Poverty Line Decisions | దారిద్య్రరేఖ నిర్ణయాంశాలు
పేదరికం నిర్వచనంలో కనీసం అవసరాలు అనే పదానికి చాలా విస్తృత అర్థం ఉన్నది. ఎందుకంటే కనీస అవసరాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కో కాలంలో ఒక్కోవిధంగా ఉంటాయి. అంటే కనీస అవసరాలు కాలానుగుణంగా,
ప్రదేశానికగుణంగా మారుతుంటాయి.
-1980లో సెల్ఫోన్ కానీ, గౌరవమైన బట్టలు కానీ కనీస అవసరాలు కావు. కానీ 2017లో అవి ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు. JAM (Jandhan, Aadhar, Mobile) లాంటి పథకాలు అత్యవసరమని ప్రభుత్వమే చెబుతుంది. కారు, ఇల్లు మొదలైనవి సంపన్నదేశాలైన అమెరికా, స్విట్జర్లాండ్లో కనీస అవసరాలు కానీ భారత్లో కాదు.
-కాబట్టి ఈ కనీస అవసరాలను ఆధారంగా చేసుకొని ఎప్పటికప్పుడు పేదరిక సూచీని నిర్వచించి, పేదరిక రేఖ (దారిద్య్రరేఖ)ను నిర్వచిస్తూ పేదరికాన్ని అంచనావేస్తారు.
-అయితే ఈ కనీస అవసరాలు అంటే ఏమిటి? దాన్ని ఏ ఆధారంగా నిర్ణయించాలి అనేది ప్రతిసారి వివాదాలకు, చర్చకు దారితీస్తుంది.
-ప్రతిసారి ప్రణాళిక సంఘం ఈ కనీస అవసరాలు అంటే ఏమిటో నిర్వచించమని ఒక కమిటీ వేయడం, అది దాన్ని నిర్వచించి, ఒక దారిద్య్రరేఖను నిర్ణయించడం, మళ్లీ అది వివాదాస్పదమవడం, మళ్లీ ఒక కమిటీ వేయడం అనేది నిత్యకృత్యమైంది.
-అంటే కనీస అవసరాలకు ఎంత ఆదాయం అవసరమో తేల్చి ఆ ఆదాయం కటే తక్కువ ఉన్నవారిని పేదలుగా గుర్తిస్తారు.
దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం పేదరిక అంచనాలు
-అందరికంటే ముందుగా పేదరికాన్ని నిర్వచించినవారు దాదాబాయి నౌరోజీ. ఇతను 1868లో పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పేదరిక రేఖను నిర్వచించారు.
1. ఇతని ప్రకారం దారిద్య్రరేఖను ఏడాదికి రూ. 16-35 మధ్యలో నిర్వచించారు.
ఆధారం: జీవనాధార ఆహారం- బియ్యం, పప్పు, కూరగాయలు, మటన్, నెయ్యి, నూనె, ఉప్పు.
2. ఆ తరువాత 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ కూడా దారిద్య్రరేఖను నిర్వచించింది. ఇది నెలకు రూ. 15-20గా నిర్ణయించింది.
3. ఆ తరువాత 1944లో బొంబాయి ప్రణాళిక కూడా పేదరికాన్ని నిర్వచించింది. ఇది దారిద్య్రరేఖను ఏడాదికి రూ. 75గా నిర్ణయించింది.
స్వాతంత్య్రానంతరం పేదరిక అంచనాలు
1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటయ్యాక పేదరికాన్ని నిర్వచించి లెక్కించే బాధ్యతను ప్రణాళిక సంఘం తీసుకుంది. 2015 నుంచి ఈ బాధ్యతను నీతి ఆయోగ్ తీసుకుంది.
విధానం
-ప్రణాళిక సంఘం ఒక కమిటీని వేస్తుంది.
-కమిటీ పేదరికరేఖను నిర్వచిస్తుంది.
-దీని ప్రకానం NSSO డాటాను సేకరించి, పేదరికాన్ని అంచనావేస్తుంది.
-NSSO డాటా ప్రకారం నీతి ఆయోగ్ ఈ దేశంలో ఎంతమంది పేదలున్నారు, వారు ఎంతశాతం ఉన్నారని ప్రకటిస్తుంది.
మొదటి అభివృద్ధి 1962లో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు
-1962 వరకు ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి పేదరికాన్ని నిర్వచించేవారు. పేదరికాన్ని నిర్వచించేందుకు, దీన్ని అధిగమించడానికి 1962లో ప్రణాళిక సంఘం ఒక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది.
-దీని ప్రకారం ఈ గ్రూపు పట్టణాలకు, గ్రామాలకు విడివిడి దారిద్య్రరేఖను నిర్వచించింది.
-పట్టణాల్లో వ్యక్తి ఆదాయం నెలకు రూ 25గా నిర్ణయించింది.
-గ్రామాల్లో వ్యక్తి ఆదాయం నెలకు రూ. 20గా నిర్ణయించింది.
-అదేవిధంగా ఇది ఆరోగ్యాన్ని, విద్యను వదిలేసి దారిద్య్రరేఖను నిర్వచించింది.
-తరువాత వీఎం దండేకర్, రథ్లు మొదటిసారిగా ఒక పద్ధతి ప్రకారం పేదరికాన్ని అంచనావేశారు.
-వీరు మొదటిసారి కెలోరీ ఆధారిత పేదరికాన్ని నిర్వచించారు.
-అంటే ఒక వ్యక్తి రోజు 2250 కేలరీల (1960-61 ధరల ప్రకారం) శక్తిగల ఆహారాన్ని (పట్టణాల్లో రూ. 22.5, గ్రామాల్లో రూ. 15) తీసుకోవడానికయ్యే కనీస ఆదాయాన్ని కనీస వ్యయంగా భావించి పేదరిక రేఖను నిర్వచించారు.
-దండేకర్, రథ్లే కాకుండా మరికొంతమంది కూడా 1950 నుంచి 1973 మధ్యలో పేదరిక అంచనాలు వేశారు. అవి..
అధ్యయనం చేసిన వ్యక్తి పేదరిక శాతం
బీఎస్ మిశ్రా 37.1
ఎంఎస్ అహ్లువాలియా 56.3
పీకే బరధాన్ 54
పీఎం దండేకర్, రథ్ 41
అలాగ్ టాస్క్ఫోర్స్ కమిటీ (1979)
1962-70 మధ్యలో జాతీయ, రాష్ర్టాల పేదరిక నిర్వచనం ఒకేలాగా ఉండేది. అలాగే అది అనుసరించిన విధానం వల్ల పేదరికాన్ని చాలా తక్కువగా అంచనావేశారు. దీనివల్ల పేదరిక రేఖ మళ్లీ వివాదాస్పదమైంది.
కమిటీ సూచనలు
-మొదటిసారిగా పట్టణాలు, గ్రామాలకు వేర్వేరు పోషకాహార వినియోగ సూచీని ప్రతిపాదించారు.
-దాని కారణంగా రోజుకు గ్రామాల్లో 2400 కేలరీలు, పట్టణాల్లో 2100 కేలరీలుగా నిర్ణయించారు.
-ఇప్పుడు ఈ కేలరీలను ఏదైనా ఆదాయానికి సమానం చేయాలి (కనీస వ్యయం) అది..
-రోజుకు గ్రామాల్లో 2400 కేలరీలకు బదులు నెలకు రూ. 49.09
రోజుకు పట్టణాల్లో 2100 కేలరీలకు బదులు నెలకు 56.64
గ్రామాల్లో నెలకు కనీసం రూ. 49 ఆదాయం లేనివారు, పట్టణాల్లో రూ. 56 ఆదాయం లేనివారిని పేదలుగా పరిగణిస్తారు.
దీన్ని Month Percapita Consumption Expenditure (MPCE) అని అంటారు.
లక్డావాలా కమిటీ (1993)
-1993లో పేదరిక సూచీని నిర్వచించడానికి లక్డావాలా ఆధ్వర్యంలో ఒక నిపుణుల కమిటీని నియమించారు.
సూచనలు
1. ఇది పట్టణాలు, గ్రామాలకు ఉన్న కేలరీల ఆధారిత లెక్కలను అలాగే ఉంచింది.
2. కానీ జాతీయ పేదరికరేఖను రాష్ర్టాలవారీగా (ఫిషర్ సూచీని అనుసరించి) వేరుచేసింది.
n అలాగే పట్టణాలు, గ్రామాల్లో ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పేదరిక సూచీని మార్చింది.
ఎ) గ్రామాలకు Consumer Price Index – Agriculture Labour (CPI-AL)
బి) పట్టణాలకు CPI- Industrial Workers ఏడాదికి నిర్ణయించింది.
-లక్డావాలా పద్ధతిని అనుసరించి 2011 వరకు PCI పేదరిక అంచనాలను లెక్కగట్టింది.
-దాని ప్రకారం పేదరికం
ప్రాంతం పేదల సంఖ్య (శాతాల్లో)
1993-94 2004-05
గ్రామీణ ప్రాంతం 37.3 28.3
పట్టణ ప్రాంతం 32.4 25.7
దేశం 36 27.5
-పై అంచనాలు కూడా వివాదాస్పదం కావడంతో 2005లో మరో నిపుణుల కమిటీని నియమించారు.
టెండూల్కర్ కమిటీ (2005)
అత్యంత వివాదాస్పదమైన కమిటీల్లో ఇది ఒకటి. యూపీఏ జమానాలో ఏర్పాటుచేసిన ఈ కమిటీ పేదరిక రేఖను అత్యంత తక్కువగా చూపింది. పేదల శాతాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నంచేసింది. ఈ కమిటీ కూడా వివాదాస్పదం కావడంతో మళ్లీ రంగరాజన్ కమిటీని ఏర్పాటు చేశారు.
సూచనలు
ఇంతవరకు ఉన్న ఒక విధమైన గుర్తింపు కాలం (Uniform Reference Period)ను కాదని మిశ్రమ గుర్తింపు కాల పద్ధతి (Mixed Recall Period)ని వాడారు.
అలాగే పట్టణాలు, గ్రామాలకు ఒకేవిధమైన పేదరిక బుట్ట (Poverty Basket)ను నిర్ణయించారు.
పై అంచనాలు తీవ్ర వివాదాస్పదం కావడంతో 2012లో మరో కమిటీని నియమించారు.
రంగరాజన్ కమిటీ (2012)
-ఈ కమిటీ తన నివేదికను 2014లో సమర్పించింది.
-ఇది మళ్లీ పాతపద్ధతి అయిన గ్రామాలు, పట్టణాలకు విడివిడి కెలోరీ ఆధారిత దారిద్య్రరేఖను నిర్వచించింది.
-మిశ్రమ ఆధారిత కాలపట్టిక కాకుండా సవరించిన మిశ్రమ ఆధారిత కాల నిర్ణయ పట్టిక ఆధారంగా తీసుకున్నారు.
-పైవారి తరువాత వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ఇతర కమిటీలు కూడా పేదరికాన్ని అంచనావేశాయి. ఉదాహరణకు సక్సేనా కమిటీ, హసీమ్ కమిటీ, అభిజిత్ కమిటీ మొదలైనవి.
-పైవేవీ ప్రణాళిక సంఘం ఏర్పాటు చేసినవి కాదు. కాబట్టి వాటి పద్ధతిని, అంచనాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రణాళికా సంఘం ప్రకటించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?