Local self-government | స్థానిక స్వపరిపాలన
-ప్రకరణ 243D(1) ప్రకారం ప్రతి పంచాయతీలోను షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్ తెగలవారికి సీట్ల రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి జనాభాను బట్టి సీట్ల రిజర్వేషన్ ఆధారపడి ఉంటుంది. రిజర్వేషన్ స్థానాల కేటాయింపు రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది.
-ప్రకరణ 243D(2) ప్రకారం రిజర్వ్ అయిన సీట్లలో కనీసం 1/3వ వంతు షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందిన మహిళలకు రిజర్వ్ చేయాలి.
-ప్రకరణ 243D(3) ప్రకారం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ అయ్యే సీట్లలో కనీసం 1/3వ వంతు (షెడ్యూల్డ్ కులాలు, తెగల మహిళలకు కేటాయించిన సీట్లతో కలుపుకొని) మహిళలకు కేటాయించాలి. ఇది రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది.
-ప్రకరణ 243D(4) ప్రకారం గ్రామ పంచాయతీ (సర్పంచ్), మాధ్యమిక పంచాయతీ, జిల్లా స్థాయి పంచాయతీ అధ్యక్ష పదవుల్లో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలకు కేటాయించాల్సిన సీట్లను శాసనసభ నిర్ధారించాలి. ఇది ఆ గ్రామ పంచాయతీ, మాధ్యమిక పంచాయతీ, జిల్లా పంచాయతీల్లో వారి జనాభాకు, రాష్ట్రంలో వారి జనాభాకు తగిన నిష్పత్తిలో ఉండాలి.
-ప్రకరణ 243D(5) ప్రకారం వివిధ పంచాయతీల అధ్యక్షులకు గల రిజర్వేషన్లు (స్త్రీల రిజర్వేషన్లు మినహాయించి) 334వ ప్రకకరణలో పేర్కొన్నంతకాలం కొనసాగుతాయి.
-ప్రకరణ 243D(6) ప్రకారం వెనుకబడిన తరగతులవారికి పంచాయతీల్లోను, గ్రామపంచాయతీల అధ్యక్షుల, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల విషయంలోను కొన్ని స్థానాలను శాసనసభ రిజర్వ్ చేయవచ్చు. మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించడం, రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనే సూత్రానికి వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు అబ్దుల్ అజీజ్ అసాద్ వర్సెస్ ఏపీ కేసులో పేర్కొంది.
-ప్రకరణ 243E పంచాయతీల కాలపరిమితిని తెలుపుతుంది.
-ప్రకరణ 243E(1) ప్రకారం మొదటి సమావేశం ప్రారంభమైన తేదీ నుంచి పంచాయతీ కాలపరిమితి ఐదేండ్లు. మరేదైనా శాసనం కింద కాలపరిమితి ముగియకముందే పంచాయతీ రద్దయితే ఆ నిబంధన వర్తించదు.
-ప్రకరణ 243E(2) ప్రకారం ఏదైనా చట్టంలో చేసే మార్పు పంచాయతీల రద్దును గురించిందైతే ఆ మార్పు, అమల్లో ఉన్న పంచాయతీలకు వాటి కాలపరిమితి తీరేలోపల వర్తించదు.
-ప్రకరణ 243E(3)(a) ప్రకారం ఐదేండ్ల కాలపరిమితి ముగియడానికిముందే ఎన్నికలు జరిగి నూతన పంచాయతీ తప్పనిసరిగా ఏర్పాటు కావాలి.
-ప్రకరణ 243E(3)(b) ప్రకారం పంచాయతీ రద్దయితే, రద్దయిన 6 నెలల్లోపు నూతన పంచాయతీ ఎన్నికలు పూర్తికావాలి. పంచాయతీ కాలపరిమితి ముగియడానికి 6 నెలలకన్న తక్కువ వ్యవధి ఉన్నప్పుడు ఒక పంచాయతీ రద్దయితే ఆ పంచాయతీ కోసం ప్రత్యేకంగా ఎన్నిక జరపాల్సిన అవసరంలేదు.
-ప్రకరణ 243E(4) ప్రకారం ఐదేండ్ల కాలపరిమితి ముగియడానికి ముందే ఒక పంచాయతీ రద్దయి, నూతన పంచాయతీ ఏర్పడినప్పుడు, ఐదేండ్ల కాలపరిమితిలో మిగిలిఉన్న వ్యవధి వరకు మాత్రమే ఆ నూతన పంచాయతీ కొనసాగుతుంది.
-ప్రకరణ 243F పంచాయతీ సభ్యుల అనర్హతలను తెలుపుతుంది.
-ప్రకరణ 243F(1) ప్రకారం ఏదైనా చట్టం కింద రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి అనర్హులుగా ప్రకటించిన వ్యక్తులకు, రాష్ట్ర శాసనసభ రూపొందించే శాసనం కింద పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనర్హులుగా ప్రకటించిన వ్యక్తులకు పంచాయతీ సభ్యుడిగా పోటీచేసే హక్కుగాని, పంచాయతీ సభ్యుడిగా కొనసాగే అర్హతగాని ఉండదు.
-ప్రకరణ 243F(2) ప్రకారం ఒక పంచాయతీ సభ్యుడు ఆ పదవిలో కొనసాగడానికి అర్హుడా, కాదా అన్న అంశం వివాదాస్పదమైనప్పుడు, ఆ అంశాన్ని శాసనసభ ఏర్పర్చే అథారిటీ నిర్ణయానికి పంపాలి. శాసనసభకు పోటీ చేయడానికి 25 ఏండ్లు. అయితే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 21 ఏండ్లు ఉండాలి.
-ప్రకరణ 243G పంచాయతీల అధికారాలు, హక్కులు, బాధ్యతలను తెలుపుతుంది. రాజ్యాంగ పరిధికిలోబడి పంచాయతీల అధికారాలు, హక్కులను నిర్ధారిస్తూ రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేక శాసనాలను రూపొందించాలి. స్థానిక స్వపరిపాలనా సంస్థలుగా పంచాయతీలు మనుగడ సాగించడానికి అవసరమైన అధికారాలను వాటికి రాష్ట్రప్రభుత్వాలు బదలాయించాలి. ఆ క్రమంలో కింద ఇచ్చిన అంశాలకు సంబంధించి కొన్ని షరతులను విధించవచ్చు. అవి..
1.ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయానికి సంబంధించిన పథకాలను రూపొందించడం.
2.XIవ షెడ్యూల్ ద్వారా పంచాయతీలకు సంక్రమించిన అంశాలతో సహా, పంచాయతీలకు అప్పగించిన ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయానికి సంబంధించిన పథకాలను అమలుచేయడం.
-ప్రకరణ 243H పన్నులు, నిధులను తెలుపుతుంది.
1.రాష్ట్ర శాసనసభ శాసనం ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి పన్నులు విధించి, వసూలు చేసే అధికారాన్ని పంచాయతీలకు బదలాయించవచ్చు.
2.రాష్ట్రప్రభుత్వం వసూలు చేసిన కొన్ని పన్నులను పంచాయతీలకు జమచేయవచ్చు.
3.రాష్ట్రప్రభుత్వ సంఘటిత నిధి నుంచి కొంతభాగాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో పంచాయతీలకు ఇవ్వవచ్చు.
4.పంచాయతీలకు సంబంధించిన నిధులను జమచేయడానికి, ఆ సొమ్మును ఖర్చు చేయడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయవచ్చు.
రాష్ట్ర ఆర్థిక సంఘం
-ప్రకరణ 243I పంచాయతీల ఆర్థికస్థితి సమీక్ష కోసం రాష్ట్ర ఆర్థిక కమిషన్ ఏర్పాటును తెలుపుతుంది.
-ప్రకరణ 243I(1) ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 అమల్లోకి వచ్చిన ఏడాదిలోపల ఒకసారి, ఆ తర్వాత ప్రతి ఐదేండ్లకోసారి రాష్ట్ర గవర్నర్లు ఆయా రాష్ట్ర పంచాయతీలకు సంబంధించి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటుచేయాలి. పంచాయతీల ఆర్థిక పరిస్థితిని ఆ సంఘం సమీక్షించాలి.
-ప్రకరణ 243I(2) ప్రకారం ఆర్థికసంఘం నిర్మాణం, సంఘ సభ్యుల నియామకం, వారి అర్హతలు మొదలైనవాటికి సంబంధించి రాష్ట్ర శాసనసభ శాసనం చేయవచ్చు.
-ప్రకరణ 243I(3) ప్రకారం తమ పని విధానానికి సంబంధించిన నియమాలను కమిషన్ రూపొందించుకుంటుంది. కమిషన్ విధుల నిర్వహణకు అవసరమైన అధికారాలను శాసనసభ చట్టపూర్వకంగా సంక్రమింపజేస్తుంది. ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్‌కు సమర్పిస్తుంది.
-ప్రకరణ 243I(4) ప్రకారం కమిషన్ సూచనలను, వాటిపై ప్రభుత్వం తీసుకునే చర్యలతోకూడిన వివరణాత్మక మెమోరాండాన్ని గవర్నర్ శాసనసభకు సమర్పించాలి.
-ప్రకరణ 243J పంచాయతీల ఖాతాల ఆడిటింగ్‌ను తెలుపుతుంది. పంచాయతీల ఖాతాల నిర్వహణ, వాటి ఆడిటింగ్‌కు సంబంధించి తగిన శాసనాన్ని శాసనసభ చేయాలి.
-ప్రకరణ 243K పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత.
-ప్రకరణ 243K(1) ప్రకారం పంచాయతీలకు చెందిన ఓటర్ల జాబితాను తయారుచేయడం, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ మొదలైన అధికారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కలిగి ఉంటుంది. ఆ ఎన్నికల సంఘానికి కమిషనర్‌ను గవర్నర్ నియమిస్తారు.
-ప్రకరణ 243K(2) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కాలపరిమితి, ఉద్యోగ నిబంధనలను రాష్ట్ర శాసనసభ చేసిన చట్టంలోని నిబంధనలకు లోబడి గవర్నర్ నిర్ధారిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?