Privacy is a fundamental right | గోప్యత ప్రాథమిక హక్కే
నేటి ప్రపంచానికి సమాంతరంగా మరో వినూత్నమైన ప్రపంచం ఆవిర్భవించింది. అది ఇంటర్నెట్ మాయాజాలం. ఆ ప్రపంచాన్నే మనం వర్చువల్ వరల్డ్ అంటున్నాం. ఆధునిక యుగంలో ఆంతరంగిక స్వేచ్ఛ అన్నది ఒక అభూత కల్పనగా మారే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే సోషల్‌మీడియాలో మరెన్నో నెట్వర్కింగ్ సైట్లలో ఎన్నో విధాలుగా అనేక మంది పౌరులు వారికివారే తమ సమాచారాన్ని చేజేతులారా జార విడుస్తూ ఆంతరంగిక స్వేచ్ఛను కోల్పోతున్నారు. అదే పౌరులు ఆధార్‌కార్డును తమ బ్యాంక్ అకౌంట్లను, ప్రభుత్వ రాయితీలు పొందడానికి జతపర్చితే తమ ఆంతరంగిక స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. వ్యక్తిగత గోప్యత- ఆంతరంగిక స్వేచ్ఛ అనే ఈ సున్నితమైన, సంక్లిష్టమైన విషయంపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చర్చనీయాంశమైంది. ఈ సందర్భంలో అసలు ఆంతరంగిక- వ్యక్తిగత గోప్యత (Right to privacy) స్వేచ్ఛకి భారత రాజ్యాంగంలో ఉన్న స్థాయి ఏమిటో చూద్దాం.
-యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్రైట్స్లోని ఆర్టికల్ 12, ఇంటర్నేషనల్ కోవెనంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్‌లోని ఆర్టికల్ 17, యురోపియన్ కన్వెన్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లోని ఆర్టికల్ 8లో ఇండ్లు, కుటుంబం, దాంపత్య జీవనం, సంతానోత్పత్తి, విద్యాభ్యాసం మొదలైనవి మానవ ఆంతరంగిక వ్యవహారాలని అవి వ్యక్తిగత గోప్యతలోని ప్రధాన విషయాలని పేర్కొన్నారు.
విదేశాల్లో వ్యక్తిగత గోప్యత
-మానవ హక్కుల ఉల్లంఘనను వ్యక్తిగత స్వేచ్ఛా రాహిత్యానికి మారుపేరుగా చెప్పే పాకిస్థాన్‌లో వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కుగా ఉన్నది. ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశంగా పేర్కొనే 1791లో అమెరికా రాజ్యాంగానికి చేసిన నాలుగో సవరణ పౌరుల వ్యక్తిగత గోప్యతకు పెద్దపీట వేసింది. పౌరుల టెలిఫోన్ సంభాషణలను రహస్యంగా ప్రభుత్వాలు వినడం వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘన కిందికి వస్తుందా అన్న న్యాయవివాదంపై 1928లో అమెరికా అత్యున్నత న్యాయస్థానం రాదు అనే తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో విభేదించిన జస్టిస్ లూయిస్ బ్రాండిస్ సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ వ్యక్తిగ గోప్యత పరిధి విస్తరిస్తుందని దార్శనీయకంగా స్పందించాడు.
భారత్‌లో వ్యక్తిగత గోప్యత-వివాదాస్పద అంశాలు
-ప్రస్తుతం మన దేశ పౌరులు ఆధార్‌ను బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసి ఇంటర్నెట్ సదుపాయంతో డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ఈ రోజుల్లో, అలాంటి లావాదేవీలు వ్యక్తిగత గోప్యతకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉన్నదని కొందరి వాదన. 2011లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవసీ బిల్లు బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలను కూడా వ్యక్తిగత గోప్యత పరిధిలో తీసుకురావడం విశేషం. అయితే, దీనివల్ల ప్రభుత్వం బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసి తగు లావాదేవీలపై నిఘా పెట్టడం కూడా వ్యక్తిగత గోప్యత హక్కు ఉల్లంఘన అవుతుంది. తద్వారా నల్లధనాన్ని అరికట్టడం ప్రభుత్వానికి కష్టతరం అవుతుంది.
-భారత జనాభాలో 27 ఏండ్ల లోపు యువతీయువకులు సాంకేతిక సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగిస్తున్న పరిస్థితుల్లో కార్పొరేట్ శక్తులు వారి వ్యక్తిగత గోప్యత హక్కుకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల జార్ఖండ్‌లో జార్ఖండ్ డైరెక్టరేట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటి వెబ్సైట్ ద్వారా 16 లక్షల మంది లబ్ధిదారుల ఆధార్ సంఖ్యలు ఇతర గోప్యమైన వివరాలు బహిర్గతమయ్యాయి. ఇది పొరపాటున జరిగిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకొని ఆపై బాధ్యులను కనిపెట్టి తదుపరి చర్యలు తీసుకోవడంలో విఫలం కావడం గమనార్హం.
జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయం
-వ్యక్తిగత ప్రతిష్ట రాజ్యాంగం మౌలిక విలువల కింద వస్తుందని, ఇది జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల హక్కులను పరిరక్షిస్తుందని తెలిపాడు. వ్యక్తులు గౌరపప్రదంగా జీవించేలా చేయడమే ప్రాథమిక హక్కుల లక్ష్యం. స్వతంత్రంగా ఉండాలంటే గౌరవప్రదంగా జీవించాలి. ఇది జరగాలంటే గోప్యత అవసరం. గోప్యత హక్కు వ్యక్తిగత ప్రతిష్టకు హామీ ఇస్తుంది. అది ఉన్నప్పుడే జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను పరిరక్షించడం సాధ్యమవుతుంది.
-వ్యక్తిగత గోప్యత హక్కు నకారాత్మకం (నెగిటివ్), సకారత్మకం (పాజిటివ్) రెండు విధాలుగా ఉంటుంది.
-నకారత్మకం అంశాలు అంటే పౌరులు జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులను హరించేలా రాజ్యం చర్చలు తీసుకోకూడదు.
-సకారత్మకం అంటే వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
-రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవితం అంటే కేవలం దేహం మనుగడకు సంబంధించినదే కాదు. జ్ఞానమే జీవితానికి పరిపూర్ణత చేకూర్చుతుంది.
జస్టిస్ ఆర్.ఎఫ్. నారీమన్
-అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎలా ఉన్నా గోప్యత అనేది శాశ్వత ప్రాథమిక హక్కు. పార్లమెంట్లో సాధారణ మెజార్టీతో చట్టం చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోనే పొందుపర్చారు. కాబట్టి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా పౌరులు వాటిని స్వేచ్ఛగా అనుభవించవచ్చు. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కు. ఇది శాశ్వతమైనది. ఎలాంటి సామాజిక, ప్రజా ప్రయోజనాలు లేకుండా గోప్యతహక్కును ఏదైనా చట్టం ఉల్లంఘిస్తే, అలాంటి చట్టం చెల్లనేరదని చెప్పే బాధ్యత న్యాయస్థానానికి ఉంది.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్
-దీర్ఘకాలంగా వ్యాధిగ్రస్తులై ఔషధాలే ప్రాణాధారంగా జీవిస్తున్న వ్యక్తులకు తమ జీవితాన్ని కొనసాగించాలో లేదా ముగించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వ్యక్తిగత గోప్యత హక్కు పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది. (ఈయన పేర్కొన్నారు)
-ఓ మహిళ తనకు సంతానం కావాలో వద్దో అని నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదా గర్భస్రావం కొరుకునే స్వేచ్ఛ కూడా వ్యక్తిగత గోప్యత హక్కు పరిధిలోని అంశమే అన్నారు.
జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే
-గోప్యత హక్కు ప్రాథమిక హక్కేనని పేర్కొన్నారు. గోప్యత హక్కుకు నిఘంటవులు, న్యాయస్థానాల్లో తప్పించి చట్టం లో నిర్వచనం లేదని న్యాయపరమైన వ్యాఖ్యానాలను, కేసులవారిగా అర్థం చెప్పడం జరుగుతుందని పేర్కొన్నారు. లింగం, జాతి, మతం, కులం, వర్గ భేదం లేకుండా ఒక వ్యక్తి గౌరవాన్ని పరిరక్షించే దిశగా ఇలాంటి హక్కులను గుర్తించడం బాధ్యత అన్నారు.
జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్……
-డిజిటల్ యుగంలో బాలలకు సంబంధించిన గోప్యతకు ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాలానిక జగత్తులో, వాస్తవ ప్రపంచంలో వారి గోప్యతపై ప్రత్యేక హక్కు అవసరం అని పేర్కొన్నారు. ఇంట్లోకి రావడానికి ఒక వ్యక్తిని అనుమతించినంత మాత్రాన దాని అర్థం ఇతరులు అలా రావచ్చనేది కాదు. ప్రభుత్వ ప్రభుత్వేతరుల ప్రమేయం నుంచి వ్యక్తుల అంతర్స్థితిని కాపాడేది ప్రాథమిక హక్కు అని వివరించారు.
జస్టిస్ ఎస్ ఏ బాబ్డే
-పురాతన మత గ్రంథాల్లో వ్యక్తిగత గోప్యత అంశం ఉంది. ఒక మహిళను పరాయి పురుషుడు చూడకూడదనే నిబంధన రామాయణంలో ఉంది. ఇతరుల ఇండ్లలో తొంగిచూడటం ఇస్లాంలో నిషిద్ధం. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా జీవించాలని క్రైస్తవుల బైబిల్ చెబుతుంది. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కును అనుభవించడానికి వ్యక్తిగత గోప్యత అనేది తప్పనిసరి. అంతేకాకుండా ఇంట్లో సభ్యుల ఏకాంతాన్ని పరిరక్షించేలా మతరపమైన ఆచారాల నిర్వహణ, వేద పఠనం, భోజన సమయంలో పవిత్రతను కాపాడేలా ఇంటిని నిర్మించాల్సిన విధానాన్ని గృహసూత్రలో పేర్కొన్నారు. యజమాని అనుమతి లేకుండా మరొకరు ఇంట్లోకి ప్రవేశించరాదని అర్థశాస్త్రం చెబుతుంది. ఇతరుల సమక్షంలో భోజన పానీయాలు తీసుకోరాదన్న రామానుజ సంప్రదాయం దక్షిణ భారత్‌లో ఉంది. ఒక చర్యను ఏకాంతంలో చేసే ప్రాథమిక స్వేచ్ఛను, సదరు చర్యను నిర్వహించే స్వేచ్ఛ నుంచి వేరు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ అంశాలతో పాటు ముఖ్యంగా స్వలింగ సంపర్కులు ట్రాన్స్జెండర్లు సంఖ్యాపరంగా తక్కువైనంత మాత్రాన వారికి ప్రాథమిక హక్కులో అంతర్భాగం అయిన గోప్యత హక్కును వారి నుంచి దూరం చేయలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. వ్యక్తిత్వ వికాసానికి, బుద్ది కుశలతకి, జ్ఞాన సముపార్జనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతూ, పౌరునికి రాజ్యం గౌరవానికి నిదర్శనంగా నిలుస్తూ భారతదేశ ప్రజాస్వామ్యానికి సాక్షీభూతంగా, వ్యక్తి స్వేచ్ఛకు మరో భూషణంగా ఉండే గోప్యత హక్కును 21వ అధికరణలోని అంతర్భాగంగా గుర్తించడం ఎంతో పరీక్షించదగిన విషయం. తద్వారా మినీ రాజ్యాంగంగా పరిగణించబడే 21వ అధికరణ పరిధి మరింత విస్తృతం కానుంది. రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా లేని ఎన్నో హక్కులను న్యాయస్థానాలు 21వ అధికరణలో అంతర్భాగంగా గురిస్తూ వస్తుండగా, గోప్యతా హక్కును కూడా ఆ విస్తారమైన రాజ్యాంగ ప్రాంగణంలో చేర్చడం, భారత న్యాయవ్యవస్థ, ఆధునిక యుగానికి దీటుగా నడుస్తోందనడం ఓ తార్కాణం.
ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగం
-పౌరుల ప్రాథమిక హక్కులకు ప్రభుత్వ చర్యల ద్వారా భంగం కలుగకుండా న్యాయస్థానాలు సంరక్షిస్తాయి. ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి భద్రత ఇతర రాజ్యాంగ హక్కుల కంటే… చట్టపరమైన హక్కుల కంటే ఎక్కువ. కాబట్టి ప్రాథమిక హక్కుల్లోని అధికరణ 21లో అంతర్భాగంగా వ్యక్తిగత గోప్యత హక్కును చేర్చినట్లయితే ప్రభుత్వ చర్యల నుంచి మరింత భద్రతను కల్పించినట్లు అవుతుంది. అయితే, వ్యక్తిగత గోప్యత హక్కు 21వ అధికరణలో అంతర్భాగంగా చేర్చవచ్చా? వద్దా? అనేదానిపై న్యాయస్థానాల్లో ఎన్నో వాదోపవాదాలు జరిగాయి.
-1954లో ఎంపీ శర్మ Vs శరత్చంద్ర, ఖరన్సింగ్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ (1962) వ్యాజ్యాల్లో ప్రధాన న్యాయస్థానం వ్యక్తిగత గోప్యత హక్కును 21వ అధికరణలో భాగంగా అంగీకరించలేదు.
-ఆ తర్వాత గోవింద్ Vs మధ్యప్రదేశ్ (1975) వ్యాజ్యం లో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులన్నీ వ్యక్తిగత గోప్యత హక్కుకు సహకరించేవని, అయితే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన ఆంక్షలకు లోబడి ఉండాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది.
-అనంతం ఆర్ రాజగోపాల్ Vs తమిళనాడు (1994) వ్యాజ్యంలో 21వ అధికరణలో పేర్కొన్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల్లో అంతర్భాగంగానే గోప్యత హక్కు ఉంటుందని, ప్రతివారికి తన వ్యక్తిగత జీవితం, కుటుంబం, వివాహం, దాంపత్య జీవితం, మాతృత్వం, పిల్లల పెంపకం, విద్య మొదలైన వ్యవహారాల్లో గోప్యతను రక్షించుకొనే హక్కు ఉందని ధర్మాసనం పేర్కొంది. అయితే వ్యక్తిగత గోప్యత హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించినచో దేశ భద్రత, జాతీయ సమగ్రతను సంరక్షించడంలో ప్రభుత్వం బలహీనపడే పరిస్థితి ఉంది. కానీ రిటైర్డ్ జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి voi కేసులో 9 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం అటు దేశ భద్రతకు సంబంధించిన అంశాలనుగాని బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డును అనుసంధానించే ప్రక్రియనుగాని స్పృశించక వ్యక్తిగత గోప్యత హక్కును 21వ అధికరణలో అంతర్భాగంగా పరిగణించడం జరిగింది. 2012లో జస్టిస్ కేఎస్. పుట్టుస్వామితో సహా రామన్ మెగసెసె పురస్కార గ్రహీత అయిన శ్రీమతి శాంతి సిన్హా, బెజవాడ విల్సన్, మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ వ్యవస్థాపకుడు అయిన అరుణరాయ్, నిఖిల్ డే, స్త్రీవాద పరిశోధకురాలైన కల్యాణి సేన్ మీనన్ ప్రధాన న్యాయస్థానంలో వ్యక్తిగత గోప్యతహక్కును ప్రాథమికహక్కుగా పరిగనించాల్సిందిగా పిటిషన్లు దాఖలు చేశారు. తదనంతరం ఈ వ్యాజ్యంలో తీర్పునిచ్చిన న్యాయమూర్తులు కింది ప్రధానాంశాలను వ్యాఖ్యానించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?