Cultural changes | యూరప్‌లో సాంస్కృతిక మార్పులు
-నైపుణ్యాలను బోధించడానికి మానవతావాదులు పాఠశాలలు నెలకొల్పారు. అంతేకాకుండా పాఠ్య పుస్తకాలు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉండేలా ముద్రణ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రచురణను చేపట్టారు. లాటిన్ లేదా గ్రీకు వంటి పురాతన భాషల్లో కాకుండా సాధారణ ప్రజలు మాట్లాడే ఇటాలియన్, ఇంగ్లిష్, ప్లెమిష్ వంటి భాషల్లో రాయడాన్ని మానవతావాదులు ప్రోత్సహించారు. అయితే అంతకుముందు కాలంలో అధ్యయనాలు ప్రధానంగా మతపరమైన అంశాలపై ఉండేవి. చర్చి అభిప్రాయాలకు భిన్నమైన వాటిని ప్రకటించడానికి పండితులు భయపడేవారు. కానీ ఇప్పుడు అధ్యయనాలు మానవులకు సంబంధించిన అంశాల మీద, జీవితాలు, ప్రేమలు, ఆలోచనలు, రాజకీయ వ్యవస్థలు, ఆర్థిక జీవితాల మీద దృష్టి కేంద్రీకరించాయి. చర్చి మీద ఆధారపడిన పండితులు కూడా చర్చి అభిప్రాయాలకు వ్యతిరేకంగా రాశారు. ఉదాహరణకు కాన్స్టాంటిన్ చక్రవర్తి.. చర్చికి అధికారాలు ఇచ్చాడన్న కొన్ని పత్రాలను వెల్ల అనే లాటిన్ పండితుడు అధ్యయనం చేశాడు. తన పరిస్థితిని మెరుగుపర్చుకోవడానికి చర్చి ఆ దొంగ పత్రాలను సృష్టించిందని నిరూపించాడు. ఇదేవిధంగా నెదర్లాండ్స్‌కి చెందిన మరో ప్రఖ్యాత మానవతావాది ఎరాస్మస్.. తొలి గ్రీకు క్రైస్తవుల రచనలైన బైబిల్లోని కొత్త నిబంధన వంటి మూల గ్రీకు గ్రంథాలను అధ్యయనం చేసి చర్చి చేసిన బైబిల్ అనువాదంలోని దోషాలను ఎత్తి చూపాడు. చర్చి నమ్మకాలు కొన్నింటిని విమర్శించి, ఇవి మూఢనమ్మకాల మీద ఆధారపడ్డాయని పేర్కొన్నాడు.
-1513లో మాకియవెల్లి రాసిన ది ప్రిన్స్ అనే పుస్తకంలో ఆ కాలంనాటి నిజ రాజకీయాలను పేర్కొన్నాడు. నీతి, నైతికత వంటి వాటి గురించి పట్టించుకోకుండా నిరంకుశ అధికారాన్ని ఎలా సాధించాలో అతడు పాలకులకు సలహా ఇచ్చాడు. ఈ విధంగా మానవతావాదులు భాషను, ఆలోచనలను మరింత ప్రతిభావంతంగా, నాగరికంగా చెయ్యడానికి పురాతన సాహిత్య అధ్యయనంతో మొదలుపెట్టి క్రమేపి మానవుల నిజ ప్రపంచం మీద అధ్యయనాలు చేస్తూ చర్చిని వ్యతిరేకించారు. ఉదారవాద విద్య అనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, పండితులకు, మేధావులకు స్వయంప్రతిపత్తిని సమకూర్చటంతో దాని ప్రభావం శాశ్వతంగా నిలిచిపోయింది.
కళాకారులు, వాస్తవికతావాదం
-మానవతావాదుల భావనలు కళలు, వాస్తు శిల్పానికి కూడా విస్తరించాయి. చిత్రకళ, శిల్పకళ వంటి దృశ్య కళల్లో ఇది వాస్తవికతావాద రూపాన్ని తీసుకుంది. కళాకారులు పురాతన గ్రీకు, రోమన్ కళలు, భవన నిర్మాణాలను అధ్యయనం చేసి వాటి నుంచి స్ఫూర్తి పొందారు. కొన్ని శతాబ్దాల క్రితం కచ్చితమైన నిష్పత్తుల్లో చెక్కిన స్త్రీ, పురుషుల విగ్రహాలు వాళ్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటలీకి చెందిన శిల్పులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలని అనుకున్నారు. వాళ్లు పర్షియా, చైనాకు చెందిన చిత్రకళను, శైలిని కూడా అధ్యయనం చేశారు. ప్రకృతి, ప్రజలు, ప్రదేశాలనూ పరిశీలిస్తూ వాటిని తమ చిత్రకళలో, శిల్పాల్లో యధాతథంగా చిత్రించడానికి ప్రయత్నించారు. దీనికోసం వాళ్లు శాస్త్రజ్ఞుల సహాయం తీసుకున్నారు. ఎముకల నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి వైద్య కళాశాలల్లోని ప్రయోగశాలలకు వెళ్లారు. పడువా విశ్వవిద్యాలయంలో వైద్య ఆచార్యుడైన ఆండ్రియాస్ వెసాలియస్ (1514-1564).. లోపలి శరీర భాగాలను వ్యవస్థలను అధ్యయనం చేయడానికి మనిషి శరీరాన్ని కోసిన మొదటి వ్యక్తి. ఆధునిక శరీర ధర్మశాస్త్ర అధ్యయనానికి ఇది నాంది పలికింది. ఆయన బెల్జియం దేశానికి చెందిన వ్యక్తి. లియొనార్డో డావిన్సీ వంటి కళాకారులు తమ బొమ్మలు, శిల్పాలు వాస్తవికంగా ఉండేలా చేయడానికి శరీర నిర్మాణ శాస్ర్తాన్ని అధ్యయనం చేశారు. దూరంలోని దృశ్యాలను చిత్రీకరించడానికి రేఖాగణిత జ్ఞానం ఉపయోగపడుతుందని చిత్రకారులు తెలుసుకున్నారు. అదేవిధంగా కాంతిలో మార్పుల ద్వారా తమ చిత్రాల్లో పొడవు, వెడల్పే కాకుండా లోతులను కూడా చూపించవచ్చని తెలుసుకున్నారు.
బొమ్మలు వేయడానికి ఆయిల్ పెయింట్లను ఉపయోగించటంతో అంతకుముందు వీలుకాని ప్రకాశవంతమైన రంగులు ఇప్పుడు సాధ్యమయ్యాయి. అనేక చిత్రాలలోని బట్టలు, వాటి రంగుల్లో చైనా, పర్షియన్ చిత్రకళ ప్రభావం స్పష్టంగా కనపడేది. ఈ విధంగా శరీర నిర్మాణశాస్త్రం, రేఖాగణిత, భౌతికశాస్ర్తాలతో పాటు అందానికి సంబంధించిన బలమైన భావన ఇటలీ కళలకు ఒక ప్రత్యేకత సమకూర్చింది. దీన్ని యదార్థవాదంగా వ్యవహరించసాగారు. ఈ ధోరణి 19వ శతాబ్దం వరకు కొనసాగింది. ఈ విధంగా ప్యూడల్ కాలంలో చర్చి ప్రోత్సహించిన కళకంటే పునరుజ్జీవన కాలంలోని కళ ఎంతో భిన్నమైనది. మతపరమైన కళ మతపరమైన అంశాలను చిత్రించేది. కొన్ని ఆదర్శ రూపాలకనుగుణంగా మనుషులను, వస్తువులను చిత్రించేవాళ్లు. తమ చుట్టూ ఉన్న వాస్తవికతను కాకుండా ఆ ఆదర్శాలను ప్రతిబించేవాటిని కళగా చిత్రీకరించాలని అనుకునేవాళ్లు. అయితే పునరుజ్జీవన కాలంనాటి కళాకారులు తమ పరిసరాల్లోని అంశాలను చిత్రించారు. గ్రీకు, రోమన్ సాహిత్యం లోంచి మానవుల భావనలు, శక్తిని, బలాన్ని వ్యక్తపరిచే బొమ్మలు వేశారు. ఈ కొత్త కళను చర్చి కూడా ప్రోత్సహించసాగింది. పోప్, చర్చికి చెందిన ఇతర నాయకులు తమ కోసం చర్చిలు, ప్రార్థనా స్థలాల ను నిర్మించడానికి మైకెలాంజిలో, రాఫెల్ వంటి గొప్ప కళాకారులను నియమించుకున్నారు. పోప్‌లకు, బిషప్‌లకు ఈ కళాకారులు పెద్ద, పెద్ద సమాధులను స్మారక స్థూపాలను నిర్మించారు. ఎన్నో చర్చిలు, కాథిడ్రల్ల గోడలపై వేశారు. అవే ఇప్పుడు అత్యుత్తమైన చిత్రకళగా గుర్తింపు పొందాయి. అయితే పునరుజ్జీవన కాలం నాటి కళాకారులు పేదల జీవితాలపట్ల, వాళ్ల వ్యథలపట్ల ఎటువంటి ఆసక్తి కనపర్చలేదు. ఇందుకు విరుద్ధంగా ధనికులు, శక్తిమంతులు, విజయవంతులైన ప్రజలను తమ కళల్లో చిత్రికరించడానికి ఆసక్తి కనబర్చారు. ఆనాటి ఉచ్ఛ దశలోని చిత్రకళకు ప్రతినిధులుగా మైకెలాంజిలో, లియోనార్డో డావిన్సీ, రాఫెల్‌లను పేర్కొనవచ్చు.
మైకెలాంజిలో (1475-1564)
-ఇతను సిైస్టెన్ చాపెల్ పైకప్పు మీద బైబిల్లో వర్ణించిన ఘట్టాలను అద్భుతంగా చిత్రించాడు. సృష్ట్యాది నుంచి జళప్రళయం వరకు అనే శీర్షికలో వాటిని చిత్రించాడు. లాస్ట్ జడ్జ్మెంట్ అనేది ఇతని ప్రఖ్యాత కళాఖండం. ఈ కుడ్య చిత్ర సముచ్ఛయంలో మొత్తం 145 చిత్రాలు, 394 మూర్తి చిత్రాలు ఉన్నాయి. వీటిలో అతని సౌందర్య దృక్పథంతో పాటు ప్రగాఢమైన మతాభినివేశం కూడా కనిపిస్తుంది.
లియోనార్డో డావిన్సీ (1452-1519)
-ఇతడు గీసిన చిత్రాల్లో లాస్ట్ సప్పర్ (చివరి విందు), మోనాలిసా విశ్వవిఖ్యాతి సంపాదించుకున్నాయి.
-సమపాళ్లలోనూ, విచక్షణతోనూ రంగులను ఉపయోగించడంలో అతడికి అతడే సాటి. మానవ శరీరశాస్ర్తాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడంతో డావిన్సీ చిత్రలేఖనాల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. ఇతడు తన కళానైపుణ్యాన్ని కేవలం చిత్రలేఖనానికి మాత్రమే పరిమితం చేసుకోలేదు. డావిన్సీ గొప్ప శిల్పి, ఇంజినీర్ కూడా.
-ఉత్తర ఇటలీలో అతడు తవ్వించిన కాలువ అతడి ఇంజినీరింగ్ నైపుణ్యానికి ప్రతీక. ఇతను గొప్ప తత్వవేత్త, గాయకుడు, యంత్ర నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నాడు.
-ఫ్రెంచి రాజు మొదటి ఫ్రాన్సిస్, మిలాన్ నగరం వచ్చినప్పుడు డావిన్సీ నిర్మించిన ఓ మరసింహాన్ని అతడికి చూపించాడు. అది ముందుకాళ్లపై లేచి, నిజమైన సింహంలా గాండ్రించి, ఫ్రెంచ్ రాజుతో సహా అక్కడున్న అందరిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తింది.
-ఎగరగలగటం అనేది అతడి కలల్లో ఒకటి. ఎగురుతున్న పక్షులను సంవత్సరాల తరబడి పరిశీలించి ఎగిరే యంత్రం నమూనాను తయారుచేశాడు.
-ఇతడు లియోనార్డో డావిన్సీ ప్రయోగాల శిష్యుడు అని తన సంతకం చేసేవాడు.
రాఫెల్ (1483-1520)
-పదహారో శతాబ్దానికి చెందిన మరో చిత్రకారుడు రాఫెల్
-ఇతనికి పోప్ రెండో జూలియస్, పోప్ పదో లియోలా ఆదరణ లభించింది. పోప్ అధికార నివాసం వాటికన్‌ను ఇతడు తన చిత్రాలతో అలంకరించాడు.
-కాంతివంతమైన రంగులతో చిత్రాలను గీయడంలో మేటి.
టీషియన్ (1477-1576)
-ఇతడు కూడా కాంతివంతమైన రంగులతో చిత్రాలను గీయడంలో నేర్పరి.
-వెనిస్ నగరాన్ని ఇతడు తన చిత్రాలతో అలంకరించాడు.
-స్పెయిన్ చక్రవర్తులు నాలుగో చార్లెస్, రెండో ఫిలిప్‌ల ప్రోత్సాహం ఇతనికి లభించింది.
-తైలవర్ణ చిత్రాలు వేయడంలో ఇతడు మేటి. ఇతడు చిత్రించిన వీనస్ చిత్రం ప్రసిద్ధి చెందింది. ఎజంప్షన్ ఆఫ్ ది వర్జిన్ అనే మత విషయక వస్తువుగల చిత్రం మరొక ప్రసిద్ధి చెందిన చిత్రం.
అల్బ్రెక్ట్ డ్యూరర్ (1471-1528)
-కళ ప్రకృతిలో ఇమిడి ఉంది. దానిని వెలికి తీయగలిగినవాళ్లకు అది అందుతుంది. జీవితానికి ఎంత దగ్గరగా ఉంటే అది అంత బాగా ఉంటుంది. ఏ వ్యక్తి తన ఊహ ద్వారా అందమైన బొమ్మ వేయలేడు. జీవితం నుంచి అధ్యయనం చేసింది మెదడులో బాగా ముద్రించుకొని ఉంటే తప్ప అని వ్యాఖ్యానించాడు.
-ప్రార్థించే చేతులు అనే పేరుతో డ్యూరర్ వేసిన బొమ్మ 16వ శతాబ్దపు ఇటలీ సంస్కృతిని తెలియజేస్తుంది.
-జర్మనీకి చెందిన హల్బెన్ మూర్తి చిత్రణలతో ప్రసిద్ధి చెందాడు.
-స్పెయిన్‌కు చెందిన ఎల్గ్రీకో మత సంబంధమైన చిత్రాలే చిత్రించాడు.
వాస్తు శిల్పం
-ఫ్యూడలిజం బలపడటంతో యూరప్‌కి చెందిన గొప్ప కళలు, సంస్కృతి క్రమేపి మరుగునపడ్డాయి. అయితే 15వ శతాబ్దంలో రోమ్ నగరం తిరిగి దాని పూర్వ వైభవానికి పునరుద్ధరించబడింది. రోమ్ చరిత్రను అధ్యయనం చేయడాన్ని పోప్ ప్రోత్సహించాడు. పాత రోమన్ శైలిని పునరుద్ధరించడానికి రోమన్ కాలపు భవనాల శిథిలాలను అధ్యయనం చేశారు. భవనాల్లో పొడవాటి స్తంభాలు, కమానులు, గుండ్రటి పైకప్పులను రోమన్లు ఉపయోగించారు. భవన నిర్మాణంలో ఇది ఒక కొత్త శైలికి దారితీసింది. వాస్తవానికి ఇది పురాతన రోమన్ శైలి పునరుద్ధరణ మాత్రమే. ఇప్పుడు దీనిని క్లాసికల్‌గా వ్యవహరిస్తున్నారు. మత గురువులు, ధనిక వ్యాపారస్తులు, కులీన వర్గాలవాళ్లు ఈ రకమైన భవన నిర్మాణంతో పరిచయం ఉన్న భవన నిర్మాతలతో ఇళ్లు కట్టించారు. కళాకారులు, శిల్పులు భవనాలను చిత్రాలు, శిల్పాలతో అలంకరించారు. ఈ కాలంలో మరో ముఖ్యమైన మార్పు అంతకుముందు కాలంలో మాదిరి కళాకారులు వాళ్లు సభ్యులైన బృందం పేరుతో కాకుండా వ్యక్తిగతంగా వాళ్ల పేరుతో ప్రసిద్ధి చెందారు. కొంతమంది చిత్రకళ, శిల్పం, భవన నిర్మాణం వంటి అనేక విషయాల్లో నైపుణ్యం కలిగి ఉండేవాళ్లు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?