Timeliness with committees | కమిటీలతో కాలయాపన
సుదీర్ఘకాలంపాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో అధ్యయనాల పేరుతో పాలకులు అనేక కమిటీలను నియమించి ఉద్యమ వేడిపై నీళ్లు చల్లేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఉద్యమం వేడెక్కడంతో ప్రణబ్‌ముఖర్జీ, రోషయ్య తదితర కమిటీలను వేసి నాన్చివేత ధోరణి అనుసరించారు. అయితే, వారి ఎత్తులు ఎంతోకాలం సాగలేదు. ప్రజాస్పందనను విస్మరించే పరిస్థితి లేకపోవటంతో చివరికి తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటుచేయక తప్పలేదు. తెలంగాణ ఉద్యమ పరిణామాల్లో ఏర్పాటైన వివిధ కమిటీలు, వారి పర్యవసానాలపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేకం..
ప్రణబ్ ముఖర్జీ కమిటీ
-కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపి విస్తృత స్థాయిలో అంగీకారం కోసం ప్రయత్నించడానికి సీనియర్ మంత్రి అయిన ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఇందులో డీఎంకే పార్టీకి చెందిన మంత్రి దయానిధిమారన్, రాష్ట్రీయ జనతాదళ్‌కు చెందిన మంత్రి రఘువంశ్‌ప్రసాద్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తెలంగాణపై తమ అభిప్రాయాలను చెప్పాలంటూ అన్ని పార్టీలకు లేఖలు రాసింది. ఈ సందర్భంలోనే టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్, నరేంద్ర, వినోద్‌కుమార్, రవీంద్రనాయక్, మధుసూదన్‌రెడ్డిలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ అన్ని పార్టీలను కలిసి వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించి తెలంగాణపై సానుకూల అభిప్రాయాలను ప్రకటించాలని కోరారు. యూపీఏలోని 13 పార్టీల్లో 11 పార్టీలు (ఆర్జేడీ, ఎన్సీపీ, పీఎంకే, జేఎంఎం, లోక్‌జనశక్తి, ఎండీఎంకే, టీఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు రాశాయి.
-ప్రతిపక్ష కూటమి ఎన్డీఏలోని 14 పార్టీల్లో 8 పార్టీలు (బీజేపీ, శిరోమణి అకాళిదళ్, జేడీయూ, ఐఎఫ్డీ, ఎంఎన్ఎఫ్, ఎన్పీఎఫ్, బీఎన్ఎస్) తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాశాయి. ఈ పార్టీలేగాక శివసేన, ఏజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటే తాము కూడా అదే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించాయి. ఈ విధంగా 196 మంది సభ్యులున్న ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో కేవలం ఐదుగురు సభ్యులు గల టీడీపీ మాత్రమే రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. ఈ విధంగా 543 మంది సభ్యులున్న లోక్‌సభలో రాష్ట ఏర్పాటును సమర్థించే వారి సంఖ్య 440కిపైనే ఉంటుంది. లోక్‌సభలో ఇంతమంది సభ్యులు మద్దతు వ్యక్తపరిచినా కాంగ్రెస్ పార్టీ చడీచప్పుడు లేకుండా ఉంది. దీంతో వర్షాకాల సమావేశాల్లోపు ఏ నిర్ణయం తీసుకోకుంటే తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అయినా అటు కాంగ్రెస్ పార్టీలో చలనం లేదు. ఇటు ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాల్సిన ప్రణబ్‌ముఖర్జీ కమిటీ 20 నెలలైనా నివేదిక ఇవ్వలేదు.
ప్రభుత్వం నుంచి వైదొలగిన టీఆర్ఎస్
-వైఎస్ఆర్ రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించకుండానే పులిచింతల, పోలవరం, సింగూరు కెనాల్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు ఆటంకం కలిగించే రీతిలో చేపట్టడంతో టీఆర్ఎస్ మంత్రులు అసహనంతో ఉన్నారు. ఇదే సమయంలో మావోయిస్టుల మీద 2005 జూలై 1న పోలీసులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకులు మరణించడంతో మావోయిస్టుల అజెండానే తమ అజెండాగా ప్రకటించుకున్న టీఆర్ఎస్ మావోయిస్టులకు దూరం కాలేక రాజీనామాలు చేయాలని నిర్ణయించుకొని 2005 జూలై 4న తమ మంత్రి పదవులకు (సంతోష్‌రెడ్డి తప్ప) రాజీనామాలు సమర్పించారు. ఏ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలిగింది ప్రజలకు వివరించడానికి 2005 జూలై 17న వరంగల్‌లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభకు కేంద్రమంత్రి శరద్‌పవార్ హాజరై తెలంగాణకు మద్దతు పలికారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారిని తనవైపు తిప్పుకొని పార్టీని చీల్చడానికి నాటి సీఎం వైఎస్ కుట్ర చేశాడు.
వైఎస్‌తో చేతులు కలిపి పార్టీకి ద్రోహం చేసినందుకుగాను టీఆర్ఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలైన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, దుగ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణిలను 2005 డిసెంబర్ 28న పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీఆర్ఎస్. మరో ఆరుగురు శాసనసభ్యులు కూడా వైఎస్, కేవీపీ క్యాంపుల్లో చేరిపోయారు. వైఎస్ అండలతో తొమ్మిదిమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్‌పై సంతకాలు చేసి బలపర్చారు. దీంతో టీఆర్ఎస్ నుంచి ఎన్నికై విప్‌ను ధిక్కరించినందుకు వీరిని అనర్హులుగా ప్రకటించాలని రాతపూర్వకంగా స్పీకర్‌కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. (విచారణ పేరుతో స్పీకర్ రెండేండ్ల కాలయాపన చేసి 2008 డిసెంబర్ 22న వారిని అనర్హులుగా ప్రకటించారు). మరోవైపు ఏడాదిన్నరయినా ప్రణబ్‌ముఖర్జీ కమిటీ నివేదిక ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రతినిధిబృందం సోనియాను కలువగా ఆమె యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఎం పార్టీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నదని అన్నారు.
టీఆర్ఎస్ ప్రతినిధులు సీపీఎం నాయకులైన సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్లను కలువగా సీతారాం ఏచూరి బదులిస్తూ భాషా ప్రయుక్త రాష్ర్టాల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నందున మా పార్టీ తెలంగాణ ఏర్పాటును సమర్థించడం లేదు. అంతమాత్రాన యూపీఏ ఇస్తానంటే మేమెప్పుడూ అడ్డుపతామని చెప్పలేదు. ఒకవేళ వారు ఇవ్వాలనుకుంటే వారికి ఉభయసభల్లో సరిపోయే బలం ఉందన్నారు. దీంతో పరిస్థితిని కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకున్నారు. కేవలం రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడటంతో వల్లనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సుముఖంగా లేదని భావించి 2006 ఆగస్టు 23న కేసీఆర్, నరేంద్రలు రాజీనామా చేశారు (కేంద్రమంత్రి వర్గం నుంచి). ఏ కారణాల వల్ల తాము రాజీనామా చేయాల్సి వచ్చిందో దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి 2006, ఆగస్టు 24న కేసీఆర్ జంతర్‌మంతర్ వద్ద నిరాహారదీక్ష చేశారు. మరుసటి రోజు లోక్‌సభలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తెలంగాణపై చర్చించాలని పట్టుబట్టారు. లోక్‌సభ పక్షాన స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ కేసీఆర్‌కు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అదేరోజు రాత్రి 10 గంటలకు శరద్‌పవార్ దీక్షా శిబిరానికి వచ్చి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశాడు.
కేసీఆర్, నరేంద్రలు కేంద్రమంత్రి పదవులకు రాజీనామా చేసి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తామెందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చి కూడా ఎలా మోసగించిందో ప్రజలకు తెలియజేయడానికి సిద్దిపేటలో తెలంగాణ సమర శంఖారావం పేరుతో 2006 సెప్టెంబర్ 8న బహిరంగ సభ నిర్వహించారు. సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఎం.సత్యనారాయణరావు కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ రెండేండ్లు మంత్రి పదవి అనుభవించి ఇప్పుడు తెలంగాణపై మాట్లాడుతున్నావ్ కాంగ్రెస్ మద్దతుతో ఎంపీగా గెలిచావ్, దమ్ముంటే ఆ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలంటూ సవాలు విసిరాడు. ఆ సవాలును స్వీకరించిన కేసీఆర్ 2006, సెప్టెంబర్ 12న రాజీనామా చేశారు. దీంతో అప్పటి సీఎం వైఎస్ రాబోయే కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణకు రెఫరెండం అని అన్నారు. 2006, డిసెంబర్ 4న పోలింగ్, 7న లెక్కింపు జరిగింది. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడానికి వైఎస్ నానా పాట్లు పడ్డాడు. అయినా కేసీఆర్ గెలిచారు.
కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే రాజీనామాలు
-రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా 2008, మార్చి 3న నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు. మార్చి 4న 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే 10 మంది టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలు చేయలేదు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ వ్యూహాత్మకంగా పావులు కదిపాడు. టీఆర్ఎస్ ఆ వ్యూహాన్ని ఛేదించలేకపోయింది. ఫలితంగా 2008, మార్చి 29న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన 16 అసెంబ్లీ స్థానాల్లో 7, 4 పార్లమెంటు స్థానాల్లో రెండు స్థానాల్లో గెలిచింది.
చంద్రబాబు జై తెలంగాణ
-2004 ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని పట్టించుకోకపోవడం వల్ల తెలంగాణ ప్రజల కసి ఎలా ఉందో చంద్రబాబుకు తెలిసివచ్చింది. దీంతో ఎలాగైనా 2009 ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబుకు జై తెలంగాణ అనకుంటే తెలంగాణలో ప్రజల వద్దకు వెళ్లలేమని అర్థమైంది.
-దాంతో ఎన్నడూలేనిది చంద్రబాబు 2008, జూలైలో మనమిద్దరం కలిసి పనిచేద్దామని కేసీఆర్‌తో అన్నాడు. దానికి కేసీఆర్ జవాబిస్తూ మీరు ముందుగా తెలంగాణను సమర్థించాలని అన్నారు. దీనికి చంద్రబాబు ఒప్పుకోవడంతో కేసీఆర్ కలిసి చంద్రబాబుతో పనిచేశారు. ఆ తరువాత దసరా పండుగనాడు చంద్రబాబు మీడియావాళ్లతో మాట్లాడుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందని ప్రకటించాడు.
ఇతర పార్టీలు
-తల్లి తెలంగాణ పార్టీని విజయశాంతి టీఆర్ఎస్లో విలీనం చేశారు. దీంతో మెదక్ ఎంపీ స్థానాన్ని విజయశాంతికి ఇచ్చి మహబూబ్‌నగర్ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేశారు.
-సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదంతో తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ చేసింది. అంతకుముందు దేవేందర్‌గౌడ్ తన నవ తెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు.
-ఈ విధంగా 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలన్నీ కూడా తెలంగాణ నినాదంతో ప్రజల ముందుకెళ్లాయి.
రోశయ్య కమిటీ
-ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండటం, మరోవైపు ఉధృతమవుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించిన వైఎస్ కంటితుడుపు చర్యగా 2009, ఫిబ్రవరి 12న అప్పటి ఆర్థికమంత్రి రోశయ్య నేతృత్వంలో ఉభయసభల సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
-ఈ కమిటీలో నలుగురు తెలంగాణవారు, ముగ్గురు ఆంధ్రవారు సభ్యులుగా ఉన్నారు. ఈ సభ్యుల్లో ఓవైసీ తప్ప అందరూ కాంగ్రెస్‌వారే.
-ఈ కమిటీలో కొణతాల రామకృష్ణ, జే గీతారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పద్మరాజు, షేక్ హుస్సేన్, అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యులు. అయితే ఈ కమిటీ తన నివేదికను ఇవ్వలేదు.
కేసీఆర్ పాదయాత్ర
-నల్లగొండ నగారా పేరుతో 2007, ఏప్రిల్ 6 నుంచి 2007, ఏప్రిల్ 12 వరకు వారం రోజుల పాటు కేసీఆర్ పాదయాత్ర చేశారు. నల్లగొండ జిల్లాలోని పలు ఫ్లోరైడ్ గ్రామాల్లో ఈ పాదయాత్ర చేపట్టారు. దీనిలోభాగంగా కేసీఆర్ మాట్లాడుతూ నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి ఆంధ్ర పాలకులు తాగు, సాగు నీరు ఇచ్చినట్లయితే ఈ సమస్య ఉండేది కాదని వంకర్లు తిరిగిన రెక్కలు, బొక్కలు చూసైనా ఆంధ్ర పాలకులు గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని, మన పక్కనుంచే పారుతున్న కృష్ణమ్మ మన పంటపొలాలకు కడుపు నింపట్లేదని, నాగార్జున సాగర్ నీళ్లు నల్లగొండ పొలాలకిచ్చినా, ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తయినా ఈ గోస తెలంగాణ బిడ్డలకుండేది గదని వాపోయారు.
-అదేవిధంగా మైనారిటీల సంక్షేమం కోసం సచార్ కమిటీ చేసిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని 2007, జూలై 15న ఇందిరాపార్క్ వద్ద కేసీఆర్ ఒకరోజు నిరాహారదీక్ష చేశారు. ఫలితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?