The first stage of Telangana development | తెలంగాణ తొలి వికాస దశ ( గ్రూప్-1 మెయిన్స్)
శాతవాహనుల పాలనా వ్యవస్థను వివరించండి?
– శాతవాహనులు వికేంద్రీకృత పాలనా వ్యవస్థను అనుసరించారు. శాతవాహన సామ్రాజ్యంలో అనేక రకాల సామంతులు స్వయంప్రతిపత్తిని అనుభవించినట్లు తెలుస్తున్నది. కేంద్రప్రభుత్వంలో రాజుకు సహాయకారిగా ఉన్న మంత్రిమండలిలో విశ్వాసామాత్యులు కీలకపాత్ర పోషించారు. కేంద్రప్రభుత్వ అధికారంలో మహామాత్ర, మహాసేనాపతి, మహాతలవర, భాండాగారిక, హీరాణిక వంటివారు కీలకపాత్ర పోషించారు. దూత, ప్రతీహార వంటి సమాచారాధికారులు కూడా ఉండేవారు.
– శాతవాహనుల కాలంలో స్థానిక పాలనలో స్థానిక ప్రాతినిధ్యానికే ప్రాధాన్యం ఇచ్చేవారు. పట్టణపాలనలో పట్టణంలోని ప్రముఖులు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, చేతివృత్తుల సంఘాల ప్రతినిధులతో కూడిన నిగమసభలు కీలకపాత్ర పోషించేవి. గ్రామపాలనను గ్రామణి/గ్రామిక పర్యవేక్షించేవారు. శాతవాహనులు చతురంగ బలాలతో కూడిన సైనికవ్యవస్థను కలిగి ఉన్నారని, శాతవాహనులకు సమకాలికంగా ఉన్న ఖారవేలుడు వేయించిన హాతిగుంఫా శాసనాన్ని బట్టి తెలుస్తుంది. శాతవాహనుల శాసనాల్లో సైన్య సంబంధమైన ‘స్కంధావర’ ‘కటకం’ అనే పదాలు కనిపిస్తున్నాయి. సైన్యం తాత్కాలిక విడిదిని స్కంధావర అని, శాశ్వత విడిదిని కటకం అని పిలిచారు.
– శాతవాహనులు పండిన పంటలో 6వ వంతును శిస్తుగా స్వీకరించారు. వారికాలంలో విస్తృతమైన ఆర్థిక కృషి జరగడంతో రహదారి సుంకాలు, సంతసుంకాలు వసూలు చేశారు. శాతవాహనులు స్థూలంగా న్యాయవ్యవస్థలో సందర్భాన్ని బట్టి మనుస్మృతినిగాని, అర్థశాసా్త్రన్ని గాని అనుసరించి ఉంటారని భావించవచ్చు.
శాతవాహనుల కాలం నాటి సామాజిక పరిస్థితులను వివరించండి?
– శాతవాహన యుగం నాటి సామాజిక పరిస్థితులను తెలుసుకునేందుకు వారి శాసనాలు, సమకాలీన సాహిత్యం దోహదపడతాయి.
– శాతవాహనుల్లో కొందరు పాలకులు మాతృసంజ్ఞలు ధరించడంవల్ల వీరు మాతృస్వామిక వ్యవస్థకు చెందినవారని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కానీ శాతహవానులందరూ స్థూలంగా పితృస్వామిక వ్యవస్థనే అనుసరించారు. 30 మంది పురుషులు పరిపాలించడం, వారసత్వం కూడా కొడుకులకే సంక్రమించడం వంటి అంశాలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. మాతృసంజ్ఞలు పాలకవర్గంలోని బభార్యత్వాన్ని సూచిస్తున్నాయని చెప్పవచ్చు. ఉన్నత వర్గాల స్త్రీలు తమ భర్తల పదవి సంకేతాలను ధరించేవారు.
ఉదా: మహాసేనాపత్ని, మహాభోజకి మొదలైనవి.
– కింది వర్గాల, శ్రామికవర్గాల స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని పనిపాటల్లో పాల్గొనేవారని గాథాసప్తశతి తెలియజేస్తుంది.
-శాతవాహన యుగంలో వర్ణవ్యవస్థ దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిందని అభిప్రాయం. నాసిక్ ప్రశస్తిని బట్టి గౌతమీపుత్రశాతకర్ణి వర్ణసాంకర్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నించాడని తెలుస్తుంది. కానీ వర్ణసాంకర్యం కొనసాగుతూనే వచ్చింది. గౌతమీపుత్రశాతకర్ణి వారసుడైన శివశ్రీశాతకర్ణి శక రాకుమార్తెను వివాహమాడారు. తదనంతర కాలంలో కులాలుగా రూపొందిన వృత్తులెన్నో శాతవాహనుల శాసనాల్లో ప్రస్తావించబడ్డాయి.
ఉదా: కువార (కుమ్మరి), కమార (కమ్మరి), సువనక (సువర్ణకారులు), వధిక (వడ్రంగులు), సేలవధక (శిల్పులు), కోలిక (నేతపనివారు), గోలిక (పశుకాపరులు), హాలక (రైతులు), తిలపిసక/తిలవిష్టక (నూనె గానుగాడించేవారు) మొదలైనవి.
– శాతవాహన యుగంలో ఆర్థిక అంతరాలుండేవి. సంపన్నులు 2, 3 అంతస్థుల ఇండ్లలో నివసించగా, సామాన్యులు పూరిగుడిసెల్లో నివసించారు. వ్యవసాయం, వాణిజ్యం, వస్తు ఉత్పత్తి రంగాల్లో విశేషమైన కృషి జరిగిన కారణంగా ప్రజలు సౌకర్యవంతమైన జీవనాన్ని గడిపినట్లు తెలుస్తున్నది. గాథాసప్తశతిని బట్టి ఉద్యానగమన, హాలిక, ఘటానిబంధన వంటి సామాజిక ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రజలు ఉల్లాసంగా జీవించేవారని తెలుస్తుంది.
శాతవాహన యుగం నాటి మత పరిస్థితులను తెల్పండి?
– శాతవాహనయుగంలో బౌద్ధం, జైనంలతో పాటు వైదిక సంప్రదాయాలైన శైవ, వైష్ణవ మతాలు వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బౌద్ధం విశేషవ్యాప్తిని పొందింది.
– శాతవాహనులు వైదిక మతాభిమానాన్ని ప్రదర్శించారు. మొదటి శాతకర్ణి అశ్వమేథంతోపాటు అనేక వైదిక యజ్ఞాలు నిర్వహించాడు. శాతవాహన రాజవంశంలో కనిపించే వేదశ్రీ, యజ్ఞశ్రీ వంటి పేర్లు వారి వైదిక మతాభిమానాన్ని చూపుతున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి వైదిక ధర్మాలను పరిరక్షించి వర్ణసాంకర్యాన్ని అరికట్టేందుకు ప్రయత్నించాడు. పౌరాణిక, హైందవ సంప్రదాయానికి చెందిన శైవ, వైష్ణవ మతాలు కూడా శాతవాహన యుగంలో వ్యాప్తిలోకి వచ్చాయి.
– గాథాసప్తశతి శివస్తుతితోనే మొదలవుతుంది. గౌరి, గణేశ, కార్తికేయ, స్కంద వంటి శైవదేవతలు ప్రస్తావించబడ్డారు. భారతదేశంలోనే అతిప్రాచీన శివాలయం (గుడిమల్లం) ఈ యుగంలోనే నిర్మించబడింది. లీలావతి అనే ప్రాకృత కావ్యాన్ని బట్టి హాలుని కాలంలో సప్త గోదావరి గొప్ప శైవక్షేత్రమని, అక్కడ శివునికి ఒక గుడి, పాశుపతశాఖకు ఒక మతం ఉండేదని తెలుస్తుంది. శాతవాహన యుగంలో విష్ణు ఆరాధన కూడా వ్యాప్తిలో ఉండేదనడానికి గాథాసప్తశతిలో ప్రస్తావించబడ్డ గోపాల, కేశవ, వర్ధన వంటి విష్ణునామాలే ఉదాహరణ. భారతీయ సాహిత్యంలోనే తొలిసారిగా రాధ గాథాసప్తశతిలో ప్రస్తావించబడింది. నాసిక్ ప్రశస్తి గౌతమీపుత్ర శాతకర్ణిని రామ, కేశవులతో పోల్చింది.
– శాతవాహనులు తొలిదశలో జైనాన్ని ఆదరించినట్లు తెలుస్తుంది. జైనస్థావరమైన మునులగుట్టలో శ్రీముఖుని నాణేలు లభించాయి. శాతవాహన తొలి పాలకులు జైనమతాభిమానులని జైనమత సాహిత్యం పేర్కొంటుంది. కాలకసూరి ప్రబంధాన్ని బట్టి కాలకసూరి అనే జైనాచార్యున్ని శాతవాహనులు ఆదరించినట్లు తెలుస్తుంది.
– శాతవాహనయుగంలో బౌద్ధం పాలకవర్గాల చేత, సామాన్య ప్రజలచేత విశేషంగా ఆదరించబడి, అత్యధిక వ్యాప్తిని పొందింది. గౌతమీబాలశ్రీ వంటి రాణులు, గౌతమీపుత్రశాతకర్ణి వంటి రాజులు బౌద్ధానికి దానాలు చేశారు. యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుని కోసం నాగార్జునకొండ దగ్గర విహారాన్ని నిర్మించాడు. శాతవాహనయుగంలో తెలంగాణలో మహాయాన బౌద్ధం విస్తృతవ్యాప్తిలో ఉంది. ధూళికట్ట, ఫణిగిరి, రామిరెడ్డిపల్లి, నాగార్జునకొండ, తిరుమలగిరి వంటివి ప్రసిద్ధ బౌద్ధక్షేత్రాలుగా వర్థిల్లాయి.
ఇక్షాకుల కాలం నాటి పరిస్థితులను వివరించండి?
-శాతవాహనుల తర్వాత తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతాలను పాలించిన ఇక్ష్వాకులు, శాతవాహనయుగం నాటి సాంస్కృతిక వికాసాన్ని కొనసాగించడంలో కీలకపాత్ర పోషించారు. ఇక్ష్వాకుల కాలంలో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగిందని నాగార్జునకొండ దగ్గర లభించిన రోమన్ నాణేలు తెలియజేస్తున్నాయి. అయితే ఇక్ష్వాకుల కాలంలోనే వాణిజ్యం తగ్గుముఖం పట్టి క్రమంగా స్వయంసంపూర్ణ గ్రామీణ ఆర్థికవ్యవస్థ పరిణామం మొదలైందని చెప్పవచ్చు.
– వాణిజ్యం క్షీణత వల్లనే ఇక్ష్వాకులు వ్యవసాయనికున్న ప్రాధాన్యాన్ని గుర్తించారు. ఇక్ష్వాకుల్లో మొదటివాడైన వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు వ్యవసాయభివృద్ధి కోసం లక్షల సంఖ్యలో నాగళ్లు, పశువులను దానం చేశాడు. ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశంలో వైదికమత వ్యాప్తికి కృషిచేశారు. వాశిష్టీపుత్ర శ్రీశాంతమూలుడు అనేక వైదిక యజ్ఞాలు నిర్వహించాడు. నాగార్జునకొండ దగ్గర ఇక్ష్వాకులకు చెందిన అవభృధ స్నానఘట్టం వెలుగుచూసింది. శ్రీశాంతమూలుడు స్కంధుడిని కూడా ఆరాధించడం వలన క్రమంగా ఆంధ్రదేశంలో స్కంధారాధన వ్యాప్తిలోకి వచ్చింది.
-వీరపురుషదత్తుని కాలంలో బౌద్ధం విశేష ఆదరణ పొందింది. నాగార్జునకొండ అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మారింది. శాంతిశ్రీ, అడవి శాంతిశ్రీ వంటి రాకుమార్తెలు బౌద్ధానికి దానాలు చేశారు. రాజభాండాగారికుని మేనకోడలు ఉపాసిక బోధిశ్రీ నాగార్జునకొండ దగ్గర దూరదేశ బౌద్ధ భిక్షువుల కోసం విహారాలను, చతుశ్శాలను నిర్మించింది. ఇక్ష్వాకుల కాలంలోనే దక్షిణభారతదేశంలో హిందూ దేవాలయాల నిర్మాణం మొదలైంది. పుష్పభద్రాలయం, కార్తికేయ ఆలయం, అష్టభుజస్వామి ఆలయం, హారతి ఆలయం వంటివి నిర్మించబడ్డాయి. గర్భగుడి, అంతరాళమండపం, ధ్వజస్తంభం, ప్రాకారం వంటి లక్షణాలతో హిందూదేవాలయ వాస్తు ప్రాథమిక స్వరూపాన్ని సంతరించుకున్నట్లు తెలుస్తుంది.
– ఇక్ష్వాకుల కాలానికి చెందిన ఒక విశిష్టమైన ప్రేక్షాగారం నాగార్జునకొండ దగ్గర వెలుగుచూసింది. రోమన్ల ప్రభావంతో నిర్మింపబడ్డ ఈ ప్రేక్షాగారానికి కొందరు ధ్వని విజ్ఞాన మండపం అని పేరు పెట్టారు.
తెలంగాణలో జైనమత వికాసాన్ని పరిశీలించండి ?
-అతిప్రాచీన కాలం నుంచి జైనమతం తెలంగాణలో విశేష ప్రాచుర్యం పొందింది. అయితే మధ్య యుగాల్లో వీరశైవం విజృంభించడంతో జైనమతం బలహీనపడింది. జైనమత సాహిత్యం ప్రకారం తొలి తీర్థంకరుడైన రుషభనాథుని కుమారుడైన బాబలి బోధన్‌ను కేంద్రంగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. బోధన్‌లో నిలువెత్తు గోమఠేశ్వరుని విగ్రహం ఉండేదని దాని స్పూర్తితోనే చాముండరాయుడు శ్రావణ బెళగోళలో గోమఠేశ్వరుని విగ్రహం ప్రతిష్ఠించాడని తెలుస్తుంది. శాతవాహనులు తొలిదశలో జైనాన్నీ ఆదరించారు. తొలిపాలకుడైన శ్రీముఖుని నాణేలు కరీంనగర్ జిల్లాలోని మునులగుట్ట దగ్గర లభించడమే ఇందుకు నిదర్శనం. కాలకసూరి ప్రబంధం ప్రకారం కాలకసూరి అనే జైనాచార్యుడిని శాతవాహనులు ఆదరించారని తెలుస్తుంది.
-అయితే శాతవాహనాంతర యుగంలో బౌద్ధమతానికి లభించినంత పోషణ జైనమతానికి లభించలేదనే చెప్పాలి. 8, 10 శతాబ్దాల మధ్య తెలంగాణను పాలించిన వేములవాడ చాళుక్యులు జైనాన్ని పోషించారు. రెండో బద్దెగుడు జైనాచార్యుడైన సోమదేవసూరిని పోషించాడు. సోమదేవసూరికి ‘శ్యాద్వాదాచలసింహా, తార్కిక చక్రవర్తి’ వంటి బిరుదులు ఉన్నాయి. ఆయన యశస్తిలక, నీతివాక్యామృతం వంటి సంస్కృత రచనలు చేశారు. వేములవాడ చాళుక్యులు వేములవాడలో శుభదామ జైనాలయం నిర్మించారు. కళ్యాణిచాళుక్యులు తెలంగాణలో అనేక జైనకేంద్రాలకు పోషణ కల్పించారు. వేములవాడ, పొట్లచెరువు, వర్ధమానపురం, కొలనుపాక వంటివి ప్రసిద్ధ జైనక్షేత్రాలుగా వర్థిల్లాయి.
– కాకతీయులు తొలిదశలో జైనమతాన్ని అవలంబించినట్లు తెలుస్తుంది. వారి కులదేవత కాకతి జైన దేవతేనని పరిశోధకుల అభిప్రాయం. ప్రోలరాజు భార్య మైలమ హన్మకొండ దగ్గర జైనుల కోసం కడలాలయ బసదిని నిర్మించింది. కానీ వీరశైవం విజృంభించాక కాకతీయులు శైవమతాభిమానులుగా మారడంతో జైనమతం పోషణ కోల్పోయింది. శైవులు జైనంపై దాడులకు పాల్పడ్డారని పాల్కురికి సోమనాథుడు అభిప్రాయడ్డాడు. సిద్ధేశ్వర చరిత్రను బట్టి గణపతిదేవుడు ఆయన గురువు విశ్వేశ్వరాచార్యుడు జైనాన్ని అణచివేశారని కొందరు చరిత్రకారుల భావన. తెలంగాణలో జైనస్థావరాలను శైవులు కబళించారని శివాలయాలకు సమీపంలో కనింపిచే జైనవిగ్రహ శకలాలు నిరూపిస్తున్నాయి.
– జైనులు తెలంగాణ సాంస్కృతిక వికాసంలో తమవంతు పాత్రను పోషించారు. విద్యావ్యాప్తికి, సామాజిక సేవకు కృషిచేశారు. వీరు కూడా వర్ణవ్యవస్థను అనుకరిస్తూ పై మూడు వర్ణాలవారికే యజ్ఞోపవీతం వంటి అంశాలను ఆమోదించడం వల్ల శూద్రకులాల్లో వ్యాప్తిని పొందలేకపోయింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?