Current Affairs March 27th | జాతి వివక్ష నిర్మూలన దినంగా ఏ రోజును పాటిస్తారు?
1. తొలిసారిగా మట్టితో ఏ దేశంలో బ్యాటరీ తయారు చేశారు? (3)
1) జపాన్ 2) ఇజ్రాయెల్
3) ఫిన్లాండ్ 4) స్వీడన్
వివరణ: పునరుత్పాదక శక్తుల నుంచి ఉత్పత్తి చేసిన వేడిని నిల్వ చేసుకొనే సామర్థ్యం ఉండేలా మట్టితో బ్యాటరీని ఫిన్లాండ్ తయారు చేసింది. ఈ తరహా పరికరాన్ని తయారు చేసిన తొలి దేశం ఇదే. నిర్మాణంలో ఉండే ప్రదేశాల్లో నిరుపయోగంగా ఉన్న మట్టిని సేకరించి ఈ బ్యాటరీని తయారు చేస్తారు. ఈ శక్తిని నిల్వ చేసే యంత్రంలో మూడు భాగాలు ఉంటాయి. అవి.. 1. మట్టిని నిల్వ చేసే గొట్టం 2. గాలిని వేడిచేసే ఎలక్ట్రిక్ హీటర్ 3. గాలి నుంచి నీటికి మార్పిడి చేసే యంత్రం. మట్టిని 600 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. నీటిని 100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడిచేసి వివిధ మార్పిడి ప్రక్రియల ద్వారా నిల్వ బ్యాటరీ నిలువ సామర్థ్యాన్ని పెంచుతారు.
2. ప్రపంచ తృణధాన్యాల సదస్సు మార్చి 18, 19 తేదీల్లో ఎక్కడ నిర్వహించారు? (4)
1) ప్రయాగ్‌రాజ్ 2) భోపాల్
3) సూరత్ 4) న్యూఢిల్లీ
వివరణ: ప్రపంచ తృణధాన్యాల సదస్సును న్యూఢిల్లీలో పూసా (పీయూఎస్ఏ) క్యాంపస్‌లో నిర్వహించారు. వివిధ దేశాల నుంచి ప్రతినిధులే కాకుండా 75 లక్షల మంది రైతులు వర్చువల్ పద్ధతిలో ఇందులో పాల్గొన్నారు. ఆహార భద్రతలో, పోషణకు సంబంధించి రెండో సుస్థిరాభివృద్ధి లక్ష్యం పేర్కొంటుంది. తృణధాన్యాలతో పోషకాహారం అందుతుంది. అలాగే మూడో సుస్థిరాభివృద్ధి లక్ష్యం మంచి ఆరోగ్యం గురించి చెబుతుంది. తృణధాన్యాలతో మెరుగైన ఆరోగ్యం సాధ్యం అవుతుంది. ఆర్థిక వృద్ధికి సంబంధించి ఎనిమిదో సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో పేర్కొన్నారు. తృణధాన్యాలను పండించడం ద్వారా పేద రైతులు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది.
3. తజకిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా ఎవరిని నియమించారు? (3)
1) అల్కేష్ కుమార్ శర్మ
2) అశ్విని
3) రామస్వామి పార్వతి
4) అపరాజిత శర్మ
వివరణ: తజకిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల సమన్వయకర్తగా రామస్వామి పార్వతిని ఆంటోనియో గుటెరస్ నియమించారు. ఇటీవల టర్కీలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో వివిధ విపత్తు నిర్వహణ కార్యకలాపాలను పార్వతి సమర్థంగా నిర్వహించారు. దీంతో ఆమెకు తజకిస్థాన్‌లో సమన్వయ బాధ్యతను అప్పగించారు. ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై ఏర్పాటు చేసిన కమిటీలో భారత్‌కు చెందిన అల్కేష్ కుమార్ శర్మ ఉన్నారు. అలాగే మానవ హక్కుల మండలిలో జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏర్పాటు చేసిన పదవిలో భారత్‌కు చెందిన అశ్వినిని నియమించారు.
4. ఏ దేశ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఇటీవల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ వారెంట్‌ను జారీ చేసింది? (2)
1) ఉక్రెయిన్ 2) రష్యా
3) సిరియా 4) ఇరాన్
వివరణ: రష్యా అధ్యక్షుడికి వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) వారెంట్‌ను జారీ చేసింది. ఈ కోర్ట్ నెదర్లాండ్స్‌లోని హేగ్ కేంద్రంగా పనిచేస్తుంది. అయితే ఈ కోర్టులో రష్యాకు సభ్యత్వం లేదు. సభ్యత్వం ఉన్న దేశాల్లో రష్యా అధ్యక్షుడు పర్యటిస్తే అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఇంతవరకు ఈ విధంగా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ఐసీసీని 2002లో ఏర్పాటు చేశారు. 1996 రోమ్ చట్టం ప్రకారం ఇది ఏర్పడింది.
5. థన్తాయ్ అభయారణ్యం ఎక్కడ ఉంది? (4)
1) ఒడిశా 2) మణిపూర్
3) మిజోరం 4) తమిళనాడు
వివరణ: థన్తాయ్ అభయారణ్యం తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలో ఇది పద్దెనిమిదో అభయారణ్యం. 80,567 హెక్టార్లు దీనికి కేటాయిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. దీన్ని ఈరోడ్ జిల్లాలో ఏర్పాటు చేశారు. గిరిజనుల హక్కులను హరించరు. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు అటవీ హక్కుల చట్టంలోని అన్ని అంశాలను పొందుతారు. ఆసియా ఏనుగుల పరిరక్షణకు ఉపయోగపడేందుకు ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించారు.
6. జాతి వివక్ష నిర్మూలన దినంగా ఏ రోజును పాటిస్తారు? (3)
1) మార్చి 20 2) మార్చి 22
3) మార్చి 21 4) మార్చి 25
వివరణ: మార్చి 21ని జాతి వివక్ష వ్యతిరేక రోజుగా పాటిస్తారు. 1960 మార్చి 21న దక్షిణాఫ్రికాలోని షార్ప్‌విల్లేలో ఒక దుర్ఘటన జరిగింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రజలు ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ రోజును జాతి వివక్ష వ్యతిరేక రోజుగా జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు 1966లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
7. ఈ ఏడాది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాను పొందింది ఎవరు? (1)
1) రతన్ టాటా 2) మన్మోహన్ సింగ్
3) శశిథరూర్ 4) స్వాతి పిరమాల్
వివరణ: ఆస్ట్రేలియా ఇచ్చే అత్యుత్తమ ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈ ఏడాది ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు ఇచ్చారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాల పెంపుతో పాటు వ్యాపారం, సామాజిక సేవల్లో విశేషంగా రాణిస్తున్నందుకు ఆయనకు ఈ అవార్డ్ దక్కింది. అలాగే ఈ ఏడాది విదేశీయులకు యూకే ప్రభుత్వం ఇచ్చే గౌరవ అవార్డును భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఇచ్చారు. గతేడాది ఫ్రాన్స్ దేశం ఇచ్చే అత్యుత్తమ అవార్డును స్వాతి పిరమాల్‌తో పాటు లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌కు ఇచ్చారు.
8. పీఎం మిత్రలో భాగంగా ఎన్ని రాష్ర్టాల్లో టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు? (4)
1) 4 2) 5 3) 6 4) 7
వివరణ: తెలంగాణ తో పాటు మరో ఆరు రాష్ర్టాల్లో జౌళి పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందుకు పీఎం మిత్ర అనే పథకాన్ని ప్రకటించారు. దీని పూర్తి రూపం- ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజిన్ అండ్ అప్పారెల్ పార్క్. తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో వీటిని రూ.4445 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్కుల ఏర్పాటుకు 13 రాష్ర్టాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.
9. ఏ దేశ శాసనసభలో మెక్‌మోహన్ రేఖను భారత్, చైనాల మధ్య సరిహద్దు రేఖగా ఇటీవల గుర్తించారు? (3)
1) భారత్ 2) ఆస్ట్రేలియా
3) అమెరికా 4) యూకే
వివరణ: భారత్, చైనాలను మెక్‌మోహన్ రేఖ విడదీస్తుందని అమెరికా చట్టసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీని ద్వారా అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రం భారత్‌లో అంతర్భాగం అని అమెరికా స్పష్టంగా అంగీకరించింది. నిజానికి అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటూ కొంత కాలంగా చైనా చెబుతుంది. కొన్ని సందర్భాల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ర్టాన్ని తమ ప్రావిన్సుగా పేర్కొంటూ పటాలను కూడా విడుదల చేసింది. తాజా తీర్మానం ద్వారా భారత్‌కు అమెరికా మద్దతు తెలిపినట్లు అయింది. ఈ రేఖను చైనా, టిబెట్, బ్రిటిష్ ఇండియాల మధ్య బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పాటు చేశారు.
10. ఏ రాష్ట్రంలో అక్షరాస్యత తక్కువగా ఉంది? (1)
1) బీహార్ 2) కేరళ
3) అరుణాచల్‌ప్రదేశ్ 4) రాజస్థాన్
వివరణ: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పలు గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం బీహార్‌లో అక్షరాస్యత కేవలం 61.8% మాత్రమే ఉంది. భారత్‌లో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఇదే. ఈ జాబితాలో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో అక్షరాస్యత 94% ఉంది. రెండో స్థానంలో లక్షద్వీప్ ఉంది. ఆ రాష్ట్రంలో 91.85% ఉంది. మిజోరం రాష్ట్రంలో 91.33% అక్షరాస్యత ఉంది. గ్రామీణ భారతదేశంలో అక్షరాస్యత 67.77% ఉంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం 84.11% అక్షరాస్యత నమోదయ్యింది.
11. ఏ సంవత్సరం నాటికి శూన్య కర్బన ఉద్గారంగా మారాలని భారత రైల్వే లక్ష్యంగా నిర్ణయించుకుంది? (1)
1) 2030 2) 2070
3) 2024 4) 2050
వివరణ: కర్బన ఉద్గారాల తగ్గింపులో భాగంగా రైల్వే శాఖ కొత్త లక్ష్యాలను ఎంచుకుంది. 2030 నాటికి శూన్య ఉద్గారాలను సాధించాలని నిర్ణయించింది. డీజిల్ ఆధారిత రైళ్లనుంచి విద్యుత్ శక్తి ఆధారితంగా వెళ్లడంతో పాటు అవసరమైన అన్ని చోట్ల పునరుత్పాదక శక్తిని పొందడం ద్వారా శూన్య ఉద్గారాలను సాధించాలని నిర్ణయించింది. 2070 నాటికి కర్బన తటస్థత సాధించాలని భారత లక్ష్యం. అలాగే వ్యవసాయ రంగంలో డీజిల్ స్థానంలోనే 2024 నాటికి పూర్తిగా పునరుత్పాదక శక్తిని వినియోగించాలని నిర్ణయించారు.
12. 2022కు సరస్వతి సమ్మాన్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? (3)
1) విశ్వనాథ్ 2) రంగనాథన్
3) శివశంకరి 4) పై ఎవరూ కాదు
వివరణ: 2022కు సరస్వతి సమ్మాన్ అవార్డును తమిళ రచయిత్రి శివశంకరి గెలుచుకున్నారు. సూర్యవంశం అనే పుస్తకానికి ఆమెకు ఈ పురస్కారం లభించింది. ఈ అవార్డును 1991 లో ఏర్పాటు చేశారు. ఈ అవార్డ్ తొలి గ్రహీత హరివంశ రాయ్ బచ్చన్. సూర్యవంశం అనే పుస్తకాన్ని 2019లో ప్రచురించారు. ఈ అవార్డును పొందినవాళ్లకు రూ.15 లక్షల నగదు ఇస్తారు.
13. ఏయూకేయూఎస్ లో లేని దేశం ఏది? (4)
1) ఆస్ట్రేలియా 2) యూకే
3) యూఎస్ 4) యూఏఈ
వివరణ: ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడును అడ్డుకొనేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, యూకే సంయుక్తంగా ఏర్పాటు చేసిన కూటమే ఏయూకేయూఎస్. ఇటీవల ఈ కూటమికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. యూఎస్, బ్రిటిష్ నుంచి ఐదు న్యూక్లియర్ శక్తితో పనిచేసే సబ్మెరైన్లను ఆస్ట్రేలియా కొనుగోలు చేయనుంది. అలాగే సైబర్ భద్రతకు సంబంధించి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూటమిలోని మూడు దేశాలు పంచుకుంటాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో చైనాను అడ్డుకొనేందుకు ఇప్పటికే క్వాడ్ అనే కూటమి కూడా ఉంది. ఇందులో అమెరికాతో పాటు భారత్, జపాన్, ఆస్ట్రేలియా సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
15. పట్టుపురుగుల పెంపకందార్లకు బీమా కల్పించిన తొలి రాష్ట్రం ఏది? (3)
1) ఉత్తరప్రదేశ్ 2) కర్ణాటక
3) ఉత్తరాఖండ్ 4) మధ్యప్రదేశ్
వివరణ: పట్టుపురుగుల పెంపకందార్లకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఆ రాష్ట్రం రేశం కీత్ బీమా అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రయోగాత్మకంగా ఆ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు. డెహ్రాడూన్, హరిద్వార్, ఉదమ్‌సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాల్లో అమలు చేస్తారు. 200 మందికి మొదట బీమా చేయించనున్నారు. పర్యావరణ మార్పులు, నీటి కొరతతో పాటు ఇతర ప్రమాదాల నుంచి రైతులకు ఈ పథకం నుంచి రక్షణ లభిస్తుంది.
14. కురుక్షేత్ర పేరుతో ఏ దేశంతో భారత్ ద్వైపాక్షిక విన్యాసాన్ని నిర్వహిస్తుంది? (2)
1) శ్రీలంక 2) సింగపూర్
3) బంగ్లాదేశ్ 4) నేపాల్
వివరణ: కురుక్షేత్ర పేరుతో భారత్, సింగపూర్ సైన్యాలు విన్యాసాలను నిర్వహిస్తాయి. ఈ ఏడాది 13వ విన్యాసాన్ని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించాయి. తొలిసారిగా ఈ ఏడాది కమాండ్ పోస్ట్‌లు కూడా పాల్గొన్నాయి. అంటే బెటాలియన్, బ్రిగేడ్ స్థాయిలోని ప్రణాళిక విభాగాలు అలాగే కంప్యూటర్ యుద్ధ గేమింగ్ విభాగాలు ఇందులో పాల్గొన్నాయి.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?