Current Affairs | దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
1. ఏ రోజును జీరో వేస్ట్ డే గా నిర్వహిస్తారు? (4)
1) మార్చి 21 2) ఏప్రిల్ 1
3) మార్చి 29 4) మార్చి 30
వివరణ: మార్చి 30న జీరో వేస్ట్ డే గా నిర్వహించాలని గతేడాది డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానాన్ని ఆమోదించింది. కెన్యాలోని నైరోబీ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, యూఎన్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ సంయుక్తంగా ఈ రోజును నిర్వహిస్తాయి. తొలిసారిగా ఈ రోజును ఈ ఏడాదే నిర్వహించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఇది కూడా ఒక భాగం. వృథాను అరికట్టడంపై అవగాహన కల్పిస్తారు. పునర్వినియోగం, పదార్థాల రీసైక్లింగ్, వృథా తగ్గింపు వంటి అంశాలు ఈ అవగాహనలో భాగంగా ఉంటాయి.
2. మధ్య ఆసియాలోని ఏ రెండు దేశాలు మలేరియా రహితంగా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? (2)
ఎ) అజర్బైజాన్ బి) ఉజ్బెకిస్థాన్
సి) తజకిస్థాన్ డి) తుర్క్మెనిస్థాన్
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, డి 4) సి, డి
వివరణ: అజర్బైజాన్, తజకిస్థాన్ దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. మలేరియా అనేది ఆఫ్రికా, దక్షిణ అమెరికా, దక్షిణ ఆసియాలో ఉష్ణ మండల, ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్లాస్మోడియం అనే జాతి వల్ల ఇది సోకుతుంది. మలేరియాను నియంత్రించేందుకు భారత్ అనేక చర్యలు తీసుకుంటుంది. 2016లో నేషనల్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. మలేరియాను నిర్మూలించేందుకు 2016-30 మధ్య కాలంలో చేయాల్సిన కృషికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలను అనుగుణంగా భారత్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
3. సీపీటీపీపీపీలో చేరిన యూరప్ తొలి దేశం ఏది? (3)
1) నార్వే 2) ఫిన్లాండ్
3) యూకే 4) ఫ్రాన్స్
వివరణ: సీపీటీపీపీ అనేది సంక్షిప్త రూపం. దీన్ని విస్తరిస్తే కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్స్ ఫర్ ట్రాన్స్-పసిఫిక్ పార్ట్నర్షిప్ (ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యానికి సమగ్ర, ప్రగతిశీల ఒప్పందం). ఇందులో యూకే చేరింది. ఈ నిర్ణయం తీసుకున్న తొలి యూరప్ దేశంగా కొత్త చరిత్రను సృష్టించింది. ఇందులో ఇప్పటికే 11 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అవి.. ఆస్ట్రేలియా, బ్రూనై, కెనడా, చిలీ, జపాన్, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరూ, సింగపూర్, వియత్నాం. ఈ ఒప్పందం 2018లో కుదిరింది. వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం ఇది.
4. నాటోలో చేరిన 31వ దేశం ఏది? (1)
1) ఫిన్లాండ్ 2) స్వీడన్
3) ఉక్రెయిన్ 4) బెలారస్
వివరణ: నాటో కూటమిలోకి ఫిన్లాండ్ చేరింది. ఎన్ఏటీవో అనేది సంక్షిప్త రూపం. దీన్ని విస్తరణ రూపం.. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఉమ్మడి రక్షణ వ్యవస్థగా దీన్ని చెప్పొచ్చు. కూటమిలోని ఒక సభ్య దేశంపై ఇతర దేశాలు దాడి చేస్తే, అది అన్ని దేశాలపై చేసిన దాడిలాగా పరిగణిస్తారు. అంటే ఉమ్మడి రక్షణ వ్యవస్థ లాగా ఈ కూటమి పనిచేస్తుంది. ఉక్రెయిన్ కూడా ఇందులో చేరడానికి చూడటమే, యుద్ధానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి. ఫిన్లాండ్ దేశానికి రష్యాతో సుమారు 1300 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఇప్పుడు ఫిన్లాండ్పై రష్యా దాడి చేసిన పక్షంలో అన్ని నాటో సభ్యదేశాలు రష్యాతో యుద్ధానికి దిగుతాయి. నిజానికి ఈ కూటమిలో చేరేందుకు స్వీడన్ కూడా యత్నించింది. అయితే టర్కీ, హంగేరి దేశాలు అభ్యంతరం చెప్పాయి.
5. ఇటీవల జిగ్మే ఖేసర్ నామ్గెల్ వాంగ్ చుక్ భారత్‌లో పర్యటించారు. ఆయన ఏ దేశ ప్రభుత్వాధినేత? (4)
1) నేపాల్ 2) థాయ్‌లాండ్
3) లావోస్ 4) భూటాన్
వివరణ: భూటాన్ రాజు భారత్‌లో ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో అధికారికంగా పర్యటించారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. ఆ దేశంలో ప్రారంభం కానున్న 13వ పంచవర్ష ప్రణాళికకు భారత్ సాయం చేయనుంది. ఈ మేరకు అంగీకారం కుదిరింది. అలాగే అదనంగా 100 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణ సౌకర్యాన్ని భూటాన్‌కు భారత్ కల్పించనుంది. ఇది స్టాండ్‌బైగా ఉండనుంది. అంటే భూటాన్ కరెన్సీలో స్థిరత్వం తీసుకొచ్చేందుకు ఉద్దేశించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఇలాంటి స్టాండ్ బై రుణ సౌకర్యాలు రెండు ఉన్నాయి.
6. క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్ ఇటీవల వార్తల్లో నిలిచారు. వీరు ఎవరు? (3)
1) భారత్‌కు రానున్న ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు
2) మహిళ ఐపీఎల్ క్రికెట్ సభ్యులు
3) చంద్రుడి పైకి వెళ్లనున్న వ్యోమగాములు
4) పైవేవీ కాదు
వివరణ: ఆర్టెమిస్-2 పేరుతో నాసా మరోసారి చంద్రుడిపైకి మిషన్‌ను చేపట్టనుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ప్రయాణించనున్నారు. ఇందులో క్రిస్టినా కోచ్ అనే మహిళ కూడా ఉన్నారు. అలాగే నల్ల జాతికి చెందిన విక్టర్ గ్లోవర్ కూడా ఈ నలుగురిలో ఒకరు. మరో ఇద్దరు రీడ్ వైస్మన్, జెరెమీ హన్సెన్.
7. దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? (2)
1) భోపాల్
2) హైదరాబాద్
3) పుణె
4) సూరత్
వివరణ: దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఇది 125 అడుగులు ఉండనుంది. ఏప్రిల్ 14న ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125వ జయంతి. విగ్రహం రూపకర్తలు పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత రామ్ వన్ జీ సుతార్, ఆయన కుమారుడు అనిల్ సుతార్.
8. మల్టీలేయర్ పీసీబీ కి సంబంధించి తెలంగాణకు చెందిన టీ వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ? (1)
1) క్వాల్ కమ్
2) సహజానంద ఇన్స్టిట్యూట్
3) గ్రామీన్ 4) ఫిస్కర్
వివరణ: రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి క్వాల్కామ్ అంతర్జాతీయ సంస్థతో తెలంగాణకు చెందిన టీ-వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రత్యేకమైన బహుళ పొరల ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డ్ (మల్టీలేయర్ పీసీబీ) ఫ్యాబ్రికేషన్ సదుపాయాన్ని అభివృద్ధి చేస్తారు.
భారత్‌లో డిజైన్, ఇన్నోవేషన్ అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు క్వాల్కామ్ మద్దతుగా నిలవడంతో పాటు పీసీబీ ఫ్యాబ్రికేషన్‌లో అవసరమైన అన్ని రకాల పరికరాలను అందించనుంది.
9. ఇటీవల ఏ నగరంలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్వహించారు? (3)
1) న్యూయార్క్ 2) టోక్యో
3) న్యూఢిల్లీ 4) బీజింగ్
వివరణ: ఐదో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యూఢిల్లీలో ఏప్రిల్ 4, 5 తేదీల్లో నిర్వహించారు. విధాన నిర్ణేతలు, పరిశోధకులతో పాటు విపత్తు నిర్వహణ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. సమావేశ ఇతివృత్తం ‘డెలివరింగ్ రెసిలెంట్ అండ్ ఇన్‌క్లూజివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్’.
10. కిమ్ కాటన్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆమె ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? (2)
1) ఫుట్‌బాల్ 2) క్రికెట్
3) హాకీ 4) కబడ్డీ
వివరణ: న్యూజిలాండ్ క్రీడాకారిణి కిమ్ కాటన్. ఇటీవల ఆమె అంతర్జాతీయ పురుషుల టీ-20లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ ఘనతను సాధించిన తొలి మహిళా క్రికెటర్ ఆమె. న్యూజిలాండ్‌లోని డుండెన్లో న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆమె అంపైర్‌గా వ్యవహరించారు.
11. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్‌కు అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? (2)
1) సుధా మూర్తి 2) సుధా శివకుమార్
3) రోషిణి 4) వర్థిని
వివరణ: ఫిక్కీలో ఉండే మహిళలు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో). సుధా శివ్‌కుమార్ ఇటీవల దీనికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆగ్నేయాసియాలో మహిళలే నిర్వహిస్తున్న వ్యాపార వ్యవస్థల్లో ఎఫ్ఎల్వో అతి పెద్దది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది ఈ వ్యవస్థ. మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలకు అండగా నిలబడుతుంది. మహిళల నేతృత్వంలోని సంస్థలు ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.
12. ఎస్ఎల్ఐఎన్ఈఎక్స్-2023, ఏ రెండు దేశాల మధ్య నావికా దళ విన్యాసం? (3)
1) ఇండోనేషియా-శ్రీలంక 2) శ్రీలంక-థాయ్‌లాండ్
3) ఇండియా-శ్రీలంక 4) ఇండియా, లిథువేనియా
వివరణ: భారత్, శ్రీలంక మధ్య జరిగే సైనిక విన్యాసమే ఎస్ఎల్ఐఎన్ఈఎక్స్. 10 నావికా దళ సైనిక విన్యాసం ఏప్రిల్ 3 నుంచి 8 వరకు ఆరు రోజుల పాటు నిర్వహించారు. ఇది రెండు దశల్లో జరిగింది. 1. హార్బర్ ఫేజ్,
2. సీ ఫేజ్. శ్రీలంకలోని కొలంబోలో దీన్ని నిర్వహించారు. భారత్ తరఫున ఐఎన్ఎస్ కిల్టన్, ఐఎన్ఎస్ సావిత్రి పాల్గొన్నాయి. శ్రీలంక తరఫున ఎస్ఎల్ఎన్ఎస్ విజయ బాహు, ఎస్ఎల్ఎన్ఎస్ సముద్ర అనే నౌకలు పాల్గొన్నాయి. భారత నావికా దళానికి చెందిన చేతక్ హెలికాప్టర్, డోర్నియర్ మారిటైం పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా పాల్గొన్నాయి.
13. ఇటీవల భారత్‌కు చెందిన ఎవరికి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని ఇచ్చింది? (4)
1) శశి థరూర్ 2) స్వాతి పిరమాల్
3) కృష్ణ వావిలాల 4) కిరణ్ నాడార్
వివరణ: సమాజ సేవకురాలు కిరణ్ నాడార్కు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం అయిన ‘చెవాలియర్ డి లా లీజియన్ డి హానర్’ను ఇచ్చింది. ఆ దేశ రాయబారి ఎమ్మాన్యుయెల్ లెనియాన్ కిరణ్ నాడార్కు అందించారు. ఆమె కిరణ్ నాడార్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్‌కు నేతృత్వం వహిస్తున్నారు. కళలకు సంబంధించి అంశాల్లో సమాజ సేవ చేస్తుంది ఈ వ్యవస్థ. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించినందుకు ఆమెకు ఈ పురస్కారం లభించింది. గతేడాది ఫ్రాన్స్ నుంచి శశిథరూర్, స్వాతి పిరమాల్ ఈ అవార్డును పొందారు. అలాగే కృష్ణ వావిలాల అమెరికా నుంచి పురస్కారాన్ని పొందారు.
14. కింది ఏ వ్యవస్థ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? (2)
1) ప్రణాళికా సంఘం 2) సీబీఐ
3) నీతి ఆయోగ్ 4) ఏదీకాదు
వివరణ: 1963 ఏప్రిల్ 1న సీబీఐ ఏర్పాటైంది. సంతానం కమిటీ సూచన మేరకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీబీఐ ఏర్పాటై 60 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జరిగిన వేడుకలకు భారత ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. ఢిల్లీ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం ఇది ఏర్పాటైంది. రాష్ర్టాల సమ్మతి లేనిదే అక్కడకు వెళ్లి సీబీఐ విచారించడం సాధ్యం కాదు. తొమ్మిది రాష్ర్టాలు ఇప్పటికే సీబీఐకి అనుమతి నిరాకరించాయి. సీబీఐ సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదు.
15. స్టార్టప్‌ల కోసం ప్రత్యేకించిన బ్యాంకును ఎక్కడ ఏర్పాటు చేశారు? (3)
1) ఇండోర్ 2) నాగ్‌పూర్
3) పుణె 4) బాంబే
వివరణ: అంకుర సంస్థల కోసం ప్రత్యేకించిన బ్యాంకును పుణెలో ఏర్పాటు చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దీన్ని ఏర్పాటు చేసింది. ఆయా అంకుర సంస్థల అభివృద్ధికి ఈ బ్యాంక్ తోడ్పాటును అందిస్తుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సిడ్బీ కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. స్టార్టప్ సంస్థలకు సకాలంలో ఆర్థిక తోడ్పాటును అందించే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?