Our poets | మన కవులు
తెలంగాణలో మేధావులు, అభ్యుదయవాదులు, కవులు, కళాకారులకు కొదువలేదు. కానీ ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా వారు వివక్షకు గురయ్యారు. అత్యద్భుతమైన సాహిత్యం సృజించి, అనేకానేక పరిశోధనలు చేసిన కవులు, రచయితలు ఉన్నప్పటికీ వారెవరూ వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వారిని స్మరించుకోవటం, వారి సాహిత్య కృషిని భవిష్యత్ తరాలకు అందించటం మన బాధ్యత. అంతేకాకుండా వివిధ రకాల పోటీ పరీక్షల్లో కూడా తెలంగాణ ప్రాంత కవులు, వారి రచనల గురించి ప్రశ్నలు అగుడుతున్నందున నిపుణ పాఠకుల కోసం కొంతమంది మన కవుల విశేషాలు..
వడ్డగాని అంజయ్య :
ఈయన 1938లో నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో జన్మించారు. చండూరు సాహితీ మేఖల వారి సాహితీ కుసుమాలలో ఈయన కవితలు అచ్చయ్యాయి. ఇవి చైతన్య ప్రతీకలు. 1938లో సాహితీ చైతన్య కళాస్రవంతి అనే సంస్థను స్థాపించారు. తొలిమెట్టు కూడా వీరి సంకలనమే.
అజ్మతుల్లా సయ్యద్ :
ఈయన దేవరకొండలో 1902లో జన్మించారు. 20కి పైగా రచనలు చేశారు. విప్లవ స్వరాలు చెప్పుకోదగినది. నీలా జంగయ్య మిత్రుడు. తెలంగాణలో సంస్కృతాంధ్ర సాహిత్యంలో మంచి ప్రతిభ కలిగిన ముస్లిం కవుల్లో అజ్మతుల్లా, సయ్యదలీ సోదర ద్వయం ఒకటి. గోల్కొండ కవుల సంచికలో వీరి పద్యాలు కలవు (184వ పుట).
తేరాల సత్యనారాయణ శర్మ :
1932 జూలై 25న నల్లగొండ జిల్లా సిరికొండ గ్రామంలో జన్మించారు. ఎంఏ, ఎంవోఎల్ చదివారు. ఈయన రచనలు 1) కవితాపట్టాభిషక్తులు 2) వ్యాస భారతి- 1, 2 3) రాచకొండ చరిత్ర 4) రెడ్డిరాజ్య చరిత్రం 5) ఓరుగంటి చరిత్ర 6) కావ్యావతారికలు 7) కాకతీయ చరిత్రం 8) తెలుగుదేశ సాంఘిక చరిత్ర 9) చారిత్రక బాంధవ్యాలు 10) విజయనగర చరిత్రం 11) తెలుగు మహాచరిత్ర మొదలైనవి. భారతి, ఆంధ్రభూమి పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు.
బాల్యం నుంచే ఉద్యమస్ఫూర్తిగల ఈయన సంస్కృతాంధ్ర సాహిత్యాలను బాగా అధ్యయనం చేశారు. అంతేగాక విమర్శనాత్మక దృక్పథం, చారిత్ర పరిశోధనాపటిమ కూడా ఈయనకు ఉంది. నేలటూరి వెంకటరమణయ్య, మారేమండ రామారావు, బీఎన్ శాస్త్రిలతో కలిసి చారిత్రక అంశాలు చర్చిస్తూ ఎన్నో చారిత్రక ప్రదేశాలు సందర్శించారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలంగాణ గర్వించదగ్గ చరిత్ర పరిశోధకుల్లో ఒకరు. నటుడు, కవి, ఉపాధ్యాయుడు, ఉద్యమనేత, చరిత్రపరిశోధకులు, స్వాతంత్య్రసమరయోధుడు, సంగీతజ్ఞుడు.
మునగాల మండలం రేపాలలో జరిగిన నిజాం వ్యతిరేక పోరాటంలో కోదాటి నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు. ఈయన జనతాకళ మండలి నాటక సంస్థలో ఒక మూలస్తంభం. కేఎల్ఎన్ రావు నటించిన గెలుపునీదే నాటకంలో నటించారు. పీవీ నర్సింహారావు ఎదుటనే విమర్శించగల సత్తా ఉన్న వ్యక్తి. మల్లంపల్లి సోమశేఖరశర్మ రచించిన రెడ్డి రాజ్యాల చరిత్ర నేడు దొరకకపోయినా ఈయన రాసిన రెడ్డిరాజ్య చరిత్ర ఆ కొరత తీరుస్తుంది. 1976లో పదవీ విరమణ పొందిన ఈయన ప్రస్తుతం హైదరాబాద్‌లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.
భట్టరు అనంతాచార్యలు :
1913లో నల్లగొండ జిల్లాలోని మోత్కూరులో జన్మించారు. సంస్కృతాంధ్ర, సంగీత, వైద్యవిద్యలు తెలుసు. వీరి రచనలు 1) పద్మినీ ప్రభాకరీయం 2) భగవద్గీతానువాదం. ఆరుట్ల రామచంద్రారెడ్డితో కలిసి 1945-46లో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని అరెస్టయి భువనగిరి జైలులో నిర్బంధశిక్షను అనుభవించారు. మొదట కమ్యూనిస్టు తరువాత సోషలిస్ట్ పార్టీలో చేరారు.
గవ్వా అమృతారెడ్డి :
ఈయన కాలం 1900-50. నల్లగొండ జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో జన్మించారు. ఈయన భావకవి. అమృతగీతాలు ఈయన రచన. ఈయనకు అనేక ఉద్యమాలతో సంబంధం ఉంది (గ్రంథాలయోద్యమం, ఆంధ్రోద్యమం). జమీందారులకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. మంచి న్యాయవాది. మునగాల రాజా నాయని వెంకట రంగారావుకు వ్యతిరేకంగా భూమి వ్యవహారాల్లో ప్రజల పక్షాన వాదించిన ధీశాలి. పోలీస్ యాక్షన్‌కు ముందు అనేకసార్లు జైలుకెళ్లారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కోదాటి నారాయణరావులతో ఈయనకు సాంగత్యం ఉంది. 1920లో పిల్లలమర్రిలో బేతిరెడ్డి గ్రంథాలయాన్ని స్థాపించారు.
అలీ సయ్యద్ :
ఈయన కాలం 1875-1960. దేవరకొండలో జన్మించారు. సంస్కృతాంధ్ర ఉర్దూ సాహిత్యాలు తెలుసు. 20కి పైగా రచనలు చేశారు. గోల్కొండ కవుల సంచికలో వీరి పద్యాలు అచ్చయ్యాయి. ఈయన రచనలు ఆనందగురుగీత, సురభాండేశ్వరం, తార్క్యోపాఖ్యానం, మానసిక రాజయోగం, బభ్రువాహన, ధ్రువ, నగర, ముక్తి ప్రదాయిని, భీమవర మహాత్మ్యం, నలచక్రవర్తి, నవీన సత్యహరిశ్చంద్ర, హరిప్రియ, దిగంబర మోహిని, ప్రమీల, కాళింది, సిరిసెనగండ్లనల నాటకం, జలంధరాసురవధ, సీతారామ శతకం, సత్యద్రౌపదీసంవాదం.
తోట ఆనందరావు : 1935, మే 12న నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలంలోని రహీంఖాన్‌గూడెంలో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం గ్రంథాన్ని ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
చెరుకు ఉషాగౌడ్ :
1963లో నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లిలో జన్మించారు. రచనలు తెలుగమ్మ, త్రిలింగాణము.
పున్న ఎల్లమ్మ :
1938 ఆగస్టు 15న నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో జన్మించారు. నిజాం రాజ్యంలో ఉన్న వెట్టి చాకిరీ విధానంపై బుర్రకథను రాశారు. భృగభేరి పత్రికను నడిపారు.
వెంపటి కనకయ్య : ఈయన కాలం 1890-1949. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో జన్మించారు. సూర్యాపేటలో జరిగిన గ్రంథాలయోద్యమంలో, జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఈయన రచనలు శ్రీకోదండ శతకం, ముముక్షుజన సంకల్పం, పార్వతీశ్వర శతకం.
బిరుదురాజు రామరాజు :
1925లో వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో జన్మించారు. ఈయన తెలంగాణ అంతటా తిరిగి జానపదగేయాలు, తాళపత్రగ్రంథాలు, శిలాశాసనాలను సేకరించారు. నారాయణపురం మురళీధర శర్మ వద్ద బస్తాడు తాళపత్రగ్రంథాలుంటే సేకరించారు. గంభీరావుపేటలో వై రామేశ్వర శర్మ, కటకం వెంకటేశ్వర్లు వద్ద నుంచి 100 తాళపత్రగ్రంథాలను సేకరించారు. ఈయన రచన మరుగున పడిన మాణిక్యాలు.
బోయినపల్లి కిషన్‌రావు :
1948 ఏప్రిల్ 13న నల్లగొండ జిల్లాలో జన్మించారు. అక్షరపుష్పాలు, సంఘర్షణ కవితలో కత్తికే కన్నుంటే శీర్షికన రాసిన కవిత ప్రముఖమైంది.
ఉమ్మెత్తల కేశవరావు :
1907 ఫిబ్రవరి 9న నల్లగొండ జిల్లా పిల్లలమర్రి గ్రామంలో జన్మించారు. 1992లో మరణించారు. ఈయన కవి, లాయర్, సర్వోదయ కార్యకర్త. ఈయన రచనలు 1) హైదరాబాద్ రైతుల సమస్య 2) భూదానోద్యమం 3) రామనామ చింతనం 4) ఖురాన్ సారం 5) సర్వోదయ సిద్ధాంతం 6) బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర 7) అహింసాక్రాంతి 8) తెలంగాణలో అహింసకు నాంది మొదలైనవి. ఈయన మాడపాటి శిష్యుడు. 8 నెలలు గుల్బర్గా జైలు జీవితం అనుభవించారు. గాంధేయవాది. రజాకార్ల వ్యతిరేక ఉద్యమకాలంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వినోబా స్మారక స్థూపాన్ని నిర్మింపజేశారు. వినోబాతో కలిసి 20 ఏండ్లు భూదానోద్యమంలో పాల్గొన్నారు. స్వామి రామానందతీర్థను గురించి తెలంగాణలో శాంతికి నాంది అని రాశారు. ముందుముల నర్సింగరావు రాసిన అసంపూర్తిగా ఉన్న 50 ఏండ్ల హైదరాబాద్ గ్రంథంను 500 పేజీలతో పూర్తిచేశారు. ఇంకా ఈయన రచనలు సబ్కో సమ్మతిదే (ప్రార్థనాగీతం), అహింసాక్రాంతికి మార్గాన్వేషణలు, పంచదశశ్లోకగీతి, భారతీయుల ప్రతిభకు అహింసయే భూషణం, స్వతంత్ర జనశక్తి దాని మహత్తు మొదలైన గ్రంథాలు రాశారు. పోచంపల్లిలో అహింసావిజ్ఞాన కేంద్రంను స్థాపించారు. ఈయన తల్లిదండ్రులు చక్రధరరావు, జానకమ్మ.
అఫ్సర్ :
ఆయన ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో జన్మించారు. అభ్యుదయకవి. అధ్యాపకులు. తెలంగాణ కవిత్వం వస్తురూప పరిణామం అనే అంశంపై పీహెచ్డీ చేశారు. నిర్లిప్తత, స్థానికత, కొత్త సాహిత్య ప్రమాణాలు, రక్తస్పర్శ (1986), ఇవాళ, కవితాసంపుటి (1991), ఆధునికత-అత్యాధునికత (1992), కథ-స్థానికత (సాహిత్య విమర్శ), వలస (కవితాసంపుటి), ఊరి చివరి (కవితాసంపుటి) ఈయన రచనలు. 1) ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు (1992) 2) ఉమ్మడిశెట్టి అవార్డు (1992) 3) అనిశెట్టి ప్రభాకర్ అవార్డు (1999) 4) పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డు (2003) 5) హైదరాబాద్ సాహితీ అవార్డు (2003) 6) మద్రాస్ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం- మద్రాస్ (2002) 7) భాషా సమ్మాన్ అవార్డు (2007)లు పొందారు. ఈయన ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు.
జే బాపురెడ్డి :
1936 జూలై 21న కరీంనగర్ జిల్లా సిరికొండ గ్రామంలో జన్మించారు. ఇటీవల రాష్ట్రప్రభుత్వం నుంచి ఈయన కాళోజీ నారాయణరావు పురస్కారం అందుకున్నారు. ఈయన రచనలు బాపురెడ్డి గేయాలు, శ్రీకారశిఖరం, బాపురెడ్డి గేయనాటికలు, అనంత సత్యాలు, హృదయ పద్యం, కాలం మాయాజాలం, బాలహేల అక్షరానుభూతులు, ఆధునిక తెలుగు కవిత్వం-స్వరూప స్వభావాలు, ప్రతిభాదర్శనం, బాపురెడ్డి కవితాదృక్పథం మొదలైనవి.
మారంరాజు సత్యనారాయణరావు :
1936 డిసెంబర్ 7న వరంగల్ జిల్లా బయ్యారంలో జన్మించారు. అధ్యయనం, అధ్యాపకత్వం, వచన రచన, అనువాదవృత్తిలో నిపుణులు. 1) ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాలు 2) ఎన్నికల రాజకీయాలు 3) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొదలైనవి ఇతన రచనలు.
కాటం లక్ష్మీనారాయణ :
1924 సెప్టెంబర్ 19న మహబూబ్‌నగర్ జిల్లా శంషాబాద్‌లో జన్మించారు. న్యాయశాస్త్రం చదివి, ముందుమల రామచంద్రారావు వద్ద జూనియర్‌గా పనిచేశారు. కొంతకాలం ఉమ్మెత్తల కేశవరావుతో కలిసి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 1945లో మడికొండలో జరిగిన ఆంధ్రమహాసభలో పాల్గొన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. స్వామి రామానందతీర్థ అనురచవర్గంలో చేరారు. రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా బూర్గుల రామకృష్ణారావుతో కలిసి పోరాటం చేస్తుండగా నిజాం ప్రభుత్వం గుల్బర్గా జైలుకు పంపింది. 1949లో జనత వారపత్రికను నడిపారు. 1979లో తెలుగు భూమి వారపత్రికను నడిపారు. స్వాతంత్య్రోద్యమ చరిత్ర పరిశోధన సంస్థను స్థాపించి హైదరాబాద్ సంస్థానోద్యమ చరిత్రను రచించారు. జిల్లాలవారీగా స్వాతంత్య్రోద్యమకారుల గురించి ప్రచురించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వీరులకు గుర్తింపు కోసం ఎనలేని కృషిచేశారు. 2010 ఫిబ్రవరి 25న మరణించారు.
శ్రీవెంకటరాజన్న అవధాని :
ఈయన కాలం జూన్ 1909-95. కరీంనగర్ జిల్లా మంథనిలో కృష్ణయ్య, సీతమ్మ దంపతులకు జన్మించారు. ఈయన కవిత్వాలు గోల్కొండ సంచికలో అచ్చయ్యాయి. నేటి ద్విజులు అంశంపై (287వ పేజీ) ఈయన పద్యాలు రాశారు. ఈయన చేసిన పదప్రయోగం ఆత్మవత్త్సర్వభూతాని అనేది సర్వశాస్ర్తాల సారాంశం. ఈయన జీవితం కూడా అలాగే గడిపారు. అగ్నిశబ్ద మహాత్మ్యం ఈయన రాసిన గ్రంథం. ఇది అలభ్యం. వృత్తిరీత్యా పత్రికల్లో పనిచేసి, న్యాయవాద వృత్తిని చేపట్టారు. పీవీ నర్సింహారావు అవధాని ఇంటికెళ్లి కింద చాపమీద కూర్చొని మాట్లాడేవారంటే ఆయన విద్వత్తు ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది. జాతీయోద్యమంలో, నిజాం వ్యతిరేకోద్యమంలో, అస్పృశ్యతా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఆంధ్రాంగ్ల, పార్శీ, కన్నడ, సంస్కృత భాషలను అవలీలగా మాట్లాడగలరు. మంచి చరిత్ర పరిశోధకులు. గయ వెళ్లి గయ శాసనంలో ఈయన గ్రామ ప్రస్తావన ఉందని చూసివచ్చారట. సంఘసంస్కరణాభిలాషి, నీతి, నిజాయితీకి మారుపేరు. నిక్కచ్చి మనిషి. నాగపూర్‌లో స్కూల్ విద్య (1922) అభ్యసించారు.
కావూరి శ్రీనివాసశర్మ :
1965 జూలై 6న మెదక్ జిల్లా సిద్దిపేటలో జన్మించారు. ఆయుర్వేదంలో గోల్డ్‌మెడల్ సాధించి డాక్టరేట్ తీసుకున్నారు. విద్యావారధి, డీ లిట్ (యునైటెడ్ థియోలజికల్ రిసర్చ్ యూనివర్సిటీ) చేశారు. చరిత్ర-పురావస్తు పరిశోధనలో డీ లిట్, పురావస్తు శాఖలో గౌరవ పరిశోధనాధికారి. రాష్ట్ర పర్యాటక శాఖలో పనిచేస్తున్నారు. రెండు నంది అవార్డులు అందుకున్నారు. మెదక్ జిల్లాపై డాక్యుమెంటరీ తీశారు. 3 జిల్లా యువజన సీఎఈవై అవార్డులు, జర్మనీ రాయల్ లిటరరీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత. ఆయుర్వేదంలో ఫెలోషిప్, ఖాట్మండ్, హిమాలయ డ్రగ్స్వారి ఫెలోషిప్ 2006, యూఆర్ఎఫ్ వరల్డ్ రికార్డ్వారి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు 2015, కవిరాజు, సాహితీ చక్రవర్తి, కవిభాస్కర, శ్రీశ్రీ అవార్డు, సాహిత్యకళానిధి, ప్రతిభాస్ఫూర్తి, నైపుణ్య అవార్డు, కృషిరత్న, జాతీయ గ్లోబల్ పీస్ అవార్డు 2014, ప్రజ్ఞానభారతి-2015, ప్రొ. జయశంకర్ స్మారక సాహిత్య అవార్డు 2015, పీవీ స్మారక సాహిత్య అవార్డు, ఆయుర్వేద పురస్కారం 2016 అందుకున్నారు. 6 సినిమాలకు పాటలు, రచనా సహకారం అందించారు. ఈయన తవ్వకాలు జరిపించి దేవస్థానాలు, రెండు నగరాలు (కుప్పానగరం, మర్పడగ) కనుగొన్నారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2015, స్కైవరల్డ్-15, వీఆర్ఎఫ్ వరల్డ్ రికార్డ్-15, ఆన్లైన్ వరల్డ్ రికార్డ్-16, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్, లైమ్ బుక్ ఆఫ్ రికార్డ్ పరిశోధనలో ఉన్నాయి.
గ్రంథాలు :
20 చారిత్రక పరిశోధన గ్రంథాలు, 100 తాళపత్రగ్రంథాల పరిష్కారం. ఈయన తండ్రి హేమచంద్ర శర్మ సీఎం కేసీఆర్ చిన్ననాటి గురువు. అనేక తాళపత్ర గ్రంథాలను ప్రాకృతం నుంచి పరిష్కరించారు. ఎన్నో వందల తాళపత్రగ్రంథాలను, తామ్రశాసనాలను తెలుగులోకి అనువదించారు. సంస్కృతం, ప్రాకృతం, బ్రాహ్మీ, ఖరోష్టి లిపిల నుంచి తెలుగులోకి అనువదించే ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. తాళపత్ర గ్రంథాల్లో ఉన్న సమాచారం ప్రకారం మెదక్ జిల్లాలో శాతవాహనుల కాలం కన్న ముందు కాలంనాటి ఒక మహా నగరాన్ని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న 6 దేవాలయాలను పరిశోధనల ద్వారా తవ్వకాలు జరిపి వెలికితీయించారు. తెలంగాణలో అత్యున్నతమైన ప్రతిభాశాలి. ఇంతింతై వటుడింతై, నభోవీధిపై అంతై అన్న పోతన వలే ఈయన ఎన్నో అందని శిఖరాలను అధిరోహిస్తూ తెలంగాణ గర్వించదగ్గ పరిశోధకులుగా ఉన్నారు.
-30 ఏండ్లు ఆయుర్వేద శాస్త్రంపై పరిశోధన, 23 గ్రంథాలను అచ్చువేసి 20 ఏండ్లుగా సాహిత్యసేవ చేస్తున్నారు. 2016, సెప్టెంబర్ 3న కలకత్తాలో యూనివర్సల్ ట్రేడ్ ఫౌండేషన్ అవార్డు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు పొందారు. ఇటీవల ఈయన పరిశోధనలో తాళపత్రగ్రంథాల్లో లభ్యమైన బ్రహ్మం గారి కన్నా ముందే భవిష్యత్ దర్శనం అనే గ్రంథం కురేషుడు రచించినట్లుగా తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో కల్యాణి చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతీయుల కాలంలో అనేక దేవాలయాలు, పట్టణాలు, నగరాలు వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?