Rapid development with small states | శ్రీఘ్రు అభివృద్ధి చిన్న రాష్ర్టాలతోనే..
రాష్ట్రాల ఏర్పాటుకు భాషతో పాటు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక స్వావలంబనను పరిగణనలోకి తీసుకోవాలి.. దేశంలో ఒకే భాష మాట్లాడేవారికి ఒకటికంటే ఎక్కువ రాష్ట్రాలుండాలి.. ఒక భాషకు ఒకే రాష్ట్రం అనే సూత్రం ఎంతో ప్రమాదకరం.. భాష, చిన్న రాష్ట్రాలు, రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ తదితర అంశాలపై అంబేద్కర్ అభిప్రాయాలను నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నాం..
-ఒక నిర్దిష్ట ప్రాంతంలో నివసించే ప్రజలంతా మాట్లాడే భాష ఒకటే అయి వాళ్లంతా ఒకే పరిపాలనా యంత్రాంగం కింద ఉన్నట్లయితే ఆ ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు, ఆటపాటలు, పండుగలు, కళలు, సాహిత్యం, సంస్కృతి అంతా ఒకేవిధంగా ఉండి ఆ ప్రజల మధ్య భేదభావాలు లేకుండా మనమంతా ఒక్కటే అనే భావోద్వేగం పెరిగి ఐక్యత పెంపొందుతుంది. ఆ ప్రాంతంలో ఉండే ప్రజా సమూహాన్నే మనం ఒక జాతిగా పరిగణిస్తాం. ఆ జాతి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తిని ఆ ప్రజలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ వారందరిని ఒకే పాలనా యంత్రాంగం కిందకు తీసుకొస్తే ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు మార్గం సులువవుతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో జాతులు స్వయం నిర్ణయాధికారం కోసం పోరాటాలు చేసింది, చేస్తుంది. జాతులు స్వయం నిర్ణయాధికారం కోసం చేసిన పోరాటాల ఫలితంగా ప్రపంచంలో పలు నూతన రాజ్యాలు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా యూరప్ ఖండంలో భాషాపరంగానే పలు చిన్నచిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. దీని నుంచి స్ఫూర్తిపొందే మనదేశంలో భాషా రాష్ట్రోద్యమాలు రూపుదిద్దుకుని బీహార్ బీహారీల కోసమే, ఆంధ్ర ఆంధ్రుల కోసమే అనే నినాదాలు పుట్టుకొచ్చాయి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే బ్రిటిష్ కాలంలోనే భాషారాష్ట్రోద్యమాలు పురుడుపోసుకున్నా స్వాతంత్య్రం వచ్చిన తరువాత అవి బలపడ్డాయి. స్వాతంత్య్రానంతరం దేశంలోని రాష్ట్రాల విభజన భాషాప్రాతిపదికపై జరిపినట్లయితే అవి ఫెడరల్ వ్యవస్థలో నిజమైన భాగస్వాములై పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరిచి అభివృద్ధిని సాధిస్తాయని ఆశించే జస్టిస్ ఫజల్ అలీ నేతృత్వంలో కేఎం ఫణిక్కర్, హృదయనాథ్ కుంజ్రూ సభ్యులుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ను నెలకొల్పి భాషతోపాటు ఆర్థికస్థోమత పరిపాలనా సౌలభ్యతలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల విభజనపై సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిషన్ వాళ్లు దేశంలో విస్తృతంగా పర్యటించి 9వేల మందితో ప్రత్యక్షంగా సంప్రదించి 1,52,250 లిఖిత పూర్వక అభ్యర్థనలను స్వీకరించి వాటిని మదింపు చేసి 267 పేజీల తమ నివేదికను 1955, సెప్టెంబర్ 30న కేంద్రానికి సమర్పించింది. కమిషన్ నివేదిక చాలా వరకు భాషారాష్ట్రోద్యమాలను తృప్తిపర్చింది. ఈ నివేదిక అమలు నిమిత్తం 1956లో భారత రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేశారు. దాన్నే 7వ రాజ్యాంగ సవరణ చట్టం అంటారు. ఈ చట్టం ప్రకారం ఎ, బి, సి, డి అనే రాష్ట్రాల తరగతులు, రాజప్రముఖుల పదవులు రద్దయి 14 గవర్నర్ పాలిత ప్రాంతాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉనికిలోకి వచ్చాయి.
-ఫజల్ అలీ కమిషన్ భాషాప్రాతిపదికనే రాష్ట్రాల విభజన చేపట్టినప్పటికీ బొంబాయి రాష్ట్రాన్ని మాత్రం భాషాప్రయుక్తంగా విభజించలేదు. ఎందుకంటే బొంబాయి రాష్ట్రాంలో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలతోపాటు గుజరాతీ భాష మాట్లాడే ప్రాంతాలు కూడా ఉండేవి. గుజరాత్ రాష్ట్రాన్ని కోరిన గుజరాతీయులను ఇది బాగా నిరాశపరిచింది. గుజరాత్ ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 1960లోనే రాష్ట్రాల పునర్విభజన చేపట్టిన నాలుగేండ్లకే బొంబాయి రాష్ట్రాన్ని మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాలుగా విభజించారు. 1962లో నాగాలాండ్‌ను ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పర్చారు. 1966లో పంజాబ్ రాష్ర్టంలోని గిరిజన ప్రాంతాలను హిమాచల్‌ప్రదేశ్‌లో కలిపి దాన్ని ఒక రాష్ర్టంగా ఏర్పాటు చేశారు. అదే ఏడాది పంజాబ్‌లోని హిందీ ప్రాంతాలను వేరుచేసి హర్యానా రాష్ర్టంగా ఏర్పాటుచేసి చండీగఢ్‌ను పంజాబ్, హర్యానా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయించారు. అస్సాంలోని గిరిజన ప్రాంతాలను వేరుచేసి 1972లో మేఘాలయ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. దాంతోపాటు మణిపూర్, త్రిపురలకు కూడా 1972లోనే రాష్ర్ట ప్రతిపత్తి కల్పించారు. మనదేశంలో విలీనమైన సిక్కింను 1975లో రాష్ర్టంగా ఏర్పాటుచేశారు. 1987లో మిజూ ప్రాంతాన్ని మిజోలాండ్గా 1988లో ఈశాన్య సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాలను అరుణాచల్‌ప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. అదే విధంగా 1987లో గోవాకు రాష్ర్ట ప్రతిపత్తి కల్పించారు. 2000లో మరో మూడు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లు ఉనికిలోకి వచ్చాయి. ఆ తరువాత చివరగా 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నుంచి తెలంగాణ ప్రాంతాన్ని వేరుచేసి రాష్ర్ట ప్రతిపత్తి కల్పించారు.
-1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దేశంలో 14 రాష్ట్రాలుంటే నేడు 29 రాష్ట్రాలున్నాయి. అంటే అదనంగా 15 కొత్త రాష్ట్రాలు ఈ 60 ఏండ్ల కాలంలో ఏర్పడ్డాయి. రాష్ట్రాల విభజన అనే ప్రక్రియ 1956లో ప్రారంభమైనదే తప్ప అది అంతం కాలేదన్నమాట. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అధ్యక్షుడు ఫజల్ అలీ తన నివేదికను 1955లో సమర్పించినప్పుడు ఆ నివేదికను లోతుగా అధ్యయనం చేసిన పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు స్పందించి తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా లిఖితపూర్వకంగా కమిషన్ వారికి సమర్పించిన వారిలో పేర్కొనదగినవాడు అంబేద్కర్. దేశ భవితవ్యాన్ని, జాతి ఔన్నత్యాన్ని, దేశసమగ్రతను దృష్టిలో ఉంచుకుని దేశంలోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ స్వరూప స్వభావాలు ఎలా ఉండాలో విస్తృతంగా వివరించాడు. అంబేద్కర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు వారి థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ పేరిట పొందుపరచబడినవి. ఇందులో అంబేద్కర్ రాష్ట్రాల ఏర్పాటుకు భాషను ఎందుకు ప్రాతిపదికగా తీసుకోవాల్సి వస్తుందో వివరిస్తూ ఒకే భాష ఒకే రాష్ర్టం అనే వాదాన్ని తప్పుపడుతూ ఒకే రాష్ర్టం ఒకే భాష తన వాదనగా పేర్కొంటూ, రాష్ట్రాలను కొన్నింటిని పెద్దవిగా కొన్నింటిని చిన్నవిగా విభజించడం వల్ల భవిష్యత్తులో ఒనగూరే నష్టాలను వివరిస్తూ దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ఎందుకు చేయాలనేది వివరించారు. ఒకవేళ అంబేద్కర్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రాల విభజన చేపట్టి ఉంటే దేశంలో రాష్ట్రాల విభజనకు సంబంధించిన డిమాండ్లు చాలావరకు తలెత్తేవి కావని నిస్సందేహంగా చెప్పవచ్చు.
-అంబేద్కర్‌కు దేశంలోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా జరగాలనే దానిపై స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. కేవలం భాషా ప్రాతిపదికనే రాష్ట్రాలను ఏర్పాటుచేయడం శ్రేయస్కరం కాదని భాషతో పాటు జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థికస్తోమతలను కూడా పరిగణలోని తీసుకోవాలనేది అతని అభిప్రాయం. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనివార్యమైనప్పుడు కొన్ని కట్టుదిట్టాలు, జాగ్రత్తలు పాటించాలనేది అతని అభిప్రాయం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు భాషను ప్రాతిపదికగా తీసుకోవడానికి గల కారణాలను అంబేద్కర్ శాస్త్రీయంగా వివరించారు. ఒకే భాష మాట్లాడే రాష్ర్ట ప్రజల్లో ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, ఆటపాటల సంస్కృతి అంతా ఒకేవిధంగా ఉండి మనమంతా ఒకే జాతివాళ్లమనే భావోద్వేగం నెలకొని వారిమధ్య ఐక్యతను కొనసాగిస్తుంది. ప్రజల్లో నెలకొనే ఈ విధమైన ఆలోచనా సరళి సుస్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తుంది. అదే బహుభాషలు మాట్లాడే రాష్ర్ట ప్రజల్లో ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు, ఆటపాటల సంస్కృతి అంతా భిన్నంగా ఉండి మనదంతా ఒకే జాతి అనే భావోద్వేగం కొరవడి భాషాపరంగా ప్రజలు విభజించబడి వారిమధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు చోటుచేసుకొని తరచూ ఆధిపత్యం కోసం జరిగే పెనుగులాటలతో సమాజంలో అంతఃకలహాలు చోటుచేసుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపాలు చేస్తాయని చెప్పేందుకు అనేక చారిత్రక ఉదంతాలున్నాయి.
ఒకే దేశం, ఒకే భాషా సంస్కృతులతో కొనసాగుతున్న జర్మనీ, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలాంటి దేశాలలో ప్రజల మధ్య ఐక్యతతోపాటు బలమైన జాతీయ భావాలు నెలకొని స్థిరమైన ప్రజాస్వామ్య వ్యవస్థలు కొనసాగుతుంటే బహుభాషా సంస్కృతులతో కూడిన ఒకప్పటి టర్కీ, ఆస్ట్రోహంగేరియన్ రాజ్యాలు ఏ విధంగా చీలిపోయాయి ఈ సందర్భంగా మనం గమనించాలి. మనదేశంలోని ఒకప్పటి మద్రాసు రాష్ర్టం ఉదంతాన్ని తీసుకుంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పూర్వం మద్రాసులో తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు భాషలు మాట్లాడే నాలుగు ప్రాంతాల ప్రజలుండేవారు. తమిళులకు ఆంధ్రులంటే, ఆంధ్రులకు తమిళులంటే గిట్టేది కాదు. దాంతో ఇరువురి మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలు పెరిగి భాషాప్రాతిపదికపై ప్రత్యేక ఆంధ్ర రాష్ర్ట ఉద్యమానికి బీజాలుపడి చివరకు ఆంధ్ర రాష్ర్ట అవతరణకు దారితీసింది. భాషా రాష్ట్రాల డిమాండ్ తెరపైకి రాకముందే, దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వమే బీహార్, పంజాబ్, బెంగాల్, ఒరిస్సాలాంటి భాషా రాష్ట్రాలుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత స్వదేశీ సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన తరువాత భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్ బలపడింది. బలపడుతున్న ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగంలో ఆర్టికల్3ను చేర్చి కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయంలో పార్లమెంటుకు అధికారాలు కట్టబెట్టడం జరిగినట్లు అంబేద్కర్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఫెడరల్ వ్యవస్థలో భాషాప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగితే ప్రతి రాష్ర్టంలోని ప్రజలకు వారి భాషాసంస్కృతులపట్ల వారి ప్రాంతం పట్ల అభిమానం పెరిగి ప్రజల్లో ఐక్యత పెంపొంది సుస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు పడి వారి భాషాసంస్కృతులతోపాటు ఆ ప్రాంతం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా అభివృద్ధి సాధిస్తుంది.
-ఎస్సార్సీ విదర్భ, తెలంగాణ ప్రాంతాలకు కూడా రాష్ర్ట ప్రతిపత్తిని కల్పిస్తూ సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం విదర్భ తెలంగాణ ప్రాంతాలను మినహాయించి మిగతా 14 రాష్ట్రాలను యథావిధిగా ఆమోదించింది. జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే ఈ 14 రాష్ట్రాల్లో 1 నుంచి 2 కోట్ల మధ్య జనాభా గల రాష్ట్రాలు 8, 2 నుంచి 4 కోట్ల మధ్య జనాభా గల రాష్ట్రాలు 4, 4 నుంచి 6 కోట్ల మధ్య జనాభా ఉన్న రాష్ర్టం ఒకటి, 6 కోట్లకు పైగా జనాభా ఉన్న రాష్ర్టం ఒకటి ఉన్నాయి. జనాభా విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు భారీగా ఉన్న విషయాన్ని ఈ గణాంకాలు తెలుపుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలతో దక్షిణాది రాష్ట్రాలను పోలిస్తే ఈ వ్యత్యాసాలు మరీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో రద్దయిన రాష్ట్రాలు
పార్టు ఎ రాష్ట్రాలు పార్టు బి రాష్ట్రాలు పార్టు సి రాష్ట్రాలు పార్టు డి రాష్ట్రాలు
1. ఆంధ్ర 1. హైదరాబాద్ 1. అజ్మీర్ అండమాన్ నికోబార్ దీవులు
2. అస్సాం 2. జమ్మువశ్మీర్ 2. భోపాల్
3. బీహార్ 3. మధ్యభారత్ 3. కూర్గ్
4. బొంబాయి 4. మైసూర్ 4. ఢిల్లీ
5. మధ్యప్రదేశ్ 5. పాటియాలా 5. హిమాచల్‌ప్రదేశ్
6. మద్రాస్ 6. రాజస్థాన్ 6. కచ్
7. ఒరిస్సా 7. సౌరాష్ర్ట 7. మణిపూర్
8. పంజాబ్ 8. ట్రావెన్ కోర్ కొచ్చిన్ 8. త్రిపుర
9. ఉత్తరప్రదేశ్ 9. వింధ్యాప్రదేశ్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?