కరెంట్ అఫైర్స్
తెలంగాణ
36వ వీఎల్ఎస్ఐ
36వ వీఎల్ఎస్ఐ (వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్) డిజైన్, 22వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ సదస్సును జనవరి 10న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సదస్సును కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరికరాలు, ఐపీ, టూల్స్ డిజైనింగ్‌లోని స్టార్టప్‌లకు తగిన ప్రోత్సాహం అందించేందుకు 200 మిలియన్ డాలర్లతో ఫ్యూచర్ డిజైన్ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ఇంటెల్, క్వాల్‌కాం, మాస్ చిప్ వంటి సంస్థలకు హైదరాబాద్ కీలకంగా ఉందని, వీఎల్ఎస్ఐ రంగ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
సందీప్‌కుమార్ సుల్తానియా
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అవార్డు లభించింది. ఢిల్లీలో జనవరి 10న 16వ ఐసీఏఐ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సర్వీస్ విభాగంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నుంచి ఆయన అవార్డును అందుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుల్తానియా సీఏ పూర్తి చేసి ఐసీఏఐలో సభ్యుడిగా ఉన్నారు.
శాంతికుమారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి జనవరి 11న నియమితులయ్యారు. దీంతో ఆమె రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా రికార్డు సృష్టించారు. ఆమె 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. ఆమె ఇప్పటివరకు అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆమె 2025, ఏప్రిల్ వరకు పదవిలో ఉంటారు.
జాతీయం
పృథ్వీ-2
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను జనవరి 10న విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగాన్ని ఒడిశా తీరంలోని చాందీపూర్‌లో చేపట్టారు. ఈ క్షిపణికి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాల్ని ఛేదించే సామర్థ్యం ఉంది. ఇది 500 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. పృథ్వీ సిరీస్‌లో పృథ్వీ-1, పృథ్వీ-2, పృథ్వీ-3, ధనుష్ క్షిపణులు ఉన్నాయి.
వరల్డ్ హిందీ డే
వరల్డ్ హిందీ డే (విశ్వ హిందీ దివస్)ని జనవరి 10న నిర్వహించారు. 1949లో మొదటిసారిగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ)లో హిందీని భారతదేశ అధికారిక భాషగా గుర్తించింది. దీనికి గుర్తుగా 1975లో నాగ్‌పూర్‌లో మొట్టమొదటి ప్రపంచ హిందీ సదస్సును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. ఈ సదస్సు జనవరి 10 నుంచి 12 వరకు జరిగింది. దీంతో 2006లో ప్రధాని మన్మోహన్ సింగ్ జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్
7వ ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్-గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను జనవరి 11న ప్రారంభించారు. ‘మధ్యప్రదేశ్-ది ఫ్యూచర్ రెడీ స్టేట్’ థీమ్‌తో రెండు రోజులు ఈ సమ్మిట్‌ను నిర్వహించారు. 84 దేశాల నుంచి 447 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 401 బయ్యర్లు, ఐదు వేల మంది పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.
గంగా విలాస్
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ (నదీ పర్యాటక నౌక) ‘ఎంవీ గంగా విలాస్’ను వారణాసిలో జనవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించారు. 51 రోజులు సాగే ఈ నౌక ప్రయాణంలో 50 పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గువాహటి, కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కవర్ అవుతాయి. రెండు దేశాల్లో కలిపి 27 నదుల్లో ప్రయాణం సాగుతుంది. వారణాసిలో ప్రారంభమై బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూగఢ్‌కు చేరుకుంటుంది. ఈ నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉంది. విలాసవంతమైన 18 సూట్లు ఉన్నాయి. రూ.68 కోట్లతో దీన్ని నిర్మించారు.
అంతర్జాతీయం
వర్జిన్ ఆర్బిట్
బ్రిటన్ నుంచి ఉపగ్రహాల ప్రయోగానికి జరిగిన మొదటి పరీక్ష విఫలమైంది. అమెరికాకు చెందిన వర్జిన్ ఆర్బిట్ సంస్థ కార్న్‌వాల్ నగరం నుంచి ఈ ప్రయోగాన్ని జనవరి 9న చేపట్టింది. దీనికి మార్పులు చేసిన ఒక బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగించింది. దీనికి 9 చిన్న ఉపగ్రహాలతో కూడిన ఒక రాకెట్‌ను అమర్చారు. నింగిలోకి వెళ్లాక 10 వేల మీటర్ల ఎత్తులో ఈ విమానం ఆ రాకెట్‌ను విడుదల చేసింది. టెక్నికల్ లోపాల వల్ల అది భూ కక్ష్యలోకి చేరుకోలేకపోయిందని యూకే స్పేస్ పోర్ట్ హెడ్ మెలిస్సా థోర్ప్ వెల్లడించారు. దీంతో రాకెట్, ఉపగ్రహాలు ధ్వంసమయ్యాయి. విమానం సురక్షితంగా కార్న్‌వాల్‌కు తిరిగొచ్చింది.
ప్రిన్స్ హ్యారీ పుస్తకం
బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్వీయ జీవిత చరిత్ర పుస్తకం ‘స్పేర్’ జనవరి 10 విడుదలయ్యింది. విడుదలైన తొలిరోజే 4 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. దీంతో బ్రిటన్‌లో ఇప్పటివరకు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న నాన్-ఫిక్షన్ పుస్తకంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది.
పాస్‌పోర్ట్ ఇండెక్స్
ప్రపంచంలోనే 2023కు శక్తిమంతమైన పాస్‌పోర్ట్ దేశాల జాబితాను హెన్లీ సంస్థ జనవరి 11న విడుదల చేసింది. 199 దేశాలతో ఈ జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో జపాన్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశ పాస్‌పోర్టు ఉండే 193 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించవచ్చు. సింగపూర్ 2, సౌత్ కొరియా 3, జర్మనీ 4, స్పెయిన్ 5, ఫిన్లాండ్ 6, ఇటలీ 7, లక్సెంబర్గ్ 8, ఆస్ట్రియా 9, డెన్మార్క్ 10వ స్థానాల్లో ఉన్నాయి.
భారత దేశం 85వ స్థానంలో నిలిచింది. 2022లో 60 దేశాల్లో పర్యటించేందుకు వీలుండగా, సెర్బియా నిరాకరణతో ఈ ఏడాది 59 దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. చైనా 66, పాకిస్థాన్ 106 స్థానాల్లో నిలువగా.. చివరి స్థానంలో అఫ్గానిస్థాన్ నిలిచింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమాన్ని జనవరి 11న కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్ హాల్లో నిర్వహించారు. దీనిలో బెస్ట్ మోషన్ పిక్చర్ క్యాటగిరీలో స్టీవెన్ స్పీల్బర్గ్ చిత్రం ‘ది ఫేబుల్‌మ్యాన్స్’, మ్యూజిక్ లేదా కామెడీ చిత్రంగా ‘ది బాన్షీర్ ఆఫ్ ఇనిషెరిన్’ నిలిచాయి. బెస్ట్ యాక్టర్ అవార్డు ఆస్టిన్ బట్లర్, యాక్ట్రెస్ అవార్డు కేట్ బ్లాంచెట్‌లకు దక్కింది. బెస్ట్ డైరెక్టర్ అవార్డు స్టీవెన్ స్పీల్బర్గ్, బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు ది బాన్షీర్ ఇనిషెరిన్లకు లభించింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాటకు దక్కింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ క్యాటగిరీలో భారతీయ సినిమాకు ఈ అవార్డు రావడం విశేషం.
క్రీడలు
హింద్ కేసరి
హింద్ కేసరి జాతీయ సీనియర్ ఇండియన్ ైస్టెల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ అభిజీత్ కాట్కే విజేతగా నిలిచాడు. జనవరి 8న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అభిజీత్ హర్యానాకు చెందిన సోమ్‌వీర్‌ను ఓడించాడు.
మహిళల విభాగంలో హర్యానాకు చెందిన పుష్ప గెలిచింది. ఫైనల్లో ఢిల్లీకి చెందిన మోహినిని ఓడించింది.
జొకోవిచ్
అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియా ఆటగాడు గెలుచుకున్నాడు. జనవరి 8న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు సెబాస్టియన్‌ను ఓడించాడు. 16 ఏండ్ల తర్వాత అతడు ఈ టైటిల్‌ను గెలిచాడు. అత్యధిక సింగిల్స్ టైటిలళ్లు గెలిచిన క్రీడాకారుల జాబితాలో జొకోవిచ్ సంయుక్తంగా నాలుగో స్థానానికి చేరుకున్నాడు. జొకోవిచ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) 92 టైటిళ్లతో సమ ఉజ్జీగా నిలిచాడు.
మహిళల సింగిల్స్ టైటిల్‌ను బెలారస్ క్రీడాకారిణి సబలెంకా గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి లిండా నోస్కావాను సబలెంకా ఓడించింది.
పురుషుల డబుల్స్‌లో లాయిడ్ గ్లాస్‌పూల్ (యూకే)-హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జంట గెలిచింది. మహిళల డబుల్స్‌లో అఇసాయ మహ్మద్ (యూఎస్)-టేలర్ టౌన్సెండ్ (యూఎస్) జోడీ విజేతగా నిలిచింది.
ప్రిటోరియస్
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ అంతర్జాతీయ క్రికెట్‌కు జనవరి 9న వీడ్కోలు పలికాడు. ఇకపై కేవలం టీ20 లీగ్‌లు, ఇతర పొట్టి ఫార్మాట్లలో మాత్రమే పాల్గొంటానన్నాడు. అతడు 30 టీ20లు, 27 వన్డేలు, మూడు టెస్టులు ఆడాడు.
వార్తల్లో వ్యక్తులు
అనురాగ్ కుమార్
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అనురాగ్ కుమార్ జనవరి 9న నియమితులయ్యారు. ఈసీఐఎల్‌లో ఈడీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పదోన్నతి లభించింది. ఈ నియామకానికి ఏసీసీ (ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్) అనుమతించింది. ఆయన ఈ పదవిలో 2016, జనవరి 31 వరకు ఉంటారు.
చరానియా
అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చీఫ్ టెక్నాలజిస్ట్‌గా భారత సంతతికి చెందిన ఏసీ చరానియా నియమితులైనట్లు వైట్‌హౌస్ అధికారులు జనవరి 10న ప్రకటించారు. టెక్నికల్‌కు సంబంధించిన విధానాలపై నాసా అధిపతి బిల్ నెల్సన్‌కు చరానియా ముఖ్య సలహాదారుగా ఉంటారు. ఈ పదవిలో ఆయన టెక్నికల్ పెట్టుబడులు, ఆరు మిషన్ డైరెక్టరేట్ల అవసరాలను పర్యవేక్షిస్తారు. ఇప్పటివరకు తాత్కాలికంగా ఈ పదవిలో ఉన్న భారత సంతతికి చెందిన సైంటిస్ట్ భవ్యా లాల్ స్థానంలో ఆయన నియమితులయ్యారు.
రంజ్ పిైళ్లె
కెనడాలోని యుకాన్ ప్రాంత ప్రభుత్వ 10వ ప్రీమియర్ (పాలనాధిపతి)గా భారత సంతతి వ్యక్తి రంజ్ పిైళ్లె జనవరి 14న ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఆయన కెనడా ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకు మంత్రిగా పనిచేస్తున్నారు. కేరళ మూలాలు కలిగిన పిైళ్లెని ఈ నెల 8న యుకాన్ లిబరల్ పార్టీ తమ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కెనడాలోని ఓ ప్రాంతానికి ప్రీమియర్‌గా భారత సంతతి వ్యక్తి ఎంపిక కావడం ఇది రెండోసారని అక్కడి అధికారులు వెల్లడించారు. ఈయన కంటే ముందు ఉజ్జల్ దోసంజ్ బ్రిటిష్ కొలంబియా రాష్ర్టానికి 2000-01 మధ్య ప్రీమియర్‌గా వ్యవహరించారు.
అర్చన కే ఉపాధ్యాయురాలు, విషయ నిపుణులు, నల్లగొండ
- Tags
- CM KCR
- current
- Current Affairs
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?