The job should not be procrastinating | ఉద్యోగం మొక్కుబడి కాకూడదు
ఏంటి సార్ చాలా ఉత్సాహంగా పాట పాడుతున్నారు? అప్పుడే వచ్చిన విక్రం శశాంక్‌ను అడిగాడు. రావయ్యా ఇవ్వాళ కొన్ని సినిమా పాటల గురించి తెలుసుకుందాం. అదేంటి సార్? పెండ్లికెళ్తున్నాం కదా! అక్కడ ఎలాగూ పాటల కచేరీ, సంగీత విభావరి కూడా ఏర్పాటు చేశారట. అందుకే పాటలపైకి వెళుతోంది మనసు బహుశా.
కాలేజీ కరస్పాండెంట్ కూతురు పెండ్లి. ఇద్దరూ బైక్‌పై కల్యాణమండపానికి చేరుకున్నారు. రాత్రి ఎనిమిది దాటింది. అప్పటికే స్టాఫందరూ, బీ-స్కూల్ విద్యార్థులందరూ చేరుకుని సందడి చేస్తున్నారు. ఫిలింనగర్ నుంచి వచ్చిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడి సంగీత విభావరి ప్రారంభమైంది పెండ్లి కార్యక్రమం అనంతరం. పాటలు చాలా బాగా పాడుతున్నారు కళాకారులు. శ్రోతలంతా ఆస్వాదిస్తున్నారు. ప్రోగ్రాం అయిపోయింది. విక్రం వివాహబంధం శాశ్వతంగా, బలంగా నిలబడాలంటే ఏది ముఖ్యమో తెలుసా? తిరుగు ప్రయాణంలో ఓ ప్రశ్న వేశాడు శశాంక్. అది ఆయన చెప్పబోయే విషయానికి ఉపోద్ఘాతంలా అర్థం చేసుకొని వింటూ ఉండిపోయాడు విక్రం. చెప్పుకుంటూ పోతున్నాడు శశాంక్.. పరస్పరం ఒకర్నొకరు విశ్వసించటం, ఒకర్నొకరు బలంగా ఇష్టపడటం, ఒకరికి ఒకరు సహాయపడటం. అని కాసేపాగి తిరిగి కొనసాగించాడు. పరస్పర విశ్వాసం, ఇష్టపడటం అనేవి ఉన్నప్పుడు సహజంగానే ప్రేమపూరిత సహాయం చేసుకోవడం జరిగిపోతుంది. అని కాసేపాగాడు. సిగ్నల్ వద్ద కాస్త స్లో చేసి తిరిగి వేగంగా నడుపుతూ మళ్లీ చెప్పటం కొనసాగించాడు.
నాగరిక మానవ సమాజంలో వివాహం అనేది అత్యంత పవిత్రబంధం. అన్ని రకాల మతాలు, నాగరికతలు ఈ విషయంలో పూర్తిగా ఏకాభిప్రాయంతో ఉన్నాయి. వింటున్నాడు శ్రద్ధగా. ఈ టాపిక్ ఎందుకింత సుదీర్ఘంగా చెబుతున్నాడో అంతుబట్టడం లేదు. అప్పుడు చెప్పాడు శశాంక్. కంపెనీకి, ఉద్యోగికి మధ్య సంబంధం కూడా ఇంతకన్నా పవిత్రమైంది. ఉద్యోగి పట్ల పరస్పరం నమ్మకం/విశ్వాసం ఉండటం ఎంతో అవసరం. ఏ ఉద్యోగి అయినా తను ఇష్టపడి చేసే పనినే ఆనందంగా చేయగలడు. పనినీ, ఉద్యోగాన్ని, కంపెనీని మనస్ఫూర్తిగా ఇష్టపడాలి. ఏదో మొక్కుబడి వ్యవహారంలా చేయకూడదు.
సహజంగానే అతడికి అప్పుడు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, రివార్డులూ అందుతాయి. కాబట్టి హెచ్ఆర్ మేనేజర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు కంపెనీని, జాబ్‌ని ఎంతలా ఇష్టపడుతున్నారన్న విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. చేయబోయే పనిని ఎంతగా ఇష్టపడితే మీరు ఉద్యోగ జీవితంలో అంతగా రాణిస్తారు.
ఇప్పుడొక చిన్న కథ చెబుతాను విను.. ఒక అందమైన అమ్మాయి ఒక మల్టీనేషనల్ కంపెనీలో నెలకు రూ. 90వేల జీతంతో పనిచేస్తుంది. వాళ్ల నాన్నగారు ఆమెకి వివాహం చేయాలనుకున్నాడు. యోగ్యులైన, ఆమెకు అన్ని విధాలా సరితూగే ఐదుగురు కుర్రాళ్లను ఎన్నుకున్నారు. అందులో.. మొదటి అబ్బాయి నువ్వు మంచి కట్నం తీసుకురావాలి అని నిబంధన పెట్టాడు. రెండో అబ్బాయి నువ్వు ఉద్యోగం చేయాలి. మంచి కట్నం కూడా తీసుకురావాలి అన్నాడు. మూడో అబ్బాయి ఉద్యోగం, కట్నమే కాదు నీవు చక్కగా వంటకూడా చేయాలి అన్నాడు. నాలుగో అబ్బాయి వీటన్నిటితో పాటు నీవు నన్ను ఇష్టపడాలి. మా అమ్మానాన్నల్ని, పెద్దల్ని గౌరవించాలి అని అన్నాడు. ఈ నలుగురు అబ్బాయిలు చాలా యోగ్యులు, చాలామంచి కుటుంబాల నుంచి వచ్చారు. ఉన్నత చదువులు చదివారు. చాలా పెద్ద కంపెనీల్లో ఆ అమ్మాయి కన్నా రెట్టింపు వేతనంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం ఆ అబ్బాయిల్లో ఎవర్ని ఎన్నుకుందాం.
నలుగురి గురించి మరొక్కసారి చదవండి. ఆ నలుగురబ్బాయిలు వేసిన ప్రశ్నలు మరోసారి చదవండి. చాలామంది నాలుగో అబ్బాయిని మంచివాడిగా ఎన్నుకుంటారు. అయితే ఇది పొరపాటు నిర్ణయం. ఈ నలుగురబ్బాయిలూ చాలా స్వార్థపరులే. నాకేం కావాలి అన్న కోణం నుంచి మాత్రమే వారు ఆలోచిస్తున్నారు. సహజంగానే ఆ అమ్మాయి ఆ నలుగురినీ తిరస్కరించింది. అమె ఐదో అబ్బాయిని ఎన్నుకొంది. అతను అర్హతలు, యోగ్యత విషయాల్లో మిగతా నలుగురికన్నా ఎక్కువేం కాదు. జీతభత్యాలు, హోదా ఇలా అన్ని అంశాల్లో మిగతా పోటీదారులకన్నా ఏవిధంగానూ మెరుగు కాదు. మరి అతని ప్రత్యేకత ఏంమిటంటే నువ్వంటే నాకిష్టం, నీ సంతోషం, నీ ఆనందం నాకు ముఖ్యం. నాలో నచ్చని అంశాలుంటే చెప్పు నన్ను నేను మార్చుకుంటాను. నీ స్వేచ్ఛని గౌరవిస్తాను. నీవు కావాలంటే ఉద్యోగంలో కొనసాగవచ్చు. మన మధ్య ఏ గొడవలు రాకుండా నీ అభిప్రాయాల్ని గౌరవిస్తూ హుందాగా నడుచుకుంటాను. పార్టీలు, క్లబ్బులకు వెళ్లను. వేరే అమ్మాయిలను కన్నెత్తి చూడను అని చెప్పాడు. నేనేం ఇవ్వగలను అనే కోణం నుంచి మాత్రమే చూస్తున్నాడు. ఇలా ఈ కథ సుఖాంతమైంది.
అన్ని విధాలుగా యోగ్యులుగా ఉంటూ అర్హతలు కలిగి ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతరత్రా టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉంటూ చక్కటి ఆటిట్యూడ్ కలిగిన అభ్యర్థుల కోసం హెచ్ఆర్ ఎదురుచూస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?