Current Affairs | కరెంట్ అఫైర్స్
తెలంగాణ
శంషాబాద్‌కు 4 స్టార్
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్కైటాక్స్ 4 స్టార్ రేటింగ్‌ను సెప్టెంబర్ 4న లభించింది. కొత్త ప్రమాణాలతో ఆపరేషనల్ ఎక్సలెన్సీ సాధించడంతో ఈ రేటింగ్ సాధ్యమైందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్) సీఈవో ప్రదీప్ ఫణికర వెల్లడించారు. నావిగేషన్ సులభతరం, చెక్ ఇన్ ప్రక్రియ, వే ఫైండింగ్ సామర్థ్యాలను వేగంగా చేయడంలో ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను అమలు చేస్తున్నారు. 1989 నుంచి అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలు, విమాన సంస్థలను అంచనా వేస్తూ స్కై ట్రాక్స్ 1 నుంచి 5 మధ్య స్టార్ రేటింగ్లను కేటాయిస్తుంది.
టెస్కాబ్‌కు అవార్డులు
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)కు అవార్డులు సెప్టెంబర్ 5న లభించాయి. ముంబైలోని రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య (నాఫ్సాబ్) దేశంలోని ఉత్తమ సహకార బ్యాంకుగా టెస్కాబ్‌కు ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏటా జాతీయ సమాఖ్య దేశంలో రాష్ట్ర సహకార, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక సహకార సంఘాల, సహకార శిక్షణ సంస్థల పనితీరుపై అధ్యయనం చేసి ఉత్తమ ప్రతిభా పురస్కారాలను అందజేస్తుంది. దేశవ్యాప్తంగా 34 రాష్ట్ర సహకార బ్యాంకులు ఉండగా, దీనిలో టెస్కాబ్‌కు 2020-21లో ప్రథమ, 2021-22లో ద్వితీయ పురస్కారాలు లభించాయి. సహకార శిక్షణ సంస్థల విభాగంలో టెస్కాబ్ 2020-21, 2021-22 రెండు సంవత్సరాలకు ప్రథమ పురస్కారాలకు ఎంపికయ్యింది. దేశంలోని 351 జిల్లా సహకార బ్యాంకుల్లో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, దేశంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సంఘాల్లో చొప్పదండి సొసైటీ ప్రథమ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఈ అవార్డులను సెప్టెంబర్ 26న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రదానం చేస్తారు.
ఉత్తమ ఉపాధ్యాయులు
రాష్ర్టానికి చెందిన ఇద్దరు ప్రభుత్వ టీచర్లకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 5న అందజేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్ అర్చన, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపాని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెదోడ్కర్ సంతోష్‌లకు ఈ అవార్డు దక్కింది. గ్రామస్థుల చొరవ, పలు స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైల సహకారంతో అర్చన పాఠశాలలో వసతులు కల్పించారు. డబుల్ డెస్క్ బెంచీలు, ప్రొజెక్టర్, కంప్యూటర్లు, వాటర్ ప్లాంట్, ఉచిత నోట్‌బుక్స్, బ్యాగ్స్, సాయంత్రం టిఫిన్ వంటివి సమకూర్చారు. దీంతో మంచిర్యాల జిల్లాలోనే అధిక విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలగా రెబ్బనపల్లి గుర్తింపు పొందింది. దాతల సహకారానికి తోడుగా అర్చన కూడా ప్రతి నెలా తన వేతనం నుంచి రూ.8 వేలు పాఠశాల కోసం ఖర్చు చేస్తున్నారు. నిపాని ప్రాథమికోన్నత పాఠశాలకు సర్వశిక్షా అభియాన్ నుంచి 5 కంప్యూటర్లు, గ్రామస్థుల సహకారంతో 2 ల్యాప్‌టాప్‌లు సంతోష్ సమకూర్చారు. ఈ పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ ప్రోగ్రాంకు విద్యార్థులు నామినేట్ అయ్యారు.
జాతీయం
ఆదిత్య- ఎల్ 1
ఇస్రో సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య- ఎల్1 ఉపగ్రహాన్ని సెప్టెంబర్ 2న విజయవంతంగా నింగిలోకి పంపింది. సతీష్ ధవన్ స్పెస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 వాహక నౌక 1480.7 కిలోల ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 16 రోజులు భూమి చుట్టూ తిరిగి, వేగం పుంజుకుని సూర్యుడి వైపు ప్రయాణం మొదలుపెడుతుంది. భూమికి 15 లక్షల కి.మీ. దూరంలో ఉన్న నిర్దేశిత ఎల్1 బిందువును చేరుకోవడానికి 125 రోజులు ప్రయాణిస్తుంది. సూర్యుడిపై పరిశోధన కోసం శాటిలైట్‌ను ప్రయోగించిన ఐదో దేశంగా భారత్ నిలిచింది. భారత్ కంటే ముందు అమెరికా, జపాన్, చైనా, ఈయూ ఈ ప్రయోగాన్ని చేపట్టాయి.
డిజిటల్ స్కిల్స్
అట్టడుగు వర్గాల వారిలో డిజిటల్ నైపుణ్యాలను పెంచేందుకు మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మెటా (ఫేస్బుక్) ఒక ఒప్పందంపై సెప్టెంబర్ 4న సంతకాలు చేశాయి. మూడేండ్లకు కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా ‘ఎడ్యుకేషన్ టు ఎంట్రప్రెన్యూర్షిప్: విద్యార్థులు, అధ్యాపకులు, వ్యవస్థాపకుల తరానికి సాధికారత కల్పించడం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనిలో దేశ వ్యాప్తంగా 5 లక్షల మంది విద్యార్థులు, యువత, ఔత్సాహిక, చిన్న వ్యాపారులకు కీలకమైన డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యాలను అందిస్తారు.
ఆరోగ్య మైత్రి క్యూబ్
ప్రపంచంలో మొట్టమొదటి ‘పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్’ను తయారు చేసినట్లు సెప్టెంబర్ 3న అధికారులు వెల్లడించారు. ఈ హాస్పిటల్‌ను భీష్మ్ (భారత్ హెల్త్ ఇనీషియేటివ్ ఫర్ సహ్యోగ్ అండ్ మైత్రి) ప్రాజెక్టులో భాగంగా రూపొందించారు. దీన్ని 72 క్యూబ్స్‌లో మడత పెట్టేసి మూడు తోపుడు బండ్లుగా మార్చవచ్చు. ఇవి కలిసే ఉంటాయి. దీని ద్వారా 100 మంది రోగులకు 48 గంటల పాటు వైద్యం అందించవచ్చు. దీనిలో 72 గదులున్నాయి. దీనికి ‘ఆరోగ్య మైత్రి క్యూబ్’ అని పేరు పెట్టారు. దీన్ని రక్షణ మంత్రిత్వ శాఖ సారథ్యంలోని ఒక టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలో అభివృద్ధి చేశారు.
క్రీడలు
ఆసియా హాకీ
ఆసియా హాకీ 5ఎస్ టోర్నీలో భారత్ టైటిల్‌ను గెలిచింది. ఒమన్‌లోని సలాలాహ్లో సెప్టెంబర్ 2న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 2-0 (పెనాల్టీ షూటౌట్) తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు గోల్స్ 4-4తో సమం కావడంతో పెనాట్లీ షూటౌట్‌ను నిర్వహించారు. ఈ విజయం ద్వారా వచ్చే ఏడాది జరిగే హాకీ 5ఎస్ ప్రపంచ కప్ టోర్నీకి భారత్ అర్హత సాధించింది. భారత్ తరఫున రాహిల్ డబుల్స్ చేయగా, జుగ్రాజ్సింగ్, మణిందర్ సింగ్ ఒక్కో గోల్స్ చేశారు.
హీత్ స్ట్రీక్
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ సెప్టెంబర్ 3న మరణించాడు. ఆ దేశం తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 2943 పరుగులు చేసి, 239 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 216 వికెట్లు తీసి, 1990 పరుగులు చేశాడు.
డ్యురాండ్ కప్
దేశీయ డ్యురాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీలో మోహన్ బగాన్ జట్టు విజేతగా నిలిచింది. కోల్‌కతాలో సెప్టెంబర్ 3న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 1-0తో మోహన్ బగాన్ జట్టు ఈస్ట్ బెంగాల్‌పై విజయం సాధించింది. 2000లో చివరిసారి ఈ ట్రోఫీని గెలిచిన మోహన్ బగాన్ జట్టు 23 ఏండ్ల తర్వాత గెలుచుకుంది. ఓవరాల్‌గా మోహన్ బగాన్ జట్టుకు ఇది 17వ డ్యురాండ్ టైటిల్.
వార్తల్లో వ్యక్తులు
సాటో కిల్మన్
వనవటు పార్లమెంట్ ఆ దేశ నూతన ప్రధాన మంత్రిగా సాటో కిల్మన్ను సెప్టెంబర్ 4న ఎన్నుకుంది. మాజీ ప్రధాని, పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ నాయకుడు అయిన కిల్మన్కు 27 ఓట్లు రాగా, ప్రస్తుత ప్రధాని ఇస్మాయెల్ కల్సాకౌ కు 23 ఓట్లు వచ్చాయి. వనవటు 80 దీవుల ద్వీప దేశం. దీని రాజధాని పోర్ట్ విలా. ప్రధాన భాషలు బిస్లామ, ఇంగ్లిష్, ఫ్రెంచ్. ఈ దేశ కరెన్సీ వటు.
తామి మానిస్
అమెరికాకు చెందిన తామి మానిస్ (58) ప్రపంచంలోనే పొడవైన కురులు కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డుల్లో చేరినట్లు సెప్టెంబర్ 3న వెల్లడించారు. ఆమె కురులు 172.72 సెంటీమీటర్ల (5.8 అడుగులు) పొడవు ఉన్నాయి. టెన్నెసే రాష్ట్రంలోని నాక్స్విల్లేకు చెందిన మానిస్ ప్రభుత్వ నర్సుగా పనిచేస్తున్నారు. 1980 నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా జట్టును కత్తింరించుకోలేదు.
నీరజ్ మిట్టల్
డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డీవోటీ) సెక్రటరీగా నీరజ్ మిట్టల్ సెప్టెంబర్ 6న నియమితులయ్యారు. ఈయన 1992 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం తమిళనాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌లో సీనియర్ అడ్వైజర్‌గా, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు.
సంధ్యారెడ్డి
ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రం సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపాలిటీకి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) డిప్యూటీ మేయర్‌గా సెప్టెంబర్ 7న ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన ఈమె ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. స్ట్రాత్‌ఫీల్డ్ స్థానిక ఎన్నికల్లో గతేడాది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఆమె సామాజిక సేవకు 2020లో ‘స్ట్రాత్‌ఫీల్డ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.
అంతర్జాతీయం
కఠ్మాండు-కళింగ
కఠ్మాండు-కళింగ లిటరరీ ఫెస్టివల్ (కేఎల్ఎఫ్) సెప్టెంబర్ 3న ముగిసింది. 2వ ఎడిషన్ అయిన ఈ సదస్సును నేపాల్ విదేశాంగ మంత్రి నారాయణ్ ప్రకాశ్ సాద్ సెప్టెంబర్ 1న ప్రారంభించారు. ఈ సదస్సుకు భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి 400కు పైగా సాహితీవేత్తలు హాజరయ్యారు. నేపాలీస్ రచయిత మాధవ్ ప్రసాద్ పోఖ్రెల్, భారత రచయిత అవధేశ్ ప్రధాన్, నటి, రచయిత దివ్యదత్త, నటి, రచయిత మనీషా కొయిరాల లకు ‘యశస్వి సాహిత్య సమ్మాన్’ అవార్డు ప్రకటించారు. ‘యశస్వి బుక్ ప్రైజ్’ బిబేక్ ఓఝా, డా. నవరాజ్ కేసీ, రేణుకా జీసీ, డా. మహేంద్ర మల్లా, గోవింద గిరి ప్రేరణ, అనురాధలకు లభించింది.
మినిట్‌మ్యాన్-III
నిరాయుధ మినిట్‌మ్యాన్-III ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం- ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్)ని సెప్టెంబర్ 6న పరీక్షించింది. దీన్ని కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్‌లో చేపట్టారు. స్పేస్ లాంచ్ డెల్టా 30 వైస్ కమాండర్ కల్నల్ బ్రయాన్ టైటస్ ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. అమెరికా తన అణు నిరోధక వ్యవస్థను తెలిపేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
స్లిమ్ ల్యాండర్
జపాన్ జాబిల్లిపై పరిశోధన కోసం స్లిమ్ (స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) అనే లూనార్ ల్యాండర్‌ను జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ (జాక్సా) సెప్టెంబర్ 7న విజయవంతంగా ప్రయోగించింది. నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి హెచ్-2ఎ రాకెట్ ద్వారా ఎక్స్-రే టెలిస్కోప్, లూనార్ ల్యాండర్లను నింగిలోకి పంపారు. ఎక్స్-రే టెలిస్కోప్‌ను గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరిమితులను కనుగొనేందుకు ప్రయోగించారు. తేలికపాటి లూనార్ ల్యాండర్ (స్లిమ్) మూడు, నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించననుంది. చంద్రుడిపై ఇప్పటివరకు నాలుగు (అమెరికా, రష్యా, చైనా, భారత్) దేశాలే అడుగుపెట్టాయి. లూనార్ ల్యాండర్ చంద్రుడిపై విజయంతంగా దిగితే జపాన్ ఐదో దేశంగా నిలువనుంది. జాక్సాను 2003, అక్టోబర్ 1న స్థాపించారు. జాక్సా అధ్యక్షుడు యమకావా హిరోషి.
అక్షరాస్యత దినోత్సవం
ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని (ఇంటర్నేషనల్ లిటరసీ డే) సెప్టెంబర్ 8న నిర్వహించారు. ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండటానికి నిరక్షరాస్యతే ముఖ్య కారణం. యునెస్కోలోని సభ్య దేశాల విద్యామంత్రులు 1965, నవంబర్ 17న నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీలో దీనిపై చర్చించారు. దీంతో సెప్టెంబర్ 8న ఇంటర్నేషనల్ లిటరసీ డేని నిర్వహించాలని తీర్మానించారు. 1966 నుంచి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దీని థీమ్ ‘ప్రమోటింగ్ లిటరసీ ఫర్ ఏ వరల్డ్ ఇన్ ట్రాన్సిషన్: బిల్డింగ్ ది ఫౌండేషన్ ఫర్ సస్టెయినబుల్ అండ్ పీస్ఫుల్ సొసైటీస్’.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?