Group-2 interview | గ్రూప్ -2 ఇంటర్వ్యూ మౌఖికం బహుకీలకం
పోటీ పరీక్షల్లో విజయం, వైఫల్యం మధ్య తేడా కేవలం ఒకే ఒక మార్కు ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే మార్కులు వచ్చినప్పటికీ వయసులో పెద్దవారికి మాత్రమే ఉద్యోగం ఇస్తారు. కాబట్టి రాత పరీక్షలో వచ్చిన మార్కులతో సంబంధం లేకుండా ఇంటర్వ్యూలో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవడానికి కృషి చేయాలి. అందుకోసం అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదు.
ప్రిపరేషన్ మెళకువలు
-వ్యక్తిత్వ పరీక్షలో ప్రధానంగా భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహించేటప్పుడు తన ఆఫీసులో ఉన్న సిబ్బందితో కలిసి పనిచేయగలిగే మనస్తత్వం, సిబ్బందితో పనిచేయించగలిగే సమర్థత ఉన్నాయా లేవా? అన్న అంశాన్ని పరీక్షిస్తారు. సమయం, సందర్భానుసారం సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు, విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన తెలివితేటలను వివిధ ప్రశ్నల రూపంలో ఇంటర్వ్యూ బోర్డు పరిశీలిస్తుంది.
ఇంటర్వ్యూ ప్రిపరేషన్
-ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఒక్కరోజులో పూర్తయ్యే అంశం కాదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థి ప్రవర్తన, వ్యక్తిత్వం, జీవన విధానం తెలుస్తుంది. ఒక ప్రభుత్వ అధికారిగా సమాజానికి సేవలు అందించే వ్యవస్థలో భాగస్వామిగా చేరే వ్యక్తికి సత్ప్రవర్తన, మంచి మూర్తిమత్వం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే వ్యక్తికంటే సమాజం గొప్పది. సమాజంలోని ప్రజలు కట్టిన పన్నులతో ప్రభుత్వ అధికారులు జీతభత్యాలు పొందుతారు. జీవితాంతం ఉద్యోగ, ఆర్థిక భద్రతను పొందుతున్నందున సమాజానికి సేవచేసే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వ ఉద్యోగం ఎంపిక విషయంలో ప్రభుత్వం తప్పనిసరిగా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో అత్యంత కీలకం
ఇంటర్వ్యూ.
-ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త పాలిన్ వియంగ్ అభిప్రాయంలో ప్రతివ్యక్తి తన జీవితంలో చాలాభాగం ప్రైవేటుగా గడపటం జరుగుతుంది. అయితే ఇతరుల ముందుకు వచ్చినప్పుడు మర్యాద ముసుగు వేసుకుని నెగ్గుకురావటం అలవాటైన పని. ఈ ముసుగును తొలగించి అసలు సిసలు నిజస్వరూపాన్ని వ్యక్తిత్వాన్ని బయటపెట్టడమే ఇంటర్వ్యూ ప్రధాన లక్ష్యం. కాబట్టి అభ్యర్థులు కృత్రిమంగా ప్రవర్తించకుండా సహజంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ ప్రవర్తనలో ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి.
దశలు
1. భౌతిక సంసిద్ధత
2. మానసిక సంసిద్ధత
3. మేధోపరమైన సంసిద్ధత
భౌతిక సంసిద్ధత
-ఇంటర్వ్యూలో అత్యంత ప్రాథమికమైనది, కీలకమైనది అభ్యర్థి భౌతికంగా కనిపించే తీరు. ఒక వ్యక్తి వేషధారణ, వ్యక్తిగత పరిశుభ్రత చూడగానే మంచి సానుకూల దృక్పథం ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. first impression is the best impression గా మిగిలిపోవాలంటే తల వెంట్రుకలు, గోళ్లు మొదలు వేసుకునే దుస్తులు చివరకు సాక్స్ ఎంపిక వరకు ప్రతి అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఖరీదైన దుస్తులు లేకపోయినప్పటికీ వేసుకున్న దుస్తులు ముడుతలు లేకుండా నీట్‌గా ఉండేలా చూసుకోవాలి. సాధారణంగా లైట్కలర్ దుస్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
మానసిక సంసిద్ధత
-ఇంటర్వ్యూలో అభ్యర్థి మానసిక స్థితిని అంచనా వేయటానికి అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థి నిజ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఇంటర్వ్యూ బోర్డు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తుంది. అందువల్ల మానసిక అడ్డంకులైన భయం, ఆందోళన, ఆత్మన్యూనత వంటి లక్షణాలను మనసులో నుంచి తొలగించుకోవాలి.
-బోర్డు సభ్యులు అభ్యర్థి మానసిక స్థితిని, స్థితప్రజ్ఞత స్థాయిని సమయస్ఫూర్తిని అంతిమంగా ఆత్మ విశ్వాసాన్ని అంచనా వేయటానికి అనేక రకాలుగా ప్రశ్నలు అడుగుతారు.
ఉదాహరణకు
1. గ్రూప్-2 ఉద్యోగాన్ని ఎందుకు ఎంచుకున్నారు?
2. ప్రభుత్వ ఉద్యోగం రాకపోతే ఏం చేస్తారు?
3. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని ఎందుకు వదిలి వస్తున్నారు?
4. ప్రైవేటురంగంలో జీతభత్యాలు చాలా ఎక్కువ కదా?
5. మీ అర్హతకు ఈ ఉద్యోగం చాలా తక్కువగా ఉంది కదా?
6. మీ పరిజ్ఞానం ఇతర రంగాల్లో మరింత బాగా ఉపయోగపడుతుంది కదా?
7. డిగ్రీ/పీజీ తర్వాత చాలాకాలంపాటు ఖాళీగా ఉన్నారా?
8. ఖాళీ సమయంలో ఏం చేస్తారు?
9. ఇంటర్వ్యూ బాగా చేశానని భావిస్తున్నారా?
10. మీరు ఉద్యోగానికి ఎంపికైనట్లు తెలిస్తే ఎలా స్పందిస్తారు.
11. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటావు?
12. మీరు చదివిన చదువుకు ఈ ఉద్యోగాలకు సంబంధం లేదు కదా?
13. మీ బలాలు, బలహీనతల గురించి చెప్పండి?
14. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?
15. మీకు పూర్తి అధికారాలు ఇస్తే మొదట ఎలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తావు?
మేధోపరమైన సంసిద్ధత
-ఇంటర్వ్యూను పూర్తిస్థాయిలో ఎదుర్కోవాలంటే మేధోపరమైన సామర్థ్యం (విషయ పరిజ్ఞానం) చాలా కీలకం. గ్రూప్-2 సిలబస్‌లోని అనేక అంశాలపై లోతైన పరిజ్ఞానం ఉన్నందునే ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని గుర్తించాలి. అయితే ఇంటర్వ్యూలో మరో రకమైన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.
ఉదాహరణకు
1. మీ పేరు, ఇంటిపేరులోని ప్రత్యేకత, నేపథ్యం
2. మీరు చదివిన విద్యాసంస్థల ప్రాముఖ్యం
3. మీ జిల్లా సమాచారం
4. వర్తమాన అంశాలపట్ల మీకున్న అవగాహన
5. ప్రభుత్వ కార్యక్రమాలపై మీ అవగాహన
-ఇలా అనేక అంశాలపై కనీస పరిజ్ఞానాన్ని ఇంటర్వ్యూలో ప్రధానంగా గమనిస్తారు.
మెంటల్ అలర్ట్‌నెస్ కీలకం
-ఇంటర్వ్యూలో అభ్యర్థిలోని విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించే సందర్భంలో మెంటల్ అలర్ట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
-సాధారణంగా ప్రతి అభ్యర్థిని ఇంటర్వ్యూలో 20 నుంచి 25 నిమిషాల సమయంలో వారి సామర్థ్యాన్ని అంచనావేస్తారు. సగటున 30 ఏండ్ల వయసులోని అభ్యర్థుల మనస్తత్వాన్ని ఇంత తక్కువ సమయంలో అంచనా వేయాలంటే చాలా కష్టం. అందువల్ల అభ్యర్థి ఇంటర్వ్యూ బోర్డు ఉన్న గదిలోకి ప్రవేశించటం, నడకతీరు, బోర్డు సభ్యులను విష్ చేయటం, కుర్చీలో కూర్చునే పద్ధతి, ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు ప్రదర్శించే హావభావాలు, ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత ధన్యవాదాలు తెలిపే విధానం, తిరిగి బయటకు వెళ్లేటప్పుడు నడక, డోర్ వేయటం వంటి ప్రతి విషయాన్ని బోర్డు సభ్యుల్లోని సైకాలజిస్టు నిశితంగా గమనించి అభ్యర్థి మనస్తత్వాన్ని అంచనా వేస్తారు.
ప్రధానంగా గమనించే అంశాలు
1. మానసిక పరిపక్వత, స్థితప్రజ్ఞత, ఆత్మవిశ్వాసం
2. వివిధ అంశాలపై అభ్యర్థి అవగాహన, దృక్పథం
3. అంశాలను వివరించే విధానం
4. ప్రభుత్వ విధానాల అమలుకే పరిమితమని తెలుసా?
5. మెంటల్ అలర్ట్‌నెస్
6. స్పోర్టివ్‌నెస్
7. అనవసర సంభాషణకు దూరంగా ఉండటం
8. సమయస్ఫూర్తి
9. ముందు చెప్పినదానికి కట్టుబడి ఉన్నారా? లేక తరచూ అభిప్రాయం మార్చుకుంటున్నారా?
10. కామన్సెన్స్, కనీస సమాచారాన్ని కలిగి ఉన్నారా?
11. ఇతరుల సహాయాన్ని తీసుకునే స్వభావం ఉన్నదా?
12. సంక్షోభం, సంఘర్షణ సమయంలో మానసిక దృఢత్వం
13. నిర్ణయాలు తీసుకునే ధైర్యం, సామర్థ్యం
14. నైతిక బాధ్యత
15. పరిపాలనలో భాగస్వామిగా చేరేందుకు అవసరమైన లక్షణాలు అభ్యర్థికి ఉన్నాయా? లేవా?
సామాజిక సమస్యలు
1. పేదరికం
2. నిరుద్యోగం
3. మహిళలపై హింస, అత్యాచారాలు
4. సామాజిక దురాచారాలు
5. బలహీనవర్గాల స్థితిగతులు
6. షెడ్యూల్డ్ కులాలు
7. షెడ్యూల్డ్ తెగలు
8. వెనుకబడిన తరగతులు
9. మైనారిటీలు
10. వికలాంగులు
11. మానవ అక్రమ రవాణా
12. వృద్ధుల సమస్యలు
13. సామాజిక అసమానతలు
14. కులతత్వం
15. మతతత్వం
16. వివాహ, కుటుంబ
వ్యవస్థల విచ్ఛిన్నం
17. గ్రామీణ సమాజంపై ప్రపంచీకరణ ప్రభావం
18. సైబర్ నేరాలు
19. నైతిక విలువల పతనం
20. మోసాలు, దోపిడీలు,
దొంగతనాలు
సంక్షేమ యంత్రాంగం
1. సంక్షేమ విధానాల అంతిమ లక్ష్యం
2. సంక్షేమ రాజ్య భావన ఎలా వికాసం చెందింది?
3. జాతీయ విధానాల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది?
4. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం
5. షెడ్యూల్డ్ తెగల సంక్షేమం
6. వెనుకబడిన వర్గాల సంక్షేమం
7. మైనారిటీల సంక్షేమం
8. మహిళ, శిశు సంక్షేమం
9. వికలాంగుల సంక్షేమం
10. వృద్ధుల సంక్షేమం
తెలంగాణలో సామాజిక సమస్యలు
1. తెలంగాణ సామాజిక నిర్మాణం ఏ విధంగా ఉంది?
2. జోగిని దేవదాసీ వ్యవస్థల నేపథ్యం ఏమిటి?
3. వెట్టిచాకిరీ వ్యవస్థ గురించి క్లుప్తంగా చెప్పండి
4. బాలకార్మిక వ్యవస్థ మూలాలు ఎక్కడ ఉన్నాయి?
5. వెట్టి, బాలకార్మిక వ్యవస్థలను ఏకకాలంలో ఏ విధంగా నిర్మూలించవచ్చు?
6. ఫ్లోరోసిస్ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?
7. తెలంగాణలో వలసలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి?
8. తెలంగాణలో వ్యవసాయరంగం స్థితిగతులు ఏమిటి?
9. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?
10. తెలంగాణ ఉద్యమం సామాజిక ఉద్యమమేనా?
సమాధానాలు చెప్పటంలో పాటించాల్సిన జాగ్రత్తలు
1. ప్రశ్న అడిగినప్పుడు అవును, కాదు వంటి పదాలను తక్కువగా వాడాలి.
2. సమాధానం అనుభవ పూర్వకంగా ఉండేలా చూసుకోవాలి.
3. సమాధానాన్ని సమర్థించుకోవాలి.
4. ప్రశ్న అడిగి సభ్యుడికి సమాధానం చెబుతూనే మిగతా సభ్యులవైపు కూడా చూడాలి.
5. ప్రతి ప్రశ్నకు స్పందించాలి.
6. పొగడ్తలకు దూరంగా ఉండాలి.
7. సమాధానం చెప్పేటప్పుడు అతి వినయాన్ని ప్రదర్శించకూడదు.
8. బోర్డు సభ్యుల దయతో ఉద్యోగాలు పొందాలన్న భావన ఉండరాదు.
9. కుటుంబ స్థితిగతులను దీనంగా చెప్పకూడదు.
10. ప్రతి సమాధానంలో ఆత్మవిశ్వాసం కనపడాలి. మెరిట్‌తోనే ఉద్యోగం పొందగలనన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి.
ముఖ్యమైన కొన్ని పథకాలు – వివరాలు
ఆసరా పింఛన్లు
-ప్రారంభం: 2014 నవంబర్ 8 అర్హులు: -వృద్ధులు -వికలాంగులు -వితంతువులు -కల్లుగీత కార్మికులు -చేనేత కార్మికులు -బీడీ కార్మికులు -ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు -పేద వృద్ధ కళాకారులు -ఒంటరి మహిళలు
పెన్షన్ల కాలక్రమం
-2013-14లో రూ. 200 -2014-15లో రూ.1000 -2019-20లో రూ. 2016 -వికలాంగులకు ప్రస్తుతం రూ. 3016 -లబ్ధిదారుల సంఖ్య: సుమారు 45 లక్షలు -బడ్జెట్ కేటాయింపులు: దాదాపు రూ.5000 కోట్లు
కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్
-ప్రారంభం: 2014 అక్టోబర్ 2
ఆర్థిక సాయం
-2014లో రూ. 51,000 -2017లో రూ.75,116 -2018లో రూ.1,00,116
అర్హులు
-18 ఏండ్లు దాటిన యువతులు వార్షికాదాయ పరిమితి: -గ్రామాల్లో లక్షన్నర రూపాయలు -పట్టణాల్లో రెండు లక్షల రూపాయలు
గ్రామజ్యోతి
-ప్రారంభం: 2015, ఆగస్టు 17 -రాబోయే ఐదేండ్లలో గ్రామాల అభివృద్ధికి రూ.25,000 కోట్లు ఖర్చు చేయటం -జనాభాను బట్టి గ్రామాల అభివృద్ధికి 2 నుంచి రూ.6 కోట్ల వరకు ప్రభుత్వ నిధులు కేటాయింపు
మన ఊరు మన కూరగాయలు
-ప్రారంభం: 2015 -కూరగాయల సాగును ప్రోత్సహించడం -రైతు పండించే కూరగాయలకు నేరుగా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడం
తెలంగాణకు హరితహారం
-ప్రారంభం: 2015, జూలై 3 -24 శాతం వరకున్న అటవీ విస్తీర్ణాన్ని 33శాతానికి పెంచటం -230 కోట్ల మొక్కలను నాటడం
ఆరోగ్య లక్ష్మి
ప్రారంభం: 2013, జనవరి 1 -2015, జనవరి 1 నుంచి పూర్తి విస్తరణ -సమగ్ర శిశు అభివృద్ధి పథకానికి అనుబంధంగా గర్భిణులు,బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందించటం. -ఆరు నెలల నుంచి 6 ఏండ్లు ఉన్న బాలబాలికలకు రెండున్నర కిలోల బాలామృతాన్ని అందించటం
మిషన్ కాకతీయ
-ప్రారంభం: 2015, మార్చి 12 -లక్ష్యం: 46,531 చెరువుల పునరుద్ధరణ -అన్నిరకాల జలాశయాల్లో 250 నుంచి 270 టిఎంసీల నీరు నిల్వ ఉండేలా సామర్థ్యాన్ని పునరుద్ధరించటం
మిషన్ భగీరథ
-ప్రారంభం: 2016, ఆగస్టు 7 -లక్ష్యం: కృష్ణా, గోదావరి నదులతోపాటు ఇతర జలాశయాలను కలిపి 1,30,000 కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా.
చేనేత లక్ష్మి
-ప్రారంభం: 2016, ఆగస్టు 7 -చేనేత కార్మికులను ఆదుకోవటం -ప్రతినెల రూ.1000 చొప్పున 9 నెలలు చెల్లిస్తే రూ.14,400 విలువైన వస్ర్తాలను తెలంగాణ చేనేత సహకార సంఘం షోరూంలలో కొనుగోలు చేయవచ్చు. (నాలుగు నెలలు చెల్లిస్తే రూ.5400 విలువగల వస్ర్తాలు)
ఫైబర్ గ్రిడ్
-ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించటం -భారత్ నెట్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. -రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, దవాఖానలు, బ్యాంకులు, ప్రజాసేవా సంస్థలకు అధికవేగంతో కూడిన ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించటం.
రైతుబంధు
-ప్రారంభం: 2018, మే 10 -పెట్టుబడి సాయం: ఏడాదికి రబీ, ఖరీఫ్ పంట కాలాలకు రూ.4000 చొప్పున ఏటా రూ.8000 -2019 నుంచి ఏటా రూ.5000 -లబ్ధిదారులు: 58.34 లక్షలు
భూ కమతాలు రైతుల సంఖ్య
-2 ఎకరాల లోపు 42 లక్షలు -2-5 ఎకరాలు 11 లక్షలు -5-10 ఎకరాలు 4.4 లక్షలు -10 ఎకరాల కంటే ఎక్కువ 94 వేలు -25 ఎకరాల కంటే ఎక్కువ 6488
తెలంగాణ పల్లె ప్రగతి
-ప్రారంభం: 2015 ఆగస్టు 23 -దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గాలను రాబోయే ఐదేండ్లలో ఆర్థికంగా బలోపేతం చేయటం -ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయం -పల్లె ప్రగతి సేవా కేంద్రాల ఏర్పాటు -బేస్‌లైన్ సర్వే ద్వారా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన 150 మండలాల గుర్తింపు
అమ్మ ఒడి/ కేసీఆర్ కిట్
-ప్రారంభం: 2017, జూన్ 3
అమ్మ ఒడి
-గర్భిణులకు చెకప్‌ల కోసం, ప్రసవానికి దవాఖానకు తరలించటం, ప్రసవం తర్వాత మళ్లీ తల్లీబిడ్డను ఇంటికి చేర్చటం
కేసీఆర్ కిట్
-ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించటం. గర్భిణులకు నాలుగు విడతల్లో రూ.12,000 ఆర్థిక సాయం (ఆడ శిశువు అయితే రూ.13,000) -ప్రసవానంతరం రూ.2000 విలువ చేసే 16 వస్తువులతో కూడిన కిట్‌ను అందిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?