఉండదు.
సంపూర్ణ పుష్పం: ఈ రకం పుష్పాల్లో నాలుగు వలయాల్లో పుష్పభాగాలు ఉంటాయి. మొదటి వలయంలో రక్షక పత్రాలు, రెండో వలయంలో ఆకర్షక పత్రాలు, మూడో వలయంలో కేసరావళి, నాలుగో వలయంలో అండకోశాలు ఉన్నట్లయితే అటువంటి పుష్పాలను సంపూర్ణ పుష్పాలు అంటారు.
ఉదా: మందార, ఉమ్మెత్త, తూటి పూలు
అసంపూర్ణ పుష్పం: నాలుగు వలయాల్లో ఏ ఒక్క వలయం లేకపోయినా అటువంటి పుష్పాలను అసంపూర్ణ పుష్పాలు అంటారు.
ఉదా: దోస, సొర, బొప్పాయి - పురుష ప్రత్యుత్పత్తి అవయవాలైన కేసరాల పైభాగంలో గల కోశం వంటి నిర్మాణాలను పరాగకోశాలు అంటారు. ఇవి గోళాకారపు పరాగరేణువులను కలిగి ఉంటాయి. ప్రతి పరాగరేణువులో పరాగనాళంలో పురుష బీజ కేంద్రకాలుంటాయి.
- అండకోశంలోని అండాశయంలో ఉండే అండాల్లో స్త్రీ బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. అండకోశంలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. పరాగరేణువులను స్వీకరించే కీలాగ్రం, పురుష బీజకణాలు ప్రయాణించడానికి తోడ్పడే కీలం. స్త్రీ, పురుష బీజకణాలు కలిసి సంయోగబీజం ఏర్పడే అండాశయం. ఇవన్నీ ఫలదీకరణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.
అండం – నిర్మాణం
- అండాకృతిలో ఉన్న అండం, అండవృంతం సహాయంతో అండాశయం లోపలి అంచుకు అతుక్కొని ఉంటుంది. మొక్క జాతిని బట్టి అండాశయంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అండాలుంటాయి. ప్రతి అండం మధ్యలో పోషక పదార్థాలు, నీరు, స్థూల సిద్ధ బీజకణాలను కలిగిన పిండకోశం ఉంటుంది.
- చాలా పుష్పించే మొక్కల్లో పిండకోశం 7 కణాలను, 8 కేంద్రకాలను కలిగి ఉంటుంది. మొదట స్థూల సిద్ధబీజం 3 సమ విభజనల తర్వాత 8 కణాల స్థితిలోకి వస్తుంది. 3 కణాలు పిండకోశం పై భాగానికి చేరి పోషణకు తోడ్పడతాయి. వీటిని ప్రతిపాద కణాలు అంటారు. పిండకోశ పూర్వ భాగంలో 3 కణాలుంటాయి. వీటిలో 2 సహాయ కణాలు, 1 స్త్రీ బీజకణం ఉంటాయి. ఇవి పరాగనాళం ప్రవేశించే మార్గానికి దగ్గరగా పిండకోశంలో అమరి ఉంటాయి. మధ్యభాగంలో ఉండే కణం పెద్దదిగా ఉండి రెండు కేంద్రకాలను కలిగి ఉంటుంది. దీన్ని ద్వితీయ కేంద్రకం అంటారు.
- రెండు పురుష బీజ కణాలు పిండకోశంలోని స్త్రీబీజ కోశంతో ఒకటి కలుస్తుంది. దీన్ని ఫలదీకరణం అంటారు.
- మరొక పురుష బీజ కేంద్రకం పిండకోశం మధ్యలో గల ద్వితీయ కేంద్రకంతో కలిసి అంకురచ్ఛదాన్ని ఏర్పరుస్తుంది. ఇలా రెండుసార్లు ఫలదీకరణం జరగడాన్ని ద్విఫలదీకరణం అంటారు. ద్విఫలదీకరణం జరగడం పుష్పించే మొక్కల ప్రత్యేకత.
- ఫలదీకరణం తర్వాత సంయుక్తబీజం పలుమార్లు విభజన చెంది పిండం ఏర్పడుతుంది. ఇది దృఢమైన కవచాన్ని ఏర్పరుచుకొని విత్తనంగా మారుతుంది. అండాశయం పెరిగి పరిపక్వం చెంది ఫలంగా మారుతుంది. తదుపరి మిగతా పుష్పభాగాలు క్షీణించిపోతాయి.
- ఫలదీకరణం తర్వాత ఏర్పడిన విత్తనం అనుకూల పరిస్థితుల్లో మొలకెత్తి కొత్త మొక్కలను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియను మొలకెత్తడం అంటారు.
పరాగ సంపర్కం
- ఒక మొక్క పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరే విధానాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలాలుగా మారతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి.
- ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని ఆత్మ పరాగ సంపర్కం/స్వపరాగ సంపర్కం అంటారు.
- ఒక పుష్పంలోని పరాగరేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు.
ఏక వృక్ష పరపరాగ సంపర్కం (గైటినోగమీ): ఒక మొక్కకు చెందిన రెండు పుష్పాల మధ్య జరుగుతుంది. ఒక పువ్వులోని పరాగరేణువులు అదే మొక్కపై ఉన్న మరొక పుష్ప కీలాగ్రంపై పడతాయి.
ఇది జన్యుశాస్త్ర పరంగా ఆత్మ పరాగ సంపర్కానికి సమానం.
భిన్న వృక్ష పరపరాగ సంపర్కం (జీనోగమీ): ఒక మొక్కపై ఉన్న పువ్వులోని పరాగరేణువులు అదే జాతికి చెందిన మరొక పుష్పం కీలాగ్రాన్ని చేరడాన్ని భిన్న వృక్ష పరపరాగ సంపర్కం అంటారు. ఇది వైవిధ్య రీత్యా నిజమైన పరపరాగ సంపర్కం.
పరాగ సంపర్కం- కారకాలు
గాలి-ఎనిమోఫిలి
నీరు-హైడ్రోఫిలి
కీటకాలు- ఎంటమోఫిలి
పక్షులు- ఆర్నితోఫిలి
గబ్బిలాలు- ఖీరఫ్టెరఫిలి
నత్తలు- మెలకోఫిలి
హెర్కోగమీ: ద్విలింగ పుష్పాల్లో ఉన్న స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు వేర్వేరు స్థానాల్లో అమరి ఉండటాన్ని హెర్కోగమీ అంటారు. దీని వల్ల ఒకేసారి ప్రత్యుత్పత్తి అంగాలు పక్వానికి వచ్చినా ఆత్మసంపర్కం జరగదు.
శాఖీయ ప్రత్యుత్పత్తి
- మొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడినట్లయితే అటువంటి ప్రత్యుత్పత్తి విధానాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. ఈ రకమైన ప్రత్యుత్పత్తి కేవలం మొక్కల్లో మాత్రమే జరుగుతుంది. మొక్కల్లో శాఖీయ ప్రత్యుత్పత్తి పద్ధతులు 1. సహజ శాఖీయ వ్యాప్తి 2. కృత్రిమ శాఖీయ వ్యాప్తి.
- సహజ శాఖీయ వ్యాప్తి వేరు, కాండం, పత్రాల ద్వారా జరుగుతుంది.
- కృత్రిమ శాఖీయ వ్యాప్తి మూడు రకాలుగా జరుగుతుంది.
1. ఛేదనం- గులాబీ, మందార
2. అంటు తొక్కడం- మల్లె, గన్నేరు
3. అంటు కట్టడం- మామిడి, నిమ్మ, ఆపిల్, గులాబీ - పుష్పించడానికి తీసుకునే సమయం వేర్వేరుగా ఉంటుంది. కొన్ని మొక్కల్లో పుష్పోత్పత్తి ఒకసారి కన్నా ఎక్కువ సార్లు జరుగుతుంది.
- ఏక వార్షిక, ద్వివార్షిక మొక్కలు శాఖీయ, లైంగిక దశలను చక్కగా చూపిస్తాయి. కొన్ని మొక్కలు అసాధారణ పుష్పోత్పత్తిని ప్రదర్శిస్తాయి.
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
Previous article
SJVN Recruitment | ఎస్జేవీఎన్లో ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు