‘కాల్ అవే గోల్ఫ్’ కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది? తెలంగాణ రౌండప్ (జనవరి-మార్చి)
గ్రూప్స్ ప్రత్యేకం
గ్రూప్-1, 2, 3పరీక్షల్లో కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలు, జాతీయ, ప్రాంతీయ అంశాలను అడుగుతారు. కాబట్టి ఉద్యోగార్థుల కోసం ఈ ఏడాది జనవరి నుంచి తెలంగాణలో జరిగిన వివిధ పరిణామాలను, ఒకే నేపథ్యం కలిగిన అంశాలను ఇస్తున్నాం.
ఘనతలు
# జగిత్యాల జిల్లా అంతగ్రామ్లోని స్వయం సహాయక సంఘం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక్కడ పసుపు, కారం పొడులను తయారు చేసి ‘స్ఫూర్తి’ అనే పేరుతో విక్రయించి ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా నాలుగు యూనిట్లకు గుర్తింపు రాగా.. దక్షిణాది నుంచి స్థానం పొందింది ఇది ఒక్కటి మాత్రమే.
# దేశంలో తొలి శిలల ప్రదర్శన శాల (రాక్‌గార్డెన్)ను హైదరాబాద్‌లో జనవరి 6న ప్రారంభించారు. జాతీయ భూ భౌతిక పరిశోధక ప్రదర్శనశాల దీన్ని ఏర్పాటు చేసింది.
#ఆక్సిజన్-18 ప్లాంట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం సమీపంలోని మణుగూరులో ప్రారంభించారు. ఈ తరహా ప్లాంట్ దేశంలోనే ఇది మొదటిది కాగా, ప్రపంచంలో ఏడోది.
#ఓడీఎఫ్ ప్లస్‌లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 14,200 గ్రామాల్లో 13,737 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా స్వచ్ఛ భారత్ మిషన్‌ను అధికారులు ప్రకటించారు.
#దేశంలోనే తొలిసారిగా మున్సిపల్ చట్టాన్ని బ్రెయిలీ లిపిలో తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
# పూర్తి ఎలక్టిక్ కార్లతో నిర్వహించే ఫార్ములా ఈ-రేస్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, సచివాలయం, తెలుగుతల్లి ఫ్లెఓవర్, స్సేన్ సాగర్ చుట్టూ 2.37 కిలోమీటర్ల ఈ-రేసింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నారు.
#నర్చరింగ్ నైబర్డ్ ఛాలెంజ్ పోటీలో దేశంలోని టాప్-10 నగరాల్లో గ్రేటర్ వరంగల్‌కు స్థానం లభించింది.
# దేశంలోని తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను హైదరాబాద్‌లోని రాయదుర్గంలో రూ.1400 కోట్లతో నిర్మించారు.
# బొగ్గు నుంచి మిథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు దేశంలో తొలిసారిగా అభివృద్ధి చేసిన కోల్ టు మిథనాల్ ప్లాంట్‌ను హైదరాబాద్‌లో జనవరి 15న ప్రారంభించారు.
# కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీఎల్)ను ‘ఏ’ కేటగిరీ కార్పొరేషన్‌గా గుర్తిస్తూ భారత ప్రభుత్వ సంస్థ రూరల్ ఎలక్టిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ జనవరి 22న ఉత్తర్వులు ఇచ్చింది. నిధుల వినియోగం, నిర్మాణం, లక్ష్యం తదితర అంశాల ప్రాతిపదికన ఈ గుర్తింపును కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ దక్కించుకుంది.
# పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యధికంగా సీసీ కెమెరాలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. సిబ్బంది సంఖ్యతో పోల్చినప్పుడు పెద్ద రాష్ట్రాల కంటే అత్యధికంగా వాహనాలు ఉన్నది కూడా ఇక్కడే.
# పంచాయతీ ఆడిటింగ్‌లో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కూడా మన రాష్ట్రమే ముందుంది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఆన్లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ నిలిచింది.
# క్షయ నిర్మూలనలో కృషి చేసినందుకుగాను జాతీయ స్థాయిలో నిజామాబాద్ జిల్లా వెండి పతకం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు కాంస్య పతకాలను దక్కించుకున్నాయి.
#అభివృద్ధి వ్యయంలో పెద్ద రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే రెండో స్థానంలో ఉంది.
# దేశంలోనే నీటిపై తేలియాడే అతిపెద్ద సౌర విద్యుత్ కేంద్రం తెలంగాణలోని రామగుండంలో అందుబాటులోకి తీసుకురానున్నారు. 100 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో 17.5, రెండో విడతలో 20 మెగావాట్లు గతంలో ప్రారంభమయ్యాయి. మూడో విడతగా ఇటీవల 42.50 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
# దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శన శాల హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానుంది. కొత్తగా కనుగొన్న ముఖ్య శాసనాలను ఇక్కడ భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో అందుబాటులోకి తెస్తారు.
పరిపాలనాపరమైన నిర్ణయాలు
#రాష్ట్రంలో మత్స్య సంపద ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా ‘తెలంగాణ చేపలు’ అనే నమూనాను (బ్రాండ్) సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘హబ్-స్పోక్’ అనే పేరుతో ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.
#రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత కార్యాచరణను కూడా ప్రారంభించింది. సిరిసిల్ల జిల్లాలోని హరిదాస్ నగర్ గ్రామంలో దీన్ని ప్రయోగాత్మకంగా జనవరి 4న ప్రారంభించారు.
# తెలంగాణలోని అనాథ పిల్లలందరినీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తించి, ప్రభుత్వమే తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది.
#రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేపట్టాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. దీనికి ‘మన ఊరు మన బడి’ అని నామకరణం చేసింది. దీనికి చేయనున్న వ్యయం రూ.7289 కోట్లు
#కోఠిలోని మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో ఇదే తొలి మహిళా విశ్వవిద్యాలయం కానుంది. రెండేళ్లలో ఈ కళాశాల శత వసంత ఉత్సవాలకు సిద్ధమవుతుంది. అలాగే రాష్ట్రంలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది.
# గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్‌లపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్న ఉపసర్పంచ్‌లపై చర్యలకు ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఉపసర్పంచ్‌ల స్థానంలో మరో వార్డ్ మెంబర్‌కు చెక్‌లపై సంతకం చేసే అధికారం ఇవ్వాలని కలెక్టర్లకు సూచించింది.
#కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పీఆర్ఏఎస్ఏడీ (ప్రసాద్) పథకంలో భాగంగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని చేర్చారు. ఇప్పటికే ఈ దేవాలయం యునెస్కో సాంస్కృతిక వారసత్వ సంపదలో చోటు సంపాదించింది. పీఆర్ఏఎస్ఏడీ అంటే-పిల్గ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిచ్యుయాలిటీ ఆగ్మెంటేషన్ డ్రైవ్.
#రాష్ట్రంలో కొత్తగా రెండు పట్టణాభివృద్ధి కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవి.. ఒకటి నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, మరొకటి మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.
# మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో మహిళా పారిశ్రామికవేత్తలకు 50 ఎకరాలను కేటాయించారు. 25 మంది మహిళలకు ఇవి దక్కనున్నాయి. పారిశ్రామిక పార్కుల్లో 10 శాతం స్థలాలు, అదనంగా పది శాతం పెట్టుబడి రాయితీని మహిళలకు ఇస్తారు. మహిళా పారిశ్రామికవేత్తలకు పార్కులను కేటాయించడం ఇదే తొలిసారి. అలాగే వారికి అండగా ఉండేందుకు ‘ఉద్యమిక’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు.
#భారత వైద్య విధానంపై అవగాహన కల్పించేందుకు ఆయుష్ గ్రామ కార్యక్రమాన్ని మార్చి 3న ప్రారంబించారు. 50 మందితో కూడిన ఆయుష్ బృందం గ్రామంలోని ఇంటింటికెళ్లి ఆరోగ్య వివరాలను సేకరిస్తుంది. ప్రస్తుతం 10 గ్రామాలను ఎంపిక చేశారు. దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తారు.
# రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల నిర్మాణానికి అవసరమైన నిధులను బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే పేరుతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
అభ్యర్థి ఏం చేయాలి?
అంశాల వారీగా ఇచ్చిన వివరాలకు సంబంధించి సమగ్ర అధ్యయనం చేయాలి. ఉదాహరణకు ఘనతలు పేర్కొన్నాం. అవి సాధించడానికి ప్రభుత్వం కృషి, స్వచ్ఛంద సంస్థల పాత్ర, అధికారులు, రాజకీయ నాయకులు ఏ విధంగా చొరవ చూపారు? అన్న కోణంలో చదవాలి. అలాగే పరిపాలన నిర్ణయాలకు కారణాలు ఏంటీ, అవి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏ విధంగా మెరుగుపరుస్తాయో విశ్లేషించుకోవాలి. ఆయా నిర్ణయాల అమలు వల్ల ఎవరికి ప్రయోజనం? ఏ విధంగా ప్రయోజనం? అన్న అంశాల ప్రాతిపదికన విషయ సేకరణ ఉండాలి. అప్పుడే మెయిన్స్‌కు సిద్ధమైనట్లు. తెలంగాణలో పరిశ్రమల వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, అందుకు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం ఏ విధంగా దోహదం చేస్తుంది, ఎంత మందికి ఉపాధి కల్పిస్తుంది, దీనివల్ల సామాజిక, ఆర్థిక ప్రగతి ఎలా ఉంది? అన్న కోణంలో విషయ సేకరణ చేయడం ద్వారా గరిష్ఠ స్థాయిలో గ్రూప్-1 మెయిన్స్‌లో స్కోర్ సాధించేందుకు వీలుంటుంది.
పెట్టుబడులు
# బ్రిటన్‌కు చెందిన వన్‌మోటో పరిశ్రమ తెలంగాణలో రూ.250 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 2000 మందికి ఉపాధి కల్పించనుంది. ఇది ద్విచక్ర ఎలక్టిక్ వాహనాల పరిశ్రమ.
#మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనుబంధ అంతర్జాతీయ సంస్థ డ్రిల్ మెక్‌స్పా రూ.1500 కోట్ల పెట్టుబడితో 150 ఎకరాల్లో అవుటర్ రింగ్ రోడ్ బయట చమురు డ్రిల్లింగ్, రిగ్గులు, వాటి అనుబంధ పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించనుంది.
#బెంగళూరు కేంద్రంగా పనిచేసే టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అపరెల్ పార్క్‌లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఏడు ఎకరాల్లో విస్తరించనున్న ఈ సంస్థ 800 మెషీన్లను ఏర్పాటు చేస్తుంది. 1600 మందికి ఉపాధి దక్కనుంది.
# తెలంగాణలో ఇప్పటికే ఉన్న ఎంఆర్ఎఫ్ సంస్థ విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. రూ.1000 కోట్లను ఇందుకు వ్యయం చేయనుంది. సంగారెడ్డిలో ఉన్న తన యూనిట్‌ను విస్తరించడం ద్వారా మరికొంత మందికి ఉపాధి కల్పించనుంది.
#మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయను ‘గేట్‌వే ఐటీ పార్క్’గా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. గచ్చిబౌలి-మాదాపూర్‌కు ఇది ప్రత్యామ్నాయం కానుంది.
#గోల్ఫ్ క్రీడా పరికరాల తయారీ సంస్థ ‘కాల్ అవే గోల్ఫ్’ అమెరికా తర్వాత అతిపెద్దదైన డిజిటల్ టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 300 మందికి ఉపాధి కల్పిస్తుంది.
# రూ.3904.55 కోట్ల పెట్టుబడితో క్వాల్కమ్ సంస్థ తన రెండో అతిపెద్ద ప్రాంగణాన్ని హైదరాబాద్‌లో అక్టోబర్‌లో ప్రారంభించనుంది.
#ఫిస్కర్ అనే ప్రముఖ విద్యుత్ వాహనాల సంస్థ రూ.100 కోట్లతో అభివృద్ధి కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయనుంది.
#అమెరికాకు చెందిన ‘కెమ్‌వేద లైఫ్ సైన్సెస్’ సంస్థ రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
#భారత్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన నాలుగో కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది.
#రంగారెడ్డి జిల్లా రావిరాలలోని ఎలక్టానిక్స్ సిటీలో రూ.100 కోట్ల పెట్టుబడితో రేడియంట్ అప్లయన్సెస్, ఎలక్టానిక్స్ పరిశ్రమను నెలకొల్పారు.
#రాష్ట్రంలోఎలక్టానిక్స్ పరికరాల తయారీ రంగంలో రాబోయే పదేళ్లలో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వం తన లక్ష్యంగా ఎంచుకుంది.
# రూ.200 కోట్ల వ్యయంతో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ పరిశ్రమ నిర్మించిన లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమను కూడా మే 2న ప్రారంభించారు. దేశంలోనే ఇది తొలి లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమ.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?