Remember the mountains | పర్వతాలను గుర్తుంచుకోండిలా…
పోటీ పరీక్షల్లో దేశంలోని పర్వతాలు చాలా కీలకాంశం. ఏ పోటీ పరీక్షలో అయినా ఈ అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. సాధారణంగా పర్వతాలు, అవి విస్తరించి ఉన్న రాష్ర్టాలు, ఆ శ్రేణిలో ఎత్తైన పర్వతాలను అడుగుతారు. మెమరీ టెక్నిక్స్‌ను ఉపయోగించి వీటిని నేర్చుకుందాం. దేశంలో ఉన్న పర్వతాలు- 1. హిమాలయాలు 2. ఆరావళి
3. వింధ్య, సాత్పూర 4. తూర్పు, పశ్చిమ కనుమలు 5. నీలగిరి 6. హురియత్ పర్వతాలు
హిమలయాలు – దేశానికి ఈశాన్యంలో ఇవి విస్తరించి ఉన్నాయని ఎలాంటి టెక్నిక్ లేకుండా గుర్తుంచుకోవచ్చు. అలాగే ఇందులో ఎత్తైంది ఎవరెస్ట్ అని కూడా చిన్నప్పటి నుంచి చదువుకున్నదే. అయితే ఇది మన దేశంలో లేదు. నేపాల్‌లో ఉంది. హిమాలయాల్లో మూడు పర్వత శ్రేణులున్నాయి. 1.ఉన్నత హిమాలయ శ్రేణి 2. హిమాచల్ లేదా మధ్య హిమాలయ శ్రేణి 3. శివాలిక్ శ్రేణి. ఆయా శ్రేణుల్లో వేరువేరు రాష్ర్టాల్లో ఎత్తైన హిమాలయాలను గుర్తుంచుకోవాలి. ఎలాగో చూడండి…
గత సంచికల్లో రాష్ర్టాలకు కోడ్స్ ఉండాలని చెప్పాం. ఇప్పుడు కొన్ని కోడ్స్ ఇస్తున్నాం. జమ్ము కశ్మీర్ – సైనికులు (ఎందుకంటే ఎక్కువగా ఆ ప్రాంతంలో సైనికులు ఉంటారు), ఉత్తరాఖండ్ – దీనికి గుడి (ఉత్తరాఖండ్ అంటే ఎందుకు గుడిగా కోడ్ ఇచ్చామో గత సంచికలో ప్రస్తావించాం), సిక్కిం – కాంచన జంగ పర్వతం, అరుణాచల్ ప్రదేశ్- అరుణ్ జైట్లీ (అరుణాచల్ ప్రదేశ్‌లో అరుణ్ ఉంది కాబట్టి అరుణ్ జైట్లీతో లింక్ చేశాం. ఆయన ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి, రాజ్యసభ నాయకుడు)
జమ్ముకశ్మీర్‌లో ఎత్తైన శిఖరం – నంగ పర్బత్, జమ్ముకశ్మీర్ కోడ్- సైనికుడు. కాబట్టి సైనికులందరూ చల్లని హిమాలయాల్లో రోజూ శర్బత్ తాగుతూ ఉంటారు (శర్బత్ను పర్బత్తో లింక్ చేశాం). ఏదైనా పరీక్షలో జమ్ముకశ్మీర్‌లో ఎత్తైన పర్వతం అని అడిగారనుకోండి, మీకు వెంటనే గుర్తుకు రావాల్సింది సైనికుడు. ఎందుకంటే సైనికుడిని జమ్ముకశ్మీర్‌తో లింక్ చేశాం కాబట్టి. సైనికులు ఏం తాగుతారు? శర్బత్ తాగుతారు. ఈ పదం నంగ పర్బత్కు దగ్గరగా ఉంది కాబట్టి వెంటనే గుర్తుకు వస్తుంది.
ఉత్తరాఖండ్‌లో ఎత్తైన శిఖరం నందాదేవి. ఉత్తరాఖండ్ కోడ్- గుడి. అయితే ఉత్తరాఖండ్‌లో ఎత్తైన కొండల్లో ఉన్న గుడి ఎవరిది అంటే నందాదేవిది. లింక్ పూర్తి అయింది.
సిక్కింలో ఎత్తైన శిఖరం కాంచన జంగ – సిక్కిం అంటే మనం లింక్ చేసిన కోడే కాంచన జంగ కాబట్టి అది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఎత్తైన పర్వతం నామ్చా బారువా. అరుణాచల్ ప్రదేశ్‌ను అరుణ్ జైట్లీతో లింక్ చేశాం. ఆయన మాజీ ఆర్థిక మంత్రి అని తెలుసు. ఆర్థిక మంత్రి డబ్బులను ఎక్కడ దాస్తారు? బీరువాలో దాస్తారు. బీరువా ఎత్తైన పర్వతాలపై ఉంటుంది. బీరువా అనేది నామ్చా బారువాకు దగ్గరగా ఉంది. కాబట్టి దాన్ని ఆ రూపంలో లింక్ చేశాం.
ఇప్పుడు చెప్పండి సిక్కింలో ఎత్తైన పర్వతం?
అరుణాచల్‌ప్రదేశ్‌లో ఎత్తైన పర్వతం?
బట్టీ పట్టనవసరం లేకుండా వచ్చాయి కదూ.. ఇప్పుడు ఇతర పర్వత శ్రేణులు, ఎత్తైన శిఖరాలను నేర్చుకుందాం.
ఆరావళి – ఈ శ్రేణిలో ఎత్తైన పర్వతం గురు శిఖర్. ఆరావళిని ఆరు అంకెతో లింక్ చేద్దాం. ఎందుకంటే ఆరావళిలో ఆరు ఉంది. ఆరు-గురు. రెండూప్రాసలో ఉన్నాయి. ఆరు అంటే ఆరావళి – గురు అంటే గురు శిఖర్. రెండూ తేలికగా గుర్తుంటాయి.
సాత్పూరా – ఈ పర్వతాల్లో ఎత్తైనది దూప్ఘర్ (మహదేవ్ కొండల్లో ఉంటుంది). సాత్పూరాను పూరీతో లింక్ చేద్దాం. సాత్పూరా పూరీ తిన్నప్పుడు ఏమవుతుంది? దూప్ (అంటే హిందీలో దాహం) అవుతుంది. కాబట్టి సాత్పూరా అనగానే పూరీ గుర్తుకు రావాలి. పూరీ తింటే దూప్ అవుతుంది కాబట్టి దూప్ఘర్ గుర్తుకు వస్తుంది.
నీలగిరి పర్వతాలు – వీటిలో ఎత్తైనది దొడబెట్ట. నీలగిరిలో నీలం ఉంది. కాబట్టి దాన్ని నీలం రంగుతో లింక్ చేద్దాం. తెల్లటి చొక్కాపై నీలం రంగు పడితే ఏం చేయాలి? దూడను తీసుకొచ్చి తొక్కించాలి. దూడ అంటే దొడబెట్టతో లింక్ చేయాలి. నీలగిరి అనగానే నీలం రంగు గుర్తుకురావాలి. అది పోవాలంటే దూడతో తొక్కించాలి. కాబట్టి నీలగిరి కొండలు – దొడబెట్ట తేలికగా గుర్తుండిపోతుంది.
పశ్చిమ కనుమలను ఎడమ కంటితో, తూర్పు కనుమలను కుడి కంటితో లింక్ చేద్దాం. ఎందుకంటే కనుమల్లో కన్నులు ఉన్నాయి. మనం ఉత్తరం దిశగా నిలబడితే, ఎడమకు పశ్చిమం, తూర్పునకు కుడి ఉంటాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?