Middle East-Fires | మధ్యప్రాచ్య మంటలు
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వందల కొద్ది ఆసక్తికర, భావోద్వేగ, యుద్ధ వాతావరణ సంఘటలు జరిగాయి. ఇంత చారిత్రక నేపథ్యం ఉన్న ఒక ప్రత్యేక దేశ చరిత్ర, దాని ఆవిర్భావ నేపథ్యాన్ని, దాని ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడం పోటీ పరీక్షల అభ్యర్థులకు ముఖ్యం. ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంపై నిపుణ పాఠకుల కోసం ప్రత్యేక వ్యాసం.
-పాలస్తీనా: ఇజ్రాయెల్, జోర్డాన్‌కు మధ్య ఉన్న ఒక చిన్న ప్రాంతం.
-జెరూసలేమ్: పాలస్తీనా ప్రాంతంలో ఒక నగరం.
-క్రైస్తవులు, ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం
-ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేమ్
-టెల్ అవివో: జెరూసలేమ్ తర్వాత అతిపెద్ద పట్టణం.
-పాలస్తీనా ముస్లింలు అధికంగా గల దేశం. ఇజ్రాయెల్ యూదులు అధికంగా గల దేశం. ఈ రెండింటికి మధ్య వివాదానికి కారణం నాటి జర్మనీలో జరిగిన పలు సంఘటనలు. జర్మనీ నుంచి నేటి వరకు ఏం జరిగిందో తెలుసుకుంటేనే అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఎందుకు వచ్చిందో అర్థం అవుతుంది.
జర్మనీ- దాని చుట్టూ ఉన్న పరిస్థితులు
-1800-1900ల మధ్యలో దాదాపు ఆసియా, ఆఫ్రికాలో ఉన్న చాలా దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్ ఆధీనంలో ఉండేవి.
-ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ తమ సామ్రాజ్యాలను విస్తరిస్తూ ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్థిక వనరులను, ఆర్థిక అధికారాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న కాలం.
జర్మనీ ఎలా ఏర్పడింది?
-చిన్న, చిన్న రాజ్యాల సముదాయంగా ఉన్న జర్మనీని ఒట్టో వాన్ బిస్మార్క్ ఏకీకరణ చేసి జర్మన్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచాడు.
-1914 వచ్చేసరికి జర్మనీ ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఏర్పడింది. ఈ పరిస్థితి బ్రిటన్, ఫ్రాన్స్‌కు మింగుడుపడలేదు.
-మొత్తం ప్రపంచం రెండు గ్రూపులుగా విడిపోయింది.
పై గ్రూపుల్లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు జెరూసలేమ్, పాలస్తీనా ఒట్టోమాన్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేవి. అయితే, ఒట్టోమాన్ మొదటి ప్రపంచ యుద్ధం ఓడిపోవడం వల్ల జెరూసలేమ్‌ను ఆక్రమించిన బ్రిటిష్ పాలస్తీనా ప్రాంతాన్ని మిలిటరీ ఆధీనంలో ఉంచింది. అయితే, జెరూసలేమ్‌లో ఉన్న యూదులు మిలిటరీ ఆధీనంలోని పాలస్తీనాకు వలసలు రావడం మొదలైంది. అప్పుడే యూదులకు, పాలస్తీనా అరబ్బు ముస్లింలకు వివాదం మొదలైంది.
వర్సైల్స్ ట్రీటీ
-మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడటంతో ఈ యుద్ధం మొత్తం జర్మనీ వల్లనే జరిగిందని అలైడ్ పవర్స్ (బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్) ఆరోపించి వర్సైల్స్ ఒప్పందానికి జర్మనీపై తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి.
-దీంతో జర్మనీ బొగ్గు గనులను ఫ్రాన్స్‌కు ఇవ్వడం, జర్మనీ సొంత ఆర్మీని స్థాపించవద్దనడం, సబ్‌మెరైన్స్ నిర్మించవద్దని, దాదాపు 65 కోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించాలని నియమం పెట్టారు.
-అధిక ద్రవ్యోల్బణం, హిట్లర్ ఎదగడం
-వర్సైల్స్ ఒప్పందం వల్ల జర్మనీ తీవ్ర ద్రవ్యోల్బనంలోకి నెట్టబడింది. అంటే ఆ దేశంలోని కరెన్సీకి విలువ లేకుండా పోయింది. జర్మనీ ప్రజలు తీవ్ర కష్టాల్లోకి నెట్టబడ్డారు.
-ఆ సమయంలో హిట్లర్ రూపంలో జర్మనీకి ఒక నాయకుడు దొరికాడు.
-మొత్తం జర్మనీ ఈ పరిస్థితికి యూదులే కారణం అని హిట్లర్ గట్టిగా నమ్మి జర్మనీ ప్రజలను కూడా నమ్మించాడు. అనంతరం వర్సైల్స్ ట్రీటీ నుంచి జర్మనీ తప్పుకొని ధిక్కార చర్యకు శ్రీకారం చుట్టింది. అలా 1933లో హిట్లర్ జర్మనీ చాన్స్‌లర్ అయ్యాడు.
-నాజీయిజమ్లో భాగంగా ప్రపంచమంతా పవిత్రులు (జర్మనీ ప్రజలు), అపవిత్రలు (యూదులు)గా విభజించబడిందని ప్రకటించి యూదుల ప్రక్షాళన నిలబడ్డాడు.
-యూదులకు వేసక్టమీ (పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్) చేయించాడు. జర్మన్లకు, యూదులకు వివాహ సంబంధాలను తెంపేశాడు. జర్మనీలో యూదులను తక్కువ పౌరులుగా ప్రకటించాడు.
-గెట్టోస్ అనే ఒక ప్రత్యేక ప్రాంతంలో మాత్రమే యూదులు ఉండటానికి అనుమతించాడు. ఇవి గోడలతో మూసివేసి, గేట్లువేసి బంధించి ఉండేవి.
హోల్కాస్ట్: 1941-45 మధ్య కాలంలో యూదులందరినీ ఒక గ్యాస్ చాంబర్లోకి పంపి సామూహికంగా హత్య చేయడం. అలా 1941-45 మధ్యలో దాదాపు 60 లక్షల మంది యూదులను హత్య చేయించాడు హిట్లర్.
జియోనిజమ్ (Zionism)
-జియోన్ అంటే జెరూసలేమ్‌లో ఉన్న ఒక గుడి పేరు.
-19వ శతాబ్దంలో యూదులు తలపెట్టిన ఒక రాజకీయ ఉద్యమమే జియోనిజమ్
-జియోనిజమ్ ముఖ్య ఉద్దేశం: ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న యూదులంతా ఏకమై పాలస్తీనాలో స్థిరపడటం.
-ఈ ఉద్యమం 1948లో ఇజ్రాయెల్‌ను స్థాపించడానికి కారణమైంది.
రెండో ప్రపంచ యుద్ధం – యూదులకు పాలస్తీనాలో ప్రవేశం
-బ్రిటన్ మిలిటరీ ఆధీనంలో ఉన్న పాలస్తీనాకు యూదులు వలస వస్తుంటే అరబ్బులు, యూదులకు మధ్య తలెత్తే ఘర్షణను తగ్గించడానికి యూదులను పాలస్తీనాకు రాకుండా బ్రిటన్ నిరోధించింది. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ప్రధాన భూమిక వహించి యూఎస్ మాత్రం, హిట్లర్ యూదులపై సాగించిన దురాగతాలను పరిగణనలోకి తీసుకొని, యూదులపై దయతో.. పాలస్థీనాలో యూదులు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వాలని బ్రిటన్ను ఒప్పించి యూదుల పాలస్తీనా ప్రవేశానికి అనుమతించారు. అయితే 1945లో ఈజిప్టులో సమావేశమైన అరబ్ దేశాలు యూదులు పాలస్తీనాలో ఉండటంపై అభ్యంతరం తెలిపారు. యూదులపై జర్మనీ జరిపిన అకృత్యాలపై సానుభూతి వ్యక్తపరుస్తూనే.. ఒకవేల యూదులను పాలస్తీనాలో ఉండనిస్తే అది పాలస్తీనాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని యూఎస్, యూకే అరబ్ దేశాలు తెలిపాయి.
రెండు ప్రపంచ యుద్ధం – యూదుల పరిస్థితి
-జర్మనీ అకృత్యాల వల్ల, హిట్లర్ సాగించిన హోల్కాస్ట్ వల్ల ఇప్పుడు యూదులకు ఒక ప్రాంతం అనేది లేకుండాపోయింది. వారికి సొంత ప్రాంతం, సొంత దేశం అనేది ఏదీలేకుండాపోయింది. అయితే జియోనిజమ్ వల్ల యూదులందరూ పాలస్తీనాలో ఏకమయ్యారు.
-అయితే పాలస్తీనా అరబ్బులు కూడా యూదులను అనుమతించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. (1946లో పాలస్తీనాలో 12 లక్షల మంది అరబ్బులు, 7 లక్షల మంది యూదులు ఉన్నారు). దీని మూలంగా 1946-47లో యూదులకు, అరబ్బులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
-అయితే 1947లో భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో బ్రిటన్ బిజీగా ఉండటంతో పాలస్తీనా విషయాన్ని ఐక్యరాజ్య సమితికి అప్పగించింది.
1947 ఐక్యరాజ్య సమితి తీర్మానం
-1947లో ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ప్రకారం పాలస్తీనా రెండు భాగాలుగా విడిపోయింది.
1. అరబ్ రాజ్యం 2. యూదుల రాజ్యం
-రెండు రాజ్యాలకు జెరూసలేమ్ ఉమ్మడి అంతర్జాతీయ నగరమని ప్రకటించింది.
-అరబ్ దేశాల స్పందన: ఈ తీర్మానానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని నిర్ణయించుకున్నాయి.
-యూదుల స్పందన : మొదటిసారి యూదుల రాజ్యాన్ని యూఎన్ఓ గుర్తించడం, యూదులకు ఒక ప్రాంతం ఇవ్వడం వల్ల ఈ విభజనను వారు స్వాగతించారు. విభిన్న స్పందనల కారణంగా పాలస్తీనాలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి.
1948లో ఇజ్రాయెల్ ఆవిర్భావం
-1948 మే 14న బ్రిటిష్ పూర్తిగా పాలస్తీనా నుంచి వైదొలగడంతో యూదులంతా కలిసి స్వతంత్ర ఇజ్రాయెల్ రాజ్యాన్ని ప్రకటించుకున్నారు.
-ఇజ్రాయెల్ దేశాన్ని ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తిస్తూ అమెరికా ప్రకటన జారీ చేసింది.
-ఈ కారణంగా అరబ్ దేశాలైన సిరియా, జోర్డాన్, ఇరాక్, ఈజిప్టులు ఇజ్రాయెల్‌పైకి యుద్ధానికి వెళ్లినా అవి ఓడిపోయాయి.
వెస్ట్‌బ్యాంక్, జెరూసలేమ్ పట్టణాల పరిస్థితి:
-యూఎన్ఓ తీర్మానంలో అంతర్జాతీయ నగరంగా ప్రకటించిన జెరూసలేమ్ నగరం ఇజ్రాయెల్-అరబ్ మొదటి యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ (పశ్చిమ), జోర్డాన్ (తూర్పు)గా విడిపోయాయి. జోర్డాన్‌కి పశ్చిమంగా ఉన్న ప్రాంతమే వెస్ట్‌బ్యాంక్. ఇది 1950 నుంచి 1967 వరకు జోర్డాన్ ఆధీనంలో ఉండేది. అయితే 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ ఈ వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించింది.
గాజాస్ట్రిప్, పాలస్తీనా శరణార్థులు
-యూఎన్ఓ తీర్మానంలో గాజాస్ట్రిప్ (మ్యాప్) పాలస్తీనాలో ఉన్న అరబ్‌లకు ఇచ్చారు.
-అయితే మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత తమను తాము కాపాడుకోవడానికి అరబ్ నుంచి టిల్-అవివో నుంచి, ఇతర ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి గాజాస్ట్రిప్కి వలస రావడం మొదలైంది. వీరినే పాలస్తీనా శరణార్థులు అని అంటారు.
-మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో గాజాస్ట్రిప్‌ను ఈజిప్ట్ ఆక్రమించింది. అయితే 1967లో మళ్లీ ఆ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది.
-ఈ గాజాస్ట్రిప్‌లో ఉన్న శరణార్థులను, ఈజిప్టు గాని, ఇజ్రాయెల్ గాని తమ పౌరులుగా గుర్తించలేదు కాబట్టి వారికి ఎలాంటి పౌరసత్వం లేకుండా అక్కడే నిర్బంధంతో వేల మంది శరణార్థులుగా మిగిలిపోయారు.
యాసర్ అరాఫత్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో)
-ఎప్పుడూ సిరియా, జోర్డాన్, ఈజిప్టు, లెబనాన్‌పై ఆధారపడుతున్న పాలస్తీనా.. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను స్థాపించి ఆ తర్వాత యాసర్ అరాఫత్ దానికి నాయకుడయ్యాడు.
-1960 నుంచి 1980 మధ్యలో ఎన్ని యుద్ధాలు జరిగినా చివరకు 1981లో ఇజ్రాయెల్ దేశాన్ని ఆమోదిస్తున్నట్టు పీఎల్ఓ ప్రకటించింది కానీ గాజాస్ట్రిప్‌ను, వెస్ట్‌బ్యాంక్‌ను తమకు అప్పగించాలని కోరింది.
1993లో జోస్‌లో ఒప్పందం :
ఇజ్రాయెల్-పాలస్తీనా ఒకదానికొకటి గుర్తించుకొని, వెస్ట్‌బ్యాంక్‌ను, గాజాస్ట్రిప్‌ను పాలస్తీనాకి అప్పగించే పని మొదలైంది. అయితే ఈ నిర్ణయాన్ని హమాస్ వ్యతిరేకించింది. (పీఎల్ఓ లాంటిదే హమాస్. కానీ పీఎల్ఓ హింసను వదిలేస్తే, హమాస్ మాత్రం అదే హింసతో ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తుంది) ఇలా ఇప్పటికీ హమాస్, పీఎల్ఓ మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో ప్రాంతాలు హమాస్ ఆధీనంలోకి వెళ్లాయి.
పాలస్తీనాపై భారత్ వైఖరి
-ఐక్య, స్వాతంత్య్ర, సార్వభౌమ పాలస్తీనా దేశాన్ని తూర్పు జెరూసలేమ్ రాజధానిగా గుర్తిస్తూ ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా మెలగాలని సూచించింది.
-1936, సెప్టెంబర్ 27న పాలస్తీనా రోజును గుర్తిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక సందేశాన్ని పంపించింది.
-1939 – యూఎన్ఓ – పాలస్తీనా ప్రత్యేక కమిటీలో సభ్యత్వం కలిగి ఉన్న భారత్, ఒక స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని ఆమోదిస్తూ భారత జాతీయ కాంగ్రెస్‌లో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే ఇది ఇజ్రాయెల్ ప్రజలను రక్షించే విధంగా ఉండాలని కోరుకుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?