హంగేరి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ?
గతంలో ఆసియా ఖండంలోని వివిధ దేశాలు, వార్తల్లో నిలవడానికి కారణాలను పరిశీలించాం. ఈ సంచికలో ఇతర ఖండాల్లోని దేశాలకు సంబంధించిన అంశాలను పరిశీలిద్దాం..
ఆఫ్రికా
# వైశాల్యం, జనాభా రీత్యా రెండో స్థానంలో ఉన్న ఖండం ఇది. చీకటి ఖండంగా పేరు ఉంది. ఈ ఖండంలో వార్తల్లో ఉన్న దేశాలు.
ఈజిప్ట్: ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఈజిప్ట్ సూయజ్ కాలువ గుండా ప్రయాణించే నౌకల నుంచి వసూలు చేసే ఫీజును 10% పెంచింది. ఈ కాలువ కృత్రిమమైనది. ఈజిప్ట్ కు మంచి ఆదాయ వనరు. ఆఫ్రికా, ఆసియాలను విడదీయడంతో పాటు మధ్యధరా సముద్రం, ఎర్ర సముద్రాలను కలుపుతుంది. దీన్ని 1869లో ప్రారంభించారు. బ్రిటిష్, ఫ్రాన్స్ నియంత్రణలో ఉంది. 1956లో నాటి ఈజిప్ట్ ప్రధాని గమల్ అబ్దెల్ నాసర్ దీనిని జాతీయం చేశారు.
మడగాస్కర్: ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా గ్రీన్ ట్రయాంగిల్‌ను మడగాస్కర్ దేశ రాజధాని అంతానానారివోలో మార్చి 16న ప్రారంభించారు.
సీషెల్స్: భారత్, సీషెల్స్ దేశాల మధ్య తొమ్మిదో లామిటియే-2022 సైనిక విన్యాసాలను మార్చి 22 నుంచి 31 వరకు నిర్వహించారు.
యూరప్
చెక్ రిపబ్లిక్:
మధ్య యూరప్‌లో ఉన్న ఒక భూ పరివేష్టిత దేశం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద సస్పెన్షన్ బ్రిడ్జిని సందర్శకుల కోసం ఈ దేశంలో ప్రారంభించారు. దీనికి ‘స్కైబ్రిడ్జ్ 721’ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు ప్రపంచంలో అతి పొడవైన ఫుట్ బ్రిడ్జ్ నేపాల్‌లో ఉంది. తాజాగా చెక్ రిపబ్లిక్లో ప్రారంభించింది దానికంటే 154 మీటర్లు పొడవైనది.
మానవ హక్కుల సంఘంలో స్థానం:
జెనీవా కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల సంఘంలో చెక్ రిపబ్లిక్కు చోటు దక్కింది. ఉక్రెయిన్‌పై దాడికి ప్రతిగా మానవ హక్కుల మండలి నుంచి రష్యాను తొలగించి, దాని స్థానంలో చెక్ రిపబ్లిక్కు చోటు కల్పించారు. ఈ మండలిలో 47 సభ్య దేశాలు ఉన్నాయి.
బెల్జియం:
ఇటీవల కాలంలో మంకీ పాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో బెల్జియం దేశం క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. మంకీ పాక్స్ వైరస్ నియంత్రణకు క్వారంటైన్‌ను తప్పనిసరి చేసిన తొలి దేశం బెల్జియం.
ఫ్రాన్స్:
ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ విజయం సాధించారు. మెరైన్ లి పెన్ను ఆయన ఓడించారు. ఆ దేశంలో గడిచిన 20 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో రెండో సారి విజయం సాధించిన తొలి వ్యక్తి మాక్రాన్.
# వరుణ-2022 సైనిక విన్యాసాలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించారు. ఇది అరేబియా సముద్రంలో కొనసాగింది.
నీలి ఆర్థిక వ్యవస్థ:
నీలి ఆర్థిక వ్యవస్థపై ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకోవాలని భారత్, ఫ్రాన్స్ దేశాలు నిర్ణయించాయి. మెరైన్ సైన్స్ పరిశోధన, సముద్రంలో స్వేచ్ఛా వాణిజ్యం తదితర అంశాల ప్రాతిపదికగా రోడ్ మ్యాప్ ఉంది.
#సీసీఎంబీ, పాశ్చర్ అగ్రిమెంట్:
వారసత్వంగా వచ్చే వివిధ వ్యాధులకు సంబంధించిన జీనోమిక్స్పై అధ్యయనం చేసేందుకు భారత్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఫ్రాన్స్‌కు చెందిన పాశ్చర్ అనే పరిశోధన సంస్థలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి
ఉత్తర అమెరికా
యూకే:
యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్ 21, 22 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. బ్రిటన్ ప్రధాని హోదాలో ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ సందర్భంగా భారత ప్రధానితో చర్చించారు. 2022 అక్టోబర్ నాటికి ఒక సమగ్రమైన సమతూకంగా ఉండే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఇరు దేశాల నాయకులు నిర్ణయించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేయడం లక్ష్యం. అలాగే ఇరు దేశాల ఆర్థిక మార్కెట్ల మధ్య సంబంధాలను పెంచడంపై కూడా చర్చించారు. భారత్‌లోని గిఫ్ట్‌సిటీ, యూకేలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానంపై మాట్లాడారు. సైబర్ భద్రతపై పరస్పర సహకారానికి ఇరు దేశాలు ఒక ప్రకటన కూడా విడుదల చేశాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్‌నర్‌షిప్‌నకు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
దక్షిణ ధ్రువానికి చేరిన హర్‌ప్రీత్ చండి: భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఆర్మీ అధికారి హర్‌ప్రీత్ చండి దక్షిణ ధ్రువానికి ఒంటరిగా చేరారు. ఈ ఘనతను సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
నెదర్లాండ్స్:
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏప్రిల్ 4 నుంచి 7 వరకు నెదర్లాండ్స్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 2022తో 75 సంవత్సరాలు పూర్తవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పాల తోట అయిన ‘క్యూకెన్‌హోఫ్’ను ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న ఒక జాతి మొక్కకు మైత్రి అని పేరు పెట్టారు.
హంగేరి:
హంగేరి అధ్యక్షురాలిగా కటలిన్ ఎవా నోవక్ ఎన్నికయ్యారు. ఆ దేశంలో అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళ ఆమె. దేశంలో మొత్తం 199 స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో కటలిన్ 137 స్థానాల్లో గెలుపొందారు.
స్విట్జర్లాండ్:
స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి చెందిన స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ 2023 నాటికి సౌర ఇంధనాన్ని విమానయానానికి వాడనుంది. ప్రపంచంలో ఈ ఘనతను సాధించనున్న తొలి ఎయిర్‌లైన్స్ ఇదే కానుంది. దీని తయారీకి గాను సిన్హేలియన్ ఎస్ఏ అనే ఒక అంకుర సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
అమెరికా:
భారత్, అమెరికాల మధ్య మే 23న ‘ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్ అగ్రిమెంట్’ కుదిరింది. భారత్‌కు పెట్టుబడులపై మద్దతు ఇచ్చేందుకు ఉద్దేశించింది ఇది. వేర్వేరు రంగాల్లో పెట్టుబడులకు అమెరికాకు చెందిన వివిధ అభివృద్ధి ఆర్థిక సంస్థలు కృషి చేస్తాయి. జపాన్‌లో నిర్వహించిన క్వాడ్ సమావేశానికి హాజరయిన ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించాయి.
2+2 చర్చలు:
భారత్, అమెరికాల మధ్య నాలుగో 2+2 చర్చలు ఏప్రిల్ 11న వాషింగ్టన్ డీసీలో నిర్వహించారు. 2+2 అంటే ఇరు దేశాలకు చెందిన రక్షణ, విదేశాంగ శాఖ మంత్రుల మధ్య నిర్వహించే సమావేశం. అంతరిక్షానికి సంబంధించి ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అగ్రిమెంట్ అని పేర్కొన్నారు. అలాగే రక్షణలో కృత్రిమ మేధ అంశంపై చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అలాగే ఉమ్మడిగా సైబర్ శిక్షణ, విన్యాసాలను విస్తృతం చేయాలని కూడా భారత్, అమెరికా నిర్ణయించాయి.
ఎన్ని దేశాలతో 2+2 చర్చలు:
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా దేశాలతో భారత్ 2+2 చర్చలు నిర్వహించింది. ఈ తరహా చర్చల తొలి భాగస్వామి మాత్రం అమెరికా. ఇప్పటి వరకు ఆ దేశంతో ఈ చర్చల్లో భాగంగా కుదిరిన ఒప్పందాలు 1) ఎల్ఈఎంవోఏ: లాజిస్టిక్స్ ఎక్సేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. 2) సీవోఎంసీఏఎస్ఏ: కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్. 3) బీఈసీఏ: బేసిక్ ఎక్సేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్.
శాంతి సేథి:
భారతీయ అమెరికన్ మహిళ. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు రక్షణ సలహాదారుగా నియామకమయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అమెరికన్‌గా శాంతి సేథి రికార్డు సృష్టించారు.
జీవోఈఎస్-టీ:
జీయో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంటల్ శాటిలైట్‌ను మార్చి 1న అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. కక్ష్యలోకి చేరిన తర్వాత దీనికి జీవోఈస్-18 అని పేరు పెడతారు. పశ్చిమార్ధగోళంలో వాతావరణ మార్పుల అధ్యయనానికి ఉద్దేశించిన ప్రయోగం ఇది.
ఐఎస్ఎస్కు స్వస్తి:
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను 2030 వరకు మాత్రమే చేతనంగా ఉంచనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఆ తర్వాత దీనిని పసిఫిక్ మహాసముద్రంలో పాయింట్ నెమో వద్ద ధ్వంసం చేయనుంది. తాజా సాంకేతిక అవసరాలను ఈ స్పేస్ స్టేషన్ తీర్చడం లేదు. దీనిని 2000లో నాసా, రోస్కోమోస్ (రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ), జేఏఎక్స్ (జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ), ఈఎస్ఏ (యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ), సీఎస్ (కెనడా స్పేస్ ఏజెన్సీ)లు కలిసి సంయుక్తంగా పాల్గొన్నాయి. ఐఎస్ఎస్కు సంబంధించి ఒక్కో అంతరిక్ష పరిశోధనా సంస్థ ఒక్కో విధిని నిర్వహిస్తాయి. అప్పుడప్పుడు ఇది తన కక్ష్యను దాటుతూ ఉంటుంది. అప్పుడు తిరిగి దానిని కక్ష్యలోకి తీసుకెళ్లే బాధ్యతను రష్యా మోస్తూ ఉంది. ఉక్రెయిన్‌ఫై యుద్ధం నేపథ్యంలో రష్యాపై భారీగా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధికంగా ఆంక్షలను ఎదుర్కొంటున్న దేశంగా రష్యా ఉంది. దీంతో ఐఎస్ఎస్లో తన బాధ్యత నుంచి తప్పుకొంటున్నట్లు రష్యా ప్రకటించింది.
అమెరికా ఖండంలో వార్తల్లో ఉన్న ఇతర దేశాలు
పనామా:
పనామా దేశంలోని అడవి ప్రాంతంలో ఒక వర్షపు కప్ప జాతిని కనుగొన్నారు. దీనికి ప్రముఖ పర్యావరణ ఉద్యమ కారిణి గ్రెటా థన్‌బెర్గ్ పేరును పెట్టారు. దీని శాస్త్రీయ నామం ప్రిస్టిమాంటిస్ గ్రెటాథన్బెర్గ్
చీలీ: చీలీ అధ్యక్షుడిగా గాబ్రియల్ బోరిక్ ఫాంట్ మార్చి 11న నియామకమయ్యారు. ఆ దేశంలో అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్న అతిపిన్న వయస్కుడు ఆయనే.
ఈక్వెడార్:
అటవీ జంతువులకు చట్టబద్ధమైన హక్కులను ఇచ్చింది. ఈ తరహా హక్కులను అందించిన తొలి దేశంగా ఈక్వెడార్ నిలిచింది.
ఓషియానియా ఖండం
ఆస్ట్రేలియా:
ఈసీటీఏ ఒప్పందం: భారత్, ఆస్ట్రేలియాలు ఆర్థిక సహకారం-వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీన్నే ఇంగ్లిష్‌లో ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్‌గా పేర్కొంటున్నారు. రానున్న అయిదేళ్లలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండింతలు చేయడం. అంటే 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం. అలాగే వస్తువులు, సేవలు, మనుషుల మధ్య రాకపోకలను సులభతరం చేయడం కూడా ఇందులో భాగం.
డిఫెన్స్ స్పేస్ కమాండ్ ఏజెన్సీ:
అంతరిక్ష రంగంలో రష్యా, చైనాల ప్రభావాన్ని తగ్గించేందుకు కొత్తగా డిఫెన్స్ స్పేస్ కమాండ్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ఆస్ట్రేలియా నిర్ణయించింది.
న్యూజిలాండ్:
న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్‌కు భారత్‌కు చెందిన గడ్డం మేఘన ఎన్నికయ్యింది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయురాలు ఆమె. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన 18 సంవత్సరాల మేఘన న్యూజిలాండ్‌లోని వాల్కట్ ప్రాంతం నుంచి న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.
వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ
ఎడ్యు రిపబ్లిక్
9849212411
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?