Who is Tanisha Guru | తానీషా గురువు ఎవరు?

మహ్మద్ కులీ కుతుబ్‌షా (1580-1612)
-ఇతడు ఇబ్రహీం కులీకుతుబ్‌షా మూడో కుమారుడు.
-గొప్ప కళాభిమాని, నిర్మాత. ఇతడే నేటి హైదరాబాద్ నగర నిర్మాత.
-ఇతడు గొప్ప సాహిత్యాభిమాని. దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట. తెలుగు భాషలో కూడా మంచి పాండిత్యంగలవాడని కొందరు పండితులు పేర్కొన్నారు.
-ఇతని కలం పేరు మానీల్. ఇతని కవిత్వాలు కులియత్ కులీ అనే పేరుగల పుస్తకంలో ఉన్నాయి.
-ఇతని కాలంలో సారంగ తమ్మయ్య వైజయంతీవిలాసం, సబ్బటి కృష్ణమాత్యుడు రత్నాకరం రచించారు.
-ఇతని సేనాపతి ఎక్లాస్ఖాన్ అమీనాబాద్ తెలుగు శాసనాన్ని వేయించాడు.
-ప్రసిద్ధ చరిత్రకారుడైన హెచ్‌కే షేర్వాణీ తన రచన హిస్టరీ ఆఫ్ కుతుబ్‌షాహీ డైనస్టీలో ఇతని కాలాన్ని కల్చరల్ ఆఫ్ లిఫ్ట్‌గా వర్ణించాడు.
-ఇతను భాగ్యమతి అనే హిందూ స్త్రీని వివాహమాడాడు. ఈమెకు హైదర్ మహల్ అనే పేరు ఇచ్చారని పెరిస్టా పేర్కొన్నాడు.
-ఇతను 1591లో భాగ్యనగర్ (హైదరాబాద్)ను నిర్మించాడు. ఇది చించెల అనే గ్రామం నుంచి అభివృద్ధి చెందింది.
-భాగ్యమతి పేరుమీదగానే ఈ నగరాన్ని నిర్మించినట్లు కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
-కానీ హైదరాబాద్‌లో ఉద్యానవనాలు (బాగ్) అధికంగా ఉండటంతో దీనికి బాగ్‌నగర్ అనే పేరు వచ్చిందని థెవ్నట్ పేర్కొన్నాడు.
-హైదరాబాద్‌లో సంభవించిన ప్లేగును పూర్తిగా నిర్మూలించిన సందర్భంగా ఇతను 1591-94లో చార్మినార్‌ను నిర్మించాడు.
-అంతేకాకుండా ఇతను హైదరాబాద్ నగరంలో దాద్‌మహల్, గగన్ మహల్, దార్ ఉల్ షిఫా (దవాఖాన), చార్‌కమాన్ మొదలైన నిర్మాణాలు చేశాడు.
-ఇతని కాలంలోనే 1605లో డచ్, 1611లో బ్రిటిష్‌వారు మచిలీపట్నంలో స్థావరాలు నిర్మించారు.
హైదరాబాద్ నగరం:
మహ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో రాజకీయంగా, సాంస్కృతికంగా, నూతనంగా నిర్మించిన హైదరాబాద్ నగరం మధ్యయుగ దక్కన్‌లోనే ఒక ప్రఖ్యాతి నగరంగా విశిష్ఠ మిశ్రమ సంస్కృతి (కాంపోజిట్ కల్చర్)కి కేంద్రంగా రూపుదిద్దుకున్నది. ముఖ్యంగా దక్కన్‌లోని సమకాలీన షియా రాజ్యాల్లోకెల్లా గోల్కొండ రాజ్యం, దాని పాలకుడు ప్రజాభిమానాన్ని పొందారు. మహ్మద్ కులీ కుతుబ్‌షా మొఘల్, పర్షియా పాలకులతో స్నేహపూర్వక దౌత్య సంబంధాలకు విశేష కృషిచేసి సఫలీకృతుడయ్యాడు.
-ఇరాన్ దేశం నుంచి అనేకమంది కవులు, కళాకారులు, వర్తకులు, మేధావులు అఫాకీలుగా వలసవచ్చి స్థిరపడ్డారు. వీరిలో ముఖ్యుడు మీర్ మోమిన్ అస్ట్రాబాదీ. ఇతడు 1581లో మహ్మద్ కులీకుతుబ్‌షా కొలువులో చేరాడు. తన విశ్వసనీయత, ప్రతిభను ప్రదర్శించి 1585 నాటికి సుల్తాన్ వద్ద పీష్వా పదవిని చేపట్టాడు. ఇతడు బహుముఖ మేధావి, ఇంజినీర్, సూఫీ తత్వవేత్త, పరిపాలనవేత్త. హైదరాబాద్ నగరం, చార్మినార్ దాని పరిసర కూడళ్ల నిర్మాణ ప్రణాళికలను మీర్ మోమిన్ అస్ట్రాబాదీ రూపొందించి సుల్తాన్ ప్రశంసలు పొందాడు.
సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా (1612-26)
-ఇతడు మహ్మద్ కులీకుతుబ్‌షా అల్లుడు. హైదరాబాద్‌కు సుల్తాన్ నగర్‌గా నామకరణం చేశాడు.
-ఇతని కాలంలో మక్కామసీద్ నిర్మాణం ప్రారంభమైంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దీన్ని పూర్తిచేశాడు.
-ఇతని కాలంలో ట్రావెర్నియర్ అనే ఫ్రెంచి యాత్రికుడు హైదరాబాద్‌లో పర్యటించి మక్కామసీదు నిర్మాణం గురించి వివరించాడు.
-మక్కా నుంచి రాళ్లు, మట్టి తెప్పించి ఈ మసీదు నిర్మాణం చేపట్టారు. కనుక దీనికి మక్కామసీదు అనే పేరు వచ్చింది.
-సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా శాంతిప్రియుడు. భగవద్భక్తి కలవాడు. యుద్ధాలు, వ్యూహాలు, కుట్రలు, కుతంత్రాలు, దౌత్యనీతిలో అతనికి అవగాహన శూన్యం. ఇతని ప్రధానమంత్రి మీర్ మోమిన్ అస్ట్రాబాదీ. తర్వాత ప్రధాని పదవి చేపట్టిన అల్లమా-ఇబన్-ఇ-కాతూన్ అమూలీగా కుతుబ్‌షాహీ రాజ్య పరిరక్షణ బాధ్యతలు నిర్వహించారు.
-ఇతనికాలంలో మొఘల్ రాయబారి మీర్ మక్కి గోల్కొండ సుల్తాన్ దర్బారును సందర్శించాడు. గోల్కొండ సుల్తాన్ మొఘల్ చక్రవర్తి జహంగీర్‌తో స్నేహం కోరి సంధికి అంగీకరించి 15 లక్షల విలువైన బహుమతులు మొఘల్ చక్రవర్తికి సమర్పించాడు.
-ఇతను స్వయంగా పర్షియన్ భాషలో గొప్ప పండితుడు. ఇతడు ఆధ్యాత్మిక, ధార్మిక భావాలతో జిల్లులా పేరుతో కవిత్వం రాశాడు.
-పర్షియా రాజు అయిన షా అబ్బాస్‌తో స్నేహసంబంధాలు కొనసాగించాడు. పర్షియా రాయబారి హసన్-బేగ్-కిఫాకీ గోల్కొండ సుల్తాన్ ఆస్థానంలో రెండేండ్లు గౌరవ అతిథిగా గడిపాడు.
-సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా కాలంలో మీర్ మహ్మద్ అస్ట్రాబాదీ రిసాలా మికర్దాయ అనే గ్రంథాన్ని తూనికలు, కొలతలపై రాశాడు.
అబ్దుల్లా కుతుబ్‌షా (1626-72)
-అబ్దుల్లా కుతుబ్‌షా తన తండ్రి మరణానంతరం పన్నెండేండ్ల వయస్సులోనే గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు.
-ఇతని తల్లి హయత్బక్షీ బేగం సంరక్షణలో ఇతడి పరిపాలన కొంతకాలం కొనసాగింది.
-ఇతని కాలంలోనే గోల్కొండ రాజ్యంపై మొఘల్ చక్రవర్తులు షాజహాన్, ఔరంగజేబులు నిరంతర దండయాత్రలు జరిపారు. గోల్కొండ రాజ్యం రాజకీయంగా, సైనికంగా, ఆర్థికంగా ఇతని కాలంలో బలహీనమైంది.
-అబ్దుల్లా కుతుబ్‌షా, షాజహాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొని ప్రఖ్యాత కోహినూర్ వజ్రాన్ని, లక్షల విలువైన బహుమానాలను షాజహాన్‌కు ఇచ్చాడు.
-కోహినూర్ వజ్రం కృష్ణా డెల్టా కల్లూరు అనే ప్రాంతంలో దొరికిందని ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పేర్కొన్నాడు.
-కానీ కోహినూర్ వజ్రం గోల్కొండ వజ్రపు గనుల్లో దొరికిందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.
-అబ్దుల్లా కుతుబ్‌షా గోల్కొండలో ఆంగ్లేయులు యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి బంగారు ఫర్మానాను 1636లో జారీచేశాడు.
-ఇతని కాలంలో క్షేత్రయ్య మువ్వపదాలు రాశాడు. క్షేత్రయ్య బిరుదు శృంగార పదకవి.
-ఇతనికాలంలో గోల్కొండ రాజ్యంలోని అధికారులు ముఠాలుగా విడిపోయారు. స్వార్థబుద్ధితో వ్యవహరించారు. దీనివల్ల రాజ్యం ప్రమాద పరిస్థితికి చేరిందని సిద్దికీ అనే చరిత్రకారుడు తన రచన హిస్టరీ ఆఫ్ గోల్కొండలో పేర్కొన్నాడు.
అబుల్ హసన్ తానీషా (1672-87)
-గోల్కొండ కుతుబ్‌షాహీ పాలకుల్లో అబుల్ హసన్ తానీషా చివరివాడు. ఇతడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు, మరాఠా యోధుడైన శివాజీకి సమకాలీకుడు.
-ఇతని కాలంలో గోల్కొండ రాజ్యంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఔరంగజేబు దాడులకు గోల్కొండ సుల్తాన్ పరాజితుడయ్యాడు. గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.
-ఇతని గురువు షారజు కట్టాల్ అబుల్ హసన్‌కు తానీషా (భోగి) అనే బిరుదు ఇచ్చాడు.
-ఇతనికాలంలోనే కంచర్ల గోపన్న (భక్త రామదాసు) పాల్వంచకు తహసీల్దారుగా ఉండేవాడు. కంచర్ల గోపన్న తాను వసూలు చేసిన శిస్తును ఖజానాకు పంపకుండా భద్రాచలంలో శ్రీరాముని దేవాలయం నిర్మించాడు.
-దీంతో తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించి తర్వాత విడుదల చేశాడు.
-తానీషా పాల్వంచ, శంకరగిరి గ్రామాలను భద్రాచలం శ్రీరాముని దేవాలయ నిర్వహణకు దానంగా ఇవ్వడమే కాకుండా అధికారికంగా రాజ్యం తరఫున ప్రతి ఏటా స్వామివారి కల్యాణ మహోత్సవం నాడు పట్టు వస్ర్తాలు సమర్పించాడు. ఇదే ఆచారం నేటికీ కొనసాగుతున్నది.
-ఈ కాలంలోనే రామదాసు దాశరథీ శతకం, రామదాసు కీర్తనలు, సింగనాచార్యుడు నిరోష కావ్యం రచించారు.
-అబుల్ హసన్ తానీషా సమర్థవంతంగా రాజ్యాధికారాన్ని చెలాయించడానికి కృషిచేశాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దండయాత్రలను చివరివరకు ధైర్యంగా ఎదిరించాడు. పరమత సహనం పాటించాడు. అక్కన్న, మాదన్న, గోపన్న మొదలైనవారు ఇతని అధికారులుగా పనిచేశారు. తన ప్రజల రక్షణ కోసం చివరివరకు పోరాడాడు. మొఘల్ సేనలను 18 నెలల పాటు ధైర్యంగా ఎదిరించాడు.
-ఇతను మరాఠా చక్రవర్తి శివాజీతో స్నేహ సంబంధాలు కొనసాగించాడు. ఇతనికాలంలో అక్కన్న, మాదన్నలు గోల్కొండ రాజ్య సుస్థిరతకు కృషిచేశారు. అక్కన్న సైన్యాధిపతిగా, మాదన్న ప్రధానిగా పనిచేశారు. అంతర్గత కుట్రల వల్ల 1686లో అక్కన్న, మాదన్నలు హత్యకు గురయ్యారు.
-అబ్దుల్లా ఫణి అనే కుతుబ్‌షాహీ అధికారి నమ్మకద్రోహం చేసి గోల్కొండ దుర్గ ద్వారాన్ని తెరిచాడు. దీంతో కుతుబ్‌షాహీ రాజధాని, గోల్కొండ దుర్గాలను మొఘల్ సేనలు ఆక్రమించాయి. అబ్దుల్ రజాక్ లౌరీ అనే సేనాపతి తానీషా తరఫున వీరోచిత పోరాటం చేసి మరణించాడు.
-ఔరంగజేబు అబుల్ హసన్ తానీషాను బీదర్ తరలించాడు. అక్కడి నుంచి దౌలతాబాద్‌కు తరలించి కోటలో బంధించాడు. పన్నెండేండ్లు బందీగా జీవించిన తానీషా దౌలతాబాద్ కోటలోనే 1699లో మరణించాడు. గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో విలీనమైంది. ఔరంగజేబు వైస్రాయ్‌ల ద్వారా గోల్కొండను పరిపాలించాడు.
కుతుబ్‌షాహీల పరిపాలన
-దక్కన్లో గోల్కొండ కేంద్రంగా 1518 నుంచి 1687 వరకు పరిపాలించిన కుతుబ్‌షాహీలు గతంలో భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా పరిపాలించిన ఢిల్లీ సుల్తానుల కంటే, గుల్బర్గా కేంద్రంగా పరిపాలించిన బహమనీ సుల్తానుల కంటే సమర్థవంతమైన, ప్రజారంజకమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించి ఆచరణలో పెట్టారు. తెలుగు ప్రజల విశ్వాసాన్ని, ప్రేమను గెలిచి నేటి తరానికి చెందిన పాలకులకు మార్గదర్శకులుగా నిలిచారు.
-కుతుబ్‌షాహీల పరిపాలన, రాజకీయవ్యవస్థ, స్వరూపం, స్వభావం గురించి మీర్జా ఇబ్రహీం జుబేరి రచన బసాతిన్-ఉస్-సలాతిన్ (దస్తూర్-ఉల్-అమల్) ఎంతో విలువైన చారిత్రక సమాచారాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలం 13 పేజీల వివరణ. దీని రచయిత మీర్జా ఇబ్రహీం జుబేరి, గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా (1626-72) సమకాలికుడని ప్రసిద్ధ చరిత్రకారుడు హెచ్‌కే షేర్వాణీ తన ప్రసిద్ధ రచన హిస్టరీ ఆఫ్ కుతుబ్‌షాహీ డైనస్టీలో పేర్నొన్నాడు.
-కుతుబ్‌షాహీ సుల్తానులు ధర్మ ప్రభువులుగా, ప్రజాసేవకే అంకితమైన సుల్తానులుగా, పరమత సహనం కలవారిగా సుమారు 175 ఏండ్లు పరిపాలించారు. వారిని ఈ మార్గంలో నడిపించిన సూత్రాలు బసాతిన్ రచయిత వివరించినవే.
RELATED ARTICLES
-
Current Affairs | SBI నాలుగో స్టార్టప్ బ్రాంచిని ఎక్కడ ఏర్పాటు చేశారు?
-
Scholarship 2023 | Scholarships for Students
-
General Studies | అరుదైన వ్యాధులు.. అసాధారణ లక్షణాలు
-
BIOLOGY | మొక్కలనిచ్చే కణుపులు.. దుంపలుగా మారే వేర్లు
-
Scholarships 2023
-
Current Affairs March 15 | National Women`s Day celebrated on?
Latest Updates
DSC Special – Social Studies | బ్యాంకులు పూచీకత్తులు లేకుండా రుణాలు ఎవరికి ఇస్తాయి?
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు