మాంసం.. జున్ను.. ఉమామి!
జ్ఞానేంద్రియాలు దేహంలో జరిగే వివిధ చర్యలను వ్యక్తపరచడానికి ఉపయోగ పడతాయి. ఇవి మెదడు తో అను సంధానమై ఉంటాయి. మెదడు నుంచి వచ్చే జ్ఞాన సమాచార సంకేతాలను స్వీకరించి వాటికి ప్రతి చర్యలు వ్యక్తపరుస్తాయి. జ్ఞానేంద్రియాల్లోని చెవి, నాలుక, చర్మం నిర్మాణం వాటి విధుల గురించి తెలుసుకుందాం.
చర్మం
# చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని డెర్మటాలజీ అంటారు. శరీరంలో స్పర్శా జ్ఞానాన్ని కలిగించే భాగం చర్మం. ఇది స్పర్శా గ్రాహకాలను కలిగి ఉంటుంది.
# మానవ శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. సుమారు 4 కిలోల బరువుంటుంది.
#చర్మంలో బహిశ్చర్మం, అంతశ్చర్మం అనే రెండు పొరలను కలిగి ఉంటుంది.
#బహిశ్చర్మం రక్షణను కలిగించే పొర. ఇది 3 పొరలను కలిగి ఉంటుంది.
1. నిర్జీవ కణాలను కలిగి ఉండే వెలుపలి పొర- కార్నియం.
2. జీవ కణాలను కలిగి ఉండే మధ్య పొర- గ్రాన్యులార్ పొర.
3. స్థిరంగా విభజనలు చెందుతూ ఉండే మాల్ఫీజియన్ పొర.
# బహిశ్చర్మం కింద అంతశ్చర్మం ఉంటుంది. ఇది స్థితిస్థాపక సంయోజక కణజాలంతో తయారవుతుంది. దీనిలో స్వేద గ్రంథులు, తైల గ్రంథులు, రోమ పుటికలు, రక్తనాళాలు, కొవ్వులు ఉంటాయి.
#చర్మం శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తూ కొన్ని వ్యర్థాలను చెమట రూపంలో విసర్జిస్తుంది.
# మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉండటం వల్ల చర్మానికి రంగు ఉంటుంది.
#స్పర్శ, ఉష్ణోగ్రత, పీడనానికి చర్మం సూక్ష్మ గ్రాహ్యతను చూపుతుంది.
#స్పర్శకు స్పర్శ గ్రాహకాలు, పీడనానికి పిసినియన్ గ్రాహకాలు, ఉష్ణోగ్రతకు నాసిప్టారులు వంటి గ్రాహకాలను కలిగి ఉంటుంది.
# స్వేద గ్రంథులు అధికంగా అరిచేయి, అరికాలులో ఉంటాయి.
#కుక్క, ఏనుగులో స్వేద గ్రంథులు ఉండవు. అందుకే కుక్క ఉష్ణోగ్రతను క్రమపరుచుకోవడానికి నాలుక బయట పెట్టుకొని ఉంటుంది. అదేవిధంగా ఏనుగులు చెవులు ఆడించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తాయి.
చర్మ గ్రంథులు
తైల గ్రంథి: ఇది ఒక సంచి లాంటి నిర్మాణం. ఇది స్రవించే తైలం వంటి పదార్థం సెబం. చర్మం తడిగా ఉండేందుకు, రోమాల పెరుగుదలకు సహాయపడుతుంది. దీన్నే సెబేషియస్ గ్రంథి అంటారు.
స్వేద గ్రంథి: ఇది రక్తంలో అధికంగా ఉండే నీరు, లవణాలను చెమట రూపంలో బయటకు పంపుతుంది.
చర్మ వ్యాధులు
# పొంగు, ఆటలమ్మ వంటి వైరస్ వ్యాధులు.
# మెలనిన్ లోపం వల్ల వచ్చే బొల్లి.
# బి3 విటమిన్ లోపం వల్ల వచ్చే పెల్లాగ్రా.
#ఫంగస్ వల్ల వచ్చే తామర వ్యాధులు.
చెవి నిర్మాణం
#చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. వినడంతోపాటు శరీర సమతాస్థితిని సక్రమంగా ఉంచడానికి చెవులు ఉపయోగపడతాయి.
#చెవిలో ప్రధానంగా మూడు భాగాలుంటాయి. అవి వెలపలి చెవి, మధ్య చెవి, లోపలి చెవి.
1. వెలుపలి చెవి
#మానవుడి తలకు ఇరువైపులా కనిపించే భాగమే వెలుపలి చెవి. ఇది ఒక డొప్ప మాదిరిగా ఉంటుంది. దీన్నే పిన్నా అంటారు. పిన్నా మైనాన్ని స్రవించే సిరోమినస్ గ్రంథులు, తైలాన్ని స్రవించే తైల గ్రంథులను కలిగి ఉంటుంది.
# వెలుపలి చెవి మృదులాస్థితో తయారై శ్రవణ కుహరంలోకి తెరుచుకుంటుంది. శ్రవణ కుహరాన్నే మరొక పేరు ఆడిటిరోమీటస్ అని పిలుస్తారు.
# శ్రవణ కుహరం చివర్లో కర్ణభేరి అనే పలుచని పొర ఉంటుంది. ఇది వెలుపలి చెవికి, మధ్య చెవికి మధ్యలో ఉంటుంది.
2. మధ్య చెవి
# కర్ణభేరిపై కలిగిన ప్రకంపనాలను పెంచడంలో మధ్యచెవి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
#మూడు ఎముకల గొలుసు కూటకం లేదా సుత్తి, దాగిలి లేదా పట్టెడ, కర్ణాంతరాస్థి లేదా అంకవన్నె ప్రకంపనాలను పెంచడానికి సహకరిస్తాయి.
# మధ్య చెవి చివరి భాగాన్ని కప్పుతూ అండాకార కిటికీ అనే ఒక పొర ఉంటుంది. మధ్య చెవి, లోపలి చెవిలోకి వర్తులాకార కిటికీ ద్వారా తెరుచుకుంటుంది.
3. లోపలి చెవి
#లోపలి చెవిలో త్వచాగహనం, అస్థి గహనం అనే రెండు భాగాలుంటాయి. త్వచాగహనంలో పేటిక, అర్ధ వర్తుల కుల్యలు, కర్ణావర్తం అనే భాగాలున్నాయి. పేటిక ముందు భాగాన్ని సేక్యులస్, వెనక భాగాన్ని యూట్రిక్యులస్ అంటారు. అర్ధ వర్తుల కుల్యలు పేటికకు కలుపబడి అంతరలసిక అనే ద్రవాన్ని కలిగి ఉంటాయి.
# కర్ణావర్తం స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియా, స్కాలా టింపాని అనే మూడు సమాంతర నాళాల్ని కలిగి ఉంది. స్కాలా వెస్టిబ్యులై, స్కాలా టింపాని పరిలసిక ద్రవంతోనూ, స్కాలా మీడియా అంతర లసిక ద్రవంతోనూ నిండి ఉంటాయి. కర్ణావర్త నాడీ తంతువులు కర్ణావర్త నాడిని ఏర్పరుస్తాయి. పేటికా నాడి, కర్ణావర్త నాడి, శ్రవణ నాడిగా ఏర్పడతాయి.
శ్రవణ జ్ఞానం
# వెలుపలి చెవి శబ్ధ తరంగాలాను సేకరిస్తుంది. అవి శ్రవణ కుల్యకు చేరుతాయి. అక్కడ కర్ణభేరిని తాకుతాయి. కర్ణభేరి నుంచి వచ్చే ప్రకంపనాలు కూటకం, దాగిలి, కర్ణాంతరాస్థిలను చేరుతాయి. కర్ణాంతరాస్థి ప్రకంపనాలను అండాకార కిటికీకి చేరవేస్తుంది. అక్కడి నుంచి అవి కర్ణావర్తం చేరుతాయి. అప్పుడు త్వచాగహనం కదులుతుంది. దాంతో ప్రకంపనాలు కార్టె అంగాన్ని చేరుతాయి. ప్రేరణలు శ్రవణనాడి ద్వారా మెదడుకు చేరుతాయి. మెదడు ఇచ్చిన ప్రతిస్పందనలను బట్టి వినడం జరుగుతుంది.
చెవి- ఆసక్తికర అంశాలు
# మానవ శరీరంలో అతి చిన్న ఎముక కర్ణాంతరాస్థి (స్టేపిస్)
# చెవిలోని ఎముకల సంఖ్య 3+3=6
# వెలుపలి చెవి (పిన్నా)ని అవశేష అవయవంగా పరిగణిస్తారు.
#మానవుడు వినగలిగే స్థాయి 20-20,000 Hz
#చెవిలోని గులిమి వల్ల ఏదైనా ఆటంకం కలిగితే హైడ్రోజన్ పెరాక్సైడ్ చుక్కలు వాడతారు.
# బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల చీము, కర్ణభేరికి వచ్చే ఇన్ఫెక్షన్లు సాధారణంగా చెవికి వచ్చే వ్యాధులు.
నాలుక నిర్మాణం
# నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లారింజాలజీ అంటారు. నాలుక నియంత్రిత కండరాలతో తయారై సుమారు పదివేల రుచి కణికల్ని కలిగి ఉంటుంది. రుచి కణికలు నాలుకలో ఉండే సూకా్ష్మాంకురాల గోడల్లో ఉంటాయి.
#చేపల్లో తప్ప మిగిలిన అన్ని సకశేరుకాల్లో జిహ్వ గ్రాహకాలు నాలుక మీద ఉంటాయి.
# ఉష్ణాన్ని గ్రహించడానికి కూడా నాలుక మీద గ్రాహకాలు ఉంటాయి.
#నాలుకపై నాలుగు రకాల సూక్ష్మంకురాలు ఉంటాయి. అవి
పాపిల్లే: ఇవి పొలుసుల్లా కనిపించే నిర్మాణాలు. రుచి కళికలు ఉండవు కాబట్టి రుచిని గుర్తించలేవు.
ఫంగిఫార్మ్ పాపిల్లే: ఇవి గుండ్రంగా కనిపించే నిర్మాణాలు రుచి కళికలు ఉంటాయి.
ఫోలియేట్ పాపిల్లే: ఇవి నాలుకకు ఇరువైపులా ఉబ్బెత్తుగా ఉండి రుచి కళికలను కలిగి ఉంటాయి.
#మిరపకాయ తిన్నప్పుడు నోరు మండటం అనేది యదార్థంగా రుచి కాదు. నాలుక భౌతికంగా ఆ ఘాటును భరించకపోవడమే.
ఉమామి: ఇది చాలా తక్కువ మందికి తెలిసిన రుచి. మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఆహారం, మాంసం, సముద్రం నుంచి లభించే ఆహారం, జున్ను నుంచి వచ్చే ఒకరకమైన వాసననే ఉమామి అంటారు.
#ఇది మోనోసోడియం గ్లూటమేట్తో కలిస్తే దాన్ని హాబింగ్ అని పిలుస్తారు. ఆసియా ప్రాంతపు వంటల్లో ఉపయోగిస్తారు.
# కృత్రిమంగా తయారైన ఆహార పదార్థాలకు ఉండే రుచిని మెటాలిక్ టేస్ట్ అంటారు.
#నాలుక మీద ఉండే గ్రాహకాలు కాకుండా ప్రత్యేకమైన నాడీవ్యవస్థ ఉంటుంది. ఇది మెదడులోని ప్రత్యేక భాగాలకు రుచుల్ని మాత్రమే తీసుకుపోతుంది.
#పసి పిల్లల్లో రుచి సున్నితత్వం ఎక్కువ.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి.
1) పీడనం- ఏసినియన్ గ్రాహకాలు
2) మధ్య చెవి- త్వచాగహనం
3) దండ కణాలు- రొడాప్సిన్
4) శంకు కణాలు- అయొడాప్సిన్
2. జత పరచండి.
ఎ బి
1) ఆప్తాల్మాలజీ ఎ. చర్మం
2) లారింజాలజీ బి. ముక్కు
3) రైనాలజీ సి. నాలుక
4) డెర్మటాలజీ డి. కన్ను
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3- బి, 4-ఎ
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
3. కింది వాటిలో తప్పుగా ఉన్న వాక్యాన్ని గుర్తించండి.
ఎ. మెలనిన్ లోపం వల్ల బొల్లి అనే వ్యాధి వస్తుంది
బి. శరీర సమతాస్థితికి చెవులు ఉపయోగపడతాయి
సి. కొవ్వులు పుష్కలంగా ఉన్న ఆహారం నుంచి వచ్చే వాసన ఉమామి
డి. సెరూమినస్ గ్రంథులు కన్నీటిని స్రవిస్తాయి
1) ఎ, బి 2) ఎ, డి
3) సి, డి 4) బి, సి
4. కింది వాటిని జతపరచండి.
ఎ బి
1. దండ కణాలు ఎ. నీరు వంటి ద్రవం
2. శంకు కణాలు బి. రొడాప్సిన్
3. కచావత్ కక్ష్య సి. జెల్లీ వంటి ద్రవం
4. నేత్రోదక కక్ష్య డి. అయొడాప్సిన్
1) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
5. కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఏది?
1) విటమన్-డి 2) విటమిన్-కె
3) విటమిన్-ఇ 4) విటమిన్-ఎ
6. అతిచిన్న ఎముక స్టేపిస్ చెవిలోని ఏ భాగంలో ఉంటుంది.
1) వెలుపలి చెవి 2) మధ్య చెవి
3) లోపలి చెవి 4) శ్రవణ కుహరం
7. స్కాలా వెస్టిబ్యులై, స్కాలా మీడియా, స్కాలా టింపాని మూడు సమాంతర నాళాల్ని కలిగి ఉన్న నిర్మాణం ఏది?
1) అస్థిగహనం 2) త్వచాగహనం
3) కర్ణావర్తం 4) యూట్రిక్యులస్
8. కింది వాటిలో రుచి కళికలు లేని సూకా్ష్మాంకురాలను గుర్తించండి.
ఎ. ఫిలిఫామ్ పాపిల్లే
బి. సర్కం వెల్లేట్ పాపిల్లే
సి. ఫంగిఫామ్ పాపిల్లే
డి. ఫోలియేట్ పాపిల్లే
1) ఎ, బి 2) ఎ, డి
3) ఎ మాత్రమే 4) డి మాత్రమే
9. చీకట్లో వస్తువులను చూడటానికి ఉపయోగపడే కంటిలోని భాగం ఏది?
1) దండ కణాలు 2) శంకు కణాలు
3) దృక్ నాడి 4) నేత్ర పటలం
10. ఆధార్ కార్డులను జారీ చేసేటప్పుడు కంటిలోని ఏ భాగాన్ని ఫొటో తీసుకుంటారు?
1) కన్ను గుడ్డు 2) తారక
3) కంటి పాప 4) రెటినా
జవాబులు
1. 2 2. 2 3. 3 4. 1 5. 4 6. 2 7. 3 8. 3 9. 1 10. 3
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?