ఎకానమీలో మంచి స్కోరింగ్ ఎలా?
80 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా TSPSC త్వరలో గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు విడుదల చేయబోతుంది. వీటిలో ఎకానమీ వంటి ప్రధాన సబ్జెక్టులో మంచి మార్కులు పొందడానికి అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు, టెక్నిక్లను అనుసరించవలసి ఉంటుంది. అధిక మార్కులు తెచ్చుకునే సబ్జెక్టుల్లో ఎకానమీ ఒకటి. దీనికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్..
- గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో ఎకానమీ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఒక పేపర్ ఉంది. ఇం దులో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి.
- గ్రూప్-2, పేపర్-3లో 150 మార్కుల పేపర్లో మూడు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్ 50 మార్కులకు ఉంటుంది.
మొదటి సెక్షన్: భారతీయ ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్లు
- మొదటి సెక్షన్లో మంచి మార్కులు సాధించాలంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఇందులో వృది,్ధ అభివృద్ధి, జాతీయాదాయ నిర్వచనాలు, భావనలు, వాటి మధ్య సంబంధాలు, జాతీయాదాయం, GDP లెక్కింపు పద్దతులను విశ్లేషించాలి. తలసరి ఆదాయం, తలసరి వినియోగం, మానవాభివృద్ధి సూచీలను అధ్యయనం చేయాలి. GDP, GNP జాతీయాదాయాన్ని ఏ విధంగా లెక్కించాలి, ఆధార సంవత్సరం అంటే ఏమిటి, CSO పాత్ర ఏమిటి అన్న కోణంలో విశ్లేషించాలి.
- పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పథకాల అమలు, ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.
- ప్రణాళిక, నీతి ఆయోగ్ అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అమలైన ప్రణాళికలు, లక్ష్యాలు, సాధించిన విజయాలు, సమ్మిళిత వృద్ధి గురించి అధ్యయనం చేయాలి. నీతి ఆయోగ్ నిర్మాణం, లక్ష్యాలు, విధులు, సభ్యులు, సమావేశాలు లాంటి వివరాలపై అవగాహన పెంచుకోవాలి.
- మొదటి సెక్షన్ సాంకేతికమైనది. భారతీయ ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రాథమిక ముందస్తు భావనలను కలిగి ఉంటుందని అభ్యర్థులు అర్థం చేసుకోవాలి.
- ద్రవ్యోల్బణం/ప్రతి ద్రవ్యోల్బణం అంశాలు అవి కోశ, ద్రవ్య విధానాలతో సంబంధం కలిగి ఉన్న తీరును అధ్యయనం చేయాలి.
- మొదటి సెక్షన్‌లోని అంశాలను రోజువారీ వార్తాపత్రికల నుంచి సాధారణ కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానించుకుంటూ అభ్యసించాలి.
- మొదటి సెక్షన్‌కు సంబంధించిన సమాచారం చాలా ముఖ్యమైనది. ఇందులో వృద్ధి రేటు, ఆధార సంవత్సరం, CSO విడుదల చేసే గృహ, CPI సమాచారం, జాతీయ ఖాతాల త్రైమాసిక డేటా మొదలయినవి ఉంటాయి.
- ఇటీవలి కొవిడ్ కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ వంటి వాటి గురించి తెలుసుకోవాలి. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలను పేదరిక నిర్మూలన కోణంలో విశ్లేషించాల్సి ఉంటుంది.
- K,V,U,W,Z,L మొదలయినటువంటి వివిధ రికవరీ నమూనాలను చదవాలి. ఈ నమూనాలు దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమన దశ నుంచి అధిక వృద్ధి రేటును తిరిగి పొందేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో తెలుపుతాయి.
రెండో సెక్షన్: తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని (1956-2014) తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, తెలంగాణ వెనుకబాటుకి గల కారణాలను విశ్లేషించాల్సి ఉంటుంది. అదే విధంగా జలాలకు సంబంధించిన బచావత్ ట్రిబ్యునల్, లలిత్భార్గవ, వాంఛూ కమిటీలు, జైభారత్ కమిటీ, గిర్గ్లానీ కమిటీ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన కమిటీలు, సూచనలు తెలుసుకోవాలి. ఈ కమిటీలు చేసిన సిఫారసుల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది.
- తెలంగాణ ఉద్యమంపై సైద్ధాంతిక అవగాహనను ఆర్థిక కోణంలో విశ్లేషించుకోవాలి, తెలంగాణ చారిత్రక అంశాలు భూసంస్కరణలు, సంస్థాగత, నిర్మాణాత్మక సంస్కరణలు అత్యంత ముఖ్యమైన అంశాలు.
తెలంగాణలో వివిధ దశల్లో అమలు చేసిన భూసంస్కరణలు, మధ్యవర్తుల తొలగింపు, జమీందారీ, జాగీర్దారీ, ఇనామ్ దారీ, కౌలు చట్టాల సంస్కరణలు, భూగరిష్ట పరిమితులు, షెడ్యూల్డ్ ఏరియాల్లో భూపరిమితులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. - తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగ స్థితిగతులు ముఖ్యంగా పంటలు, ఉత్పత్తి, ఉత్పాదకత, వ్యవసాయ పరపతి, నీటిపారుదల సౌకర్యాలు, ఎరువుల వినియోగం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ కార్యక్రమాలు, రైతుబంధు వంటి పథకాలు తదితర అంశాలను పరిశీలించాలి. రాష్ట్రం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానం, జిల్లాల వారీగా వివిధ పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడులు, సేవా రంగం పాత్ర, వివిధ రంగాల అభివృద్దికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ర్రాష్ట్ర GSDPలో వివిధ రంగాల వాటా, శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చదవాలి.
- తెలంగాణ అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్, దళిత బంధు, ధరణి, కేసీఆర్ కిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, ఆరోగ్యలక్ష్మి, ఆసరా పింఛన్లు, పేదలకు ఇళ్లు, దళితులకు భూ పంపిణీ, బియ్యం పంపిణీ, భద్రతా ఉపకరణాన్ని బలోపేతం చేయడం, షీ టీమ్స్, గొర్రెల పంపిణీ, సాఫ్ట్‌నెట్(SOFTNET),టాస్క్ (TASK), T-ఫైబర్(T-Fiber), WE హబ్ మహిళా పారిశ్రామికవేత్తల హబ్ వంటి ప్రతిష్టాత్మక సామాజిక, సంక్షేమ పథకాల గురించి చదవాలి.
- కొవిడ్ కాలంలో తెలంగాణ ఎపిడమిక్ డిసీజెస్ నిబంధనలు 2020, ఆహార భద్రత కార్డుదారులందరికీ ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ, నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయడానికి డిపాజిట్ చేసిన రూ.1500, తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులకు అందించిన రూ.500, 2020-21 మధ్య కాలంలో పాఠశాల విద్యార్థుల కోసం అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు పెంచకుండా, యజమానులు అద్దె వసూలు వాయిదా వేసేలా ప్రభుత్వం తీసుకున్న సామాజిక-ఆర్థిక చర్యల గురించి తెలుసుకోవాలి.
మూడో సెక్షన్ అభివృద్ధి, మార్పు, సమస్యలు
- భారత దేశంలో ప్రాంతీయ అసమానతలు, వలసలు, పట్టణీకరణ, అభివృద్ధి, పునరావాసం, భూసేకరణ చట్టాలు వంటి అంశాలపై పూర్తి అవగాహనను పెంపొందించుకోవాలి. వృద్ధి, పేదరికం, అసమానతలు, విద్య, ఆరోగ్యం, సామాజిక మార్పు, సామాజిక భద్రత వంటి ఆర్థిక సమస్యలను కూడా తెలుసుకోవాలి.
UNDPకి సంబంధించి మిలీనియం లక్ష్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి వీటిని దేశంలో అమలు చేసే నీతి ఆయోగ్ వంటి సంస్థల గురించి అత్యంత ప్రాధాన్య ప్రశ్నలు వస్తాయి. - 2000-2015 మధ్య కాలంలో MDG, 2015-2030 మధ్య కాలంలో SDG లక్ష్యాలను సాధించడానికి భారతదేశం అమలు చేసిన కార్యక్రమాల గురించి తెలుసుకోవాలి.
- హోం, గృహ, పట్టణ వ్యవహారాల, గణాంకాలు, కార్యక్రమ అమలు వంటి మంత్రిత్వ శాఖలు వలసలు, పట్టణీకరణకు సంబంధించిన సమాచారాన్ని, గణాంకాలను, పథకాల గురించి తెలియజేస్తాయి. ఈ సమాచారం ఆధారంగా గణాంకాలను విశ్లేషిస్తూ చదువుకోవాలి.
- పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతల సమాచారం కోసం ఆర్థిక సర్వే ఉపయోగపడుతుంది.
రిఫరెన్స్ పుస్తకాలు..
నా క్లాస్ నోట్స్ గ్రూప్-2 ,గ్రూప్- 3 పరీక్షలకు సంబంధించిన మూడు విభాగాల సమాచారాన్ని అందిస్తుంది. ప్రతి అంశాన్ని ప్రత్యేకంగా వివిధ కేస్ స్టడీస్‌తో , ఇటీవలి సర్వే నుంచి డేటా, రోజువారీ కరెంట్ అఫైర్స్, హోంమంత్రిత్వ శాఖ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ, లేబర్ బ్యూరో వంటి శాఖలు విడుదల చేసిన భారత ప్రభుత్వ సమాచారం గణాంకాలతో సహా క్లుప్తంగా, క్విక్ రివిజన్‌కు అనుకూలంగా ఉండేందుకు నోట్స్ రాసుకున్నాను.
NCERTS: ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ పుస్తకం (Class 11), మైక్రో , మాక్రో ఎకనామిక్స్ పుస్తకం (Class 11), భారత, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన తెలుగు అకాడమీ పుస్తకాలు..
మాదిరి ప్రశ్నలు
1. ఇటీవల కొవిడ్ దృష్ట్యా కింది వాటిలో ఏ రికవరీ మోడల్ వ్యక్తుల ఆదాయ స్థాయిల్లో విస్తృతమైన అసమానతలను చూపింది?
A) L ఆకారం B) V ఆకారం
C) K ఆకారం D) Z ఆకారం
2. దేశ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితులలో ఉన్నప్పుడు
1) ప్రణాళికలు మరియు సబ్సిడీల రూపంలో ప్రభుత్వం ఖర్చులు చేస్తుంది.
2) ఎగుమతులు తగ్గించాలి
3) భారత ప్రభుత్వ ఉద్దీపన చర్యలు
సరైన ప్రకటనలను గుర్తించండి
A) 1 మరియు 2 మాత్రమే
B) కేవలం 2
C) కేవలం 3 D) పైవన్నీ
3. కింది వాటిలో ఏది పరిమాణాత్మక సాధనాల్లో భాగంగా పరిగణించబడదు?
1) బ్యాంక్ రేటు
2) రెపో రేటు
3) ప్రాధాన్యతా రంగ రుణాలు
4) పైవన్నీ
4. ప్రాథమిక లోటుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది
A) ఇది ప్రస్తుత ప్రభుత్వ పనితీరును స్పష్టంగా చూపుతోంది.
B) ఇది గత ప్రభుత్వ పనితీరును స్పష్టంగా చూపిస్తుంది.
C) ఇది వడ్డీ చెల్లింపులను కలిగి ఉంటుంది. D) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు