Ease of doing business | ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
ఆర్థికాభివృద్ధి, సంస్కరణల గురించిన చర్చలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడినా ఈ అంశానికే ప్రస్తుతం అధిక ప్రాధాన్యం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు, పేద దేశాలు అన్న భేదం లేకుండా అన్ని దేశాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌కు ఎక్కడలేని ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ ఇండెక్స్ ఇచ్చే ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానం కోసం దేశాలమధ్యే కాకుండా ఒక దేశంలోని రాష్ర్టాల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటి? దీనిని ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలు నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రపంచబ్యాంకు 2001లో మొదటిసారిగా ప్రారంభించింది. 2003లో మొదటిసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టును ప్రచురించింది. ప్రస్తుతం ఈ ఇండెక్స్‌లో ప్రపంచంలోని 185 దేశాలకు ర్యాంకులు ఇస్తున్నారు. అయితే, ఇదే భావనతో కూడిన ఒక పరిశోధనా పత్రం 2002లోనే క్వార్టర్లీ జర్నల్ ఆఫ్ ఎకనామిక్స్ అనే పత్రికలో సిమన్ జంకోవ్, రాఫెల్ లా పోర్టా, ఫ్లోరెన్సియో లాపెజ్ డి సిలేన్స్, ఆండ్రీ షీఫర్ అనే ఆర్థికవేత్తలు ప్రచురించారు. ఇప్పటివరకు దాదాపు 800 పరిశోధన పత్రాలు, వాటి రచయితల భాగస్వామ్యంతో ప్రపంచబ్యాంకు గ్రూపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను రూపొందించి, వివిధ దేశాలకు ర్యాంకులు ఇస్తున్నది.
ఏమిటీ ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్?
-ప్రపంచవ్యాప్తంగా వ్యాపారంలో పోటీతత్వాన్ని పెంచాలన్న ప్రధాన ఉద్దేశంతో రూపొందించిన ప్రణాళికయే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సాంకేతికత అభివృద్ధి, వాణిజ్య సంబంధాల వృద్ధితో ప్రపంచంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అయితే అన్నిదేశాల్లో ఆర్థిక, సామాజిక, పాలనాంశాలు ఒకేలా లేవు. కొన్నిదేశాలు వ్యాపార, పెట్టుబడి అనుకూల సంస్కరణలు వేగంగా కొనసాగిస్తుండగా, మరికొన్ని దేశాలు ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. దాంతో ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో సిరిసంపదలు, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన దారిద్య్రం నెలకొని ఉన్నాయి. పేద దేశాల్లోని వనరులు, మార్కెట్లు ధనికదేశాల్లోని పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నప్పటికీ చాలాప్రాంతాల్లో వ్యాపారానుకూల పరిస్థితులు లేకపోవటం ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ పరిస్థితుల్లో మార్పులు ఏ మేరకు జరుగుతున్నాయనే అంశాలను పరిశీలించటమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ పని.
ర్యాంకులు ఎలా ఇస్తారు?
-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌ను ప్రపంచబ్యాంకు రూపొందిస్తున్నప్పటికీ అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది ఆర్థికవేత్తలు, ఆడిటర్లు, సర్వే సంస్థల కృషితో తయారవుతున్నది. వివిధ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి, పరిపాలన, కార్మిక చట్టాల్లో చేపడుతున్న సంస్కరణలను అధ్యయనం చేస్తారు. ఇందుకోసం కొంతమంది మేధావులతో ఒక ప్రశ్నావళిని రూపొందిస్తారు. ఆ ప్రశ్నావళిలోని అంశాలను పూర్తిగా నెరవేర్చిన దేశానికి ఉత్తమ ర్యాంకు లభిస్తుంది. ఇందుకోసం ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి మే మధ్య కాలంలోని డాటాను పరిగణనలోకి తీసుకొంటారు.
ఒక దేశానికి సంబంధించిన ప్రశ్నావళి వ్యాపారం ప్రారంభించడం
-వ్యాపారం ప్రారంభించేందుకు అమల్లో ఉన్న నిబంధనలు, వ్యాపార అనుమతులకు పడుతున్న సమయం, వ్యాపారం ప్రారంభించేందుకు అవుతున్న వ్యయం, కొత్త వ్యాపారం ప్రారంభానికి అవుతున్న కనీస మూలధనం.
వ్యాపార సంస్థ భవనాల నిర్మాణం
-వ్యాపార సంస్థ తనకు అవసరమైన భవనాల నిర్మాణానికి అమల్లో ఉన్న నిబంధనలు, పడుతున్న సమయం, వ్యయం.
విద్యుత్ సదుపాయం
-ఒక సంస్థ కొత్తగా నిర్మించిన భవనానికి శాశ్వతంగా విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అమల్లో ఉన్న నిబంధనలు, పడుతున్న సమయం, అవుతున్న వ్యయం.
ఆస్తుల రిజిస్ట్రేషన్
-వ్యాపారాన్ని ప్రారంభించే సంస్థ తన ఆస్తులను రిజిస్టర్ చేయించుకొనేందుకు అమల్లో ఉన్న నిబంధనలు, పడుతున్న సమయం, వ్యయం
రుణ లభ్యత-వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవసరమైన రుణాన్ని పొందేందుకు ఆ దేశంలో ఉన్న న్యాయపరమైన అంశాలు, రుణ సమాచారం లభ్యత.
పెట్టుబడిదారుడి రక్షణ
-దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే పెట్టుబడిదారుడికి ఆ దేశంలో లభిస్తున్న న్యాయ, చట్టపరమైన రక్షణలు, వాటాదారుల ప్రయోజనాలకు రక్షణ.
పన్నులు
-దేశంలో పన్నుల విధానం, రకాలు, పన్నులు చెల్లించేందుకు పడుతున్న సమయం, మొత్తం ఆదాయంపై వ్యాపార సంస్థ చెల్లించాల్సిన పన్నులు
సరిహద్దు ఆవలి వాణిజ్యం
-ఉత్పాదక వస్తువుల ఎగుమతి, దిగుమతులకు అమల్లో ఉన్న నిబంధనలు, వ్యయం, పడుతున్న సమయం.
కంపెనీ దివాళా విధానాలు
-నోట్: పై అంశాలతోపాటు అనేక అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డాటా సేకరిస్తారు. ఈ ప్రశ్నావళికి కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఒక దేశంలో వ్యాపారానికి అనుగుణంగా ఏ స్థాయిలో సరళీకరణ జరుగుతున్నదో తెలుసుకోవడమే ప్రశ్నావళిలోని అంశాల ఉద్దేశం. ఈ సరళీకరణ విధానాలను అమలు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు పోటీ పడుతున్నాయి. దీంతో వ్యాపారం, వాణిజ్యంలో పోటీ వాతావరణం పెరుగుతూ సంపద సృష్టించబడి పేదరికం తగ్గించబడుతున్నది. దేశాలకే కాకుండా ఒక దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపార అనుకూలతలను తెలుసుకొనేందుకు కూడా ప్రశ్నావళి ఉంటుంది. దాని ఆధారంగా డాటా సేకరించి ర్యాంకులు ఇస్తున్నారు.
-2013లో ప్రారంభమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్టులో వరుసగా ఏడేండ్లు సింగపూర్ మొదటిస్థానంలో నిలిచింది.
-80 దేశాలతో ప్రారంభమైన ఈ రిపోర్టు 2013కు 180 దేశాలకు విస్తరించింది. 2014లో లిబియా, మయన్మార్, సాన్ మారినో, దక్షిణ సూడాన్ దేశాలతో కలుపుకొని 189 దేశాలకు విస్తరించింది.
ర్యాంకులతో ఉపయోగం ఏమిటి?
-ప్రపంచంలో ప్రస్తుతం ఏ దేశమూ తన సొంత పెట్టుబడులు, వనరులతో అభివృద్ధి సాధించడంలేదు. ఒకదేశం అభివృద్ధి ప్రపంచంలోని ఇతర దేశాలతో ఆ దేశానికి ఉన్న వాణిజ్య, వ్యాపార సంబంధాలపైనే అధికంగా ఆధారపడి ఉన్నది. ప్రస్తుతం ఏ దేశంలోని పెట్టుబడిదారుడు అయినా, ఇతర ఏ దేశంలో అయినా పెట్టుబడులు పెట్టవచ్చు. అలా బయటి నుంచి వస్తున్న పెట్టుబడులతోనే అనేక దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు విదేశీ పెట్టుబడులు చాలా కీలకంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారుడు వ్యాపారాన్ని ప్రారంభించి, నిర్వహించేందుకు వీలైనంత సరళీకృత విధానాలు ఉంటేనే పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో ఉత్తమ ర్యాంకు కలిగి ఉన్న దేశంలో వ్యాపార నిర్వహణకు పెద్దగా అడ్డంకులు ఉండవు, అంతేకాకుండా పెట్టుబడిదారుడికి తగిన రక్షణ కూడా ఉంటుంది. అందువల్ల ఆ దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశాల మధ్య, ఒక దేశంలోని రాష్ర్టాల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం ఉంది.
విమర్శ
-వ్యాపారం, వాణిజ్యంలో పోటీ వాతావరణాన్ని పెంచడంలో బాగానే ఉపయోగపడుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ కార్మికులు, ఉపాధి వంటి అంశాల్లో తీవ్ర విమర్శలకు గురయ్యింది. ముఖ్యంగా పెట్టుబడిదారుడిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది పనిచేస్తుండటంతో ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: భారత్
-వ్యాపార నిర్వహణకు అవసరమైన సరళీకరణ విధానాలను అమలుచేయడంలో భారత్ ప్రపంచదేశాలతో పోల్చితే చాలా వెనుకబడి ఉందని ఆ నివేదిక పేర్కొంటున్నది. దేశంలో సంప్రదాయకంగా ఉన్న కొన్ని ప్రతిబంధకాల దృష్ట్యా సరళీకృత విధానాల అమలు నెమ్మదిగా సాగుతున్నది. అందువల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులతో 2017లో భారత్ 130వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 2016లో 131వ స్థానంలో ఉండగా ప్రస్తుతం ఒక స్థానం మెరుగుపర్చుకున్నది. ఈ ర్యాంకుల్లో న్యూజిలాండ్ మొదటిస్థానంలో ఉంది.
తెలంగాణ నంబర్ 1
-కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా అమలవుతున్న అభివృద్ధి, సరళీకరణ విధానాలవల్ల.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థాయికి చేరుకొన్నది. 2015లో 13వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2016 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి ఎగబాకింది. కేంద్ర పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక మండలి (డీఐపీపీ రూపొందించిన 403 సంస్కరణల్లో అత్యధిక అంశాలను అమలుచేసిన తెలంగాణ మొదటిస్థానంలో నిలిచింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?