Meaning in Group Discussion | గ్రూప్ డిస్కషన్లో అంతరార్థం
సెమినార్లో పాల్గొని ఓ ఇరానీ హోటల్లో విక్రం, శశాంక్‌లు తమ మిత్రులతో కబుర్లు చెప్పుకొంటూ చాయ్ తాగుతున్నారు. పాత హిందీ పాటలు స్పీకర్లో మంద్రంగా వినిపిస్తున్నాయి. నోర్ముయ్ బద్మాష్ అన్న కేకతో హోటల్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందరూ ఉలిక్కిపడి ఒక్కసారిగా ఆ కేకలు వినిపించినవైపు చూశారు.
వాళ్లు నలుగురు కుర్రాళ్లు, దగ్గర్లోనే ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులని అర్థమైపోయింది వారిని చూడగానే. అప్పటిదాకా చక్కగా కబుర్లు చెప్పుకుంటున్న వాళ్లు ఏదో విషయం గురించి చర్చలోకి దిగి చర్చ కాస్త రచ్చగా మారేలా ఉద్రేకపడుతున్నారు. నలుగురు గట్టిగానే మాట్లాడుతూ పిడికిళ్లు బిగించి, కళ్లెర్ర చేసుకుని రొప్పుతూ బల్లపై గుద్దుతూ, అడ్డూఅదుపులేకుండా అసభ్యంగా తిట్టుకుంటూ క్షణాల్లో రణరంగంగా మార్చేశారు వాతావరణాన్ని.
బిల్లు చెల్లించి నిశ్శబ్దంగా బయటకు వచ్చేశారు విక్రం, శశాంక్. వాళ్లలో ఒకడు మా కాలనీవాడే సార్. అసలెంత నెమ్మదస్తుడనుకున్నారు. పెద్దలందరి పట్ల గౌరవంగా ఉంటూ చాలా మంచివాడని అనిపించుకుంటూ ఉంటాడు. ఇవ్వాళ వాడిని చూసి చాలా ఆశ్చర్యం కలిగింది అని చెప్పాడు విక్రం. మంచి పాయింట్ పట్టావు విక్రం. హెచ్చార్ రౌండ్స్‌లో ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో భాగంగా గ్రూప్ డిస్కషన్‌ని ఒక భాగంగా చేయటంలో అంతరార్థం ఇదే అని శశాంక్ చెప్పాడు. కాస్త వివరంగా చెప్పండి సార్.
గ్రూప్ డిస్కషన్లో పాల్గొన్నావు కదా! నీవు అక్కడ గమనించిన అంశాలు చెప్పు ఒకసారి శశాంక్ అడిగాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా మన కాలేజీలో కొన్ని కంపెనీల ఇంటర్వ్యూలకు నేను అటెండ్ అయ్యాను కదా సర్. అప్పుడు గ్రూప్ డిస్కషన్లో నేను పాల్గొన్నాను. ఈ గ్రూప్ డిస్కషన్లో రౌండ్‌ని పొడి అక్షరాల్లో జీడీ అని అంటారు మా ఫ్రెండ్సంతా. ఇందులో మేం ఓ పది, పదిహేను మంది వృత్తాకారంలో కూర్చుని, కంపెనీ హెచ్చార్ మాకు ఇచ్చిన టాపిక్ గురించి ఓ పదిహేను, ఇరవై నిమిషాలు మాట్లాడుకుని, టైమప్ అని వారు ప్రకటించగానే చర్చ ముగించి బయటకు వచ్చేశాం.
ఇంటర్వ్యూలో భాగంగా అనేక రౌండ్స్ ఉంటాయి. ప్రతి రౌండ్‌కి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అది అర్థం చేసుకోగలిగితే సునాయాసంగా విజయం మన సొంతమవుతుంది.
గ్రూప్ డిస్కషన్ అనగానే చాలామంది తమ తెలివితేటలు బయటపెట్టుకోవటానికో, తమ వాదనాపటిమను తెలపటానికో ఓ వేదిక దొరికిందని భావిస్తారు. కానీ అది శుద్ధ తప్పు.
నలుగురిలో ఒక అభ్యర్థి ప్రవర్తన ఎలా ఉంటుందన్నది తెలుసుకోవటం హెచ్చార్ మేనేజర్ ముఖ్య ఉద్దేశం. ఇందాక ఇరానీ హోటల్లో నీవు చెప్పిన మంచి కుర్రాడి ప్రవర్తన చూశాం కదా! పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. పర్సోనా అంటే ముసుగు అని అర్థం. అంటే సమాజంలో మనుషులందరూ సభ్యతాసంస్కారాలు పాటిస్తూ మంచి మాటలు మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తూ జీవిస్తూ ఉంటారు.
పెరిగిన వాతావరణం, చదివిన పుస్తకాలు, వారు పొందిన శిక్షణలు ఇలాంటి అంశాలు వారి బయటి ప్రవర్తనను నిర్దేశిస్తాయి. అంటే అందరూ మంచివారిలాగే ప్రవర్తిస్తూ కనిపిస్తారు. కానీ ప్రతి మనిషి మంచి, చెడు అనే రెండు భావాల్నీ కలిగి ఉంటాడు.
మై ఎక్స్పర్మెంట్స్ విత్ ట్రూత్ అనే పేరుతో విడుదలైన మహాత్మాగాంధీ ఆత్మకథ చదివితే గాంధీ కూడా దీనికి మినహాయింపు కాదని తెలుస్తుంది. ఇక అభ్యర్థి సంస్థలోకి తీసుకున్న తరువాత అతను తప్పనిసరిగా టీం సభ్యుడిగా మెలగాలి. బృందంతో కలిసి మెలిసి ప్రవర్తించాలి. ఇచ్చిపుచ్చుకునే రాజీ ధోరణి కలిగి ఉండాలి. తన బృందం తనకు ముఖ్యం అనే ఆలోచనా ధోరణి కలిగి ఉండాలి. ఎవర్నీ నొప్పించకూడదు. ఇలాంటి లక్షణాలున్న వ్యక్తులను వెదికి పట్టుకోవటమే హెచ్చార్ మేనేజర్ ముందున్న పెద్ద చాలెంజ్. ఇందుకు సంబంధించి జీడీ హెచ్ఆర్ టీంకి ఒక అవకాశం కల్పిస్తాడు. అభ్యర్థిలో సానుకూల ధోరణులు, బృంద సభ్యుడిగా మెలగటానికి అవసరమైన లక్షణాలు ఉన్నాయా లేవా అన్నది జీడీలో అభ్యర్థి ప్రవర్తన ద్వారా సులభంగా తెలిసిపోతుంది.
అంతా అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ మంచిగానే ప్రవర్తిస్తారు. వారి భావాల్ని ఎవరైనా తప్పు పట్టినప్పుడో, వారితో విభేదించినప్పుడో వారి అసలు స్వభావం బయటపడుతుంది. అందుకే గ్రూప్ డిస్కషన్లో వీలైనంత వరకు భావతీవ్రతకు అవకాశమున్న టాపిక్లని చర్చకి ముందుకు తెస్తారు హెచ్చార్ మేనేజర్లు. దీనివల్ల ఒక అభ్యర్థి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో తెలుస్తుంది. సాధారణంగా అభ్యర్థులని మూడు రకాలుగా విభజించవచ్చు.
1) Aggressive (దూకుడు, నిర్లక్ష్యంగలవారు)
2) Submissive (ఓటమిని అంగీకరించి ఒత్తిడికి గురయ్యేవారు)
3) Assertive (అందర్నీ కలుపుకొనిపోతూ, ఎవర్నీ నొప్పించకుండా ఎదుటివారి తప్పుల్ని సైతం కన్విన్సింగ్‌గా చెప్పి ఒప్పిస్తూ, విజేతగా నిలిచే ధోరణి)
నాయకత్వ లక్షణాలు కలిగిన అసర్టివ్ క్యాండిటేట్లను గ్రూప్ డిస్కషన్ ద్వారా సునాయాసంగా గుర్తించవచ్చు. కాబట్టి గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటున్నప్పుడు అనవసర కోపతాపాలకు గురవకుండా, హుందాగా ఒక పరిష్కర్తలాగా వ్యవహరించే ధోరణి అలవర్చుకోవాలి.
గ్రూప్ డిస్కషన్లో మీ ప్రవర్తన ద్వారా నాయకత్వ లక్షణాలు, అసర్టివ్ నేచర్, సమాజంలో ఎలా ప్రవర్తిస్తారు, వ్యక్తిత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివన్నీ తెలుస్తాయి.
కాబట్టి జీడీ అనే రౌండ్‌లోని నాయకుడిని హెచ్చార్ టీంకి పరిచయం చేయండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?