‘సరళీకృత’ ప్రభావం ఎలా ఉన్నది?
సరళీకృత ఆర్థిక విధానాల అమలు ప్రభావం
-సంక్షేమ రంగాలకు కేటాయింపులు తగ్గించి క్రమంగా సంక్షేమ చర్యల నుంచి ప్రభుత్వం తప్పుకుని ప్రజలపై పన్నుల భారం పెంచడం.
-ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరిట మూసివేయటం లేదా ప్రైవేట్ వ్యక్తులకు వాటిని అప్పగించడం
-ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి ప్రైవేట్ వ్యవస్థను ప్రోత్సహించడం
-అత్యంత ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించడం
-ప్రకృతి వనరులను ప్రైవేట్ పరిశ్రమలకు, సంస్థలకు అప్పగించడం
-సంక్షేమ రాజ్య భావనను ప్రభుత్వాలు విస్మరించడం
-సేవా రంగాన్ని విస్తృతపర్చడం
వ్యవసాయ రంగానికి ఉండే కేటాయింపులను భారీగా తగ్గించడం 1991-92లో ఆర్థిక సంస్కరణలు ఆరంభమైనప్పటి నుంచి 2001-2002 వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 20శాతం తరుగుదల నమోదైంది. స్వచ్చంధ ఉద్యోగ విరమణ కారణంగా వేలాదిమంది ఉద్యోగాలు వదిలేసి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల వేటలో పడ్డారు. 1996లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగాల నియామకంపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేశాడు. 1999లో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సర్వీస్ కమిషన్ నుంచి ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని రాష్ర్టంలో కొన్ని వేల సంఖ్యలో చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి.
దాదాపు కొన్ని వేల మంది తమ ఉపాధిని కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుదింపు, కాంట్రాక్టు పద్ధతుల్లోనే ఉద్యోగ నియామకాలు, సేవా రంగాలకు నిధుల కేటాయింపుల్లో కోత, సబ్సిడీలను రద్దుపర్చడం లాంటివి ఆర్థిక సంస్కరణలో భాగం. ఇందులో భాగంగానే కార్మికులకు ఇచ్చే బోనస్‌లను నియంత్రించి పెన్షన్లను తొలగించారు. అంతేకాదు ఉద్యోగ భద్రత, సర్వీస్ బెనిఫిట్స్, పెన్షన్ వంటివి కనుమరుగయ్యాయి. మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలను కోర్ (ప్రధాన) , నాన్‌కోర్ (అప్రధాన) విభాగాలుగాను పర్మినెంట్, టెంపరరీ అని, డైరెక్టు రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతి అని వర్గీకరించారు. ఈ విధానాలతో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతులు ఉనికిలోకి వచ్చాయి.
పర్యవేక్షణ బాధ్యతలతో కూడిన ఉన్నతస్థాయి ఉద్యోగాలను కోర్ ఉద్యోగాలుగా పరిగణించి వాటిని ప్రభుత్వం రిక్రూట్మెంట్ నిర్వహించి నింపుతుంది. ఇవి పరిమిత సంఖ్యలో ఉండే ఉద్యోగాలు. ఇవిగాక మిగతా ఉద్యోగాలన్నింటిని నాన్ కోర్ ఉద్యోగాలుగా పరిగణించి వాటిని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతిలో నింపుతుంది. శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలుకుతుంది. గ్రూప్-3, గ్రూపు-4లలో ఈ సంస్కరణల మూలంగా ఉద్యోగ అవకాశాలుండవు. ఈ సంస్కరణల అమలుతో స్వచ్చంధంగా పదవీ విరమణ జేసిన తెలంగాణ ఉద్యోగుల వివరాలు…
1. మొదటి దశ
(1998-2001) 4744
2. రెండో దశ
(2002-2005) 7321
3. ఆ తదుపరి 38,539
మొత్తం 50,604
-ఈ నూతన ఆర్థిక సంస్కరణలకు తెలంగాణ ప్రయోగశాల అయ్యింది. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం, చేయూత లేక వీధినపడ్డారు. అనేక లఘు పరిశ్రమలు మూతపడ్డాయి. చిన్నపరిశ్రమలు, హస్తకళలు, చేతివృత్తులు చితికిపోయాయి. విదేశీ వస్తువులు ఉత్పత్తులు మనదేశ మార్కెట్లోకి యథేచ్ఛగా ప్రవేశిస్తుండటంతో స్థానిక ఉత్పత్తులకు గిరాకీ లేక అనేక చిన్న చిన్న పరిశ్రమలు మూతబడి వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ప్రపంచ బ్యాంకు షరతులతో ప్రభుత్వరంగ ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి.
స్వచ్ఛంద పదవీ విరమణ పథకంతో బ్యాంకు, ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి సాగనంపారు. కొత్త ఉద్యోగాలు లేక ఉన్నవి ఊడిపోయి ప్రజలు ఇబ్బందులపాలయ్యారు. ఈ విధానాలు ఉపాధి రహిత వృద్ధిని కొనసాగిస్తూ ప్రజల మధ్య అంతరాలను పెంచుతూ సామాజిక జీవితంలో అభద్రతలను అశాంతిని పెంచాయి. ఈ ప్రయోగంలో తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోతున్న ప్రమాదకర పరిస్థితుల్లో ప్రత్యేక రాష్ర్ట డిమాండ్ ఊపందుకుంది. ఈ ఆర్థిక సంస్కరణలు తీవ్రమైన ప్రాంతీయ అసమానతలకు దారితీశాయి. ముఖ్యంగా కోస్తా ప్రాంతంతో పోలిస్తే తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. పేదరికపు స్థాయిని అంచనా వేసినట్లయితే 1980 నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 11.29 శాతం వ్యక్తులు, 18.87 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే, అదే తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో 80.08 శాతం ప్రజలు 82.28 శాతం కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువనున్నారు.
ఉమ్మడి రాష్ర్టంలో ఈ నూతన ఆర్థిక విధానాలతో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు. కోస్తాంధ్రలో వాణిజ్య పంటలతో పెట్టుబడీదారి వ్యవసాయంతో ఎదిగిన సామాజిక వర్గాలు నూతన ఆర్థిక విధానాలను తమకు అనుకూలంగా మలుచుకుని కుబేరులయ్యారు. తెలంగాణలోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములు ముఖ్యంగా హైదరాబాద్ పరిసరాలలోనివి వలసవొచ్చిన కోస్తాంద్ర పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయాయి. ఖరీదైన భూములతోపాటు జంట నగరాలలోని వ్యాపారాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, హోటళ్లు, పత్రికలు, సినీపరిశ్రమతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వీరి చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఉమ్మడి రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో ఈ వలసవొచ్చిన కోస్తాంద్ర పెట్టుబడిదారులకు వారి వ్యాపారాలు విస్తరింపజేసుకోవడానికి అవకాశాలు విరివిగా లభించాయి.
ఈ నూతన ఆర్థిక విధానాలతో అప్పటికే అభివృద్ధి చెంది ఉన్న కోస్తాంద్ర ప్రాంతం మరింత అభివృద్ధి చెంది తెలంగాణ ప్రాంతం మరింత వెనుకబడిపోయి రెండు ప్రాంతాల మధ్య అసమానతలు పెరిగిపోయాయి. తెలంగాణ గ్రామాల్లో వ్యవసాయం, కులవృత్తులు, చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు పోటీకి తట్టుకోలేక క్షీణించి పేదరికం అప్పులతో చిన్న రైతులు, కార్మికులు,బలహీన వర్గాలు, మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు మరింత అధ్వాన స్థితికి నెట్టవేయబడ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, కూలీల వలసలు, విప్లవోద్యమాలపై అణచివేత రాజ్యహింస పెరిగి పౌరస్వేచ్ఛ మృగ్యం కావడం వంటి వాటితో సామాజిక అశాంతి తీవ్రంగా పెరిగిపోయింది. నూతన ఆర్థిక విధానాలపై నుంచి రుద్దబడే ఒక అభివృద్ధి నమునాను ముందుకు తెచ్చాయి. క్షేత్రస్థాయి అవసరాల నుంచి, ప్రజల ఆకాంక్షల నుంచి, అనుభవాల నుంచి కాకుండా సంపన్న వర్గాల ఆలోచనల నుంచి ప్రజలకు ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పర్చాలనే దిశగా ఈ అభివృద్ధి నమునా పనిజేస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు