తక్కువైతే కష్టం.. ఎక్కువైతే నష్టం!
ప్రస్తుత కాలంలో ప్రజలు రకరకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు, స్త్రీ, పురుష భేదం లేకుండా వ్యాధుల బారిన పడుతున్నారు. కలుషిత ఆహారం, వాతావరణ కాలుష్యం, శారీరక వ్యాయామం లేకపోవడం, ధూమపానం, మద్యపానం, వంశపారంపర్యంగా వ్యాధులు సంక్రమిస్తున్నాయి. వ్యాధులపై సరైన అవగాహన ఉంటే జీవనకాలాన్ని పెంచుకునే అవకాశం ఉంది.
బయాలజీ
హెపటైటిస్ అనేది వైరస్ల వల్ల కాలేయానికి కలిగే ఉజ్వలనం. బ్యాక్టీరియా, శిలీంధ్రాల వల్ల కూడా ఇది కలుగుతుంది. ఐదు రకాల వైరస్లు హెపటైటిస్‌ను కలగజేస్తున్నాయని గుర్తించారు. ఆకలి లేకపోవడం, సాధారణ అస్వస్థత, వికారం, నీళ్ల విరేచనాలు, కడుపులో సరిగా లేకపోవడం, జ్వరం, చలి, కామెర్లు, సిరోసిస్ (కాలేయం తంతుయు తంగా మారడం) మొదలైనవి వైరల్ హెపటైటిస్ లక్షణాలు.
హెపటైటిస్-ఎ: ఇది హెపటైటిస్-ఎ వైరస్ (హెచ్ఏవీ) వల్ల కలుగుతుంది. హెచ్ఏవీలో ఏక పోచ ఆర్ఎన్ఏ ఉంటుంది. దీని క్యాప్సిడ్ను ఆవరిస్తూ పరివేష్టనం ఉండదు. ఇది మల ముఖ మార్గంలో మల పదార్థంతో, కలుషితమైన ఆహారం, నీటి ద్వారా వ్యాపిస్తుంది. దీని పొదిగేకాలం 2-6 వారాలు. దీర్ఘకాల హెపటైటిస్-ఎ ఉండదు. ఇనాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ వ్యాక్సిన్ లభ్యమవుతుంది.
హెపటైటిస్-బి: ఇది బి వైరస్ (హెచ్‌బీవీ) వల్ల కలుగుతుంది. హెచ్బీవీలో పరివేష్టనం ఉంటుంది. దీని వ్యాప్తి ఇంజిక్షన్లు, రక్త మార్పిడుల లాంటి ఆంత్రేతర పద్ధతుల ద్వారా లేదా శిశు జననానికి కొద్దిగా ముందు లేదా తర్వాత కాలంలో తల్లి నుంచి శిశువుకు లేదా లైంగిక సంబంధం ద్వారా సంక్రమిస్తుంది. దీని పొదిగే కాలం 4-26 వారాలు. ఇది దీర్ఘకాలిక వ్యాధిగా మారే అవకాశం శిశువుల్లో ఎక్కువ. ప్రౌఢ జీవుల్లో తక్కువ. వ్యాక్సిన్‌లో జన్యుపరంగా మార్పుచేసిన ఈస్ట్ ద్వారా ఉత్పత్తి అయిన వైరల్ ప్రొటీన్ తొడుగు ఉంటుంది.
హెపటైటిస్-సి: దీన్ని హెపటైటిస్-సి వైరస్ (హెచ్‌సీవీ) కలుగజేస్తుంది. హెచ్సీవీలో ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది. పరివేష్టనం ఉంటుంది.
ఇది ఆంత్రేతర పద్ధతుల ద్వారా వ్యాపి స్తుంది. దీని పొదిగేకాలం 2-22 వారాలు. చాలా సందర్భాల్లో ఇది దీర్ఘకాల హెపటైటిస్‌కు దారితీస్తుంది. దీనికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
హెపటైటిస్-డి (డెల్టా వైరస్): దీన్ని హెచ్డీవీ వైరస్ కలుగజేస్తుంది. దీనిలో ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది. పరివేష్టనం హెబీవీ జీనోం నియంత్రిస్తుంది. ఇది ఆంత్రేతర పద్ధతుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని పొదిగే కాలం 6-26 వారాలు. హెచ్‌బీవీ వ్యాక్సిన్ హెపటైటిస్-డి ని సమర్థంగా నివారిస్తుంది.
హెపటైటిస్-ఇ: దీన్ని హెచ్ఈవీ వైరస్ కలుగజేస్తుంది. ఏకపోచ ఆర్ఎన్ఏ ఉంటుంది. పరివేష్టనం ఉండదు. దీని సంక్ర మణ మలముఖ మార్గం ద్వారా జరుగు తుంది. దీని పొదిగేకాలం 2-6 వారాలు. వ్యాక్సిన్ తయారీ అభివృద్ధి దశలో ఉంది.
నోట్: హెపటైటిస్-బి వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత బారుచ్ శ్యామ్యూల్ బ్లూమ్‌బర్గ్ గౌరవార్థం ఆయన పుట్టినరోజైన జూలై 28ని ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవంగా నిర్వహిస్తారు.
ఇది వంశపారంపర్యంగా వచ్చే రక్త సంబంధ వ్యాధి. ఎర్రరక్త కణాల్లో హిమోగ్లోబిన్ లోపించి రక్తహీనతకు దారితీస్తుంది. తలసేమియాతో బాధపడేవారిలో ఆక్సిజన్‌ను రవాణా చేసే హిమోగ్లోబిన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ వ్యాధి ఆల్ఫా, బీటా అనే రెండు రకాలుగా ఉంటుంది. హిమోగ్లోబిన్‌లోని ప్రొటీన్ భాగాల్లో వచ్చే లోపాల వల్ల ఈ రెండు రకాల తలసేమియా వ్యాధులు వస్తాయి. తక్కువ స్థాయి తలసేమియా వ్యాధిగ్రస్తుల్లో రక్తహీనత, కాలేయం, పిత్తాశయం పరిమాణం పెరగడం, వ్యాధినిరోధక శక్తి తగ్గడం, పెరుగుదల నెమ్మదిగా ఉండడం. ఎముకలు సన్నబడి పెళుసుగా మారడం, గుండెపోటు మొదలైన లక్షణాలు ఈ వ్యాధి సోకినవారిలో కనిపిస్తాయి.
తలసేమియా తీవ్రమైన వంశపారంపర్య, రక్తసంబంధిత వ్యాధి.
ప్రపంచ జనాభాలో 4.5 శాతం మంది తలసేమియా మైనర్ వ్యాధితో బాధ పడుతున్నారు.
35 మిలియన్ల భారతీయులు ఈ వ్యాధి కలిగించే అసాధారణ జన్యువును కలిగిన వాహకులు.
ప్రపంచంలో ఏటా లక్షమంది శిశువులు తలసేమియా మేజర్‌తో జన్మిస్తున్నారని అంచనా.
మన దేశంలో ఏటా 10 వేల నుంచి 12 వేల మంది పిల్లలు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు.
తలసేమియా వ్యాధిగ్రస్తుల జీవితకాలం పెంచాలంటే రక్తమార్పిడి, విలువైన మందులు అవసరం.
వివాహం, గర్భధారణకు ముందు, శిశుజననం తర్వాత పరీక్షలు చేయించు కోవడం, అవగాహన కల్పించడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చు.
చికిత్స: పెరుగుదల తక్కువగా ఉండటం, పెళుసుబారిన ఎముకలు తొందరగా వ్యాధులకు గురవడం వంటి లక్షణాలను మొదటి ఏడాదిలోనే గుర్తిస్తే తలసేమియా మేజర్‌ను తగ్గించడం తేలికవుతుంది. మొదటి సంవత్సరంలోనే శిశువులో హిమోగ్లోబిన్ స్థాయిని, పెరుగుదలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. హిమోగ్లోబిన్ పరిమాణం 70 శాతం కన్నా తగ్గినప్పుడు పిల్లల్లో పెరుగుదల లోపిస్తుంది. వారు క్రమంతప్పకుండా రక్త చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం హిమోగ్లోబిన్ స్థాయి 115-120 గ్రా/లీ. ఉండేలా చూడాలి. ఈ చికిత్సలో ముఖ్యమైన అంశం ప్రతి మూడు నాలుగు నెలలకొకసారి గాఢత కలిగిన ఎర్రరక్త కణాలను ప్రవేశపెట్టడం ద్వారా చికిత్స చేస్తారు. మూల కణాల మార్పిడి ద్వారా తలసేమియా మేజర్ వ్యాధిని నయం చేయవచ్చు. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు వారి కణజాలాలకు సమానమైన కణజాలం కలిగిన వారి సోదర/సోదరి నుంచి సేకరించిన ఎముక మజ్జలో ఉండే ఎర్రరక్త కణాల మూలకణాల (ఎముకమజ్జ మార్పిడి) ద్వారా చికిత్స చేయవచ్చు.
నోట్: తలసేమియాపై అవగాహన కల్పించ డానికి ఏటా మే 8న ప్రపంచ తలసేమియా నివారణ దినోత్సవం నిర్వహిస్తారు.
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్ జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల) ,రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
థైరాయిడ్
అంతఃస్రావక గ్రంథులన్నింటిలో అతి పెద్దదైన థైరాయిడ్ గ్రంథి స్వరపేటికకు ఉదరతలంలో ఉంటుంది. దీనిలోని రెండు లంబికలు ‘ఇస్తమస్’తో కలపబడి ఉంటాయి. ఈ గ్రంథి రెండు రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి థైరాక్సిన్, కాల్సిటోనిన్. థైరాయిడ్ హార్మోన్లను ఏటీపీ ఉత్పత్తికి కణజాలాల్లో ఆక్సిజన్ వినియోగాన్ని ప్రేరేపించడం ద్వారా ఆధార జీవక్రియా రేటును పెంచుతాయి. ప్రొటీన్ల సంశ్లేషణను ప్రేరేపిస్తాయి. ఉభయజీవుల్లో రూపవిక్రియకు థైరాక్సిన్ అవసరం. కాల్సిటోనిన్ రక్తంలో కాల్షియం, పాస్ఫేట్ల స్థాయిని తగ్గిస్తుంది. థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే థైరాక్సిన్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల రెండు రకాల అపస్థితులు కలుగుతాయి.
1. హైపోథైరాయిడిజమ్: థైరాక్సిన్ హార్మోన్ తక్కువగా స్రవిస్తే శరీర బరువు పెరుగుతుంది. జన్మతా కలిగే హైపోథైరాయి డిజమ్ వల్ల పిల్లల్లో ‘క్రిటినిజం’ కలుగు తుంది. దీని వల్ల పిల్లల్లో బుద్ధిమాంద్యం, మరుగుజ్జుతనం, వంధ్యత్వం కలుగు తాయి. ప్రౌఢ మానవుడిలో హైపోథైరాయిడిజమ్ ‘మిక్సోడిమా’కు దారితీస్తుంది. ఈ బాధితులకు హృదయస్పందన రేటు, దేహ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటాయి. చలిని తట్టు కోలేరు. సులువుగా బరువు పెరుగుతారు.
2. హైపర్ థైరాయిడిజమ్: థైరాక్సిన్ హార్మోన్ అధికంగా స్రవించడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. ఈ అపస్థితిని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. దీని అసాధారణ రూపం ‘గ్రేవ్స్ వ్యాధి’ ఇది ఒక స్వయం అసంక్రామ్యత లోపం. హైపోథై రాయిడిజమ్ ప్రాథమిక లక్షణం థైరాయిడ్ గ్రంథి పరిమాణం పెరగడం. ఈ స్థితిని సామాన్య గాయిటర్ అంటారు. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్లను ఉత్పత్తి చేయాలంటే అయోడిన్ అవసరం. శరీరం అయోడిన్‌ను తయారు చేయదు. కాబట్టి తీసుకునే ఆహారం ద్వారానే అయోడిన్ శరీరంలోకి చేరాలి. అందుకే ప్రభుత్వం అయోడైజ్డ్ సాల్ట్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని ప్రచారం చేస్తుంది.
నోట్: థైరాయిడ్ లక్షణాలు, ఆహార నియమాలు, నివారణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏటా మే 25న ప్రపంచ థైరాయిడ్ నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
తీవ్ర అలసట, జుట్టు రాలడం.
బరువు పెరగడం/ తగ్గడం.
అధిక చెమటలు, కండరాల నొప్పులు.
చర్మం పొడిబారటం, కాళ్లు వాపునకు గురవడం.
మలబద్ధకం, స్త్రీల్లో రుతుక్రమం సరిగ్గా లేకపోవడం.
పిల్లల్లో శారీరక, మానసిక పెరుగుదల లోపించడం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?