Appointment of Judges-Disputes | జడ్జీల నియామకం-వివాదాలు
భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య వివాదాలు ఏర్పడటం చాలా తక్కువేనని చెప్పాలి. అయితే న్యాయశాఖ, కార్యనిర్వాహకశాఖల మధ్య మాత్రం కొన్నిసార్లు వివాదాలు ఏర్పడ్డాయి. అందులో ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం గురించే ఈ వివాదాలు ఎక్కువ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ తన స్వతంత్రతను కాపాడుకోవటమనే కారణంతో న్యాయమూర్తుల నియామకం తమ చేతుల్లోనే ఉండాలని సుప్రీంకోర్టు, పారదర్శకతకోసం తన చేతుల్లోకి తీసుకోవాలని కార్యనిర్వాహకశాఖ చేస్తున్న ప్రయత్నాలు ఇటీవలికాలంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
రాజ్యాంగంలో ఉన్న ఎన్నో అంశాలను, వివాదాస్పద అధికరణలను దాదాపు అన్ని అంశాలను తనదైన శైలిలో విపులీకరించే సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలపై ఒక విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తుంది. తనదైన అర్ధవివరణలు ఇస్తూ జ్యుడీషియల్ ఓవర్ ఆక్టివిజమ్కి పాల్పడుతుంది.
జడ్జీల నియామకం-చరిత్ర
-జడ్జీల నియామకం గురించి రాజ్యాంగంలోని అధికరణ 124(1) ప్రకారం దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉండాలి. అందులో ఒక ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), ఏడుగురికి మించకుండా న్యాయమూర్తులు ఉండాలి. ఈ సంఖ్యను పెంచాలంటే పార్లమెంటు చట్టం ద్వారా పెంచవచ్చు అని ఉంది. అందుకే ప్రస్తుతం మొత్తం సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 31కి పెంచారు.
-సుప్రీంకోర్టు జడ్జీని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి జడ్జీలను నియమించేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలను, హైకోర్టు జడ్జీలను సంప్రదించవచ్చు.
-ఒకవేళ సీజేఐని కాకుండా ఇతర జడ్జీలను నియమించేటప్పుడు రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించాలి.
-అదేవిధంగా ప్రతి హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఉండాలి. హైకోర్టు జడ్జీల సంఖ్యను అవసరం అనుకున్నప్పుడు రాష్ట్రపతి మార్పులు చేయవచ్చు.
-నోట్: అంటే సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను మార్చేది పార్లమెంట్ అయితే హైకోర్టు జడ్జీల సంఖ్యను మార్చేది మాత్రం రాష్ట్రపతి.
-ప్రతి హైకోర్టు జడ్జీని నియమించేముందు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను కూడా సంప్రదిస్తారు.
-హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాకుండా ఇతర జడ్జీలను నియమించేటప్పుడు.. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధానన్యాయమూర్తిని కూడా సంప్రదించవచ్చు. అంటే ప్రతి జడ్జీని ఎలా నియమించాలో రాజ్యాంగ ప్రకారం స్పష్టంగా, రాష్ట్రపతి మరికొందరిని సంప్రదించి నియమిస్తారు.
-సంప్రదించడం అంటే సమ్మతించడం కాదు. అంటే రాష్ట్రపతి సీజేఐని కానీ, గవర్నర్‌ను కానీ సంప్రదించినప్పుడు వారు ఇచ్చిన అభిప్రాయాన్ని కచ్చితంగా సమ్మతించాలా, వద్దా అనే విషయంపై ఇంకా వివాదం కొనసాగుతున్నది.
-1950 నుంచి దాదాపు రెండు శతాబ్దాలు జడ్జీల నియామకం ఇదే నియమంపై రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి నియమించారు.
-మొదటి రెండు శతాబ్దాలు ప్రభుత్వానికి, భారత ప్రధాన న్యాయమూర్తికి దాదాపు ఏకాభిప్రాయం ఉండాలి.
-సీనియర్ మోస్ట్ జడ్జీని మాత్రమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేవారు. కానీ 1973లో ముగ్గురు సీనియర్ జడ్జీలను కాదని జూనియర్ అయిన ఏఎన్ రాయ్‌ని సీజేఐగా నియమించారు. అలాగే 1977లో అప్పుడున్న జడ్జీలను పక్కకు పెట్టి ఎంయూ బేగ్‌ను నియమించారు.
-ఈ రెండు నియామకాలకు సంబంధించి వివాదం ఏర్పడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కేసు విషయంపై నియామకాలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. అలా వివాదాలు ఏర్పడిన జడ్జీల కేసుల వివరాలు..
ఎస్పీ గుప్తా కేసు-1982
-రాజ్యాంగంలో ఉన్న సంప్రదింపులు అనే పదానికి సమ్మతింపు అనే అర్థం వస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అంతేకాకుండా హైకోర్టు జడ్జీకి ఇష్టం లేకుండా అతన్ని మరో కోర్టుకు బదిలీ చేయవచ్చా? లేదా? అని మరో ప్రశ్న ఉదయించింది.
-ఇలా 1982 నుంచి 1992 వరకు జడ్జీల నియామకం వివాదాస్పదమవుతూనే ఉంది.
ఎస్సీఏఆర్ఏ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
-ఇంతకుముందు ఇచ్చిన అన్ని జడ్జిమెంట్లను కాదని ఈ కేసులో ఒక సరికొత్త జడ్జిమెంటును సుప్రీంకోర్టు వెలువరించింది. దాని ప్రకారం..
-జడ్జీల నియామక ప్రక్రియ ఒక సమగ్ర (Integratie), భాగస్వామ్యం (Participative), సంప్రదింపుల (Consultative) పద్ధతి, ప్రక్రియ అని ఈ పద్ధతి ద్వారానే ఉన్నత న్యాయమూర్తులను నియమించాలని పేర్కొంది.
-సీజేఐ ఇచ్చిన అభిప్రాయం అందరికంటే ఎక్కువ, ముందు ప్రాధాన్యం పొందాలని పేర్కొంది.
-ఒకవేళ సుప్రీంకోర్టు జడ్జీని నియమించాలంటే సీజేఐ ద్వారా ఆ ప్రక్రియ మొదలవ్వాలనే హైకోర్టు జడ్జీల నియామకంలో ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రక్రియ మొదలవ్వాలని పేర్కొంది.
-కేవలం అత్యంత సీనియర్ మోస్ట్ జడ్జీని మాత్రమే సీజేఐగా నియమించాలనీ పేర్కొంది.
-ఈ విధంగా ప్రక్రియ సాగుతున్న క్రమంలో అధికరణ 143 ప్రకారం ఎప్పుడైనా రాష్ట్రపతి భావిస్తే సుప్రీంకోర్టు నుంచి న్యాయసలహాను పొందవచ్చు అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి జడ్జీల నియామకం గురించి సుప్రీంకోర్టును సలహా కోరుతారు. ఇదే మూడో జడ్జీల కేసుగా ప్రసిద్ధి చెందింది.
3వ జడ్జీల కేసు-1998
-ఈ కేసుతోనే కొలీజియం వ్యవస్థ ఆవిష్కృతమైంది.
సుప్రీంకోర్టు జడ్జీల నియామకం గురించి
-జడ్జీల నియామక ప్రక్రియను మొదలుపెట్టే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కచ్చితంగా నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జిలను సంప్రదించాలి.
-ఒకవేళ ఏదో ఇద్దరు జడ్జీలు సమ్మతించకపోయినా ఆ సిఫారసులు ప్రభుత్వానికి పంపవద్దు. అంటే నియామక ప్రక్రియ కొనసాగవద్దు.
-కొలీజియం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిల ఏదైనా భేదాభిప్రాయం ఉంటే దాన్ని పక్కన పెట్టాల్సిందే.
కొలీజియం అంటే
-సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జీలను, ప్రధాన న్యాయమూర్తిని కలిపి కొలీజియం అంటారు.
-కొన్నిసార్లు నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలనే కొలీజియం అంటారు. దీని నిర్వచనంపై స్పష్టత లేదు.
హైకోర్టు జడ్జీల గురించి
-హైకోర్టు జడ్జీలను నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులోని ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జీలను సంప్రదించి ప్రక్రియ మొదలు పెట్టాలి.
హైకోర్టు జడ్జీల బదిలీలకు సంబంధించి
-సుప్రీంకోర్టులో ఉన్న నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జీలతో పాటు రెండు హైకోర్టు (బదిలీ జరిగే హైకోర్టు, ఏ కోర్టుకు బదిలీ చేస్తున్నారో ఆ హైకోర్టు)ల జడ్జీలను కూడా సంప్రదించాలి.
-జడ్జీల బదిలీ న్యాయసమీక్ష కిందకు వస్తుంది.
-అంటే మూడో జడ్జీల కేసు తర్వాత సంప్రదింపుల ప్రక్రియ కేవలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మాత్రమే సంప్రదించాలనే నియమం నుంచి మరో నలుగురు జడ్జీలను సంప్రదించాలి, బదిలీల్లో అయితే మరింత మందిని సంప్రదించాలనే కొత్త నియమాలతో కొలీజియం పద్ధతి ఆవిర్భవించింది.
-ఈ విధంగా కొలీజియం వ్యవస్థ ద్వారా రాష్ట్రపతి నియామక అధికారాన్ని నామమాత్రం చేస్తూ జడ్జీలే నియమించుకునే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి 2015 వరకు జడ్జీల నియామక ప్రక్రియ కొనసాగింది.
జడ్జీల నియామకం ప్రస్తుత పరిస్థితి
-ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు కొలీజియం వ్యవస్థ ద్వారానే సిఫారసు అయి రాష్ట్రపతి చేత నియామకమవుతారు. కొలీజియం సిఫారసు మేరకే బదిలీలు కొనసాగుతాయి. కానీ ఈ కొలీజియం వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం కోసం మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ (MOP) ఇటీవలే తయారుచేసి సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అందజేసింది.
-ఇప్పటి నుంచి ఈ MOP ప్రకారం కొలీజియం సిఫారసుల మేరకు జడ్జీల నియామకం, బదిలీలు కొనసాగుతాయి.
NJAC Act కూర్పు
-మొత్తం 6గురు ఉంటారు.
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి- చైర్మన్
2. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత మరో ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ జడ్జీలు ఉంటారు.
3. భారత న్యాయశాఖా మంత్రి
4. ఇద్దరు ప్రముఖ వ్యక్తులు
-పైన పేర్కొన్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను నియమించడానికి భారత ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేత ఆధ్వర్యంలో ఈ ముగ్గురు ఆ ఇద్దరిని నియమిస్తారు.
NJAC ముఖ్య విధి
1. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర జడ్జీలను నియమించడానికి పేర్లను రాష్ట్రపతికి సిఫారసు చేయడం
2. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల పేర్లను కూడా రాష్ట్రపతికి సిఫారసు చేయడం
3) ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకి జడ్జీల బదిలీ ప్రక్రియ
-పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి, జడ్జీల నియామకాల్లో ప్రభుత్వ పాత్రకు సంబంధించి, ఈ ప్రక్రియలో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల పాత్రపై అనుమానాలతో సుప్రీంకోర్టు NJACని కొట్టివేసింది.
కొలీజియం విమర్శలు
1. పారదర్శకత లేకపోవడం (జడ్జీల నియామకానికి ఒక పద్ధతి, ప్రక్రియను ఏర్పర్చకపోవడం, దాన్ని ఎవరికి చెప్పకపోవడం)
2. జవాబుదారీతనం లేకపోవడం (ఎవకరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోవడం)
3. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణ శాఖకు ఉండాల్సిన అధికారాలను నామమాత్రం చేయడం
4. బాగా పలుకుబడి, కుల, వర్గ, లింగ పలుకుబడి, వివక్షాపూరితంగా ఎంతోమందిని నియమించడం
5. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలను సరైన నిష్పత్తిలో నియమించకపోవడం
6. 2015, ఏప్రిల్ 1నాటికి మొత్తం 998 పోస్టుల్లో ఇంకా 358 పోస్టులు ఖాళీగా ఉండటం మొదలైన విషయాలకు సంబంధించి తీవ్రస్థాయిలో ప్రభుత్వం తరఫున, పౌరసంఘాల నుంచి విమర్శలు రావడం.
-ఆ ప్రక్రియలో భాగంగా 2011లో సూరజ్ ఇండియా ట్రస్ట్ కేసులో కింది ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
1. అధికరణం 124(2)లో ఉన్న సంప్రదించాలి అనే పదం అర్థం సమర్పించాలనా?
2. అసలు కొలీజియం అనే పదం రాజ్యాంగంలో ఉందా?
3. న్యాయశాఖ అభిప్రాయాలు రాజ్యాంగాన్ని మార్చవచ్చా?
4. 1993, 1998లో వచ్చిన న్యాయనిర్ణయాలను మరో పెద్ద రాజ్యాంగ ధర్మాసనంతో మార్చవచ్చా?
-పై ప్రక్రియలను మార్చడానికి, జడ్జీల నియామకంలో ప్రభుత్వానికి కూడా (కార్యనిర్వహణ శాఖ) ఉండాలనే ఉద్దేశంలో, కొలీజియంపై వచ్చిన విమర్శల ఆధారంగా ప్రభుత్వం జాతీయ న్యాయ నియామక బిల్లుకు సిఫారసు చేస్తూ, దాన్ని రూపొందించి 2014, డిసెంబర్ 31న 99వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొంది NJAC Act ఏర్పడింది. అది ఆర్టికల్ 124ని మార్చి కొత్త భాష్యం చెప్పింది. దాన్ని నోటిఫై చేస్తూ 2015, ఏప్రిల్ 13న గెజిట్‌లో కూడా ప్రచురించింది.
-కానీ ఈ NJAC Act న్యాయవ్యవస్థ స్వతంత్రను రాజ్యాంగ మౌలిక భావనను (బేసిక్ స్ట్రక్చర్)ను దెబ్బతీస్తుందని భావిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దాని ఆధారంగా సుప్రీంకోర్టు NJAC Actను కొట్టివేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?