రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరప్‌లో అంతటి స్థాయి యుద్ధం రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరొద్దంటూ హెచ్చరికతో పాటు రష్యాకు అనుకూలంగా ఉండే డాన్బాస్ ప్రాంతంలో అణచివేతకు ఉక్రెయిన్ పాల్పడుతుందని రష్యా ఆరోపణ. త్వరలోనే ముగిసిపోతుందని భావించినా నేటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. యూరప్‌లో వైశాల్యం రీత్యా అతిపెద్దది రష్యా. ఆ తర్వాతి స్థానంలో ఉక్రెయిన్ ఉంది. 1991 ఆగస్ట్ 24న యూఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. దీనికి రష్యాతో పాటు మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లొవేకియా, పోలాండ్, బెలారస్ తదితర దేశాలతో సరిహద్దు ఉంది. ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత వార్తల్లోకి వచ్చిన వివిధ ఒప్పందాలు…
జీనోసైడ్ కన్వెన్షన్: రష్యాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉక్రెయిన్ ఒక ఫిర్యాదు చేసింది. డాన్బాస్ ప్రాంతంలో నరమేధానికి పాల్పడుతున్నామంటూ తమపై రష్యా తప్పుడు ప్రచారం చేస్తుందని ఉక్రెయిన్ ఆరోపించింది. నరమేధానికి పాల్పడుతున్నది రష్యా అని పేర్కొంది. ఈ ఒప్పందం 1948లో కుదిరింది. తమపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ది హేగ్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఉక్రెయిన్ కోరింది.
మాంట్రిక్స్ కన్వెన్షన్: ఇది 1936లో కుదిరిన ఒప్పందం. దీని ప్రకారం బాస్ఫోరస్, డార్డానెల్లిస్ జలసంధులపై టర్కీ దేశానికి హక్కులు సంక్రమిస్తాయి. ఈ రెండు జలసంధులు నల్ల సముద్రం, ఏజియన్ సముద్రాలను కలుపుతాయి, మర్మరా సముద్రం గుండా ఈ జలసంధులు ఉంటాయి. మర్మరా సముద్రం భౌగోళికంగా టర్కీ దేశంలో ఉంటుంది. యద్ధం సమయంలో దీనిపై రవాణాను నియంత్రించే హక్కు టర్కీకి ఉంటుంది. ఈ మేరకు కుదిరిన ఒప్పందాన్నే మాంట్రిక్స్ కన్వెన్షన్ అంటారు. టర్కీ, ఆస్ట్రేలియా, బల్గేరియా, ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, రొమేనియా, యుగోస్లేవియా, యూకే, సోవియట్ యూనియన్లు దీనిపై సంతకం చేశాయి. ఒప్పందం ప్రకారం యుద్ధం సమయంలో యుద్ధ నౌకలు ఈ జలసంధుల నుంచి ప్రయాణించాలంటే టర్కీ అనుమతి అవసరం. నల్ల సముద్రంతో సరిహద్దు ఉన్న దేశాలు 8 రోజుల ముందుగా, సరిహద్దు లేని దేశాలు 15 రోజుల ముందుగా టర్కీకి సమాచారం ఇవ్వాలి. యుద్ధనౌకల ప్రయాణానికి సంబంధించిన నిబంధన ఇది.
క్లస్టర్ మునిషన్స్: అతి ఎక్కువ ప్రాంతంలో ప్రభావం చూపే ఆయుధాలు ఇవి. మౌలిక సదుపాయాలను కూడా ధ్వంసం చేస్తాయి. వీటి తయారీ ఉత్పత్తి, బదిలీ, నిల్వలను ఐక్యరాజ్య సమితి నిషేధించింది. దీనికి సంబంధించి రూపొందించిన ఒప్పందంపై 2008లో ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో సంతకాలు ప్రారంభమయ్యాయి. 2010లో ఇది అమల్లోకి వచ్చింది. రష్యా వీటిని వినియోగిస్తుందని అంతర్జాతీయ మానవ హక్కుల పరిశీలన సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపణ. అంతేకాదు థర్మోబేరిక్ బాంబులను కూడా రష్యా ఉపయోగిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. థర్మబేరిక్ బాంబులనే ఏరోసోల్ బాంబ్స్ అని కూడా అంటారు. వీటిని విసిరిన తర్వాత ముందస్తుగా పేలి తర్వాత గాలిలోని ఆక్సిజన్‌ను వినియోగించుకొని మరోసారి పేలుతాయి. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి ఒప్పందం లేదు. అయితే వినియోగిస్తే చర్య తీసుకొనేందుకు 1899, 1907లో కుదిరిన హేగ్ ఒప్పందం ఉపయోగపడుతుంది.
జెనీవా ఒప్పందాలు: యుద్ధానికి సంబంధించి జెనీవాలో పలు దఫాల్లో కుదుర్చుకున్న ఒప్పందాలను రష్యా ఉల్లంఘిస్తుందని ఉక్రెయిన్‌తో పాటు పలు దేశాలు ఆరోపించాయి. జెనీవా ఒప్పందాల్లో నాలుగు ఉన్నాయి. అవి
జెనీవా ఒప్పందం-1
గాయపడిన సైనికులపై దాడి చేయరాదు.
జెనీవా ఒప్పందం-2
గాయపడిన సైనికులు, చీలిక ఏర్పడిన నౌకపై ఉన్న సైనికులపై దాడి చేయరాదు.
జెనీవా ఒప్పందం-3
యుద్ధఖైదీలను విడిచిపెట్టాలి.
జెనీవా ఒప్పందం-4
ఆక్రమించిన ప్రాంతాల్లో పౌరులపై దాడి చేయరాదు.
హేగ్ ఒప్పందం: సాంస్కృతిక కట్టడాల పరిరక్షణకు సంబంధించింది ఇది. 1954లో కుదిరింది. యుద్ధ ప్రదేశాల్లో ఉండే సాంస్కృతిక కట్టడాలను పరిరక్షిస్తుంది. ఇందుకు ఆయా భవనాలపై బ్లూషీల్డ్ (నీలి రంగులో ఉండే తెర)ను ఎగురవేస్తారు. ఇందుకు 1996లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది బ్లూషీల్డ్ను కూడా ఏర్పాటు చేశారు.
రష్యాపై ఆంక్షలు
- యుద్ధం నేపథ్యంలో రష్యాపై అనేక ఆంక్షలు విధించారు. యూరోపియన్ యూనియన్‌తో పాటు అమెరికా కూడా రష్యా నుంచి చమురు దిగుమతులను నియంత్రించింది.
- స్విఫ్ట్ (ఎస్డబ్ల్యూఐఎఫ్టీ) నుంచి రష్యాను తొలగించారు. దీని పూర్తి రూపం- సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ మెసేజింగ్ సిస్టమ్. ఈ వ్యవస్థను 1973లో ఏర్పాటు చేశారు. బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది.
- అమెరికా తను పాటించే పర్మనెంట్ నార్మల్ ట్రేడ్ రిలేషన్స్ నుంచి రష్యాను తప్పించింది. దీనివల్ల రష్యా నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై అధికంగా సుంకాలు విధిస్తారు. ఫలితంగా రష్యా వస్తువులు ఖరీదు అవుతాయి.
- ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించింది. రష్యా స్థానంలో చెక్ రిపబ్లిక్ చేరింది.
- ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి రష్యా నిష్క్రమించింది. అలాగే తనపై అధికంగా ఆంక్షలు విధించడంతో నిరసనగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి కూడా రష్యా నిష్క్రమించింది.
భారత్ వైఖరి
- యుద్ధానికి సంబంధించి చాలా సందర్భాల్లో భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలకు సూచించింది. యుద్ధ సమయంలో బుచా అనే ప్రాంతంలో పౌరులపై రష్యా దాడి చేసింది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. జెనీవా ఒప్పందాలకు ఇది విరుద్ధం అని స్పష్టం చేసింది. అలాగే భద్రతా మండలి, సాధారణ సభల్లో జెలెన్స్కీ ప్రసంగానికి సంబంధించిన ఓటింగ్‌లో భారత్ ఉక్రెయిన్‌కు అనుకూలంగా ఓటు వేసింది.
- భద్రతా మండలిలో రష్యా తొలగింపునకు సంబంధించిన తీర్మానంలో భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది.
- రష్యా చమురు ఎగుమతిపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించడంతో భారత్‌కు తక్కువ ధరకే రష్యా విక్రయించింది. అయితే కొనరాదంటూ అమెరికాతో సహా యూరోపియన్ దేశాలు ఒత్తిడి తెచ్చినా భారత్ తలొగ్గలేదు. దృఢ వైఖరిని ప్రదర్శించింది. తమకు సార్వభౌమాధికారం ఉందంటూ సూటిగా చెప్పింది.
- యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు భారత్ ఆపరేషన్ గంగా చేపట్టింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?