Fundamental rights and prescriptive principles | ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం
19వ అధికరణ ద్వారా వ్యక్తి స్వేచ్ఛను పొందే సందర్భంలో ఏ వ్యక్తి అయినా నిర్బంధంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి సామాజికంగా వెనుకబడిన సందర్భంలో ఆదేశికసూత్రాల్లో పేర్కొన్న 39(ఎ) అధికరణ ద్వారా కల్పించే ఉచిత న్యాయసేవా సహాయాన్ని పొందడం ద్వారా వ్యక్తి స్వేచ్ఛను కాపాడుకోవచ్చు.
21వ అధికరణ జీవించే హక్కును తెలుపుతుంది. వ్యక్తులు జీవించడానికి అవసరమైన కనీస అవసరాలను సమకూర్చుకోవాలంటే జీవనాధారంగా జీవనోపాధిని కల్పించాలి. ఆదేశిక సూత్రాల్లోని 41వ అధికరణ జీవనోపాధిని లేదా జీవనభృతిని కల్పించాలనే అంశం ఈ రెండింటికి మధ్యగల అవినాభావ సంబంధాన్ని తెలుపుతున్నది.
21వ అధికరణ జీవించే హక్కును తెలియజేస్తున్నందున ఆదేశిక సూత్రాల్లోని 48(ఎ) అధికరణలో పేర్కొన్న పర్యావరణ పరిరక్షణ అనే అంశం కాలుష్యరహితమైన వాతావరణం, స్వచ్ఛమైన తాగునీరు వంటి అంశాలు వ్యక్తి జీవించే హక్కుకు అంత్యంత అవశ్యకాలు.
46వ అధికరణను అనుసరించి రిజర్వేషన్లు అమలుపరిచేందుకు చేసే చట్టాలకు ప్రాథమిక హక్కుల్లోని 15(4), 15(5), 16(4) అధికరణల ద్వారా కల్పించిన సంరక్షణలను ఈ రెండింటికి మధ్యగల అవినాభావ సంబంధాన్ని తెలుపుతుంది.
46వ అధికరణను అనుసరించి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినవర్గాలకు కల్పించే రిజర్వేషన్లకు ప్రాథమిక హక్కుల్లోని 15(4), 15(5), 16(4) అధికరణలు సంరక్షణ కల్పిస్తున్నాయి.
ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య తేడాలు
ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
ప్రాథమిక హక్కులు 3వ భాగంలో 12 నుంచి 35 వరకుగల అధికరణల్లో పేర్కొన్నారు. ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో 36 నుంచి 51 వరకుగల అధికరణల్లో పేర్కొన్నారు.
ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు ఉద్దేశించినవి. అంటే వ్యక్తి ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఆదేశిక సూత్రాలు సమాజ సమిష్టి ప్రయోజనాలకు ఉద్దేశించినవి. మొత్తం సమాజ ప్రతిపాదికన ఏర్పాటు చేశారు.
ప్రాథమిక హక్కులు ప్రధానంగా నకారాత్మక దృక్పథం కలిగి ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడని పనులను తెలుపుతాయి. ఆదేశిక సూత్రాలు ప్రధానంగా సకారాత్మకమైనవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలియజేస్తాయి.
ప్రాథమిక హక్కులను ఉన్నత న్యాయస్థానాలు సంరక్షిస్తాయి. ఆదేశిక సూత్రాల అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ కలిగి ఉన్నాయి. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు.
ప్రాథమిక హక్కుల అమలు కోసం ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేయాలి.
ప్రాథమిక హక్కులను జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సస్పెండ్ చేయవచ్చు. ఆదేశిక సూత్రాలు ఎల్లప్పుడూ సుప్తచేతనావస్థలో ఉంటాయి.
ప్రాథమిక హక్కులు రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి ఇవి సాధనాలుగా ఉంటాయి. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ లక్ష్యాలను ఇవి తెలియజేస్తాయి.
ప్రాథమిక హక్కులు సర్వకాలాలు, సర్వ వ్యవస్థలలో అందుబాటులో ఉంటాయి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాల ఆర్థిక స్థోమతను అనుసరించి మాత్రమే అందుబాటులో ఉంటాయి.
రాజ్యాంగ సవరణలు- సుప్రీంకోర్టు తీర్పులు
ఆదేశిక సూత్రాల అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందువల్ల వీటిని అమలుపర్చడంలో భాగంగా మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 1950లో విద్యాసంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పిస్తూ చట్టాన్ని రూపొందించింది. చంపకం దొరై VS స్టేట్ ఆఫ్ మద్రాస్ మధ్య జరిగిన వ్యాజ్యంలో మొదట మద్రాస్ హైకోర్టు, ఆ తదనంతరం సుప్రీంకోర్టు రిజర్వేషన్ల చట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు అయిన సమానత్వ హక్కుకు విరుద్ధంగా ఉండడంతో ఈ చట్టం చెల్లదని తీర్పునిచ్చింది.
కామేశ్వర్ సింగ్ VS స్టేట్ ఆఫ్ బీహార్ మధ్య జరిగిన వ్యాజ్యంలో అదేవిధంగా బేలా బెనర్జీ VS స్టేట్ ఆఫ్ బెంగాల్ మధ్య జరిగిన వ్యాజ్యంలోనూ సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వ్యక్తుల ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
మొదట రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల అమలు కోసం రూపొందించిన చట్టాలకు రక్షణ కల్పిస్తూ 15(4) అధికరణను, 31(ఏ), 31 (బీ) అధికరణలను భారతరాజ్యాంగంలో చేర్చారు.
4వ రాజ్యాగం సవరణ: కామేశ్వర్ సింగ్ కేసులోనూ బేలాబెనర్జీ కేసులోనూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించడం కోసం భారత పార్లమెంట్ 4వ రాజ్యాంగ సవరణను చేసింది. దీని ప్రకారం నష్ట పరిహారం విషయంలో ప్రభుత్వాలు చట్టబద్ధంగా నిర్ణయించిన అంశానికి న్యాయ సంరక్షణ కల్పిస్తూ 9వ షెడ్యూల్లో చేర్చారు.
శంకరీ ప్రసాద్ VS యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చిన రిజర్వేషన్ల సంరక్షణను, భూసంస్కరణ చట్టాలకు సంరక్షణ కల్పించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అదేవిధంగా రాజ్యాంగంలో 13వ అధికరణ ప్రకారం సాధారణ చట్టాలను మాత్రమే న్యాయసమీక్షకు గురిచేస్తాము. 368వ అధికరణను అనుసరించి చేసిన రాజ్యాంగ సవరణలను న్యాయసమీక్షకు గురిచేసే అవకావం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
సజ్జన్‌సింగ్VS స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 17వ రాజ్యాంగసవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చిన అంశాల ప్రకారం వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారాలను చట్టబద్ధంగా నిర్ణయించిన వాటికి మాణ్యత ఉంటుందని వాటిని న్యాయస్థానాలు కొట్టివేయరాదని పేర్కొంటూ చేసిన సవరణ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
1967లో గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యమిస్తూ ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని తీర్పు ఇచ్చింది.
1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 24వ రాజ్యాంగ సవరణను సమర్థించింది. అంటే ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు నిర్దేశిక నియమాల ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
1980లో మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకూ ఆదేశిక సూత్రాలకూ మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం జరిగింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?