Naxalbury movement | నక్సల్బరి ఉద్యమం
-గ్రూప్-1 ప్రత్యేకం
నక్సల్బరి అనేది ఒక గ్రామం పేరు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్‌డివిజన్‌లోని హిమాలయపర్వతాల దగ్గర ఉన్న గ్రామం. గ్రామ జనాభాలో అత్యధికులు సంథాల్ గిరిజనులు. ఈ గిరిజన రైతాంగాన్ని స్థానిక భూస్వాములు (జోతేదార్లు) దోపిడీకి పీడనకు గురిచేసేవారు.
-1967 మార్చి 3న ఆ గ్రామరైతులు జోతేదారు పంటపొలాన్ని ఆక్రమించుకుని, అందులో ఎర్ర జెండాలు పాతి పంటను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతపు రైతు సంఘం ఈ చర్యను ప్రశంసిస్తూ భూమి మీద భూస్వాముల గుత్తాధిపత్యాన్ని రద్దుచేయాలని, రైతు కమిటీల ఆధ్వర్యంలో భూపంపిణీ జరగాలని, భూస్వాములను నిరోధించడానికి రైతులను సంఘటితపరిచి సాయుధ పోరాటం చేయాలని పిలుపునిచ్చింది.
-నక్సల్బరి గ్రామ రైతాంగం ప్రారంభించిన ఈ పంట స్వాధీనం దావానలంలా వ్యాపించి 1967 ఏప్రిల్ కల్లా 60 చోట్ల భూస్వాముల పంట స్వాధీనం, భూస్వాధీనం సంఘటనలు జరిగాయి. రైతులు సంఘటితమయ్యారు. రైతు కమిటీల నిర్మాణం జరిగి, జోతేదార్ల దగ్గర వున్న భూపత్రాలను స్వాధీనం చేసుకుని, వాటిని తగులబెట్టి భూఆక్రమణ చేపట్టారు.
-ఈ పోరాటంలో వేలాదిమంది రైతులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ ఘటనలతో రైతాంగ విముక్తి యుద్ధం ప్రారంభమైనట్లు పోరాటయోధుడు చారు మజుందార్ ప్రకటించారు. దేశంలోని అన్ని ప్రాంతాల రైతాంగ పోరాట నాయకులు నక్సల్బరీ పంథాను అంగీకరించి వారితో సంబంధాలు పెట్టుకున్నారు. రైతాంగ నాయకులంతా అఖిల భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితిలో ఏకమై 1969 ఏప్రిల్ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు)ని స్థాపించారు.
-నక్సల్బరి రైతాంగ ఉద్యమం భూమి, భుక్తి, విముక్తి అనే నినాదాలతో తన లక్ష్యాన్ని స్పష్టం చేసింది. దున్నేవాడికే భూమి ప్రాతిపదికగా వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగే నూతన ప్రజాస్వామిక విప్లవం తన సైద్ధాంతికి దృక్పథంగా ప్రకటించింది. నూతన ప్రజాస్వామిక విప్లవం అంటే భూస్వామ్య వ్యతిరేక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం. సాయుధ పోరాటం ద్వారానే విప్లవం విజయవంతమవుతుంది. అది దీర్ఘకాలంగా ఉంటుంది.
-మొదట పల్లెలను విముక్తిచేసి ఆ పిదప పట్టణాలను చుట్టు ముట్టి అంతిమంగా రాజ్యాధికారం ఆ విప్లవోద్యమ లక్ష్యం. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావజాలంతో పోరాటాలను నిర్మించాలనేది వీరి దృక్పథం. నక్సల్బరి రైతాంగ పోరాటం క్రమంగా అఖిల భారత స్థాయి పోరాటంగా ఎదిగింది.
-నక్సల్బరి రైతాంగ పోరాట పిలుపునకు స్పందించని రాష్ర్టం లేదు. దాదాపు ప్రతి రాష్ర్టంలో ఈ పోరాటంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. పోరాట క్రమంలో ప్రజానీకంలో భూమి, భుక్తి, విముక్తి గురించి ఆకాంక్షలు వెల్లివిరిశాయి.
-నక్సలైట్లు భారత సమాజాన్ని అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థగా విశ్లేషిస్తారు. 15 ఆగస్టు 1947న బ్రిటిష్ వాళ్లు దేశం విడిచి వెళ్లిపోయినా, వలస కాలపు దోపిడీ, లూటీ ఇంకా కొనసాగుతుందని వీరి విశ్వాసం. బ్రిటిష్ వలస నుంచి బయటపడినప్పటికీ అనేక సామ్రాజ్యవాద దేశాలు దేశ రాజకీయాలను నిర్దేశిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొడుతున్నాయి.
-దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం ఇంకారాలేదని, అది వచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందని, దాన్ని సాధించుకునేందుకు రెండో స్వాతంత్య్ర సంగ్రామం అవసరమని వీరి ప్రగాఢ విశ్వాసం. సామ్రాజ్యవాదులను, దళారీ వ్యవస్థను నిర్మూలించాలనేది వీరి వాదన. అర్ధ భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల రూపంలో భూస్వామ్య వ్యవస్థ దేశంలో ఇంకా కొనసాగుతుందని, ఇది ప్రజల్లో దోపిడీని, పీడనను కొనసాగిస్తుందని, దాని కూల్చివేతకు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు అవసరమని వీరి వాదన.
-సంప్రదాయ కమ్యూనిస్టు పార్టీలు నమ్మినట్లుగా పార్లమెంటరీ తరహా విధానంలో నూతన ప్రజాస్వామిక విప్లవం రాదని అది సుదీర్ఘ ప్రజాయుద్ధం ద్వారానే సాధ్యమని దేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా దున్నేవాడికే భూమి నినాదంతో వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం కొనసాగించాలనేది వీరి ప్రగాఢ విశ్వాసం.
-తెలంగాణ తొలితరం నక్సలైట్లలో గణనీయమైన భాగం ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమంలో పాల్గొంది. వీళ్లంతా 1974 నుంచి 1977 వరకు సీపీఐ (ఎంఎల్) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ పేరుతో కొనసాగి 1980 ఏప్రిల్‌లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్‌గా మారింది. 2004 సెప్టెంబర్ 21న పీపుల్స్‌వార్ సీపీఐ మావోయిస్టుగా పేరు మార్చుకుంది. 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ర్టం ఏర్పడేవరకు అది తెలంగాణకు ప్రత్యేక రాష్ర్ట ప్రతిపత్తి కల్పించాలనే డిమాండుకు కట్టుబడి ఉంది.
-ఆంధ్రప్రదేశ్ రెవల్యూషనరీ కమ్యూనిస్టు కమిటీ పేరుతో 1969లో ఏర్పడిన ఒక నక్సల్ గ్రూపు ఆ తర్వాత కాలంలో సీపీఐ (ఎంఎల్) విమోచన, సీపీఐ (ఎంఎల్) జనశక్తి సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) ప్రతిఘటన సీపీఐ (ఎంఎల్) ప్రజాప్రతిఘటన, యూసీసీఆర్ఐ (ఎంఎల్), సీపీఐ (ఎంఎల్) వంటి పార్టీలుగా చీలిపోయింది.
-వీటిలో సీపీఐ (ఎంఎల్) జనశక్తి 1998 నుంచి న్యూడెమోక్రసీ 2007 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమాన్ని సమర్థించాయి. నక్సలైట్ ఉద్యమం తనకు తాను వ్యవసాయ విప్లవంగా చెప్పుకుంటుంది. ఈ ఉద్యమం మూడు ప్రధానమైన అంశాలను తెరపైకి తెచ్చింది.
-అవి భూమి, భుక్తి, విముక్తి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాముల చేతుల్లో వందలాది ఎకరాల భూమి కేంద్రీకరించబడి ఉంది. ఈ భూస్వాములు పంచాయతీల పేర పేద ప్రజల నుంచి మామూళ్లు, దండుగల సాకుతో బలవంతపు వసూళ్లకు పాల్పడేవారు. ఎలాంటి ప్రతిఫలం ఇవ్వకుండా వెట్టిపేరుతో భూస్వాములు తమ గడీల్లో పనులు చేయుంచుకోవడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం నిత్యకృత్యమైపోయింది.
-భూస్వాములను నిలదీసే ధైర్యం పేద ప్రజలకు లేకుండాపోయింది. ఈ నేపథ్యంలోనే నక్సల్బరి ఉద్యమం వచ్చింది. ఆంధ్రా వలస పాలకుల చేతుల్లో స్థానిక భూస్వామ్య పెత్తందార్ల చేతిలో అవమానానికి గురైన తెలంగాణ యువతకు, గ్రామీణ రైతాంగానికి నక్సల్బరి ఉద్యమం ఒక ఆశాకిరణంగా కనిపించింది. ఈ క్రమంలోనే వచ్చిన ఎమర్జెన్సీ చీకటి రోజులతో అసంతృప్తికి గురైనవారికి తమ హక్కులను ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కేవలం నక్సల్బరి ఉద్యమం మాత్రమేనని విశ్వసించిన తెలంగాణ పేద ప్రజానీకం నక్సల్బరి ఉద్యమంవైపు ఆకర్షితులైంది.
-ఈ క్రమంలో వచ్చినవే సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాలు. భూస్వాముల దోపిడీపై సిరిసిల్ల, జగిత్యాల రైతాంగం చేసిన ఉద్యమాలకు సిరిసిల్ల, జగిత్యాల జైత్రయాత్ర ఒక వ్యక్తీకరణ. ప్రజల్లో చైతన్యం ఆత్మవిశ్వాసం, పోరాడే సంకల్పం కలిగితే తలెత్తే పరిణామాలకు సిరిసిల్ల, జగిత్యాల పోరాటాలు ప్రతీకలు. రైతుకూలీ సంఘాలు, రాడికల్ యువజన సంఘాలు గ్రామాల్లో వెలసిన తర్వాత దొరల దౌర్జన్యాలు క్రమంగా అంతరించిపోయాయి.
-దొరల పద్ధతులకు వ్యతిరేకంగా అనేక గ్రామాల్లో సంఘం నాయకత్వాన ప్రజలు ఐక్యంగా కదిలి దొరల పంచాయతీ తీర్పుల నుంచి ప్రజలను విముక్తి చేసి భూస్వాములకు బదులుగా సంఘం లేదా గ్రామకమిటీలు ఈ పంచాయితీలను పరిష్కరించే బాధ్యతను చేపట్టాయి. చైతన్యవంతమవుతున్న ప్రజానీకం పాత పద్ధతుల్లో వేలాది రూపాయల చెల్లించాల్సిన అవసరం లేకుండా భూస్వాముల కుట్రలకు బలికాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో సంఘం ముందు అందరి సమక్షంలో పరిష్కరించుకున్నారు.
-పంచాయితీలన్నీ ప్రజానీకం మధ్యకు వచ్చాయి. ఏ కేసు విచారణగాని, తీర్పుగాని రహస్యంగా జరగదు. ఈ ప్రజాకోర్టుల్లో గ్రామప్రజలంతా భాగస్వాములై న్యాయబద్ధంగా ఆమోదయోగ్యంగా తమ పంచాయితీలను పరిష్కరించుకునేవారు. ఈ రైతాంగ పోరాటాల్లో బలంగా ముందుకువచ్చిన పోరాట రూపం సాంఘిక బహిష్కరణ ఈ పోరాట రూపాన్ని ప్రజలు విస్తృతంగా ప్రయోగించారు.
-గ్రామాల్లో భూస్వాముల పెత్తనం సాగిన రోజుల్లో గ్రామస్థులు తమను ఎదిరించకుండా ఉండటం కోసం వారిని కులం నుంచి వెలివేయడం, నీళ్లు, నిప్పు ఆ కుటుంబానికి దొరకకుండా చేయడం, వారితో ఎవరు మాట్లాడకూడదని వారికి ఎవరు ఎలాంటి సహాయం చేయకూడదని నిబంధనలు విధించి వారిని ఆర్థికంగా, మానసికంగా హింసించేవారు.
-ఇదే బహిష్కరణ ఆయుధాన్ని పీడిత రైతాంగం భూస్వాములపై ఎక్కుపెట్టి అహంకారం దౌర్జన్యంతో కూడిన ఒక్కరిద్దరి గ్రామపాలనకు బదులు సంఘం ద్వారా గ్రామప్రజలు గ్రామ వ్యవహారాలను ప్రజాస్వామ్యబద్ధంగా అందరి సమక్షంలో నిర్వహించుకునే పద్ధతి వచ్చింది. సాంఘిక బహిష్కరణ పోరాట రూపం ద్వారా రైతాంగం భూస్వాముల పెత్తనాన్ని అరికట్టి గ్రామాల్లోని అరాచక శక్తులను కట్టడి చేసింది.
-నక్సల్బరీ ఉద్యమానికి ముందు తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్‌లాంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నెలకొనివున్న పరిస్థితులు తెలంగాణలో భూస్వామ్య దోపిడీ పీడనలో ప్రధానమైన అంశం వెట్టిచాకిరీ. గ్రామాల్లో ఆధిపత్య శక్తులు దౌర్జన్యాన్ని ప్రయోగించి ఏ మాత్రం ప్రతిఫలం ఇవ్వకుండా శ్రామికుల శ్రమను నిర్బంధపూరితంగా దోచుకోవడాన్ని వెట్టిచాకిరీ అని అంటారు.
-ఆధునిక భారతదేశ చరిత్రలో గణనీయమైన ప్రభావం చూపిన ఉద్యమం నక్సలైట్ ఉద్యమం. ఇది దేశవ్యాప్త ఉద్యమం అయినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ ఉద్యమానికి స్థావరంగా నిలిచింది. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమంగా దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నక్సలైట్ ఉద్యమాన్ని వివరించేటప్పుడు అది ఆంధ్రప్రదేశ్ నుంచి విస్తరించిన ఉద్యమంగానే పరిగణిస్తున్నారు.
-మొత్తంమీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ మార్క్సిస్టు లెనినిస్టు రాజకీయ పంథాను విశ్వసించే పార్టీలు ప్రధానంగా ఆరు వరకు ఉన్నాయి. వాటి సంస్థాగత నిర్మాణాల శక్తి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా తెలుగు సమాజంమీద వాటి ప్రభావం ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) స్థాపన 1969 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా గుత్తికొండలో జరిగింది.
-గుత్తికొండలో జరిగిన రహస్య సమావేశానికి నక్సల్బరి నిర్మాత చారు మజుందార్‌తో పాటు శ్రీకాకుళం, కోస్తా, రాయలసీమ, తెలంగాణ నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. అప్పటికే ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఉద్యమం జోరుగా సాగుతుంది.
-కమ్యూనిస్టు పార్టీలు ఆ ఉద్యమాన్ని విచ్ఛిన్నకర ఉద్యమంగా విశ్లేషిస్తే చారు మజుందార్ పంథాను అనుసరించిన మార్క్సిస్టు లెనినిస్టు నాయకులు మాత్రం తెలంగాణ ఉద్యమంలో ప్రజావెల్లువ ఉందని దానిలో పాల్గొనాలని, పాలకవర్గాల విధానాల మీద ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతున్న ఈ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొని ప్రజా చైతన్యానికి పదునుపెట్టాలని, ఈ ఉద్యమాన్ని ఒక పాలకవర్గ ముఠాకు వ్యతిరేకంగా మరొక పాలకవర్గ ముఠా హస్తగతం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యతను చేపట్టాలని వీరు భావించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?