Solarjung versions | సాలార్జంగ్ సంస్కరణలు
ఆర్థిక సంస్కరణలు
సాలార్జంగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి నిజాం రాజ్యంలో ప్రభుత్వ ఖర్చులు ఆదాయానికి మించి ఉన్నాయి. నిజాం రాజులు తమ సిబ్బందికి జీతాలు చెల్లించే స్థితిలో లేరు. నిజాం తన సొంత భూములను వజ్రాలు, ఆభరణాలు ప్రైవేట్ వర్తకుల వద్ద తాకట్టుపెట్టి కోట్ల రూపాయల అప్పులు చేశాడు. సాలార్‌జంగ్‌కు పూర్వం ప్రధానిగా పనిచేసిన చందూలాల్ ఆర్థిక విధానాలు ప్రభుత్వ ఖజానాను దివాలా తీయించాయి. సాలార్జంగ్ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించి వ్యక్తిగతంగా తన సాలుసరి జీతాన్ని రూ. 25,000 నుంచి రూ. 15,000 వరకు తగ్గించుకున్నాడు. పరిపాలనా యంత్రాంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అసమర్థులు అవినీతిపరులైన దాదాపు 1000 మంది సిబ్బందిని తొలగించి పనిలేకుండా మిగులుగా ఉన్న అదనపు సిబ్బంది జీతాలను 1/3వ వంతుకు తగ్గించాడు. దానికితోడు హెచ్చు జీతాలు ఉన్న కొన్ని ఉద్యోగాలను రద్దుచేశాడు. సికింద్రాబాద్, బొల్లారంలో ఉన్న బ్రిటిష్ సైన్యం దేశరక్షణకు చాలని భావించి నిజాం సొంత సైన్యాన్ని భారీగా తగ్గించాడు. దీంతో ప్రభుత్వ నిర్వహణలో దుబారా ఖర్చు భారీగా తగ్గి రెండేండ్లలో ఆర్థిక లోటు తీరింది.
దానితో వడ్డీ వ్యాపారులకు నిజాం తాకట్టుపెట్టిన ఆభరణాలు, వజ్రాలు, భూములను విడుదల చేయించాడు. భూమి శిస్తుతోపాటు ఆబ్కారీ, వాణిజ్యం, రవాణా, ఎగుమతి, దిగుమతి, సుంకాలు, స్టాంపు, శాఖల ద్వారా వచ్చిన ఆదాయం ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చాయి. ఇతని కాలంలో రెవెన్యూ వసూలు పద్ధతిలో చేపట్టిన సంస్కరణల మూలంగా విధించిన పన్నుల్లో నూటికి 98 శాతం వసూలైంది. దాంతో 1853-81 మధ్యకాలంలో ప్రభుత్వ రెవెన్యూ వసూళ్లు రెండున్నర రెట్లు పెరిగాయి. పటిష్టమైన పన్ను రెవెన్యూ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల హైదరాబాద్ రాజ్యం ఆదాయం 1853-83 మధ్య కాలంలో 19 మిలియన్ల నుంచి 30 మిలియన్ల రూపాయలకు చేరుకుంది. నిజాం ప్రభుత్వం సాలార్జంగ్ సలహా ప్రకారం 1857లో జరిగిన సిఫాయి తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులకు సహకరించారు. అల్లావుద్దీన్ మౌల్విని బంధించి అండమాన్ దీవులకు పంపారు. హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెన్సిపై దాడికి పాల్పడిన తుర్రేజాజ్ ఖాన్‌ను కాల్చిచంపేందుకు బ్రిటిష్ వాళ్లకు సహాయపడ్డాడు. తిరుగుబాటును అణచడంలో నిజాం చేసిన కృషి మరువలేనిదని బ్రిటిష్ పాలకులు భావించి దానికి బహుమానంగా నిజాం తమకు ఇవ్వవలసిన రూ. 50,00,000 రుణాన్ని మాఫీ చేయడంతోపాటు 1861లో రాయచూర్, అహ్మద్‌నగర్, దారశివం, నల్దుర్గ్ ప్రాంతాలను తిరిగి నిజాంకు ఇచ్చి 10వేల పౌండ్లు నిజాంకు 3 వేల పౌండ్లు సాలార్‌జంగ్‌కు బహుమానం ప్రకటించి, ఐదో నిజాం అయినటువంటి అఫ్జల్ ఉద్దౌలాకు 1861లో ది స్టార్ అఫ్ ఇండియా బిరుదును ఇచ్చారు. 1857 సిఫాయిల తిరుగుబాటులో పాల్గొన్న షోలాపూర్ రాజు వెంకటప్ప నాయక్‌ను బంధించి బ్రిటిష్ వారికి అప్పగించడంలో నిజాం చేసిన సహాయానికి బదులుగా బ్రిటిష్‌వాళ్లు 1861లో షోలాపూర్ ప్రాంతాన్ని నిజాంకు ఇచ్చారు. ఇనాం భూములను జాత్ జాగీర్లను సర్వే చేయించి దాదాపు రూ. 17 లక్షల విలువ చేసే వీటిని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ శాఖను పటిష్టపరిచి, రహదారి పన్నుల వసూళ్లను క్రమబద్ధీకరించి అటవీ ఉత్పత్తులను పెంచి, ప్రజా గిడ్డంగుల శాఖను ఏర్పరిచి, స్టాంప్ పేపరును ప్రవేశపెట్టారు. వీటన్నింటి మూలంగా నిజాం ప్రభుత్వం ఆర్థికంగా నిలదొక్కుకోగలిగింది.
రెవెన్యూ సంస్కరణలు
ఏ రాజ్యమైనా స్థిరంగా, పటిష్టంగా ఉండాలంటే దానికి ఆదాయమే మూలం. రాజ్యానికి ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది కాబట్టి రాజ్యాన్ని బలోపేతం చేయాలంటే పన్నుల విధానాన్ని సంస్కరించాలి. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన సంస్కరణలలో రెవెన్యూ సంస్కరణలు అత్యంత ముఖ్యమైనవి. రాజ్యానికి ప్రధాన వనరు రెవెన్యూ కాబట్టి గతంలో అమలులో ఉన్న రెవెన్యూ విధానాలను 1864-65లలో పూర్తిగా పునర్ వ్యవస్థీకరించారు. నిజాం పాలనలో భూమిని నాలుగు భాగాల కింద విభజించారు. అవి 1. ఖాల్సా ప్రాంతం 2. సర్ఫేఖాస్ 3. పైగా 4. జాగీరులు. వీటిలో రకరకాల శిస్తు నిర్ణయ పద్ధతులుండేవి. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన రెవెన్యూ సంస్కరణలు ఖాల్సా ప్రాంతానికే వర్తిస్తాయి. మిగతా ప్రాంతాల్లో వేరే విధానాలు అమలులో ఉండేవి. సాలార్జంగ్ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాన్ని జిలా బందీ విధానం అంటారు. దీని ప్రకారం నిజాం రాజ్యంలో జిల్లాలన్నింటినీ 5 ప్రాంతీయ మండలాలుగా లేదా సుభాలుగా విభజించి ప్రతి మండలానికి లేదా సుభాకు ఒక సుబేదార్‌ను నియమించారు.
రాజ్యాన్ని మండలం లేదా సుభా, జిల్లా, తాలూకా, గ్రామాల కింద విభజించి సుభాకు సుబేదార్‌ను లేదా సదర్ తాలూకాదారును, జిల్లాకు తాలూక్దారును, తాలూకాలకు తహసీల్దార్లను, గ్రామాలకు పట్వారీ, మాలీపటేల్ను నియమించారు. వీళ్లు భూమిశిస్తు వసూలులో కీలకపాత్ర పోషించేవారు. ప్రతి 30 ఏండ్లకు ఓసారి భూమి శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టారు. 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటుచేసి దానికి ఒక అధ్యక్షుడితోపాటు నలుగురు సభ్యులను నియమించి వారి ద్వారా ప్రధాని రెవెన్యూ వ్యవహారాలను పరిశీలించేవారు. భూములను సర్వేచేసి వాటి హద్దులను, సారాన్ని ఇతర అంశాలను నిర్ధారించడానికి సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేశారు. నిజాం రాజ్యంలో భూమి శిస్తు వసూలు చేయడానికి గతంలో ఉన్న వేలం పద్ధతి, మధ్య దళారులను తొలగించి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతులకు ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధం ఏర్పర్చి వారికి తమ భూములపై హక్కులు కల్పించారు. ఇనాం భూములను రద్దుచేసి, భూమిని కొలిపించి హద్దులు నిర్ణయించి రికార్డులు తయారు చేయించారు. భూమి విస్తీర్ణాన్ని, సాగు పరిమాణాన్ని బట్టి, పంటలు పండని భూములను మినహాయించి శిస్తు నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. భూమి శిస్తు దన రూపంలోగానీ, దాన్యం రూపంలోగానీ చెల్లించే వెసులుబాటు కల్పించాడు. నిజాం రాజ్యంలో 1880-81 నాటికి భూమిశిస్తు 2,09,21,971 రూపాయలకు చేరుకుంది. అంటే దీనికి ప్రధాన కారణం సాలార్జంగ్ చేపట్టిన సంస్కరణలే.
విద్యా సంస్కరణలు
నిజాం రాజ్యంలో విద్యాభివృద్ధికి సాలార్జంగ్ ఎనలేని కృషి చేశాడు. రాజ్యంలో నూతన విద్యాసంస్థల ఏర్పాటుకు అతని కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ సహాయపడ్డాడు. నాలుగో నిజాం నసీరుద్దౌలా కాలంలో 1855లో దారుల్ ఉలూమ్ అనే ఉన్నత విద్యా సంస్థను నెలకొల్పాడు. ఈ విద్యా సంస్థలో పర్షియన్, అరబిక్, ఉర్దూతోపాటు గణితం, సైన్సు, ఇంగ్లిషు కూడా బోధించేవాళ్లు. 1870లో నగర ఉన్నత పాఠశాల (సిటీ హైస్కూల్)ను 1872లో చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలను స్థాపించారు. ప్రజా పన్నుల శాఖ (పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్)లో పనిచేయడానికి కావాల్సిన సిబ్బందిని తయారు చేసుకోవడానికి 1870లో ఓ ఇంజనీరింగ్ కళాశాలను నెలకొల్పడం జరిగింది.
ప్రభువుల పిల్లల విద్యా అవసరాలు తీర్చే నిమిత్తం 1873లో మదర్సా ఆలియాను రాజకుటుంబీకుల పిల్లల కోసం 1878లో మదర్సా ఏ ఐజాను నెలకొల్పడం జరిగింది. బాలికల విద్యా అవసరాల నిమిత్తం 1881లో గ్లోరియో గర్ల్స్ హైస్కూల్‌ను స్థాపించడం జరిగింది. సాలార్జంగ్ మరణానంతరం 1887లో నిజాం కాలేజీని స్థాపించారు. నిజాంరాజ్యంలో నాడు 162 పాఠశాలలుండే అందులో పర్షియన్ పాఠశాలలు 105, మరాఠీ పాఠశాలలు 34, ఆంగ్ల పాఠశాలలు 4, తెలుగు పాఠశాలలు 19 వరకు ఉండేవి. సాలార్జంగ్ కృషివల్ల నిజాం రాజ్యంలో మేధావులు విద్యావంతులు తయారయ్యారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?