Higher education .. Is it a way of employment | ఉన్నత చదువా.. ఉపాధి మార్గమా..
విద్యార్థి జీవితాన్ని మలుపుతిప్పే మార్గం ఇది.. అభిరుచుల ప్రకారం చదవాలా? అవకాశాలకనుగుణంగా చదవాలా? నలుగురు నడిచేదారిలో వెళ్లాలా? మనకంటూ ఒక దారి ఏర్పర్చుకోవాలా? అని ఆలోచిస్తుంటారు విద్యార్థులు.. ఇలాంటి సందిగ్ధ సమయంలో సరైన సమాచారం ఉంటే సరైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు.. అందుకే ఇంటర్ తరువాత ఉన్న వివిధ కోర్సుల వివరాలను నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నాం..
ఏయే కోర్సులున్నాయి
-దాదాపు చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్, మెడికల్ కోర్సులపైనే దృష్టిసారిస్తారు. వీటితోపాటు కామర్స్, లా, ఆర్ట్స్ వంటి కోర్సులనూ రాష్ట్రంలోని యూనివర్సిటీలతో పాటు ఇతర రాష్ర్టాల్లోని యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
-ఇంటర్ తరువాత విద్యార్థులకు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి. ఈ రెండింట్లో ఏది అవసరమో ఎంచుకునేందుకు వివిధ రకాల కారణాలు దోహదం చేస్తాయి. త్వరగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేనివాళ్లు ఉన్నతవిద్యవైపు దృష్టిసారిస్తారు. ఉన్నతవిద్యకు ఎన్ని రకాల అవకాశాలున్నాయో తెలుసుకుంటే అభిరుచి మేరకు అడుగు ఎటు వేయాలో అర్థమవుతుంది.
వైద్యరంగంలో అడుగుపెట్టాలనుకునేవారు
-ఇంటర్లో బైపీసీ తీసుకున్నవారు డాక్టర్, పశువైద్యాధికారిగా, వైద్య సంబంధ ఇతర వృత్తులు, ఉద్యోగాలవైపు వెళ్లొచ్చు.
-బైపీసీ చేసినవారికి బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, అగ్రికల్చర్ ఆక్వాకల్చర్, జెనెటిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్, ఆస్ట్రానమీ, బయోస్టాటిస్టిక్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జియాలజీ, ఫారెస్ట్ రేంజర్, హార్టికల్చర్, మాలిక్యులార్ బయాలజీ, హోంసైన్స్, ఓషనోగ్రఫీ, ప్లాంట్ పాథాలజీ వంటి కోర్సులను విద్యార్థి అభిరుచికనుగుణంగా ఎంచుకుంటే ఆయా రంగాల్లో అవకాశాలు చాలా ఉన్నాయి.
-ఎందుకంటే పరిశోధనారంగంలో బయోఇన్ఫర్మాటిక్స్, బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీలదే పైచేయి. వైద్యవిభాగంలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన AIIMS, MGIMS, AFMC, JIPMER, CMC, BHUలలో ప్రవేశం కోసం ఆయా సంస్థలు జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి.
-నీట్, రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్ ద్వారా వైద్యకళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్ఎంఎస్ (సిద్ధ), బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (ఫిషరీస్), బీఎస్సీ (ఫారెస్ట్రీ), బీవీఎస్సీ (వెటర్నరీ) వంటి కోర్సుల్లో చేరవచ్చు.
-మెడిసిన్ చేసిన తరువాత ఉన్నత విద్యలో రాణించాలంటే ఎండీ, ఎంఎస్, డీఎం, పీజీ ఇన్ ఫోరెన్సిక్ మెడిసిన్, ఏరోస్పేస్ మెడిసిన్, ఏవియేషన్ మెడిసిన్, సైకియాట్రి, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్ కోర్సులు ఉన్నాయి.
ఫార్మసీ
-ఇంటర్ ఎంపీసీ, బైపీసీ చేసినవారు ఫార్మసీ కోర్సులు చేయవచ్చు. ఎంసెట్ ద్వారానే బీ ఫార్మసీ చేయాలి. ఈ కోర్సు చేసినవారు ఫార్మాత కంపెనీల్లో ఉద్యోగం, సొంతంగా మెడికల్ షాపు పెట్టుకోవచ్చు.
వ్యవసాయ విద్య
-వ్యవసాయ విద్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దీనికి కూడా ఎంసెట్ రాయాలి. ఇందులో బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్‌సైన్స్), బీఎస్సీ (హోమ్‌సైన్స్) ఆనర్స్, బీఎస్సీ (ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్ వంటి నాలుగేండ్ల కోర్సులు ఉన్నాయి. హోమ్‌సైన్స్ కోర్సుకు వేరుగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఇందులోకి మహిళలను మాత్రమే తీసుకుంటారు.
ఇంజినీరింగ్
-ఒక దేశం పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి ఇంజినీర్లే కారకులు. అధునాతన భవనాల నిర్మాణంలో, భారీ ప్రాజెక్టుల రూపకల్పనలో ఇంజినీర్ల పాత్రే కీలకం. అందుకే ఇంజినీర్లకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది.
-ఇంటర్ తరువాత అధికశాతం విద్యార్థుల దృష్టి ఇంజినీరింగ్‌పైనే ఉంటుంది. ఇంజినీర్‌గా స్థిరపడాలనుకునేవారు తీసుకునే గ్రూపు ఎంపీసీ. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ఇండస్ట్రియల్ రంగాల్లో ఇంజినీరింగ్ చేసేందుకు ఎంపీసీనే పునాది. ఎంపీసీతో ఇంటర్ చదివినవారికి రాష్ట్రంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి.. అవి 1) ఎంసెట్, 2) బీఎస్సీ.
-ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేండ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు లభిస్తుంది. విద్యార్థి ర్యాంక్, అభిరుచికనుగుణంగా ఇంజినీరింగ్ కోర్సులో చేరవచ్చు.
-బీఎస్సీలో వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి. అవి.. మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్- ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డెయిరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్ ప్రధానమైనవి.
అభిరుచికి తగిన బ్రాంచితో భవిష్యత్తు
-ఇంజినీర్ అయ్యేందుకు జాతీయస్థాయిలో ఐఐటీ, నిట్, బిట్‌శాట్, రాష్ట్రస్థాయిలో జేఎన్టీయూ, ఇతర ప్రైవేట్ కాలేజీలు ఇంజినీరింగ్ బ్రాంచీలను నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రధానమైనవి..
1) సివిల్ ఇంజినీరింగ్, 2) ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
3) మెకానికల్ ఇంజినీరింగ్, 4) సీఎస్ఈ, ఐటీ
5) ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
-వీటి ఎంపికలో విద్యార్థి ఆసక్తి కీలకం. ఆ రంగంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉండాలి.
అకౌంటెంట్ రంగం
-ఇంటర్లో కామర్స్ (ఎంఈసీ, సీఈసీ) కోర్సులు తీసుకున్నవారు అకౌంటెంట్ రంగంలో స్థిరడవచ్చు. కామర్స్‌తో ఉన్నత చదువులు చదివినవారికి అవకాశాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంక్ మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు ఇన్సూరెన్స్ సంస్థల్లో, స్టాక్ మార్కెట్లలో ఉద్యోగాలు పొందవచ్చు.
-అంతేకాకుండా సీఏ, ఐసీడబ్ల్యూ, బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది.
న్యాయవాద రంగంలో
-లాయర్ కావాలనుకునేవారు లా కోర్సులు చేయాలి. సమాజంలో రోజురోజుకూ న్యాయవ్యవస్థకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు లా కోర్సులు అందిస్తున్నాయి.
-బీఏ ఎల్ఎల్బీ జనరల్, బీఏ ఎల్ఎల్బీ ఆనర్స్, బీకాం ఎల్ఎల్బీ జనరల్, బీకాం ఎల్ఎల్బీ ఆనర్స్, బీబీఏ ఎల్ఎల్బీ జనరల్, బీబీఏ ఎల్ఎల్బీ ఆనర్స్, బీఎస్సీ ఎల్ఎల్బీ జనరల్, బీఎస్సీ ఎల్ఎల్బీ ఆనర్స్. ఇవి ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు.
-లా యూనివర్సిటీలన్నీ కలిపి కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో లా సెట్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో చేరవచ్చు. ఉస్మానియా లా కాలేజీ, నల్సార్ యూనివర్సిటీ, దేశంలో నేషనల్ లా యూవర్సిటీ, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా వర్సిటీ, నిర్మా వర్సిటీ, కర్ణాటక స్టేట్ యూనివర్సిటీ వంటివి ప్రత్యేకంగా లా కోర్సులను అందిస్తున్నాయి. ఇందులోని ఐదేండ్ల కోర్సులన్నింటికీ ఇంటరే అర్హత.
ఇతర ఆధునిక కోర్సులు
-ఫ్యాషన్ టెక్నాలజీ: నేటి యువతను బాగా ఆకర్షిస్తున్న రంగం ఫ్యాషన్. దీనికి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వంటి పలు సంస్థలు బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ డిజైన్, బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైనింగ్, బీఏ ఇన్ టెక్స్టైల్ డిజైనింగ్ వంటి కోర్సులను అందిస్తుంది.
-జెమాలజీ: రత్నాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అసలైనవి గుర్తించడం, విలువ లెక్కకట్టడం వంటివి నేర్చుకోవాలి. పలు సంస్థలు జెమాలజీలో డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి.
-సముద్ర పరిశోధనలు: సముద్రాల అధ్యయనాన్ని ఓషనోగ్రఫీ అంటారు. ఈ ఓషనోగ్రఫీ కోర్సును ఐఐటీ మద్రాస్, ఐఐటీ బొంబాయి, కొచ్చిన్ వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్నామలై యూనివర్సిటీ లాంటివి అందిస్తున్నాయి.
-విపత్తు నిర్వహణ: సహజంగాగాని, మానవ తప్పిదాల వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. ఇవి వచ్చే ముందు, తరువాత నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. దీనికోసం ఎక్స్‌పర్ట్స్‌ను తయారుచేయడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
-టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్: ఈ రంగంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ వంటి తదితర సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో తమ అభిరుచికి అనుగుణంగా ఎంపిక చేసుకొని రాణించవచ్చు.
-దూరవిద్య: ప్రతిరోజూ కాలేజీకి వెళ్లి డిగ్రీ చేయలేనివారికి ఉన్న అత్యుత్తమ అవకాశం దూరవిద్య. రాష్ట్రంలోని, ఇతర రాష్ర్టాల్లోని దాదాపు అన్ని యూనివర్సిటీలు దూరవిద్యను అందిస్తున్నాయి. రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ ముఖ్యమైనవి.
వైద్యవిద్యకు విభిన్న మార్గాలు
-వైద్యరంగం అంటే కేవలం డాక్టర్ మాత్రమే కాదు. నర్సులు, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు కూడా వైద్యరంగంలోకే వస్తారు. అలాంటి వారికోసం విభిన్నమైన కోర్సులను చాలా కాలేజీలు అందిస్తున్నాయి.
-దేశంలో, రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలు వివిధ స్పెషలైజేషన్లతో బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ, పారామెడికల్ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి కొన్ని రాష్ర్టాలు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తుంటే మరికొన్ని ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా చేర్చుకుంటున్నాయి.
-బీఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ): వ్యాధి నిర్ధారణకు సంబంధించి మెడికల్ ల్యాబ్‌లలో ఎలాంటి పరీక్షలు నిర్వహించాలో నేర్పుతారు. కెమికల్, బ్యాక్టీరియాలజికల్, మైక్రోస్కోపిక్, బయాలజికల్ టెస్టులు చేయడంలో పాటించాల్సిన విషయాలు వివరిస్తారు.
బీపీటీ
-బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీని బీపీటీగా పిలుస్తున్నారు. శారీరక నొప్పులతో ఇబ్బందులుపడే వారికి క్రమపద్ధతిలో చికిత్సలు చేయాలి. వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన శాస్త్రీయ పద్ధతులను నేర్పుతారు.
బీయూఎంఎస్
-ఇది పురాతన వైద్య విధానం. రోగులకు సహజసిద్ధంగా లభించే వివిధ ఔషధాలతో చికిత్సలు ఎలా చేయాలి తదితర విషయాలు నేర్పిస్తారు.
-బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడిసిన్ అండ్ సర్జరీ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
నర్సింగ్
-ఈ కోర్సును ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, హాస్పిటళ్లు నిర్వహిస్తున్నాయి. వైద్య అవసరాలకు తగిన సేవలందించేందుకు శిక్షణ ఇస్తున్నాయి.
-దేశంలో నర్సింగ్ విద్యా వ్యవస్థ పనితీరును సరైన పంథాలో అమలు చేసేందుకు 1947లో ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నర్సింగ్ కళాశాలల ఏర్పాటు మొదలు, కరిక్యులమ్‌ను రూపొందించడం, ప్రవేశ ప్రక్రియ తదితర అంశాలన్నింటినీ నిర్దేశిస్తుంది.
-డిగ్రీ, డిప్లొమా కోర్సులను రాష్ట్రంలోని పలు విద్యా సంస్థలు, ఆస్పత్రులకు చెందిన కాలేజీలు నిర్వహిస్తున్నాయి.
1) బీఎస్సీ (బేసిక్ నర్సింగ్-4 ఏండ్లు)
2) జీఎస్ఎం (జనరల్ నర్స్ మిడ్వైఫరీ-3 ఏండ్లు)
3) ఏఎన్ఎం (ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫ్)
-ఈ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు పొందాలి. 17 ఏండ్లు నిండి 35 ఏండ్లు దాటకూడదు. ఇంటర్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
-ఏఎన్ఎంకు టెన్త్‌లో 45 శాతం మార్కులు ఉండాలి.
-బీఎస్సీ (ఆనర్స్) – పారా మెడికల్ కోర్సులు (ఆప్తాల్మిక్ టెక్నిక్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇన్ రేడియోగ్రఫీ): 55 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ పాసైనవారు అర్హులు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?