విప్లవం వెంటే విపత్తు..
రాజ్యాంగబద్ధ రాచరికంగా ఫ్రాన్స్ పరిణామం
-జాతీయ శాసనసభ 1791లో రాజ్యాంగ ముసాయిదా ప్రతిని తయారుచేసింది. దీని ప్రధాన ఉద్దేశం రాచరిక అధికారాలను పరిమితం చేయడం. అన్ని అధికారాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండటానికి బదులు శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య విభజించి ఉన్నాయి. దీంతో ఫ్రాన్స్ రాజ్యాంగబద్ధ రాచరిక దేశంగా మారింది.
-1791 రాజ్యాంగం చట్టాలను చేసే అధికారాన్ని జాతీయ శాసనసభకు ఇచ్చింది. ఇది పరోక్షంగా ఎన్నికయ్యే సభ. ఎన్నుకునేవాళ్ల సమూహాన్ని పౌరులు ఎన్నుకోగా ఆ సమూహం శాసనసభను ఎన్నుకుంటుంది. అయితే, పౌరులందరికీ ఓటుహక్కు లేదు. 25 ఏండ్ల వయస్సు పైబడి, కనీసం మూడు రోజుల కూలీ అంత పన్ను చెల్లిస్తున్న పురుషులకు మాత్రమే క్రియాశీలక పౌరుల హోదాను ఇచ్చారు. అంటే ఓటుహక్కు వీళ్లకు మాత్రమే ఉంది. పురుషులు, పౌరుల హక్కుల ప్రకటనతో రాజ్యాంగం మొదలైంది.
-జీవించే హక్కు, వాక్ స్వాతంత్య్రం, చట్టం ముందు అందరూ సమానులే వంటి హక్కులను సహజ, విడదీయరాని హక్కులుగా చేశారు. దీని అర్థం ఈ హక్కులు ప్రతిఒక్కరికి పుట్టుకతో సంక్రమిస్తాయి. పౌరుల సహజహక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. అయితే ఫ్రాన్స్‌లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. 16వ లూయీ రాజ్యాంగం మీద సంతకం చేసినప్పటికీ, అతడు ప్రష్యా రాజుతో రహ్యసంగా మంతనాలు చేపట్టాడు. ఇతర పొరుగు దేశాల పాలకులు కూడా ఫ్రాన్స్‌లోని పరిణామాలతో ఆందోళన చెందారు.
-1789 తర్వాత జరిగిన తిరుగుబాటును అణగదొక్కడానికి తమ సైన్యాలను పంపించడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇది జరిగే లోపలే 1792 ఏప్రిల్‌లో జాతీయ శాసనసభ ప్రష్యా, ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించింది. సైన్యంలో చేరడానికి వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వాళ్లు దీనిని యూరప్ అంతటిలోని రాచరికాలు, రాజులకు వ్యతిరేకంగా ప్రజల యుద్ధంగా చూశారు. 1791 రాజ్యాంగం సమాజంలోని ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులు ఇచ్చింది. కాబట్టి విప్లవ పంథా మరింత ముందుకు సాగాలని జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి తమ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవడానికి ప్రజలకు రాజకీయ క్లబ్బులు ముఖ్యమైన వేదికలయ్యాయి. వీటిల్లో విజయంతమైనవి జాకోబిన్స్ క్లబ్బులు.
-పారిస్‌లోని ఒకప్పటి సెయింట్ జాకబ్ కాన్వెంట్ నుంచి దీనికి ఆ పేరు వచ్చింది. జాకోబిన్ సభ్యులు ప్రధానంగా సమాజంలోని పేద ప్రజల నుంచి ఉండేవాళ్లు. చిన్న దుకాణదారులు, చేతివృత్తుల వాళ్లు, చెప్పులు తయారుచేసేవాళ్లు, వంటలు వండేవాళ్లు, గడియారాలు చేసేవాళ్లతో సహా సేవకులు, రోజువారీ కూలీలు ఇందులో ఉండేవారు. వాళ్ల నాయకుడు మ్యాక్సిమిలియన్ రాబ్స్పియర్. ఆహార పదార్థాల కొరత, అధిక ధరలతో కోపోద్రిక్తులైన అధిక సంఖ్యాక పారిస్ ప్రజలతో 1792 వేసవిలో జాకోబిన్లు ఒక తిరుగుబాటుకి ప్రణాళిక వేశారు. ఆగస్టు 10 ఉదయం ట్యులరేసిస్ భవనంపై దండెత్తి రాజు రక్షక భటులను చంపేశారు. కొంతకాలం రాజునే బందీగా ఉంచారు. ఆ తర్వాత రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. దాంతో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి సంపదతో సంబంధం లేకుండా 21 ఏండ్లు దాటిన పురుషులందరికీ ఓటుహక్కు లభించింది.
-ఈ విధంగా కొత్తగా ఎన్నికైన శాసనసభను కన్వెన్షన్ అని పిలిచారు. 1792 సెప్టెంబర్ 21న అది రాచరిక రాజ్యాన్ని రద్దుచేసి ఫ్రాన్స్‌ను గణతంత్రంగా ప్రకటించింది. కుట్ర ఆరోపణపై లూయీకి, రాణి మేరి ఆంటోనెట్లకు మరణశిక్ష విధించారు. 1793, జనవరి 21న 16వ లూయీకి మరణశిక్ష అమలు చేశారు. శరీరం నుంచి శిరస్సును వేగంగా ఖండించే మరణయంత్రం గిలెటిన్ ఎక్కుతూ లూయీ ఎంతో నిబ్బరం ప్రదర్శించాడు. నా రక్తమే ఫ్రాన్స్‌కు శాంతిని, సౌఖ్యాన్ని ఇవ్వగలదనుకుంటే.. ఆ రక్తం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు అని చివరి మాటలుగా పేర్కొన్నారు. లూయీ తన పరిపాలన కాలంలో అత్యంత హుందాగా ప్రవర్తించిన సందర్భం ఇదేనని చరిత్రకారులు వ్యాఖ్యానించారు.
-బీతావహ పాలన: జాతీయ కన్వెన్షన్‌కు రాచరికవాదులు, రిపబ్లికన్లలో మితవాదులైన జిరాంజిస్టులు సమస్యగా పరిణమించారు. వీరు పార్లమెంటరీ విధానాన్ని సమర్థిస్తూ ఆర్థిక, రాజకీయకాంశాల్లో ప్రభుత్వాల జోక్యం నామమాత్రంగా ఉండాలనే వారు. అతివాదులైన జాకోబిన్ల ఉదార వైఖరులవల్లే ఫ్రాన్స్‌లో క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని భావించారు. జిరాంజిస్టులను కాదని జాకోబిన్లు కన్వెన్షన్‌కు నాయకత్వం వహించారు. దీంతో డాంటన్, రాబ్స్పియర్, కార్నోలు ఇందులో సభ్యులుగా తొమ్మిది మందితో ప్రజాసంరక్షక సమితి ఏర్పడింది. దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పి విప్లవాన్ని రక్షించడానికి ప్రజా సంరక్షక సమితి దమనకాండకు పూనుకుంది. విప్లవానికి ప్రతికూలంగా కనిపించే ప్రతి వ్యక్తిని అంతమొందించడానికి సిద్ధపడింది. ఫలితంగా పది నెలల వ్యవధిలో ఐదు వేల మందిని గిలెటిన్ ఎక్కించారు. వారిలో మేడమ్ రోలాండ్ వంటి విదూషీమణులూ ఉన్నారు. 22 మంది జిరాంజిస్ట్ నాయకులకూ ఇదే గతి పట్టింది. 1793 అక్టోబర్ 16న మేరి ఆంటోనెట్‌ను కూడా గిలెటిన్ చేశారు. ఈ బీభత్సం దేశమంతటా విస్తరించి బీతావహ పాలనగా ప్రసిద్ధికెక్కింది. ఈవిధంగా రాబ్స్పియర్ తన విధానాలను తీవ్రంగా అమలుచేశాడు. కొన్ని సందర్భాల్లో అతడి సహచరులే కొంత సంయమనం పాటించాలని కోరేవారు. అయితే చివరకు 1794 జూలైలో అతడిని న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చింది.
-ఫ్రాన్స్‌లో డైరెక్టరీ పాలన: జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో సంపన్న, మధ్యతరగతి వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. సమాజంలో ఆస్తిలేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసిన కొత్త రాజ్యాంగాన్ని చేశారు. ఎన్నికైన రెండు శాసనసభ సంఘాలకు ఇది అవకాశం కల్పించింది. ఇవి ఐదుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకుంటాయి. దీన్నే డైరెక్టరీ అంటారు. జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరి అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడటానికి ఈ విధానాన్ని చేపట్టారు. అయితే డైరెక్టరీ తరుచూ శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్లు. దాంతో అవి వాళ్లను తొలగించేవి. ఇలాంటి రాజకీయ అస్థిరత్వం నెపోలియన్ బోనపార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దారితీసి అంతిమంగా అతడు అధికారం చేజిక్కించుకున్నాడు. తనకు తాను ఫ్రాన్స్‌కు చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.
19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు
-18వ శతాబ్దం మధ్యకాలంలో తూర్పు, మధ్య యూరప్ నిరంకుశ రాచరిక పాలన కింద ఉండేవి. ఈ భూభాగాల్లో భిన్న ప్రజలు ఉండేవాళ్లు. దీంతో ప్రజలు తమకు ఉమ్మడి అస్తిత్వం లేదా సంస్కృతి ఉందని భావించేవాళ్లు కాదు. తరుచు వాళ్లు వేరే భాషలు మాట్లాడుతూ భిన్నమైన మూలాలకు చెంది ఉండేవాళ్లు. ఉదాహరణకు ఆస్ట్రియా-హంగేరీలను పాలించిన హాబ్స్బర్గ్ సామ్రాజ్యంలో ఎన్నో భిన్నమైన ప్రాంతాలు, ప్రజలు ఉండేవాళ్లు. అందులో టైరోల్, ఆస్ట్రియా, సుడెటెన్ ల్యాండ్‌తో కూడిన ఆల్పైన్ ప్రాంతాలు ప్రధానంగా జర్మనీ మాట్లాడే రాచరికం ఉండిన బొహీమియా, ఇటాలియన్ భాష మాట్లాడే లొంబార్టీ, వెనీషియా ప్రాంతాలు కూడా ఉండేవి. హంగేరీలో సగం జనాభా మగ్యార్, మిగిలిన సగం అనేక భాషలు మాట్లాడేవాళ్లు. గలీషియాలో రాజవంశస్థులు పోలిష్ మాట్లాడేవాళ్లు. జర్మన్, ఇటాలియన్, మగ్యార్ మాట్లాడే ఆధిపత్య బృందాలకు తోడు ఉత్తరాన బొహీమియన్లు, స్లోవాక్లు, కార్నియోలాలో స్లోవిన్స్లు, దక్షిణాన క్రొయాట్లు, తూర్పున ట్రాన్సిల్ వానియాలో రొమేనియన్లు వంటి అనేక రైతాంగ జాతులు ఉండేవి. ఈ విభేధాల కారణంగా ప్రజల్లో రాజకీయంగా తాము ఒక్కటే అన్న భావన ఏర్పడలేదు.
కొత్తగా ఏర్పడిన మధ్య తరగతి
-యూరప్‌లో సామాజికంగా, రాజకీయంగా కులీన వర్గం అంటే ధనిక భూస్వామ్య వర్గం ఆధిపత్య వర్గంగా ఉండేది. ఈ వర్గ ప్రజలందరూ ఒకే రకమైన జీవనశైలి కలిగి ఉండేవాళ్లు. వాళ్లకి పట్టణాల్లో ఇండ్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్టేట్లు ఉండేవి. దౌత్య సంబంధ కార్యకలాపాల కోసం, ఉన్నత సమాజంలోనూ ఫ్రెంచి మాట్లాడేవాళ్లు. ఈ కులీన కుటుంబాలు తరుచూ వివాహ సంబంధాలతో ముడిపడి ఉండేవి. ఈ శక్తిమంతమైన కులీన వర్గం జనాభా రీత్యా చాలా తక్కువ సంఖ్యలో ఉండగా, జనాభాలో రైతాంగం అధికశాతంగా ఉండేది. పశ్చిమ యూరప్‌లో వ్యవసాయంలో అధిక భాగం కౌలుదార్లు, చిన్న రైతులు చేసేవాళ్లు. తూర్పు, మధ్య యూరప్‌లో భూస్వాముల విశాల ఎస్టేట్లను బానిస రైతులు సాగు చేసేవాళ్లు. అయితే పశ్చిమ యూరప్‌లో, మధ్య యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో పారిశ్రామిక ఉత్పత్తి, వాణిజ్యం క్రమేపి పెరగసాగాయి. ఇది పట్టణాల వృద్ధికి దారి తీసింది. మార్కెట్ కోసం ఉత్పత్తి చేయడంపై ఆధారపడిన ఒక కొత్త వాణిజ్యవర్గం ఏర్పడింది. 18వ శతాబ్దం రెండో సగంలో ఇంగ్లండ్‌లో పారిశ్రామికీకరణ మొదలయ్యింది.
– కానీ ఫ్రాన్స్, జర్మన్ రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో అది 19వ శతాబ్దంలోనే మొదలైంది. దీంతో కొత్త సామాజిక వర్గాలు ఉనికిలోకి వచ్చాయి. శ్రామిక, మధ్య తరగతి, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, న్యాయవాదులు, డాక్టర్లు వంటి వివిధ వృత్తి నిపుణులు, మధ్య, తూర్పు యూరప్‌లోని 19వ శతాబ్దం చివరి భాగం వరకు ఈ వర్గాలు చిన్న సంఖ్యలోనే ఉన్నాయి. విద్యావంతులైన ఉదారవాద, మధ్య తరగతి వాళ్లు జాతీయ ఐక్యతను కోరుకున్నారు. సమాజంలో కులీన వర్గాలకు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దుచేయాలని వాళ్లు కోరారు. యూరప్‌లోని ఇతర ప్రజలకు ప్రజాస్వామ్యం, జాతీయవాదం అందించాలని ఫ్రెంచి ప్రజలు అనుకున్నారు.
-ఫ్రెంచి విప్లవానికి సంబంధించిన ఘటనలు, వార్తలు యూరప్‌లోని వివిధ నగరాలకు చేరుకున్నప్పుడు అక్కడి విద్యార్థులు, విద్యావంతులైన మధ్య తరగతిలో ఇతరులు జాకోబిన్ క్లబ్బులు ఏర్పర్చసాగారు. వాళ్ల కార్యక్రమాలు, ప్రచార ఉద్యమాలతో 1790ల్లో హాలెండ్, బెల్జియం, స్విట్జర్లాండ్, ఇటలీలోని అధిక భాగంలోకి ఫ్రెంచి సైన్యం ప్రవేశానికి సుగమం చేసింది. విప్లవ యుద్ధాలు మొదలుకావడంలో ఫ్రెంచ్ సైన్యం జాతీయవాదం అన్న భావనను ఇతర దేశాలకు తీసుకువెళ్లసాగింది. ఈ సైన్యానికి నెపోలియన్ నాయకత్వం వహించి తన నియంత్రణలోకి వచ్చిన విస్తృత భూభాగంలో ఫ్రాన్స్‌లో అప్పటికే ప్రవేశపెట్టిన ఎన్నో సంస్కరణలను అమలు చేశాడు. చక్రవర్తి కావడం ద్వారా నెపొలియన్ ఫ్రాన్స్‌లో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించాడనడంలో అనుమానం లేదు. అయితే పరిపాలనను ఇది మరింత హేతుబద్ధంగా, సమర్థవంతంగా మలచడానికి ఎన్నో విప్లవాత్మకాంశాలను చేపట్టాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు