An inscription describing the genealogy of Kakatiya | కాకతీయుల వంశవృక్షాన్ని వివరించిన శాసనం? ( పోటీపరీక్షల ప్రత్యేకం )
– తెలంగాణలో రాష్ట్రకూటులకు సేనాధిపతులుగా, చాళుక్యులకు రాష్ట్ర పాలకులుగా, దుర్గాధిపతులుగా కాకతీయులు సేవలందించారు. కాకతీయులు వారి పట్టుదల, శౌర్యప్రతాపాలు, నిజాయితీవల్ల స్వతంత్రులై అనుమకొండ, ఓరుగల్లు రాజధానులుగా సుమారు మూడు శతాబ్దాలకు పైగా తెలుగు భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలను పరిపాలించారు. నేటి తెలంగాణ సంస్కృతికి తొలి బీజాలు కాకతీయుల కాలంలోనే పడ్డాయని చెప్పుకోవచ్చు.
– శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్నంతటిని ఏకఛత్రాధిపత్యం కిందకు తీసుకొచ్చినవారు కాకతీయులు. కాకతీయుల పుట్టుక లేదా ఉనికి తెలుసుకోవడానికి అనేక శాసనాలు, సాహిత్య రచనలు కొంత సమాచారాన్ని అందజేస్తున్నాయి. వీరి గురించి మొదటిసారిగా వేంగీచాళుక్య రాజు ‘దానార్ణవుడు’ వేయించిన మాగల్లు శాసనం (క్రీ.శ.956)లో ఉంది. ఈ శాసనం ప్రకారం ‘కాకర్త్య గుండ్యన’ విజ్ఞప్తి మేరకు దానార్ణవుడు నతవాడి విషయలో గల మాగల్లు గ్రామాన్ని ‘దొమ్మన’ శర్మ అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు.
కాకతి: కాకతీపురం అనే గ్రామం వారి నివాసం కావడంవల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఈ వాదనను చాలామంది అంగీకరించలేదు.
– వినుకొండ వల్లభాచార్యుడు తన క్రీడాభిరామంలో కాకతమ్మకు సైదోడు ఏకవీర అని పేర్కొన్నాడు. అంటే ఓరుగల్లులో కాకతి, ఏకవీర అనే గ్రామదేవతలను కలిపి పూజించారని ఈ దేవత పేరుమీదగానే వీరిని కాకతీయులు అని పిలిచేవారని ‘క్రీడాభిరామం’ వివరిస్తుంది.
– విద్యానాథుడు తన ‘ప్రతాపరుద్ర యశోభూషణం’లో కాకతమ్మ దేవత కాకతీర్నామ దుర్గా భజయంత్రి ఇతి కాకతీయ’ అని పేర్కొన్నాడు. కాకతి అంటే దుర్గాశక్తి అని, ఆ శక్తిని ఆరాధించారు కాబట్టి వీరు కాకతీయులయ్యారని పేర్కొంటారు.
– 16వ శతాబ్దం తొలి భాగానికి చెందిన షితాబ్ ఖాన్ (సీతాపతి) వేసిన శాసనం ఢిల్లీ సుల్తానుల సైన్యాలు ఓరుగల్లు కోటలోని కాకతి విగ్రహాన్ని ధ్వంసం చేయగా ఆ జగన్మాతృకను, కాకతి రాజ్య పద్మపీఠి అయిన ఆ దేవత విగ్రహాన్ని షితాబ్ ఖాన్ పునఃప్రతిష్టించాడని పేర్కొంటుంది. ఈ విధంగా ‘కాకతి’ అనే గ్రామదేవతను ఆరాధించడం వల్లనే కాకతీయులు అని పేరువచ్చిందనే అభిప్రాయానికి చాలామంది చరిత్రకారులు వచ్చారు.
కాకతీయ పాలకులు: 1965లో కనుగొన్న బయ్యారం చెరువు శాసనం వల్ల వీరికి సంబంధించిన భిన్న అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శాసనాన్ని గణపతిదేవుడు పరిపాలించే కాలంలో అతడి చెల్లెలు మైలాంబ తన బిరుదు మీదుగా నిర్మించిన ‘ధర్మకీర్తి-సముద్ర’మనే పెద్ద చెరువు స్థాపన సందర్భంగా వేశారు. ఈ శాసనంలో కాకతీయుల వంశవృక్షం గురించి వివరించి ఉంది. దీని ప్రకారం కాకతీయుల మూలపురుషుడు ‘వెన్నడు’. ఇతడు దుర్జయ వంశానికి చెందినవాడు. ఇతడు రాష్ట్రకూటుల సేనాధిపతిగా ఉంటూ వేంగీచాళుక్యులపై దాడి చేశాడు. వెన్నడుకు నాలుగో తరం వాడు గుండ్యన. ఇతడు రాష్ట్రకూట రెండో కృష్ణుడి తరఫున వేంగీచాళుక్య రాజు మొదటి భీమునికి వ్యతిరేకంగా ‘నిరువధ్యపుర యుద్ధం (క్రీ.శ.900)’ చేశాడు. ఈ యుద్ధంలో గుండ్యన మరణించాడు. ఇతడి ధైర్యసాహసాలకు, నిస్వార్థ సేవకు మెచ్చి రాష్ట్రకూట రెండో కృష్ణుడు గుండ్యన కుమారుడైన ‘ఎరియ’ను కురవి ప్రాంతానికి పాలకుడిగా నియమించాడు. ఎరియ అనంతరం బేతియ, తర్వాత నాలుగో గుండ్యన లేదా కాకర్త్య గుండ్యన కురవి పాలకుడు అయ్యాడు.
కాకర్త్య గుండ్యన: ఇతడి కాలంలో వేంగీచాళుక్య రాజ్యంలో దానార్ణవుడు, రెండో అమ్మరాజు మధ్య వారసత్వ యుద్ధాలు ప్రారంభమయ్యాయి.
-ఈ వారసత్వ యుద్ధంలో తనకు మద్దతు పలికిన కాకర్త్య గుండ్యనకు నతవాడి సీమను దానార్ణవుడు ఇచ్చాడు.
– కాకర్త్య గుండ్యన కాలంలో రాష్ట్రకూటుల్ని ఓడించి కళ్యాణి చాళుక్యులు రాజ్యాన్ని స్థాపించగా వీరి సామంతుడయ్యాడు.
-ముదిగొండ పాలకుడు బొట్టు బేతరాజు కళ్యాణి చాళుక్య రెండో తైలపుడి అనుమతి పొంది రెండో తైలపుడి సేనాని ఎరభూపతి సహాయంతో కురవిపై దాడిచేసి కాకర్త్య గుండ్యనను హతమార్చాడు.
– ఎరభూపతి భార్య కామసాని తన మేనల్లుడైన ఒకటో బేతరాజు (గుండ్యన కుమారుడు)పై జాలిపడి అనుమకొండ ప్రాంతాన్ని బేతరాజుకు ఇప్పించేటట్లు రెండో తైలపుడిని ఒప్పించి బేతరాజును అనుమకొండ పాలకుడిగా చేసింది.
– ఈ విధంగా అనుమకొండలో ఒకటో బేతరాజు కాకతీయుల పాలనను ప్రారంభించాడు.
మొదటి బేతరాజు (క్రీ.శ. 995-1052): ఇతడు పశ్చిమ (కళ్యాణి) చాళుక్యులకు సామంతుడు. హనుమకొండను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు.
-ఇతడు చిన్నవాడైనందున రాజ్య సంరక్షణ భారాన్ని ఇతడి మేనత్త కామసాని, ఆమె భర్త విరియాల ఎరభూపతి చూసుకున్నారు.
– మొదటి బేతరాజు మంత్రి నారాయణయ్య శనిగరం (కరీంనగర్) వద్ద చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మరమ్మతులు చేసి ‘శనిగరం’ శాసనాన్నివేయించాడు.

– మొదటి బేతరాజు బిరుదులు ‘కాకతి పురాధీనత, చోడకా్ష్మాపాల’.
మొదటి ప్రోలరాజు (క్రీ.శ. 1052-1076): ఇతడు మొదటి బేతరాజు కుమారుడు.కాజీపేట, పిల్లలమరి, పాలంపేట శాసనాలు ఇతడి గొప్పతనాన్ని పేర్కొంటున్నాయి.
– ఈ శాసనాలు మహాశూరుడైన ప్రోలరాజు చక్రకూట విషయాన్ని చక్కదిద్దాడని, కొంకణ మండలాన్ని జయించాడని, భద్రంగ పురాధీశ్వరుడిని తరిమాడని, పురాకూటాధీశుడైన గొన్నరాజును యుద్ధంలో సంహరించాడని తెలుపుతున్నాయి.
-ప్రోలరాజు విజయాల్లో ఎక్కువ శాతం తన సార్వభౌముని (కళ్యాణి చాళుక్య సోమేశ్వరుడు) యుద్ధాలకు సంబంధించినవే.
-ఇతడు కేసముద్రం, జగత్ కేసరి సముద్రం అనే చెరువులు తవ్వించాడు.
– ఇతడు వరాహ చిహ్నంతో నాణేలు ముద్రించాడు.
– ప్రోలరాజు బిరుదులు ‘అరిగజకేసరి, కాకతివల్లభ సమధీగత పంచమహాశబ్ద’.
రెండో బేతరాజు (క్రీ.శ. 1076-1108): ఇతడు మొదటి ప్రోలరాజు కుమారుడు.
– ఇతడు ఆరో విక్రమాదిత్యుడి దండయాత్రలో పాల్గొని సబ్బి మండలంలో వెయ్యి గ్రామాలు, ముదిగొండ రాజ్యంలో కొంత భాగాన్ని బహుమానంగా పొందాడు.
– ఇతడు కాజీపేట శాసనాన్ని వేయించాడు. దీని ప్రకారం ఇతడు గొప్ప యుద్ధవీరుడు.
– రెండో బేతరాజు ఆధ్యాత్మిక గురువు రామేశ్వర దీక్షితులు. ఇతడి నుంచి బేతరాజు శైవ దీక్షను పొందాడు.
-బేతరాజు పైజపల్లి అనే గ్రామానికి ‘శివపురం’ అని పేరుపెట్టి దానిని రామేశ్వర పండితుడికి దానం చేశాడు.
– ఇతడు హనుమకొండలో తన తండ్రిపేర ప్రోలేశ్వర ఆలయం, తన పేర బేతేశ్వరాలయం నిర్మించాడు.
– ఇతడి సేనాని వైజ్జదండాధీశుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. ఇతడు కరీంనగర్‌ను ఆక్రమించాడు.
– రెండో బేతరాజు బిరుదులు విక్రమ చక్రి, మహామండలేశ్వర, త్రిభువనమల్ల, చలమర్తి గండ.
దుర్గరాజు (క్రీ.శ. 1108-16): ఇతడు బేతరాజు పెద్ద కుమారుడు.
– ఇతడు హనుమకొండ బేతేశ్వర శివాలయాన్ని రామేశ్వర పండితుడికి దానం చేశాడు.
-ఇతడి బిరుదులు త్రిభువనమల్ల, చలమర్తి గండ
– ఇతడికి సంబంధించిన శిలాశాసనం ‘కాజీపేట దర్గా శాసనం’ ఒక్కటే.
రెండో ప్రోలరాజు (క్రీ.శ.1116-58): ఇతడు రెండో బేతరాజు రెండో కుమారుడు. తొలి కాకతీయుల్లో గొప్పవాడు.
-ఇతడు రాజ్యానికి రాగానే ముందుగా తన రాజ్య భూభాగాలకు సరిహద్దులో ఉన్న కళ్యాణి చాళుక్యుల సామంతులతో యుద్ధం చేసి విజయం సాధించాడు.
– ఇతడి కుమారుడైన రుద్రదేవుని ప్రసిద్ధ అనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం ఈ విషయాన్ని బలపరుస్తుంది.
– రెండో ప్రోలరాజు చేతిలో కొలనుపాక పాలకుడైన పరమార జగ్గదేవుడు పరాజయం పొందాడు. క్రీ.శ. 1173లో కళ్యాణి చాళుక్య రాజు రెండో జగదేకమల్లుడు, రెండో ప్రోలరాజు సైన్యాలు కండూరిపై దండెత్తి తైలపుడిని ఓడించాయి.
– ప్రోలరాజు భీమచోడుడిని ఓడించి వధించాడు. శ్రీశైలం వరకు తన సైన్యాలను నడిపి అక్కడ విజయస్తంభాన్ని నాటాడు.
– ఇతడి కాలం నుంచే పొలవాస ప్రభువులు, అనుమకొండ ప్రభువులకు మధ్య సంఘర్షణ ప్రారంభమైంది.
– ఇతడి కాలంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది.
– ప్రోలరాజు మహామంత్రి బేతనామాత్యుడి భార్య ‘మైలమ’ కడలాలయ బసదిని జైనుల కోసం ఇతడి కాలంలో నిర్మించింది.
– ప్రోలరాజు బిరుదులు మహామండలేశ్వర, దారిద్య్ర విద్రావణ
ప్రాక్టీస్ ప్రశ్నలు
1. ‘కాకతమ్మకు సైదోడు ఏకవీర’ అనే పదం ఏ గ్రంథంలో కనిపిస్తుంది?
ఎ) ప్రతాపరుద్ర యశోభూషణ
బి) క్రీడాభిరామం
సి) నీతిసారం డి) ప్రేమాభిరామం
2. ‘మాగల్లు శాసనం (క్రీ.శ.956)’ వేయించిన రాజు?
ఎ) దానార్ణవుడు బి) ప్రోలరాజు-2 సి) కాకర్త్య గుండ్యన డి) రుద్రమదేవి
3. హనుమకొండలో బేతేశ్వరాలయం నిర్మించినది?
ఎ) దుర్గరాజు బి) బేతరాజు-1 సి) బేతరాజు-2 డి) ప్రోలరాజు-1
4. తొలి కాకతీయ రాజుల్లో గొప్పవాడు?
ఎ) ప్రోలరాజు-1 బి) ప్రోలరాజు-2 సి) బేతరాజు-1 డి) బేతరాజు-2
5. జైనుల కోసం కడలాలయ బసదిని నిర్మించినది?
ఎ) మైలాంబ బి) మైలమ
సి) గణపాంబ డి) ముమ్మడమ్మ
6. కింది వాటిలో సరైనవి?
ఎ) చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మరమ్మతులు చేసి శనిగరం శాసనాన్ని వేయించినది మొదటి బేతరాజు మంత్రి నారాయణయ్య
బి) రెండో బేతరాజు పైజపల్లి గ్రామానికి శివపురం అని పేరుపెట్టి దానిని రామేశ్వర పండితుడికి దానం చేశాడు
సి) ఎ డి) ఎ, బి
7. శ్రీశైలం వరకు తన సైన్యాలను నడిపి అక్కడ విజయ స్తంభాన్ని నాటిని కాకతీయ రాజు?
ఎ) రెండో ప్రోలరాజు బి) కాకర్త్య గుండ్యన
సి) దుర్గరాజు డి) మొదటి బేతరాజు
8. కాకతీయుల మూలపురుషుడు?
ఎ) కాకర్త్య గుండ్యన బి) వెన్నడు
సి) దానార్ణవుడు డి) కాకతీయుడు
9. నిరువధ్యపుర యుద్ధం (క్రీ.శ. 900) ఎవరి మధ్య జరిగింది?
ఎ) కాకతీయులు-రాష్ట్రకూటులు
బి) కాకతీయులు-పాండ్యులు
సి) రాష్ట్రకూటులు-వేంగీ చాళుక్యులు
డి) రాష్ట్రకూటులు-చోళులు
10. కాకతీయుల వంశవృక్షాన్ని వివరించిన
శాసనం?
ఎ) అనుమకొండ శాసనం
బి) బయ్యారం చెరువు శాసనం
సి) శనిగరం శాసనం
డి) మల్కాపురం శాసనం
11. కేసముద్రం, జగత్ కేసరి సముద్రం అనే చెరువులు తవ్వించినది?
ఎ) మొదటి ప్రోలరాజు
బి) రెండో ప్రోలరాజు
సి) కాకర్త్య గుండ్యన
డి) రెండో బేతరాజు
Answers
1-బి, 2-ఎ, 3-సి, 4-బి, 5-బి, 6-డి, 7-ఎ, 8-బి, 9-సి, 10-బి, 11-ఎ

సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు






