‘డిజి సాథి’ అనే కార్యక్రమం దేనికి సంబంధించినది? (కరెంట్ అఫైర్స్ )
కరెంట్ అఫైర్స్ 13.07.22
గత సంచికలో ఆర్థిక రంగంలో వ్యవసాయ సంబంధ అంశాలను పరిశీలించాం. ప్రస్తుతం సూక్ష్మ, లఘు పరిశ్రమలతో పాటు సేవా రంగంలో వచ్చిన మార్పులను పరిశీలిద్దాం..
ఆర్‌ఏఎంపీ: ఇది సంక్షిప్త రూపం. విస్తరణ రూపం-రైజింగ్ అండ్ యాగ్జిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫామెన్స్. ఈ పథకం అమలుకు ప్రపంచ బ్యాంక్ సహాయం చేస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దీనిని అమలు చేయనున్నారు. ఈ పథకానికి చేసిన కేటాయింపు మొత్తం రూ.6,062.45 కోట్లు. దీనికి ప్రపంచ బ్యాంక్ రూ.3750 కోట్ల రుణం ఇస్తుంది.
యాపిల్ సంస్థ ఘనత: యాపిల్ సంస్థ మార్కెట్ విలువ జనవరి 3న 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఘనత సాధించిన ప్రపంచపు మొట్టమొదటి సంస్థ ఇదే. గతంలో ఒక ట్రిలియన్ డాలర్, రెండు ట్రిలియన్ డాలర్లకు చేరిన తొలి సంస్థగా కూడా యాపిల్ ఘనతను దక్కించుకుంది.
డాబర్ సంస్థ: పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ తటస్థత సాధించిన భారత దేశపు తొలి వినియోగ వస్తువుల సంస్థగా డాబర్ నిలిచింది. దాదాపు 27,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వృథాను సేకరించి ఇది రీసైక్లింగ్ చేస్తుంది.
జడ్‌ఈడీ పథకం: సూక్ష్మ, లఘు, మధ్య తరహా మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ జడ్‌ఈడీ అనే పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. దేశంలోని ఈ చిన్నతరహా సంస్థలు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు సన్నద్ధం చేసే ఉద్దేశంతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ అనే పథకానికి దీనిని కొనసాగింపుగా చెప్పుకోవచ్చు.
బ్యాంకింగ్ రంగం
డీ-ఎస్ఐబీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలను డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్‌లుగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. విఫలం చెందేంత చిన్నవి ఆ బ్యాంకులు కావని దీని భావం. దీనినే ఇంగ్లిష్‌లో టూ బిగ్ టు ఫెయిల్ అంటారు.
బంగారం కొనుగోలు: 2021లో బంగారం కొనుగోలులో ప్రపంచంలోని అన్ని కే్రంద బ్యాంకులతో పోలిస్తే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో థాయ్‌లాండ్ కేంద్ర బ్యాంక్ నిలిచింది. 2021లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ 77.5 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొన్నది.
యూపీఐ 123: స్మార్ట్ఫోన్లు లేని వాళ్లు కూడా చెల్లింపులు చేసే విధంగా కొత్త యూపీఐ సేవను యూపీఐ 123 పేరుతో రిజర్వ్ బ్యాంక్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవతో సమ్మిళిత ఆర్థికవృద్ధి పెరుగుతుంది. డిజిటల్ లావాదేవీలు కూడా పెరుగుతాయి. ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే యూపీఐ 123 పనిచేస్తుంది. అలాగే ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించి 24×7 హెల్ప్‌లైన్‌ను కూడా ‘డిజి సాథి’ అనే పేరుతో ప్రారంభించింది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది.
ఎన్ఏబీఎఫ్ఐడీ: దీని పూర్తి రూపం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇటీవల దీనిని ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో భాగం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో ఇప్పటికే ఎగ్జిమ్ బ్యాంక్, నాబార్డ్, సిడ్బీ, ఎన్హెచ్బీలు ఉన్నాయి. తాజాగా నాబ్ఫెడ్ కూడా చేరింది.
నాబ్ఫెడ్ లక్ష్యం: ఈ ఏడాది మౌలిక సదుపాయాల రంగానికి ఒక ట్రిలియన్ రూపాయల రుణాలను అందించాలని నాబ్ఫెడ్కు కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
డబ్ల్యూఎంఏ పరిధి: 2022-23 ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధభాగానికి వేస్ అండ్ మీన్స్ ఇన్ అడ్వాన్స్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.1,50,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రైల్వే రంగం
మిషన్ అమానత్: తమ వస్తువులను కోల్పోతే తక్షణమే తెచ్చుకొనేందుకు మిషన్ అమానత్ పేరుతో పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రక్షణ దళం అందుబాటులోకి తెచ్చింది.
బుల్లెట్ ట్రెయిన్ స్టేషన్: దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రెయిన్ స్టేషన్‌ను సూరత్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ. లక్ష కోట్లు వ్యయం కావచ్చని భావిస్తున్నారు. ఇందులో రూ.88,000 కోట్లు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ సాయం చేయనున్నది.
రెజ్లింగ్ అకాడమీ: భారత రైల్వేల ఆధ్వర్యంలో తొలి రెజ్లింగ్ అకాడమీని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈ అకాడమీ దేశంలోనే అతి పెద్దది. రెజ్లింగ్‌కు సంబంధించి ఆధునిక క్రీడా సామగ్రి అందుబాటులోకి రానుంది. దీని ఏర్పాటుకైన వ్యయం రూ.30.76 కోట్లు.
కవచ్: స్వయం చోదిత రైలు రక్షణ వ్యవస్థగా దీనిని చెప్పొచ్చు. ఇంగ్లిష్‌లో దీనినే ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అంటారు. ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా ఢీకొనకుండా ఈ సాంకేతిక అభివృద్ధిని అందుబాటులోకి తేనున్నారు. తెలంగాణలోని పటాన్చెరు నుంచి వికారాబాద్ మధ్య చేపట్టిన కవచ్ ప్రయోగం విజయవంతమయ్యింది. 2022-23లో 2000 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను కవచ్ పరిధిలోకి తేనున్నారు. తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఏడాది 4000-5000 కిలో మీటర్ల కవచ్ రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తారు. మొత్తంగా 34,000 కిలో మీటర్ల కవచ్ వ్యవస్థ రానుంది.
తొలి గతిశక్తి కార్గో టెర్మినల్: దేశంలో తొలి గతిశక్తి కార్గో టెర్మినల్‌ను తూర్పు రైల్వేలో భాగమైన అసనాల్ డివిజన్లో ఏర్పాటు చేశారు. 2021 డిసెంబర్ జీసీటీ విధానం ప్రకటన తర్వాత ఏర్పాటు కానున్న తొలి గతిశక్తి టెర్మినల్ ఇదే.
జాతీయ రైల్ ప్రణాళిక: రైల్వే వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు జాతీయ రైల్వే ప్రణాళిక-2030ని ఇటీవల ప్రకటించారు. దేశంలో సరకు రవాణాలో 45 శాతం వాటాను దక్కించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే సరకు రవాణా రైళ్ల వేగాన్ని గంటకు 50 కిలోమీటర్లు పెంచనున్నారు. కొన్ని ముఖ్యమైన రైల్వే ప్రాజెక్టుల్లో 2024 నాటికి 100% విద్యుదీకరణ చేపడుతారు.
ఇతర ఆర్థిక అంశాలు
# వేర్వేరు పథకాల ద్వారా ప్రస్తుతం ఇస్తున్న బియ్యం స్థానంలోనే ఫోర్టిఫైడ్ రైస్ (అధిక పోషకాహారంతో కూడిన బియ్యం) కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే ఆహార ధాన్యాలను పేదలకు ఇచ్చే పథకాలు అమలులో ఉన్నాయి. లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ ఆహార భద్రత చట్టం, సమీకృత బాలల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు ఇతర సంక్షేమ పథకాల్లో ఇచ్చే బియ్యం స్థానంలోనే ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వనున్నారు.
# ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ అంగీకరించింది. మొత్తం రూ.1600 కోట్లతో రానున్న అయిదు సంవత్సరాలకుదీనిని అమలు చేయనున్నారు.
# ఎగుమతి సన్నద్ధత సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఇందుకు రాష్ట్రాలను తీర, భూపరివేష్టిత, హిమాలయ, కేంద్ర పాలిత ప్రాంత రాష్ట్రాలుగా విభజించి ర్యాంకులను కేటాయించింది. వివిధ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన ప్రాంతాలను పరిశీలిస్తే..
తీర రాష్ట్రాల్లో అగ్రస్థానం- గుజరాత్
భూపరివేష్టిత రాష్ట్రాల్లో అగ్రస్థానం- హర్యానా
హిమాలయ రాష్ట్రాల్లో అగ్రస్థానం- ఉత్తరాఖండ్
కేంద్ర పాలిత ప్రాంతాల్లో తొలి స్థానం- ఢిల్లీ
# ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టన్నెల్‌గా హిమాచల్‌ప్రదేశ్‌లోని అటల్ టన్నెల్‌ను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గుర్తించింది.
#ఎయిర్ ఇండియా సంస్థను 2022, జనవరి 27 నాటికి టాటా సంస్థకు అప్పగించారు. ఈ సంస్థను 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో జీఆర్డీ టాటా ప్రారంభించారు. 1946లో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. 1993లో నాటి పార్లమెంట్ సభ్యుడు ప్రమోద్ మహాజన్ నేతృత్వంలో ఏర్పాటైన స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు పౌర విమానయాన రంగంలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించారు. 2007లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లను విలీనం చేశారు.
# నష్టాల్లో ఉన్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థను టాటా సంస్థకు కేంద్రం అప్పగించింది. ఈ సంస్థ ఒడిశాలో ఉంది.
#జీవీత బీమా రంగంలోకి 20% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమెటిక్ రూట్లో అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రూ.63,000-66,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావించింది.
# నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఆగస్ట్ 2021లో ప్రకటించిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్‌కు అనుగుణంగా ఈ కొత్త కార్పొరేషన్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది.
#ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని సెప్టెంబర్ 2022 వరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 2020లో కొవిడ్ మహమ్మారి సమయంలో దీనిని ప్రారంభించారు. పేదలకు ఆహార ధాన్యాలను ఈ పథకంలో భాగంగా ఇస్తారు. ఈ పథకం మార్చి 2022 వరకు మాత్రమే ఉండేది. తాజాగా దీనిని మరో ఆరు నెలల పాటు అమలు చేయనున్నారు. ఇందుకు అదనంగా కేంద్రంపై రూ.80,000 కోట్ల ఆర్థిక భారం పడనుంది.
జనవరి నుంచి జరిగిన ముఖ్య నియామకాలు
# రాజేష్గేరా: నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
# నటరాజన్ సుందర్: నేషనల్ అసెట్స్ రీకన్‌స్ట్రక్షన్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
# కేకే వేణుగోపాల్: భారత అటార్నీ జనరల్‌గా మరో మూడు నెలలకు నియమితులయ్యారు. రాజ్యాంగంలోని 76వ అధికరణం ప్రకారం అటార్నీ జనరల్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.
#నితిన్ గుప్తా: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ చైర్మన్‌గా ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యారు.
#తపన్ కుమార్ డేకా: సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన డేకాను డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా కేంద్రం నియమించింది.
# వినయ్ మోహన్ క్వాత్రా: భారత కొత్త విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
# సోమశేఖర్ రాజు: భారత సైన్యానికి వైస్ చీఫ్‌గా మే 1న నియమితులయ్యారు.
# తరుణ్ కపూర్: ప్రధాన మంత్రి మోదీకి సలహాదారుగా నియమితులయ్యారు. గతంలో ఆయన పెట్రోలియం సెక్రటరీగా పనిచేశారు. అలాగే ప్రధాన మంత్రి ప్రైవేట్ సెక్రటరీగా వివేక్ కుమార్ నియమితులయ్యారు.
#రాజీవ్ కుమార్: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా రాజీవ్ కుమార్ మే 15న బాధ్యతలను స్వీకరించారు.
#వినయ్ కుమార్ సక్సేనా: ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?