Kakatiyas – Religion | కాకతీయులు – మతం
జైనమతం
-కాకతీయుల్లో మొదటితరానికి చెందిన చాలామంది పాలకులు జైనమతాన్ని ఆచరించి ఆదరించారు. వైదిక మతాభిమానులైన తూర్పు చాళుక్యుల రాజ్యంలో నిరాదరణకు గురైన జైనులకు అనుమకొండ ఆశ్రయంగా మారింది. వృషభనాథుడిని తూర్పుచాళుక్య రాజైన రాజరాజనరేంద్రుడు హింసించగా ఆ జైన సన్యాసి అనుమకొండకు వచ్చి ఆశ్రయం పొందాడని ఓరుగల్లు కైఫియత్ తెలుపుతున్నది. ప్రోలరాజు అనుమకొండ శాసనం జినేంద్ర ప్రార్థనతో ఆరంభమైంది. చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మొదటి బేతరాజు దానాలిచ్చినట్లు శనిగరం శాసనం పేర్కొంది. కాకతీయ రెండో బేతరాజు జైన బసదికి దానం చేశాడని తెలుస్తుంది.
-క్రీ.శ. 1114 నాటి రెండో ప్రోలరాజు వేయించిన వరంగల్ పద్మాక్షి ఆలయ శాసనం కదలరాయ జైన బసది నిర్మాణానికి అతని భార్య మైలమ దానం చేసినట్లు పేర్కొంటుంది. జైన కవి అప్పయార్యుడు ప్రతాపరుద్రుడికాలంలో జినేంద్ర కల్యాణాభ్యుదయం అనే రచన చేశాడు. అంతేకాకుండా విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో చెప్పినట్లు ప్రతాపరుద్రుని కాలం వరకు ఉన్న వారి గరుడ ధ్వజంలోని గరుడ చిహ్నం వారి వైష్ణవ మతావలంబనకు ప్రామాణికం కాదు. దీనికి తగిన సాక్ష్యాలు లేవు. ఈ గరుడ చిహ్నం 16వ తీర్థంకరుడైన శాంతినాథుని చిహ్నం కావచ్చు. అయితే క్రమంగా జైనం, బౌద్ధం స్థానిక ప్రజల అభిమానం కోల్పోయి శైవం, వైష్ణవం ప్రజలకు, రాజులకు సన్నిహితమయ్యాయి.
శైవమతం
-శైవమతం కాకతీయుల ఆదరణ పొందింది. వీరికాలంలో శైవంలో కాలాముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్యశైవ, వీరశైవం మొదలైన ఉపశాఖలు ఉండేవి. తొలి కాకతీయులు కాలాముఖ శైవశాఖను ఆచరించి ఆదరించారు. అనుమకొండ శాసనం.. రెండో బేతరాజు శ్రీశైలంలోని మల్లికార్జున శిలామఠం అధిపతి అయిన రామేశ్వర పండితుడి శిష్యుడని పేర్కొంది. బేతరాజు ఇతనికి వైజనపల్లి (శివపురం) గ్రామాన్ని దానం ఇచ్చాడు. రామేశ్వర పండితుడు లకులేశ్వర ఆగమ మహాసిద్ధాంతంలో పండితుడు. ఇతడు బేతరాజు కుమారులైన దుర్గరాజు, రెండో ప్రోలరాజులకు కాలాముఖ శివదీక్ష ఇచ్చాడు. కర్ణాటకలోని కాలాముఖ శైవ శాఖకు చెందిన శైవులు కూడా శ్రీశైలాన్నే తమ కేంద్రంగా, రామేశ్వర పండితుడినే తమ గురువుగా గుర్తించడం శ్రీశైలం ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది.
-లకులేశ్వరుడు లేదా నకులేశ్వరుడు కాలాముఖ శైవ సిద్ధాంత స్థాపకుడు రామేశ్వర పండితుడే తీరాంధ్రలోని ద్రాక్షారామం ఆలయానికి స్థానపతి అని ఆధారాలు తెలియజేస్తున్నాయి. కాకతీయ రాజులు కాలాముఖ శైవ గురువులతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పుకున్నారు. నేటి మహబూబ్నగర్ జిల్లాలోని తుంగభద్ర నదీ తీరంలో గల అలంపురం ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. అక్కడి బ్రహ్మేశ్వరాలయ మహాస్థానాధిపతులు గొప్ప ధార్మిక గురువులు, పండితులు. అలంపూర్ సమీపంలో ఉన్న అగస్త్యేశ్వరం కాలాముఖ శైవ సన్యాసులకు మరొక ముఖ్య కేంద్రం. వేములవాడ కాకతీయుల కాలంలో తెలంగాణ ప్రాంతంలో గొప్ప శైవక్షేత్రం. దానికి కళ్యాణి చాళుక్యుల కాలం నుంచే రాజాదరణ లభించింది. రెండో ప్రోలరాజు గురువైన రామేశ్వర పండితుడు కాళేశ్వరంలో స్థిరపడ్డాడు. ఇతడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠ చేశాడు. కాకతీయుల కాలంలో తెలంగాణలో ధర్మపురి, అనుమకొండ, ఐనవోలు, పానగల్లు, నిజామాబాద్, నందికంది, శనిగరం గొప్ప కాలాముఖ శైవ క్షేత్రాలు. రాయలసీమలో పుష్పగిరి గొప్ప కాలాముఖ శైవక్షేత్రం. తీరాంధ్రలో అమరావతి, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ భీమేశ్వరాలయాలు గొప్ప కాలాముఖ శైవక్షేత్రాలు.
-కాకతీయుల కాలంనాటి రెండో ప్రముఖ శైవశాఖ పాశుపతులు లేదా శైవ సిద్ధాంతులు. ఆగమాలు ఈ శాఖ వారికి ఆధారాలు. యోగనిష్ఠ అనుసరించే ఈ శాఖ అనుచరులకు శివాలయాలు అనుబంధంగా ఉండేవి. అయితే, కాలాముఖ శైవ సన్యాసుల పేర్లు శివ, శంభు, పండిత, రుషి పదాలతో అంతమవుతాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ చుట్టూ విస్తరించిన కాలాచూరి రాజ్యం శైవసిద్ధాంత సంప్రదాయానికి కేంద్ర స్థానంగా వెలుగొందింది. క్రీ.శ. 13వ శతాబ్దం నాటికి కాలాచూరి రాజ్యంలో ఏర్పడిన రాజకీయ అశాంతి, అస్థిరతల వల్ల కాలాచూరి రాజ్యంలోని శైవ గురువులు ఆంధ్రదేశానికి వలస వచ్చారు.
-విశ్వేశ్వర శివదేశికుడు కాకతీయ గణపతి దేవుని గురువు. ఇతనికి భారీ సంఖ్యలో అనుచరులు ఉన్నారని అమెరికన్ చరిత్రకారిణి సింథియాటాల్ బోట్ అభిప్రాయపడింది. గణపతి దేవుని కాలం నాటికి కాకతీయుల ఆధీనంలో ఉన్న త్రిపురాంతకం, భట్టిప్రోలు, ఏలేశ్వరం, మంథని, మందరం, కాళేశ్వరం, మల్కాపురం, సోమశిలలో విశ్వేశ్వర శివదేశికుడు శైవగోళకీ మఠాలను స్థాపించాడు. రాజగురువు స్థానం పొందాడు. ఇతడే గణపతిదేవునికి, అతని కుమార్తె రుద్రమదేవికి రాజగురువు. రుద్రమదేవి వేయించిన క్రీ.శ. 1261 నాటి మల్కాపురం శాసనం ప్రకారం.. రుద్రమ తన తండ్రి కోరిక మేరకు విశ్వేశ్వర శంభుకు వెలనాటి విషయంలో కృష్ణా తీరాన మందరం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చింది. ఈ గ్రామంలో విశ్వేశ్వర శివదేశికుడు ఒక శుద్ధ శైవ మఠాన్ని, అన్నదాన సత్రాన్ని, శివాలయాన్ని నిర్మించాడు. ఇదే ప్రసిద్ధ గోళకీమఠంగా పేరుపొందింది. గోళకీమఠానికి చెందిన శివాచార్యులను శాసనాల్లో గోళకీవంశంవారిగా, భిక్షా మఠ సంతానంగా వర్ణించారు. మందరం గ్రామంలో అనేక మంది బ్రాహ్మణులకు నివాసం ఏర్పాటు చేశాడు. దీన్నే విశ్వేశ్వర గోళకీమఠం అంటారు. ఇక్కడ విద్యార్థులకు వేదాలు బోధించడానికి ముగ్గురు గురువులు, తర్కాన్ని, సాహిత్యాన్ని, ఆగమాలను బోధించడానికి ఐదుగురు గురువులు ఉండేవారని, ఇక్కడ విద్యార్థులు, గురువులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పించారని, ఈ మఠంలో ఒక ప్రసూతి వైద్యశాల ఉన్నట్లు శాసనాలు తెలుపుతున్నాయి.
-సామాన్య ప్రజలు, రాజ కుటుంబీకులు ఈ గోళకీమఠాధిపతుల బోధనలతో విశేషంగా ప్రభావితులయ్యారు. శ్రీశైలంలో ఈ కాలంలో అభినవ గోళకీమఠం ఉండేది. దాని నిర్వహణ కోసం కాయస్థ జన్నిగదేవుడు కొన్ని దానాలు చేశాడు. విశ్వేశ్వర శంభు కాళేశ్వరంలో ఒక శివాలయాన్ని, ఉప మఠాన్ని స్థాపించాడు. కాకతీయుల కాలంలో గోళకీ మఠాల శాఖలను పుష్పగిరి, శ్రీపర్వతం, త్రిపురాంతకం, అలంపురం, ద్రాక్షారామం, భట్టిప్రోలు మొదలైన చోట్ల నెలకొల్పారు. వీటి అధిపతులంతా శైవ ఆచార్యులే. రెండో ప్రతాపరుద్రుని పాలన చివరి దశ వరకు ఈ గోళకీమఠాలు ఉజ్వల దశను అనుభవించాయి. కాకతీయుల పతనానంతరం గోళకీమఠాల ప్రాబల్యం క్షీణించి శ్రీశైలం, దాని ద్వార క్షేత్రాలు, ఉమామహేశ్వరం, అలంపురం, త్రిపురాంతకం, పుష్పగిరి రాజాదారణ, ప్రజాదరణ పొందాయి.
వైష్ణవం
-కాకతీయులు వారి రాజ్యంలోని ప్రజలకు పూర్తి మత స్వేచ్ఛ ఇచ్చారు. వారి ముద్రలు, నాణేల మీద వరాహలాంఛనం, వారు నిర్మించిన త్రికూట ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠ వారి పరమత సహనాన్ని తెలియజేస్తుంది. రుద్రదేవుడు తాను నిర్మించిన రుద్రేశ్వరాలయంలో వాసుదేవుని విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అతని మంత్రి వెల్లంకి గంగాధరుడు అనుమకొండలో ప్రసన్న కేశవ ఆలయాన్ని నిర్మించాడు. గణపతిదేవుని సోదరి రాణి మైలాంబ ఇనుగుర్తిలో గోపాలకృష్ణుని గుడి కట్టించి, దాని నిర్వహణ కోసం దానాలు చేసింది. రెండో ప్రతాపరుద్రుని సేనాని దేవరి నాయకుడు. తన రాజు ఆజ్ఞ మేరకు కావేరి తీరంలో శ్రీరంగనాథస్వామి ఆలయానికి సకలవీడు గ్రామాన్ని దానం చేశాడు. రెండో ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1321లో చెన్నకేశస్వామికి కొన్ని దానాలు చేశాడని శాసనాలు పేర్కొంటున్నాయి. ఇతని దేవేరి లక్ష్మీదేవి కరీంనగర్ ఎల్గేడులోని రామనాథ దేవుని గుడికి కొన్ని కానుకలు సమర్పించింది. కాకతీయుల కాలంలో సింహాచలం, మాచెర్ల, అహోబిలం, ధర్మపురి, తిరుపతి, శ్రీకూర్మం, మంగళగిరి, పొన్నూరు, నెల్లూరు, నందలూరు, కొప్పారం, కారెంపూడి, కొండపాక మొదలైన చోట్ల అనేక విష్ణుమూర్తి ఆలయాలు నిర్మించారు.
కాకతీయుల కాలంనాటి భాష, సాహిత్యాలు
-కాకతీయ రాజులు, వారి మంత్రులు, అధికారులు, సంస్కృత, తెలుగు భాషల వికాసానికి కృషి చేశారు. వీరి కాలంనాటి శాసనాల్లో విద్యాసంస్థలు, పండితుల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. క్రీ.శ. 1261 నాటి మార్కాపురం శాసనం వీరికాలం నాటి విద్యామండపాల స్థితిని, కార్యకలాపాలను తెలియజేస్తుంది. విశ్వేశ్వర శివుడు నిర్మించిన గోళకీమఠంలోని విద్యా మండపంలో రుగ్వేదం, యజుర్వేదం, సామ, అధర్వణ వేదాలు, తర్క, సాహిత్యం మొదలైన అంశాలను బోధించేవారు. శ్రీశైలం, పుష్పగిరి ఇతర ముఖ్య విద్యామండపాల్లో సంస్కృతంలోనే ఎక్కువ భాగం బోధన జరిగేది. రెండో ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన విద్యానాథుడు గొప్ప సంస్కృత పండితుడు. ఇతని ప్రసిద్ధ రచన ప్రతాపరుద్రీయం లేదా ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ అలంకార రచనలో విద్యానాథుడు తన చక్రవర్తి రెండో ప్రతాపరుద్రుడిని ప్రస్తుతించాడు. కళింగ, పాండ్య, యాదవ రాజులపై సాధించిన విజయాలను పేర్కొన్నాడు. శాకల్యమల్లు కవి వీరి కాలానికి చెందిన మరొక గొప్పకవి. ఇతడి రచనలు ఉదాత్తరాఘవం, నిరోష్ఠ్య రామాయణం, రుద్రదేవుని ఉత్తరేశ్వర శాసనంలో పేర్కొన్న విద్దణాచార్యుని రచన ప్రమేయ చర్చామృతం.
-రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలోని సంస్కృత పండితుడైన గుండయభట్టు శ్రీహర్షుని ఖండన ఖండఖాద్యమనే అద్వైత గ్రంథానికి వ్యాఖ్య రాశాడు. గణపతిదేవుని గజసాహిని అయిన జాయప గొప్ప సంస్కృత పండితుడు. ఇతని ప్రసిద్ధ రచన నృత్యరత్నావళి. ఈ రచనలో నాడు ఆంధ్రదేశంలో వాడుకలో ఉన్న నృత్య, నాట్య రీతులను అద్భుతంగా వర్ణించాడు. దీనిలో మొత్తం ఎనిమిది ప్రకరణలు ఉన్నాయి. నేడు ఈ నృత్యరత్నావళి అనేక భాషలలోకి అనువాదమై నృత్య, నాట్య గురువులకు ప్రామాణిక గ్రంథమైంది. పాలంపేట రామప్పగుడి గోడలపై అణువణువునా గ్రంథంలోని రీతులు చెక్కారు. జాయపసేనాని సంగీతంపై గీతరత్నావళి, వాద్య పరికరాలపై వాద్యరత్నావళి అనే గ్రంథాలను రచించాడని కొందరు పేర్కొన్నారు. కానీ, ఇవి అందుబాటులో లేవు.
తెలుగు సాహిత్యం
-తెలుగు భాషా పరిణామదశ శాతవాహనుల కాలంనాటి గాథాసప్తశతిలో కొన్ని తెలుగు పదాల వాడుకతో ఆరంభమై తూర్పుచాళుక్యుల కాలంనాటికి పరిపూర్ణతను సంతరించుకుంది. కాకతీయుల కాలంలో తెలుగు భాష మాట్లాడే నేటి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలు ఐక్యం చేయబడ్డారు. ప్రజల భాషగా ప్రసిద్ధి చెందిన జానుతెలుగులతో శైవ, వైష్ణవ పండితులు రచనలు చేశారు. ఆనాటి శాసనాల్లో కూడా తెలుగు వాడారు. ఆనాటి ముఖ్య తెలుగు రచనలు తిక్కనసోమయాజి ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం, దశకుమారచరితం, శివదేవయ్య పురుషార్థసారం, అప్పయార్యుని జైనేంద్ర కల్యాణాభ్యుదయం, పాల్కురికి సోమనాథుని పండితారాధ్య చరితం, బసవపురాణం, బద్దెన రచించిన నీతిసార ముక్తావళి, సుమతీశతకం, గోన బుద్ధారెడ్డి రంగనాథరామాయణం, భాస్కరుని భాస్కర రామాయణం, మారన మార్కండేయ పురణాలు ముఖ్యమైన తెలుగు రచనలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?