దీర్ఘకాలిక స్మృతి : కొన్ని గంటలు, రోజులు, నెలలు, ఏండ్లు లేదా జీవన పర్యంతం గుర్తుండే స్మృతి ఇది. సమాచారం ఎక్కువ కాలం ఉండేది ఇక్కడే. దీర్ఘకాలిక స్మృతికి అవధులు ఉండవు. ఈ స్మృతిపథంలో రికార్డు అయిన విషయం చెరిగిపోయే ప్రసక్తే లేదు. పునఃశ్చరణ కష్టం కావచ్చునేమోకానీ, ఫలానా విషయం మెదడులోంచి కనుమరుగైపోవడం ఉండదు. రిగ్రేషన్లో ఏం జరుగుతుంది? ఒక వ్యక్తిని డీప్ ట్రాన్స్‌లోకి పంపి అతని పూర్వపు జీవితానికి, వెనక్కి తీసుకెళ్లే ప్రక్రియను ఏజ్ రిగ్రెషన్ అంటారు. ఈ విధానం ద్వారా వ్యక్తిని ఒక నిర్దిష్టమైన చోట ఆపినప్పుడు, ఆ వయసులో అతనికి జరిగిన ఒక సంఘటనను వివరించమని కోరితే ఆ వ్యక్తి ఆ సంఘటనను యథాతథంగా తన చుట్టూ ఉన్న వ్యక్తుల పేర్లు, వాళ్లు వేసుకున్న దుస్తుల రంగులు వంటి చిన్నచిన్న వివరాలతో సహా క్లియర్‌గా వివరిస్తాడు. అంతేకాకుండా, ఫలానా సంఘటన జరుగుతున్నప్పుడు అతనికి కలిగిన మానసిక ఉద్వేగానుభూతిని కూడా యథాతథంగా పొందుతాడు. అందువల్ల బ్రెడయన్కు ఇంద్రియానుభూతుల ద్వారా అందే ఏ సమాచారమైనా సరే చెరిగిపోయే ప్రసక్తి లేదు. కాబట్టి మహామేధావులైన వ్యక్తుల దగ్గర నుంచి, అతి సామాన్యుడైన మనిషి వరకూ అందరి మెదళ్లూ ఒకేలా పనిచేస్తాయి. ఒకే విధమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎరిక్సన్, ఛేజ్ వంటి శాస్త్రజ్ఞులు, అసాధారణమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించే వారిలో సూపర్‌మేన్ క్వాలిటీస్ అంటూ ప్రత్యేక లక్షణాలేవి ఉండవని అంటారు.
మరుపునకు కారణాలు : మనం దేన్నయినా లేదా చదివే ఏ విషయాన్నయినా ఎందుకు మర్చిపోతాం? మనం అనుభవించిన లేదా అనుభూతికి లోనయిన విషయాలు మన స్మృతిపథంలో మెమరీ ట్రేసెస్ (స్మృతి చిహ్నాలు)గా నమోదవుతాయని తెలుసుకున్నాం. ప్రతి స్మృతి చిహ్నం నిర్దిష్టమైన మోతాదులో మానసిక శక్తి వినియోగించడం మూలంగా ఏర్పడుతుంది. ఎక్కువకాలం పాటు గుర్తుంచుకోవాల్సిన అంశాలకు ఎక్కువ మానసిక శక్తి వెచ్చించాలి. స్మృతి చిహ్నాల నమోదు కార్యక్రమం లీలగా మాత్రమే జరిగినప్పుడు ఆ అనుభవం లేదా, సన్నివేశం త్వరగా స్మృతిపథం నుంచి తొలగిపోతుంది. నమోదైన స్మృతి, తన శక్తిని కోల్పోకుండా ఉండటానికి దాన్ని అప్పుడప్పుడు రీచార్జ్ చేస్తూ ఉండాలి. లేకపోతే అది స్మృతి బ్యాంకులో నిలువ ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి, స్మృతి చిహ్నాలు సరిగ్గా ఏర్పడకపోవటమో, ఏర్పడిన స్మృతిచిహ్నాలు తిరిగి రీచార్జ్ కాకపోవటమో, కాలం గడిచేకొద్దీ షేడ్ అయిపోవడమో, మరోకొత్త స్మృతి చిహ్నాలు ఏర్పాటుకు శక్తిని వినియోగించాల్సి రావటమో జరుగుతుంది. అందువల్ల మతిమరుపునకు కారణాలుగా కింది వాటిని పేర్కొనవచ్చు.
-జోక్యం
-అణచివేత
-సరిగ్గా నమోదు కాకపోవడం
-ఉపయోగించకపోవటం