Vice Presidential Election | ఉపరాష్ట్రపతి ఎన్నిక-రాజ్యాంగ ప్రక్రియ
రాజ్యాంగంలోని ఐదో భాగంలో ప్రకరణ 63 నుంచి 71 వరకు గల తొమ్మిది ప్రకరణలు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలుపుతున్నాయి. భారత ఉపరాష్ట్రపతిని అమెరికా ఉపాధ్యక్ష పదవితో పోల్చవచ్చు. ఈ పదవిని అమెరికా దేశం నుంచి గ్రహించారు.
-ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటుచేయాలని రాజ్యాంగ పరిషత్లో హెచ్వీ కామత్ ప్రతిపాదించించారు.
-ప్రకరణ 63 భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడని తెలుపుతుంది.
-ప్రకరణ 64 ప్రకారం భారత ఉపరాష్ట్రపతి పదవిరీత్యా రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. ఆ పదవి తప్ప ఉపరాష్ట్రపతి మరే ఇతర లాభదాయక పదవులను కలిగి ఉండరాదు.
గమనిక: 65వ ప్రకరణ ప్రకారం కొన్ని పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తున్నప్పుడు రాజ్యసభ చైర్మన్ విధులను నిర్వర్తించరాదు. 97వ ప్రకరణ కింద రాజ్యసభ చైర్మన్గా లభించే జీతభత్యాలను పొందరాదు.
-ప్రకరణ 65 ప్రకారం కింది పరిస్థితుల్లో రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తాడు.
-ప్రకరణ 65(1) ప్రకారం రాష్ట్రపతి మరణించినప్పుడు లేదా రాజీనామా చేసినప్పుడు లేదా రాష్ట్రపతిని అభిశంసించినప్పుడు, రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరిగి కొత్త రాష్ట్రపతి అధికార విధులను చేపట్టే వరకు రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు.
-ప్రకరణ 65(2) ప్రకారం అనారోగ్యం వల్ల గాని, విదేశాలకు వెళ్లడం గాని, వ్యక్తిగత కారణాల వల్లగాని రాష్ట్రపతి తన విధులకు హాజరు కాలేనప్పుడు, ఆయన తిరిగి విధులకు హాజరయ్యే వరకు రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు.
-ప్రకరణ 65(3) ప్రకారం రాష్ట్రపతి అధికారాలను ఉపరాష్ట్రపతి నిర్వహించే కాలంలో రాష్ట్రపతికి గల అధికారాలు, సౌకర్యాలు ఉపరాష్ట్రపతి పొందుతాడు. ఈ కాలంలో ఉపరాష్ట్రపతికి చెల్లించాల్సిన జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అంతవరకు రెండో షెడ్యూల్లో పేర్కొన్న జీతభత్యాలు, సౌకర్యాలు ఉపరాష్ట్రపతికి చెల్లించాలి.
-ప్రకరణ 66 ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానం తెలుపుతుంది.
-66 (1) ప్రకారం పార్లమెంట్ ఉభయసభల సభ్యుల (నామినేటెడ్ సభ్యులతో సహా)తో ఏర్పడిన ఒక ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు నైష్పత్తిక విధానంలో ఏక బదిలీ ఓటు ద్వారా రహస్య ఓటింగ్ విధానంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
గమనిక: రాష్ట్ర శాసనసభ్యులకు ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొని ఓటు వేసే అవకాశం లేదు.
-66(2) ప్రకారం ఉపరాష్ట్రపతి అభ్యర్థి పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభల్లో సభ్యుడై ఉండరాదు. ఒకవేళ పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభల్లో సభ్యుడై ఉండి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనట్లయితే, ఆ విధంగా ఎన్నికైన మరుక్షణమే అతని పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది.
-66(3) ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలను తెలియజేస్తుంది.
-66(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా స్థానిక సంస్థల్లో
ప్రభుత్వ ఉద్యోగి లేదా ఏదైనా అథారిటీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయకూడదు. ఒకవేళ పోటీ చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేయాలి.
గమనిక: 1961 వరకు పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగేది. 11వ రాజ్యాంగ సవరణ (1961) ద్వారా 66(1) ప్రకరణను మార్చి పార్లమెంట్ ఉభయసభల సభ్యులతో కూడిన ఒక ఎలక్టోరల్ కాలేజీ అని సవరించారు. 11వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికను ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలు ఉన్నాయనే కారణంతో ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి రాష్ట్రపతి నోటీస్ జారీ చేశాక ఎలెక్షన్ కమిషన్ ఉపరాష్ట్రపతి ఎన్నికను జరుపుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ పద్ధతిలో వ్యవహరిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?