‘పార్ట్ నర్షిప్ ఇన్ ది బ్లూ పసిఫిక్’తో సంబంధం ఉన్న దేశాలు? (కరెంట్ అఫైర్స్)
గ్రూప్-1, 2 పరీక్షల్లో అంతర్జాతీయ అంశాలు చాలా కీలకం. ఈ విభాగానికి సంబంధించి వార్తల్లో ఉన్న వివిధ అంతర్జాతీయ సంస్థలు, వివిధ దేశాల్లో జరుగుతున్న సంఘటనలు అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ సంస్థల్లో భారత పాత్ర, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా కీలకమే. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన వివిధ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన పలు ప్రశ్నలను పరిశీలిద్దాం..
1. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి (3)
ఎ. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా జయతి ఘోష్ నియమితులయ్యారు
బి. ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన బళత్వంపై ఉన్నత స్థాయి కమిటీలో స్థానం పొందిన ఏకైక భారతీయురాలు రుచిరా కాంబోజ్
1) ఎ 2) బి
3) రెండూ సరికావు 4) రెండూ సరైనవే
వివరణ: ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత రాయబారిగా రుచిరా కాంబోజ్ నియమితులయ్యారు. బళత్వంపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో స్థానం పొందిన ఏకైక భారతీయురాలు జయతి ఘోష్. ఐరాసలో అండర్ సెక్రటరీ జనరల్‌గా బంగ్లాదేశ్ కు చెందిన రబాబ్ ఫాతిమా నియమితులయ్యారు. ఈ పదవిని చేపట్టిన బంగ్లాదేశ్ తొలి వ్యక్తి ఆమె.
2. కింది ఏ సంస్థకు భారత్ ఇటీవల ఎన్నికయ్యింది? (1)
1) ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ (ఐసీహెచ్) కమిటీ
2) ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి
3) ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ
4) ధర్మకరృత్వ మండలి
వివరణ: ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక (యునెస్కో) సంస్థకు చెందిన ఒక కమిటీకి భారత్ ఎంపికయ్యింది. సాంస్కృతిక వారసత్వ సంపదలకు సంబంధించి అంతర ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ఉండే కమిటీ ఇది. భారత్ ఈ కమిటీలో 2006 నుంచి 2010 వరకు, 2014 నుంచి 2018 వరకు సభ్య దేశంగా ఉంది.
3. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ వారసత్వ సంపద జాబితాలో భారత్ నుంచి ఎన్ని అంశాలు ఉన్నాయి? (3)
1) 12 2) 13 3) 14 4) 15
వివరణ: యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారత్ నుంచి 14 అంశాలు ఉన్నాయి. అవి.. వేద మంత్రోచ్ఛారణ, రామ్‌లీల, కుడియట్టం, రమ్మన్, ముడియట్టు, కాల్బెలియా, నృత్యం, బౌద్ధమంత్రోచ్ఛారణ, మణిపూర్‌లోని సంకీర్తన, పంజాబ్‌లో కనిపించే ఇత్తడి, రాగి క్రాఫ్ట్ తయారీ, యోగా, నౌరోజ్, కుంభమేళా, దుర్గా పూజ.
4. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో భారత్ నుంచి చేర్చిన తాజా అంశం? (4)
1) యోగా 2) కుంభమేళా
3) నౌరోజ్ 4) దుర్గా పూజ
వివరణ: కోల్‌కతాలో నిర్వహించే దుర్గా పూజను యునెస్కోకు చెందిన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చారు. ఐదురోజుల పాటు దుర్గా పూజ వేడుక ఉంటుంది. ఈ వేడుకపై గతేడాది బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసింది. 2019లో ఈ వేడుకకు సుమారు రూ.32,000 కోట్ల వ్యాపారం జరిగిందని, పశ్చిమబెంగాల్ రాష్ట్ర జీఎస్డీపీలో ఇది 2.58% ఉంటుందని నివేదిక ఇచ్చింది.
5. వ్యవసాయాభివృద్ధి అంతర్జాతీయ నిధికి కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? (2)
1) జిల్బర్ట్ హౌంగ్బో 2) అల్వరో లారియో
3) స్వాతి ధింగ్రా 4) కెతాంజి బ్రౌన్
వివరణ: వ్యవసాయాభివృద్ధి అంతర్జాతీయ నిధి రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. దీనికి డైరెక్టర్‌గా అల్వరో లారియో నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో జిల్బర్ట్ హౌంగ్బో ఉన్నారు. ఆయన ప్రస్తుతం జెనీవా కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ కార్మిక సంస్థకు నాయకత్వం వహించనున్నారు. భారత సంతతికి చెందిన స్వాతి ధింగ్రా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ద్రవ్య ప్యానెల్లో సభ్యురాలిగా ఎంపికయ్యారు. కెతాంజి బ్రౌన్ అమెరికా సుప్రీంకోర్టులో అసోసియేట్ జడ్జిగా ఏప్రిల్ 7న బాధ్యతలు చేపట్టారు. ఈ ఘనత సాధించిన తొలి నల్ల జాతీయురాలిగా ఆమె ఘనత సాధించారు.
6. ఇటీవల ఏ సంస్థకు ‘అంతర్జాతీయ సంస్థ’ హోదా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది? (3)
1) అంతర్జాతీయ సౌర కూటమి
2) ఇక్రిశాట్
3) కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4) ఏదీకాదు
వివరణ: కొయలిషన్ ఫర్ డిజాస్టర్ రెజిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీడీఆర్ఐ)కు అంతర్జాతీయ సంస్థ హోదా ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఆ సంస్థ ప్రధాన కేంద్రానికి మినహాయింపులు, ప్రత్యేక హక్కులు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, బహళ దేశ అభివృద్ధి బ్యాంక్‌లు, ప్రైవేట్ రంగంలోని సంస్థలు, అకడమిక్ వ్యవస్థలు ఈ సీడీఆర్ఐలో భాగస్వామ్యాన్ని కలిగి ఉంటాయి.
7. కింది ఏ సంస్థలో భారత్ బళ భాషల తీర్మానాన్ని ఈ ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టింది? (1)
1) ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ
2) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి
3) యునెస్కో
4) అంతర్జాతీయ కార్మిక సంస్థ
వివరణ: బహుళ భాషా వినియోగంపై ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి ఆమోదం లభించింది. తొలిసారిగా హిందీతోపాటు బంగ్లా, ఉర్దూ భాషలను ఇందులో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ఇచ్చే సమాచారం ఇక నుంచి అధికారిక భాషలతో పాటు తీర్మానంలో పేర్కొన్న అనధికార భాషల్లో కూడా లభించనుంది. హిందీ ప్రాచుర్యానికి 2018లో భారత్ చొరవతో ‘హిందీ@యూఎన్‌ను ప్రారంభించారు. ఇటీవల ఈ వ్యవస్థకు భారత్ ఎనిమిది లక్షల డాలర్ల ఆర్థిక సాయం కూడా అందించింది.
8. భద్రతా మండలిలో 1267 తీర్మానం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? (2)
1) బహుళ భాషల వినియోగం
2) వ్యక్తులు లేదా వ్యవస్థలపై ఆంక్షలు
3) అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాలు
4) అణు విద్యుత్ వినియోగంపై పరిమితి
వివరణ: లష్కర్-ఈ-తోయిబా వ్యవస్థాపకుడు అయిన హఫీజ్ సయిద్ సమీప బంధువు అయిన అబ్దుల్ రహ్మాన్ మక్కి ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్, అమెరికాలు సంయుక్తంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఈ తీర్మానమే 1267. దీనిని చైనా సాంకేతిక నిలుపుదల చేసింది. భద్రతా మండలిలో ఏదైనా సాంకేతిక నిలుపుదల చేశారంటే ఆరు నెలల వరకు అది చర్చలోకి రాదని భావించాలి.
9. యూఎన్ ఉమెన్, లింక్డ్ఇన్ దేనికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి? (3)
1) లింగ సమానత్వ సాధనకు
2) కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు
3) మహిళల ఆర్థిక సాధికారత సాధించేందుకు
4) మహిళల విద్యా అవకాశాల మెరుగుకు
వివరణ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌గా భావించే లింక్డ్ఇన్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యూఎన్ ఉమెన్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మహిళల ఆర్థిక సాధికారత సాధించేందుకు ఉద్దేశించింది ఇది. 5,00,000 అమెరికన్ డాలర్లను యూఎన్ ఉమెన్ పెట్టుబడిగా పెట్టనుంది. ప్రయోగాత్మకంగా దీనిని భారత్‌లోని మహారాష్ట్రలో చేపట్టారు. 2000 మంది మహిళల డిజిటల్, సాఫ్ట్, ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించనున్నారు.
10. ‘పార్ట్ నర్షిప్ ఇన్ ది బ్లూ పసిఫిక్’తో సంబంధం ఉన్న దేశాలు? (1)
1) యూఎస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, యూకే
2) యూఎస్, భారత్, ఆస్ట్రేలియా, యూకే
3) యూఎస్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే
4) యూఎస్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే, భారత్
వివరణ: పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దీవి దేశాలతో సహకారానికిగాను పార్ట్నర్స్ ఇన్ బ్లూ పసిఫిక్ (పీబీపీ) పేరుతో ఒక కొత్త కూటమి ఆవిర్భవించింది. పసిఫిక్ దీవుల్లో దాదాపు 14 దేశాలు ఉంటాయి. ఇందులో 10 దేశాల్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పర్యటించారు. ఆయా దేశాలతో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఈ పర్యటనకు ముందే ఇక్కడ ఉన్న సోలోమాన్ ఐలాండ్స్‌తో పలు అంశాలకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకొనేందుకు పీబీపీ కూటమి ఆవిర్భవించింది.
11. కింది ఏ రెండు దేశాలు ఇటీవల కామన్వెల్త్ కూటమిలో చేరాయి? (2)
1) టోగో, కోస్టారికా 2) టోగో, గబాన్
3) పనామా, గబాన్ 4) పనామా, కోస్టారికా
వివరణ: కామన్వెల్త్ కూటమిలో టోగో, గబాన్ దేశాలు చేరాయి. దీంతో ఈ కూటమిలో సభ్య దేశాల సంఖ్య 56కు పెరిగింది. ఒకప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్న దేశాల కూటమి ఇది. ఈ ఏడాది జూన్‌లో కిగాలిలో జరిగిన సమావేశంలో టోగో, గబాన్ దేశాలు కూటమిలో చేరాయి. ఈ రెండూ కూడా ఫ్రెంచి భాషను మాట్లాడే దేశాలు.
12. ఎస్ఆర్ఈఎస్టీహెచ్ఏ (శ్రేష్ఠా) పేరుతో ఏ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ రుణాన్ని ఇచ్చింది? (3)
1) ఒడిశా 2) కర్ణాటక
3) గుజరాత్ 4) పశ్చిమబెంగాల్
వివరణ: శ్రేష్ఠా అంటే పూర్తి రూపం.. సిస్టమ్స్ రిఫామ్స్ ఎండీవర్స్ ఫర్ ట్రాన్స్‌ఫామ్డ్ హెల్త్ అచీవ్మెంట్. ఇందులో భాగంగా 350 మిలియన్ డాలర్ల మొత్తాన్ని గుజరాత్ రాష్ట్రానికి ఆర్థికసాయంగా ప్రపంచ బ్యాంక్ అందించనుంది. గుజరాత్లో ప్రాథమిక వైద్యంలో సేవల నాణ్యత పెంచడంతోపాటు వేగంగా, సమగ్రంగా అందివ్వడం కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. ఆర్ఈడబ్ల్యూఏఆర్డీ (రివార్డ్) అనే పథకంలో భాగంగా ఈ ఏడాది ప్రపంచ బ్యాంక్ కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు కూడా రుణాన్ని ఇచ్చింది. అణగారిన వర్గాల సాంఘిక భద్రతలకు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి కూడా రుణం మంజూరు చేసింది. కేంద్రం అమలు చేస్తున్న మిషన్ కర్మయోగి పథకానికి సైతం 47 మిలియన్ డాలర్ల రుణ సాయం ప్రపంచ బ్యాంక్ అందించనుంది. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కేంద్రం వాషింగ్టన్లో ఉంది.
13. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో తీవ్ర పేదరికం 2011 నుంచి 2019 మధ్య.. (2)
1) పెరిగింది 2) తగ్గింది
3) స్థిరంగా ఉంది 4) ఏదీకాదు
వివరణ: భారత్‌లో తీవ్ర పేదరికానికి సంబంధించిన నివేదికను ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసింది. 2011లో 22.5% ఉన్న తీవ్ర పేదరికం, 2019 నాటికి 10.2 శాతానికి తగ్గిందని వెల్లడించింది. అంటే తగ్గుదల 12.3 శాతం ఉంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పేదరికంలో తగ్గుదల గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ గణాంకాల్లో తేలింది.
14. ‘లైవ్-ఫైర్’ దేనికి సంబంధించింది? (4)
1) ఉపగ్రహాల ప్రదర్శన
2) విపత్తు నిర్వహణ అంశాలు
3) విద్యుదాఘాతం తట్టుకొనే విన్యాసం
4) సైబర్ రక్షణ డ్రిల్
వివరణ: ‘లైవ్-ఫైర్’ పేరుతో నాటో కూటమి ప్రపంచంలోనే అతిపెద్ద సైబర్ రక్షణ డ్రిల్స్‌ను నిర్వహించనుంది. ఈ కూటమికి చెందిన సైబర్ డిఫెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈస్టోనియాలో ఉంది. అక్కడే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సైబర్ భద్రతా నిపుణులు ఇందులో పాల్గొంటారు. దేశాల ఐటీ వ్యవస్థలు, ఇతర ముఖ్య కంప్యూటర్ మౌలిక సదుపాయాలను సైబర్ దాడుల నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రదర్శిస్తారు.
15. మానవ హక్కులు, పర్యావరణ మార్పునకు సంబంధించి తొలి నిపుణుడిగా నియమితులైంది ఎవరు? (3)
1) రాబర్ట్ మెట్సోలా
2) ఆంటోనియో గుటెరస్
3) ఇయాన్ ఫ్రై 4) ఎవరూకాదు
వివరణ: మానవ హక్కులు, పర్యావరణ మార్పులకు సంబంధించి ఒక స్వతంత్ర నిపుణుడిని జెనీవా కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి నియమించింది. ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయన. తువాలు, ఆస్ట్రేలియా దేశాల ద్వంద్వ పౌరసత్వం ఆయనకు ఉంది. పర్యావరణ మార్పుతో మానవ హక్కులు ఏ విధంగా ఉల్లంఘనకు గురవుతున్నాయన్న అంశాలను ఆయన పరిశీలిస్తారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?