Friendshif with neighbors | ఇరుగుపొరుగుతో ఇగురంగా..
అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు అనే భాగాన్ని జనరల్ స్టడీస్ పేపర్-1లో చేర్చారు. గతంలో ఇది పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఉండేది కాదు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఇది పూర్తిగా కొత్త సబ్జెక్ట్. ఉద్యోగార్థులకు ప్రాంతీయ, జాతీయ అంశాలతోపాటు అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉండాలన్నది ఈ శీర్షిక ఉద్దేశం.
అంతర్జాతీయ సంబంధాల్లో రెండు లేదా అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య ఉన్న సంబంధాలు, వాటి చారిత్రక నేపథ్యం, యుద్ధాలు, సంధులు, ఒప్పందాలు, ప్రాంతీయ సర్దుబాట్లు ఉంటాయి.
అభ్యర్థులు అంతర్జాతీయ సంబంధాలను మూడు దశల్లో అధ్యయనం చేయాలి.
1. అంతర్జాతీయ సంబంధాల పుట్టుపూర్వోత్తరాలు, వాటి అభివృద్ధి క్రమం, పరిధి, స్వభావం, అందులో వస్తున్న మార్పులు.
2. అంతర్జాతీయ సంస్థలు/ప్రాంతీయ సంస్థలు, వాటి ఆవిర్భావం, చారిత్రక నేపథ్యం, లక్ష్యాలు, అవి సాధించిన విజయాలు, వాటి పనితీరును విశ్లేషణాత్మకంగా చదవాలి. ఇందులో UNO, NAM, EU, ASEAN, SAARC, OPEC, G-7, BIMSTEC మొదలైనవి వస్తాయి.
3. ఇతర దేశాలతో భారత్ కుర్చుకున్న ఒప్పందాలు, సంధులు, ఇతర దేశాలతో మనకున్న సంబంధాలు, సంఘటనలు, ప్రపంచ రాజకీయాల్లో భారత్ పాత్రను అంచనా వేయగలగాలి.
అంతర్జాతీయ సంబంధాలు-ఆవిర్భావం
-ప్రాచీన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెప్పినట్లు మానవుడు సంఘజీవి. సంఘంతో సంబంధంలేనివాడు దేవుడైనా కావాలి లేదా పశువైనా అయివుండాలి. ఇదే సూక్తి రాజ్యాలకు కూడా వర్తిస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏ దేశమూ ఒంటరిగా మనుగడ సాగించలేదు. దేశాల మధ్య పరస్పర సహకారం అవసరం. ప్రతి దేశం స్వతంత్ర, సార్వభౌమ దేశమే అయినప్పటికీ వివిధ అవసరాల దృష్ట్యా ఇతర దేశాల పై ఆధారపడాల్సి వస్తుంది. అందుకే అంతర్జాతీయ సంబంధాలకు ప్రాముఖ్యం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మార్పులను తన పరిధిలో చేర్చుకుని బహుముఖ స్వభావాన్ని సంతరించుకుంది.
-ప్రాచీన కాలంలో విలసిల్లిన సింధూ (ఇండియా), గ్రీకు, ఈజిప్టు, సుమేరియా, మెసపటోమియా, చైనా నాగరికతలు చరిత్రలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. వీటి మధ్య స్నేహపూర్వక వాణిజ్య-వ్యాపార సంబంధాలున్నట్లు చరిత్ర చెపుతున్నది.
-కౌటిల్యుని అర్థశాస్త్రంలో సప్తాంగ సిద్ధాంతం అంతర్జాతీయ సంబంధాలను, దౌత్య నీతిని చర్చించింది. ప్రాచీన కాలపు అంతర్జాతీయ సంబంధాలు అవసరాన్ని బట్టి పాక్షిక స్థాయిలో కొనసాగాయి.
-1453 నాటి తురుష్కుల కాన్స్టాంట్నోపిల్ ఆక్రమణ ఫలితంగా సముద్రమార్గం కనిపెట్టబడింది. ఫలితంగా నూతన భూభాగాలను గుర్తించి రాజ్యాల మధ్య రవాణా సులభతరం చేయబడింది. అనేక ఐరోపా రాజ్యాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో వలసవాదం, సామ్రాజ్యవాదం ద్వారా తమ పాలనకు పునాదులు వేసి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడీ చేశాయి.
-సాంస్కృతిక పునరుజ్జీవనం ఫలితంగా యూరప్ రాజ్యాల్లో పాలకుల మీద పోప్ ఆధిపత్యం అంతరించింది. మతం స్థానంలో రాజ్యవ్యవస్థ సాధికారత సాధించింది.
-ప్రఖ్యాత ఇటలీ రాజనీతి తత్వవేత్త మాకియవెలి రాజ్యం (State) అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించి జాతిరాజ్య (Nation State) భావనను ప్రాచుర్యంలోకి తెచ్చా డు. రాజ్యం సర్వసార్వభౌమాధికారం కలిగి ఉంటుందని, రాజ్య అంతర్గత వ్యవహారాల్లో మత జోక్యం ఉండొద్దని నిరసించాడు.
-1648 నాటి వెస్ట్‌ఫాలియా శాంతి సమావేశం అంతర్జాతీయ సంబంధాలకు రూపురేఖలను ప్రసాదించింది. ఈ ఒడంబడిక ద్వారా యూరప్ దేశాలు ప్రపంచ శాంతి సాధనకు పునాదులు వేశాయి. దేశాల మధ్య వివాదాల పరిష్కారానికి చట్టబద్ధమైన ఏర్పాట్లను సమీక్షించింది.
– 1690 నాటి జాన్లాక్ పౌర ప్రభుత్వం, 1762లో జేజే రూసో ప్రచురించిన సోషల్ కాంట్రాక్ట్ గ్రంథాలు రాజ్యం బహిర్గత పార్శాలను సృజించాయి.
-జీన్ బోడిన్ అనే ఫ్రెంచ్ న్యాయ శాస్త్రవేత్త తాను రాసిన సిక్స్ బుక్స్ ఆఫ్ కామన్వెల్త్ అనే గ్రంథంలో సార్వభౌమాధికారం అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా చర్చించాడు. ఇది రాజ్యాలకు అంతర్జాతీయంగా సాధికారత కల్పించింది.
-డేవిడ్ హ్యూమ్, ఓల్టేర్ అనే తత్వవేత్తలు అంతర్జాతీయ రాజకీయాలను అధ్యయనం చేయడం ద్వారా ప్రపంచ శాంతికి పునాదులు వేయవచ్చన్నారు.
-18వ శతాబ్దం ఆరంభం నాటికి శాంతి, దౌత్యనీతి అనే భావనలు రాజ్య లక్ష్యాలుగా అవతరించి ప్రపంచవ్యాప్తంగా వాటిని అమలుపర్చాలనే ధృడ సంకల్పం ఏర్పడింది.
-జెర్మీ బెంథాం అనే బ్రిటిష్ ఉపయోగితావాది తాను రాసిన An Introduction to the Principles of Morals & Legislation అనే గ్రంథంలో అంతర్జాతీయ సంబంధాలు అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించి ప్రచారంలోకి తెచ్చాడు. ఆయన తర్వాత ఇమ్మాన్యుయల్ కాంట్ పర్సెట్వల్ పీస్ అనే వ్యాసంలో అంతర్జాతీయ సంబంధాల ప్రాముఖ్యతను విశ్వవ్యాప్తంగా వివరించాడు.
-1814 మే లో వాటర్ లూ యుద్ధంలో నెపోలియన్ ఓటమి తర్వాత.. 1814 నవంబర్ నుంచి 1815 జూన్ వరకు యుద్ధ విజేతలైన రష్యా, బ్రిటన్, ఆస్ట్రియా, ప్రష్యాలు ఇతర ఐరోపా దేశాలతో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శాంతి సమావేశాన్ని నిర్వహించాయి. ఇది అంతర్జాతీయ సంబంధాల్లో మైలురాయి.
-1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ సంబంధాలకు విస్తృత ప్రాచుర్యం లభించింది. యుద్ధం-శాంతి-నిరాయుధీకరణ వంటి అంశాలకు ప్రాముఖ్యం పెరిగింది. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్, ఆయన భార్య సోఫియా హత్య మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణమైంది. దీంతో ప్రపంచం రెండుగా చీలింది. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీలు ట్రిపుల్ అలయన్స్గా ఏర్పడగా.. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు ట్రిపుల్ ఎంటాంట్గా అవతరించాయి.
-ఈ యుద్ధం 1565 రోజులపాటు జరిగింది. 65 మిలియన్ల జనాభా పాల్గొన్నారు. సుమారు 90 లక్షల మంది మరణించగా లక్షకుపైగా క్షతగాత్రులయ్యారు.
-ఈ యుద్ధంలో జర్మనీ ఘోర పరాజయం పాలైంది.
-అన్ని యుద్ధాలను అంతంచేసే ఆఖరి యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధమే కావాలి అని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ భావించాడు.
-యుద్ధ నిర్మూలన, ప్రపంచశాంతి నిర్మాణం కోసం 1918 జనవరి 8న విల్సన్ 14 సూత్రాల పథకాన్ని రూపొందించాడు.
-యుద్ధాన్ని సమీక్షించడానికి 1919 జనవరి 18న ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వెర్సైల్స్ శాంతి సంధి జరిగింది. 70 మంది ప్రతినిధులు హాజరైన ఈ సదస్సు జాతిరాజ్య భావనను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని తీర్మానించింది.
-1920లో ప్రపంచ మొదటి శాంతి సంస్థ నానాజాతి సమితి అవతరించింది. ఉడ్రోవిల్సన్ నానాజాతి సమితి పితామహుడిగా ఘనతకెక్కాడు. సమితి ఆవిర్భావం ద్వారా అంతర్జాతీయ సంబంధాల్లో ఒక కొత్త ఒరవడి మొదలైంది. ఒక జాతి – ఒక రాజ్యం అనే నినాదం తెరపైకి వచ్చింది.
-24 దేశాలతో సమితి మొదలైంది. అమెరికా శాసనసభ తిరస్కరించడంవల్ల ఆ దేశం నానాజాతి సమితిలో సభ్యత్వం పొందలేకపోయింది.
-వెర్సైల్స్ సంధి విధించిన షరతులతో జర్మనీ ప్రపంచ రాజకీయాల్లో తన స్థానాన్ని కోల్పోయింది. ఆ పరాభవం నుంచే హిట్లర్ నాజీయిజం మొలకెత్తింది.
-నానాజాతి సమితి అనంతర పరిణామాల్లో ముస్సోలినీ, హిట్లర్లు నియంతలుగా ఎదిగి రెండో ప్రపంచయుద్ధానికి కారణమయ్యారు. ఉడ్రోవిల్సన్ ఆకాంక్షించిన శాంతియుత ప్రపంచానికి భిన్నంగా 1939 సెప్టెంబర్ 1న రెండో ప్రపంచ యుద్ధం మొదలై 1945 ఆగస్టు వరకు 6 ఏండ్లపాటు కొనసాగింది. వెర్సైల్స్ సంధి లోపాలతోపాటు జర్మనీ పోలండ్పై దండెత్తడం యుద్ధానికి తక్షణ కారణమైంది.
-యుద్ధం జరుగుతుండగానే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్లు అట్లాంటిక్ సముద్రంలో రహస్యంగా సమావేశమై 8 అంశాలతో ఒక ఉమ్మడి ప్రణాళిక రూపొందించారు. దీన్నే అట్లాంటిక్ చార్టర్ అంటారు. ఇదే ఐరాసకు పునాదిరాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో 1945 అక్టోబర్ 24న UNO ఏర్పడింది.
-మొదటి ప్రపంచయుద్ధం నుంచి ఐరాస ఆవిర్భావం వర కు, 1945 నుంచి 1991లో సోవియట్ యూనియన్ పతనమయ్యేవరకు సంభవించిన ప్రచ్ఛన్న యుద్ధ కార్యకలాపాలు, 1991లో మొదలైన ఆర్థిక సరళీకృత విధానాలు అంతర్జాతీయ సంబంధాల్లో ప్రాథమికాంశాలు.
అంతర్జాతీయ సంబంధాలు – వికాసం
-మొదటి ప్రపంచయుద్ధం తర్వాత అంతర్జాతీయ సంబంధాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఉడ్రోవిల్సన్ ప్రస్తావించాడు. ఆ మేరకు బ్రిటన్‌లో వేల్స్ విశ్వవిద్యాలయం 1919లో అంతర్జాతీయ సంబంధాల అధ్యయన శాఖను ఏర్పాటు చేసింది. దీనికి ఉడ్రోవిల్సన్ పీఠం అని పేరు. అదే ఏడాది అమెరికాలోని జార్జిటన్ విశ్వవిద్యాలయం విదేశాంగ విధాన అధ్యయన శాఖను రూపొందించింది.
-1923లో పారిస్ యూనివర్సిటీ (ఫ్రాన్స్), 1924లో సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీ (అమెరికా)ల్లో అంతర్జాతీయ రాజకీయ అధ్యయన పీఠాలు మొదలయ్యాయి. 1930 నాటికి అమెరికాతోపాటు చాలా యూరప్ దేశాలు అంతర్జాతీయ రాజకీయాలపై పరిశోధనలు మొదలుపెట్టాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ అనివార్యంగా అంతర్జాతీయ సంబంధాలను అధ్యయనం చేస్తున్నాయి.
అంతర్జాతీయ సంబంధాలు – పరిధి
-మొదట్లో యుద్ధం-శాంతి-దౌత్యనీతికే పరిమితమైన అంతర్జాతీయ సంబంధాలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తన పరిధిని విస్తృత పర్చుకుంది. రాజ్యాల మధ్య సహకారం, సంఘర్షణ (కన్ఫ్లిక్ట్) వంటి సంబంధాలతోపాటు రాజ్యాల మధ్య ఆర్థిక, రాజకీయ, శాస్త్ర-సాంకేతిక, రక్షణ ప్రచారాంశాలతోపాటు విశ్వమానవ హక్కులు, పర్యావరణం, అంతర్జాతీయ న్యాయం, వసుధైక ప్రపంచం వంటి అంశాలను విస్తరించింది. అంతర్జాతీయ సంబంధాల్లో ప్రధానంగా కింది అంశాలు ప్రస్తావించబడుతాయి.
1. దౌత్యనీతి: రాజ్యాల మధ్య సంబంధాలను ప్రభావితపర్చేది దౌత్యనీతి. ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం-శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఉపకరిస్తుంది. ప్రతిదేశం ఇతర దేశాల్లో నియమించే రాయబార వర్గాలు, కార్యాలయాలు, రాజ్యాధినేతల పర్యటనలు, ఒప్పందాలు వాటి ప్రయోజనాలు దౌత్యనీతితో ముడిపడి ఉంటాయి.
2. అంతర్జాతీయ వ్యవస్థ: ప్రపంచంలో రాజ్యాలతో కూడుకున్నదే అంతర్జాతీయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉన్న వివిధ భౌగోళిక ప్రాంతాలు, రాజ్యాల మధ్య తేడాలు-పోలికలు, వాటి పనితీరు, లక్ష్యాలు, అవి అవలంభిస్తున్న రాజకీయ ధోరణులు, వివిధ దేశాల కూటములు ఉంటాయి. శక్తి, ప్రాబల్య సమతౌల్యం, రాజకీయ ఆధిపత్యం కూడా ఇందులో భాగాలే.
3. విదేశాంగ విధానాలు: ప్రపంచ రాజ్యాల సంబంధాలు, అవి అవలంభిస్తున్న విదేశాంగ విధానాలు, నిర్ణయీకరణ, దేశాధినేతల వ్యక్తిత్వం-దూరదృష్టి, విదేశాంగ విధానాలను అమలుపర్చే సంస్థలు ఇందులోకి వస్తాయి.
4. అంతర్జాతీయ సంస్థలు: ప్రపంచ దేశాల మధ్య శాంతి సహకారాలను పెంపొందించే దిశగా అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తాయి. ఐరాస, ఆఫ్రికాదేశాల సమైక్య సంస్థ, యురోపియన్ యూనియన్ (ఈయూ), ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య, ఇస్లామిక్ దేశాల సమాఖ్య, దక్షిణాసియా దేశాల సహకార సమాఖ్య, కామన్వెల్త్ దేశాల సమాఖ్య మొదలైనవి. ఇవి ఆయా సభ్య దేశాల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలను ప్రతిబింబిస్తూ సహకార సాధనాలుగా ప్రపంచశాంతికి కృషి చేస్తాయి.
-ప్రముఖ తత్వవేత్త క్విన్సీరైట్ చెప్పినట్లు అంతర్జాతీయ సంబంధాలు మూడు అంశాలపై ఆధారపడి ఉంటాయి.
1. స్వతంత్ర రాజ్యాలు పరస్పర విరుద్ధ అవసరాలను కలిగి ఉంటాయి.
2. ప్రతి రాజ్యం దాని సురక్షిత-స్వతంత్య్ర మనుగడకు ప్రాధాన్యతనిస్తుంది.
3. జాతి రాజ్యాల మధ్య వివాదాల పరిష్కారానికి బలప్రయోగమే అంతిమ సాధనం.
రాజ్యాల మధ్య అధికారం కోసం జరిగే ఆరాటమే అంతర్జాతీయ సంబంధాలు
రాజ్యాలు తమ చర్యల ద్వారా ఇతర దేశాలతో తమకు విభేదాలున్నా, లేకున్నా తమ జాతీయ ప్రయోజనాలను రక్షించుకునే ప్రయత్నమే అంతర్జాతీయ సంబంధాలు
సార్వభౌమ రాజ్యాలు ప్రపంచ రాజకీయాల్లో తమ మిత్ర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంటూనే తమ జాతీయ ఆసక్తులను పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తుంటాయి
అంతర్జాతీయ సంబంధాలంటే – రాజ్యాల విదేశాంగ విధానాలు, రాజకీయ శక్తితోపాటు ప్రపంచ రాజకీయ సమస్యలను పరిశీలించేవి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?