European immigration | యూరోపియన్ వలసలు
యూరప్‌తో భారతదేశానికి వ్యాపార సంబంధాలు ప్రాచీన గ్రీకు కాలం నుంచి ఉన్నాయి. మధ్యయుగాల కాలంలో యూరప్, భారతదేశం, ఆగ్నేయాసియాల మధ్య అనేక మార్గాలగుండా వ్యాపారం సాగింది.
ఒకటోమార్గం: పర్షియన్ సింధుశాఖ వెంట సముద్ర మార్గం, అక్కడ నుంచి ఇరాక్, టర్కీల గుండా భూమార్గం. తర్వాత మళ్లీ సముద్ర మార్గాన వెనీస్, జెనీవాలను చేరుకోవడం.
రెండో మార్గం: ఎర్ర సముద్రం గుండా ప్రయాణంచేసి భూమార్గాన ఈజిప్టులోని అలెగ్జాండ్రియా రేవు చేరుకొని అక్కడి నుంచి సముద్రమార్గంలో వెనీస్, జెనీవాలను చేరుకోవడం.
మూడో మార్గం: ఇది వ్యాపారులు తరచూ ఉపయోగించని భూమార్గం. ఇది భారత వాయవ్య సరిహద్దు కనుమల గుండా పోయి, మధ్యఆసియా, రష్యాలను దాటి బాల్టిక్ సముద్ర తీరాన్ని చేరుతుంది.
-ఆసియాకు సంబంధించిన వ్యాపారాన్ని అరబ్బు వర్తకులు, నావికులు నిర్వహించేవాళ్లు. మధ్యదరా తీర ప్రాంతానికి, యూరప్‌కు సంబంధించిన వ్యాపారాన్ని ఇటాలియన్లు గుత్తగా కొన్నారు. ఆసియా నుంచి యూరప్‌కు వెళ్లే సరకులు అనేక రాజ్యాల గుండా పయనించి, అనేక చేతులు మారేవి.
-మార్గంలో ప్రతి రాజ్యం రహదారి సుంకాలు, వాణిజ్య సుంకాలు వసూలు చేసుకొనేది. అయినా ప్రతి వర్తకుడు అధికంగా లాభాలు పొందేవాడు. ఇవికాక మార్గం మధ్యలో దొంగల భయం, ప్రకృతి బీభత్సాలు మొదలైన అనేక భయాలు ఉండేవి.
అయినప్పటికీ వ్యాపారం అత్యంత లాభదాయకంగానే ఉండేది. ఎందుకంటే యూరప్ ప్రజలకు తూర్పు దేశాల సుగంధ ద్రవ్యాలు లేకపోతే పూట గడిచేది కాదు. వాటికి యూరప్ మార్కెట్లలో అపరిమితమైన ధర పలికేది. శీతాకాలంలో యూరప్ ప్రజలు ఉప్పు, మిరియపు పొడిలో ఊరవేసిన మాంసాహారం మీద బతికేవాళ్లు కాబట్టి, వాళ్లకి సుగంధ ద్రవ్యాలు నిత్యజీవితావసరంగా మారాయి. ఫలితంగా, భారతీయుల ఆహారంలో మాదిరిగానే యూరప్ ప్రజల ఆహారంలో కూడా 17వ శతాబ్దం దాకా సుగంధ ద్రవ్యాల్ని పుష్కలంగా దట్టించేవాళ్లు.
-ఎప్పుడైతే ఒట్టోమాన్ టర్కీలు ఆసియా మైనర్‌ను జయించి, 1453లో కాన్స్టాంటినోపుల్ని స్వాధీనం చేసుకోవడంతో తూర్పు, పడమర దేశాల మధ్య వర్తక మార్గాలు టర్కీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పైపెచ్చు వెనీస్, జెనీవా వర్తకులు యూరప్-ఆసియాల మధ్య సాగే వ్యాపారం మొత్తాన్ని గుత్తగా తీసుకొని స్పెయిన్, పోర్చుగల్ వంటి నూతన పశ్చిమ యూరప్ జాతీయ రాజ్యాల్ని ఈ పాత వర్తకమార్గాల గుండా జరిగే వ్యాపారంలో పాలుపంచుకోకుండా చేశారు.
-కానీ ఇండియా, ఇండోనేషియాలతో వ్యాపారం మహా విలువైంది. కాబట్టి పశ్చిమ యూరప్ దాన్ని తేలిగ్గా వదులుకోలేదు. ఒకవైపు సుగంధ ద్రవ్యాలకు విపరీతమైన గిరాకీ మరోవైపు ఆ వ్యాపారం మీద వచ్చే అపార లాభాలు నోరూరించాయి. కథకథలుగా చెప్పుకొనే భారతదేశ అత్యద్భుత సంపద ఇంకో ఆకర్షణ.
-పైగా నాడు యూరప్ ఖండాన్ని తీవ్రమైన బంగారం కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ప్రతి బంధకాలు లేకుండా వ్యాపారం సజావుగా సాగాలంటే బంగారం ఒక్కటే మారక సాధనం. కాబట్టి భారతదేశానికి సుగంధ ద్రవ్య ద్వీప సముదాయమైన ఇండోనేషియాకు పశ్చిమ యూరప్ రాజ్యాలు, వర్తకులు క్షేమకరమైన నూతన సముద్ర మార్గాల అన్వేషణకు పూనుకొన్నారు.
-వీళ్లు అరబ్బు, వెనీషియన్ల వ్యాపార గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టి, టర్కీల శతృత్వాన్ని తప్పించుకొని, తూర్పు దేశాలతో నేరుగా వర్తక సంబంధాల్ని నెలకొల్పుకోవాలనుకున్నారు. దానికి తగిన సాధన సంపత్తి వాళ్లకుంది. 15వ శతాబ్దం యూరప్‌లో నౌకా నిర్మాణం, నౌకాయాన సాంకేతిక విజ్ఞానంలో అద్భుత ప్రగతిని సాధించింది. పైగా సాంస్కృతిక పునరుజ్జీవనం పశ్చిమ యూరప్ ప్రజల్ని కొత్త సాహసం చేయడానికి ఉత్తేజపర్చింది.
-వీరిలో పోర్చుగీసువారు ముందంజవేశారు. క్రమంగా ఇతర రాజ్యాలవారు కూడా ఈ అన్వేషణలో పాల్గొన్నారు. మొదట పోర్చుగీసువారు, తర్వాత డచ్‌వారు, డేన్లు, ఆంగ్లేయులు, ఫ్రెంచ్ దేశస్థులు వచ్చారు.
పోర్చుగీసువారు: సముద్ర వర్తక మార్గాల అన్వేషణలో పోర్చుగల్ రాజు హెన్రీ ఉత్సాహాన్ని కనబర్చాడు. ఇతడికి నావిగేటర్ అనే బిరుదు కూడా ఉంది.
-1494లో స్పెయిన్‌కు చెందిన కొలంబస్ భారతదేశాన్ని చేరుకోవాలని బయలుదేరి అమెరికా ఖండాన్ని కనిపెట్టాడు. 1498లో పోర్చుగల్ దేశీయుడు వాస్కోడిగామా యూరప్ నుంచి ఇండియాకు ఒక నూతన సముద్రమార్గాన్ని కనిపెట్టాడు. వాస్కోడిగామా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి గుడ్‌హోప్ అగ్రం మీదుగా ముందుకు వెళ్లి భారత పశ్చిమతీరంలోని కాలికట్కు చేరాడు.
-ఆ ప్రాంతానికి రాజుగా ఉన్న జామెరిన్‌ను కలుసుకొని తాను తెచ్చిన వస్తువులు వారికి ఇచ్చి ఇండియా సరకులతో తిరిగి పోర్చుగల్‌కి చేరాడు. సముద్రయానంలో అతనికి అయిన ఖర్చుకి అరవై రెట్లకు తెచ్చిన సరకుని అమ్మేశాడు. ఇవి నౌకాయానంలో కనిపెట్టిన నూతన విషయాలు ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించాయి. గుడ్‌హోప్ అగ్రం మీదుగా నూతన సముద్రమార్గాన్ని కనిపెట్టడం అనేది మానవజాతి చరిత్రలో నమోదైన రెండు అత్యంత ప్రధానమైన, మహత్తర సంఘటనలుగా ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ఆడం స్మిత్ అభివర్ణించాడు.
-క్రీ.శ. 1500లో కాబ్రల్, 1503లో వాస్కోడిగామా వచ్చారు. పోర్చుగీసువారికి వర్తక సదుపాయాల కోసం వాస్కోడిగామా జామెరిన్తో సంప్రదింపులు జరిపాడు. మహ్మదీయ వర్తకులను రావద్దని కోరాడు. కానీ జామెరిన్ తిరస్కరించిన కారణాన గామా కాలికట్‌పై కాల్పులు జరిపి జామెరిన్‌ను అంగీకారానికి లొంగదీసి అక్కడ కోట నిర్మించాడు.
ఫ్రాన్సిస్ డీ ఆల్మిడా (1505-1509)
-గామా తిరిగి వెళ్లిపోయిన తర్వాత డీ ఆల్మిడా 1500 మంది సైనికులతో నౌకలో పోర్చుగీస్ స్థావరాలపై వైస్రాయ్గా వచ్చాడు.
-ఇతడు కొచ్చిన్‌లో కాబ్రల్ నిర్మించిన కోటను బలిష్టం చేశాడు. లన్ననూర్ వద్ద కోటను నిర్మించాడు. గోవా సమీపంలో ఉన్న అంజీదీవ్ దీవులను ఆక్రమించాడు.
-సముద్రం మీద తమ అధికారాన్ని స్థాపిస్తేకాని, భూమ్మీద తమ అధికార స్థానం ఉండదని తలచి బలమైన నౌకాదళాన్ని నిర్మించాడు. దీన్నే బ్లూ వాటర్ పాలసీ (విధానం) అని అంటారు.
-ఇతడి తర్వాత అప్పాన్ సో డీ అల్బుకర్క్ పోర్చుగీసు స్థావరాలపై అధికారానికి వచ్చాడు.
అప్పాన్ సో డీ అల్బుకర్క్ (1509-1515)
-పోర్చుగల్ అధికారాన్ని మనదేశంలో స్థాపించి వారి స్థావరాలను వృద్ధిపర్చాడు.
-ఇతడు క్రీ.శ. 1510లో గోవాను ఆక్రమించి స్వాధీన పర్చుకున్నాడు. గోవాను ప్రధాన పరిపాలనా కేంద్రంగా చేసి తమ పాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు.
-క్రీ.శ. 1511లో మలక్కాను ఆక్రమించి కోటను నిర్మించాడు.
-క్రీ.శ. 1515లో పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఆర్మజ్ ద్వీపాన్ని ఆక్రమించాడు.
-తాను ప్రవేశపెట్టిన పాలనా యంత్రాంగాన్ని నడపటం కోసం పోర్చుగల్ నుంచి ప్రజలను రప్పించి, స్థానికులతో వివాహాలను ప్రోత్సహించాడు. తన ప్రాంతాల్లో సతీసహగమనాన్ని నిషేధించాడు.
-మహ్మదీయులను హింసించి హిందువులను ఆదరించాడు. పాఠశాలలు నిర్మించాడు.
-ఇతడికి భారతదేశంలో పనిచేసిన పోర్చుగీస్ గవర్నర్లలో గొప్పవాడు. పోర్చుగీస్ వలస సామ్రాజ్య నిర్మాత అని ఇతడికి బిరుదు ఉంది.
-క్రీ.శ. 1515-60 మధ్య పోర్చుగీస్వారి అధికారం చురుగ్గా విస్తరించింది. మాల్యుకాస్ పామేస్, డొమింగో పేస్, న్యూనిజ్ వంటి పోర్చుగీస్ వారు చాలామంది విజయనగర రాజుల అస్థానంలో ఉన్నారు. వీరి సహాయంతో గుజరాత్ సుల్తాన్ బహదూర్షా, ఆశీర్గఢ్ సుల్తాన్లు ఫిరంగి దళాన్ని సమకూర్చుకున్నారు. విజయనగర రాజుల పతనం తర్వాత వీరిని అదుపులో పెట్టగల ప్రభుత్వం లేకపోయింది.
-క్రీ.శ. 1561 తర్వాత వీరి కార్యకలాపాలకు హద్దులేకుండాపోయింది. మక్కాకుపోయే యాత్రికులకు ఇబ్బందులు కలిగిస్తూ వారి నుంచి డబ్బు దోచుకోవటం సాగించారు. సముద్రపు దోపిడీలు సాగించారు. గుజరాత్, బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను ఓడించారు.
-పోర్చుగీస్ వారు క్రీ.శ. 1518లో కొలంబోలో కోటను నిర్మించారు. భారతదేశ పశ్చిమతీరంలో క్రీ.శ. 1534లో డయ్యూ బేసిన్లను, 1538లో డామన్నూ, తూర్పు ప్రాంతంలో నాగపట్టణం, పాంథోయ్, చిట్టగాంగ్, హుగ్లీలను సంపాదించారు. తూర్పు దేశాల్లో తమ గొప్పతనాన్ని చాటడానికి పోర్చుగల్ 1514లోనే పోప్‌కు భారతదేశం నుంచి ఎన్నో బహుమతులు పంపింది. వీటిలో పర్షియా కంబళ్లను, గోవా ఏనుగులను, ముత్యాల సరాలు వేలాడుతున్న గుర్రాలను రోమ్ నగరమంతా పోప్ ఊరేగించాడట. పశ్చిమతీరంలో పోర్చుగల్ స్థావరాలు తూర్పుతీరంలో ప్రాంతాల కంటే బాగా వృద్ధిచెందాయి. రాజకీయంగా కూడా వీరు పలుకుబడి సంపాదించారు. గోవా ఆక్రమించుకున్న కారణంగా బీజాపూర్‌తో విరోధం ఏర్పడిన విజయనగర, గుజరాత్, ఆశీర్గఢ్ అధిపతులతో స్నేహాన్ని సంపాదించారు. క్రీ.శ. 1605 వరకు వీరికి మొఘలులతో సత్సంబంధాలు ఉన్నా ఆంగ్లేయుల రాకతో పెద్ద అవరోధం ఏర్పడింది. క్రమంగా వీరు తమ రాజకీయ వర్తక ఆధిక్యాన్ని పోగొట్టుకున్నారు. ఔరంగజేబు కాలంలో చిట్టగాంగ్ పతనంతో వీరి ఆధిక్యం పోయింది. క్రీ.శ. 1656లో సింహళాన్ని 1662లో ఆర్మజ్ను, 1739లో బేసిన్‌ను పోగొట్టుకున్నారు.
పోర్చుగీస్ వారి పతనానికి కారణాలు
-దక్షిణ అమెరికాలో బ్రెజిల్ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత చాలామంది పోర్చుగీస్‌వారు అక్కడికి వెళ్లిపోయారు. భారతదేశం కంటే పోర్చుగల్ చాలా చిన్నది. అంతేకాకుండా ఇండియా, పర్షియా, ఈజిప్టు దేశాల్లో మొఘల్, సఫావీ మావూలుకే వంశాలు స్థాపితమైన తర్వాత పూర్వపు అరాచక పరిస్థితులు అంతరించాయి. దీనివల్ల పోర్చుగీస్ వారికి పెద్ద అవరోధం ఏర్పడింది. డచ్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ వారి రాకవల్ల వీరి వర్తకం బాగా దెబ్బతిన్నది. మొదట వీరి ధైర్యసాహసాలు ఎంత పేరుతెచ్చాయో రానురాను అవినీతి, అక్రమచర్యలు వీరికి అంత అప్రతిష్ట తెచ్చాయి. స్వార్థం వల్ల సంకుచితత్వం వల్ల వీరు పతనమయ్యారు.
పోర్చుగీస్ పాలనా విధానం
-పోర్చుగల్ రాజు వలసల మీద సర్వాధికారి. పోర్చుగల్ వలసల సామ్రాజ్యానికి ప్రధాన పాలనా కేంద్రం. దాని మీద వైస్రాయ్ అధికారి. ఇతర కేంద్రాల్లో కెప్టెన్లు అధికారులుగా ఉండేవారు. వైస్రాయ్కి సలహా ఇవ్వడానికి ఒక సెక్రటరీ, ఒక కౌన్సిల్ ఉండేది. వైస్రాయ్ కింద వెడాల్ డీ ఫసెండా అనే ఉద్యోగి ఉండేవాడు. సైనికులు, ఓడరేవులు, టంకశాలలు ఇతని అధికారంలో ఉండేవి. క్రిమినల్ తగాదాల్లో వైస్రాయ్ ఉన్నత న్యాయాధికారిగా పనిచేసేవాడు. సివిల్ తగాదాలు పరిష్కరించడానికి న్యాయాధిపతుల సభ ఉండేది. క్రైస్తవ మతవ్యాప్తి కోసం రోమన్ చర్చి పోర్చుగీస్ జెస్యూట్ మతాచార్యులకు అనేక హక్కులు కల్పించింది.
-సర్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవాలో కాలుపెట్టిన మొదటి క్రైస్తవ మతాచార్యుడు. 1560లో గోవాకు ఒక ఆర్చిబిషప్‌ను రోమ్ నియమించింది. 1567లో హిందువులు, ముస్లింలను పనిలో చేర్చుకోరాదని శాసించారు. క్రైస్తవులు కానివారు కూడా తప్పకుండా ఆదివారం ప్రార్థనల్లో పాల్గొనాలని నిర్బంధించారు. అనాథ శిశువులను బలవంతంగా తమ మతంలోకి మార్చారు. బిడ్డలు లేకుండా చనిపోయినవారి ఆస్తిని క్రైస్తవమతం పుచ్చుకున్నవారి దగ్గరి బంధువులకు ఇప్పించారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారందరికి పోర్చుగీస్వారితో సమాన హక్కులను కల్పించారు. ఈవిధంగా పోర్చుగీస్ వారు తమ ప్రాంతాల్లో మత న్యాయస్థానాన్ని స్థాపించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?