పర్యావరణం- ప్రాణాధారం ( పోటీ పరీక్షల ప్రత్యేకం)

ఈ భూమిపై కోటానుకోట్ల జీవులు మనుగడ సాగిస్తున్నాయి. జీవావరణ వ్యవస్థలో ప్రతి జీవి పాత్ర కీలకమే. కానీ ప్రపంచం అభివృద్ధి చెందుతున్నకొద్దీ పర్యావరణానికి హాని పెరుగుతున్నది. అడవుల నరికివేతవల్ల వాతావరణంలో ప్రతికూల మార్పులు జరుగుతున్నాయి. పరిశ్రమల కారణంగా జల, వాయు, భూ కాలుష్యాలు పెరుగుతున్నాయి. కాబట్టి పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు పర్యావరణం, జీవవైవిధ్యం, నూతనంగా గుర్తించిన జీవజాతుల గురించి అన్ని రకాల పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ సంబంధ అంశాలపై ముఖ్యమైన సమాచారం నిపుణ పాఠకుల కోసం…
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (World Health Day)
– ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) 1948, ఏప్రిల్ 7న ఏర్పాటైంది. అందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా.. ప్రపంచ మానవాళిని, భూగ్రహాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, వాటిమీద అంతర్జాతీయ అప్రమత్తతపై WHO దృష్టిసారించింది.
-పర్యావరణ కారణాలవల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 1.30 కోట్ల మరణాలు సంభవిస్తున్నాయని WHO అంచనా వేసింది.
థీమ్ (2022): అవర్ ప్లానెట్, అవర్ హెల్త్ (Our planet, our health)
-ఈ భూమ్మీద రాజకీయ, సామాజిక, వాణిజ్య నిర్ణయాలు వాతావరణ, ఆరోగ్య సంక్షోభాలను మరింత ఉధృతం చేస్తున్నాయి. ప్రపంచంలో 90 శాతం మంది శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడుతున్న కలుషిత గాలిని పీలుస్తున్నారు.
-మారిన వాతావరణ పరిస్థితుల కారణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా దోమకాటు సంబంధ వ్యాధులు విస్తరిస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భూతాపం, నీటి ఎద్దడి లాంటి కారణాలతో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. ఎంతో మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు.
– అనారోగ్యకర ఆహారం, శీతలపానీయాలు స్థూలకాయత్వానికి దారితీస్తున్నాయి. క్యాన్సర్‌తోపాటు హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతున్నాయి.
ప్రపంచ ధరిత్రీ దినోత్సవం (World Earth Day)
– పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించడం కోసం ప్రతి ఏడాది ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలు ఏకమవుతారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమమే ప్రపంచ ధరిత్రీ దినోత్సవం.
-ధరిత్రీ దినోత్సవాన్ని ముందుగా 1970, ఏప్రిల్ 22న అమెరికాలో జరుపుకొన్నారు. ప్రస్తుతం 193 దేశాల్లోని 100 కోట్ల మంది ప్రజలు ఈ ధరిత్రీ దినోత్సవంలో భాగస్వాములై.. పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు పనిచేస్తున్నారు.
థీమ్ (2022): ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ (Invest in Our Planet).
– మొదట అమెరికాలో ధరిత్రీ దినోత్సవం నిర్వహించారు. 1990 నాటికి ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలు ప్రపంచ ధరిత్రీ దినోత్సవ కార్యక్రమంలో భాగమయ్యాయి.
– 2020లో ధరిత్రీ దినోత్సవ 50వ వార్షికోత్సవాలు నిర్వహించారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 50వ ధరిత్రీ దినోత్సవం జరుపుకొన్నారు.
భారత్‌కు నమీబియా చిరుతలు (Namibia Cheetahs to India)
-భారత్‌కు నమీబియా చిరుత పులులు రానున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో పాల్పూర్ వైల్డ్ లైఫ్ సాంక్చుయరీకి ఆ చిరుతలను తీసుకురానున్నారు.
– అయితే వివిధ దేశాల మధ్య వన్యప్రాణుల వాణిజ్యానికి ఎలాంటి అడ్డంకులు లేకపోయినా, వన్యప్రాణుల దేహభాగాల ఎగుమతి, దిగుమతులపై మాత్రం ఐక్యరాజ్యసమితి నిషేధం అమల్లో ఉంది.
-అందుకే ఏనుగు దంతాలు సహా తమ దగ్గరున్న వన్యప్రాణి ఉత్పత్తుల ఎగుమతులకు వీలుగా నిషేధం ఎత్తివేయాలని నమీబియా కోరుతున్నది. ఈ మేరకు నిషేధం ఎత్తివేయించడంలో భారత్ మద్దతును ఆశిస్తున్నది.
-నమీబియా చిరుతల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం ఇప్పటికే ఆ దేశ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఖతార్ ఎయిర్‌లైన్స్ ఎలాంటి రుసుము లేకుండా చిరుతలను భారత్‌కు తీసుకొచ్చేందుకు అంగీకరించిందని కునో ఫారెస్ట్ సర్కిల్‌కు చెందిన డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పీకే వర్మ తెలిపారు.
ప్రపంచ మలేరియా దినోత్సవం (World Malaria Day)
– ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ఏటా ఏప్రిల్ 25న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలేరియా ప్రభావిత సమూహాలను ఏకం చేయడానికి, మలేరియా వ్యతిరేక ప్రయత్నాల్లో శక్తిని కూడగట్టడం మలేరియా డే నిర్వహణ ప్రధాన ఉద్దేశం.
– మలేరియాను నిర్మూలించాలనేది ప్రపంచ దేశాల ఉమ్మడి లక్ష్యం. మలేరియా రహిత ప్రపంచాన్ని చూడాలనే ఉమ్మడి లక్ష్యసాధన కోసం ప్రతి ఏడాది ప్రపంచ మలేరియా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
థీమ్ (2022): హార్నెస్ ఇన్నోవేషన్ టు రెడ్యూస్ ద మలేరియా డిసీజ్ బర్డెన్ అండ్ సేవ్ లైవ్స్ (Harness Innovation to Reduce the Malaria Disease burden and save lives).
-చైనాలో 2017 నుంచి ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 2021లో చైనాకు మలేరియా రహిత దేశంగా సర్టిఫికెట్ ఇచ్చింది.
– WHO తాజా నివేదిక ప్రకారం.. 2020లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా 6,27,000 మలేరియా మరణాలు చోటుచేసుకున్నాయి. 2019తో పోల్చుకుంటే 2020లో 1.40 కోట్ల కేసులు, 69,000 మరణాలు పెరిగాయి.
-కానీ, కొన్ని దేశాల్లో మాత్రం 2020లో ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాలేదు. కాంబోడియా, మలేషియా, ది రిపబ్లిక్ ఆఫ్ కొరియా, వియత్నాం తదితర దేశాలు జీరో మలేరియా కేసులు నమోదైన దేశాల జాబితాలో ఉన్నాయి.
అరుదైన ఆర్కిడ్ (Rare Orchid Species)
-ప్రాసోఫిల్లమ్ మోర్గానీ అనే ఆర్కిడ్ జాతి మొక్కలు అత్యంత అరుదైనవి. ఇవి ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన మొక్కలు.
– ఈ ప్రాసోఫిల్లమ్ మోర్గానీ జాతి మొక్కల్నే ’ది కొబుంగ్రా లీక్ ఆర్కిడ్’ లేదా ’ది మిగ్నోనెట్టే లీక్ ఆర్కిడ్’ అని కూడా అంటారు. ఈ ఆర్కిడ్ జాతి మొక్కలను విక్టోరియాలోని కొబుంగ్రాలో తొలిసారి 1929లో గుర్తించారు. అయితే 1933 నుంచి ఈ జాతి మొక్కలు కనిపించకుండాపోయాయి.
– ఈ ఆర్కిడ్ జాతి మొక్క 12 నుంచి 20 సెంటీమీటర్ల పొడవున్న ఒకే పత్రాన్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా ఆకుపచ్చ-ఎరుపు వర్ణంలో ఉన్న ఒకే పుష్పాక్షంపై 50 నుంచి 80 పుష్పాలు గుంపుగా అమరి ఉంటాయి.
– 1933 నుంచి కనిపించకుండాపోయిన ఈ అరుదైన ఆర్కిడ్ జాతి మొక్క దాదాపు 89 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ కనిపించడం విశేషం.
కీలక అంశాలు
-ఈ ప్రాసోఫిల్లమ్ మోర్గానీ 89 ఏండ్లుగా కనిపించకుండా పోవడంతో విక్టోరియా రాష్ట్రానికి చెందిన ఫ్లోరా అండ్ ఫౌనా యాక్ట్-1988 కింద విలుప్తమైన జాతిగా ప్రకటించారు.
-అయితే, 2000 సంవత్సరంలో ప్రాసోఫిల్లమ్ మోర్గానీతో చాలా దగ్గరి పోలికలున్న మరో ఆర్కిడ్ జాతిని గుర్తించారు. న్యూ సౌత్‌వేల్స్‌లోని కోషియస్కో జాతీయ పార్కులో ఈ ఆర్కిడ్ను కనిపెట్టారు. దానికి ప్రాసోఫిల్లమ్ రెట్రోఫ్లెక్సమ్ అని నామకరణం చేశారు. సాధారణంగా దీన్ని ’ది కియాండ్రా లీక్ ఆర్కిడ్’ అంటారు.
తొలి కార్బన్ న్యూట్రల్ గ్రామం
(Palli as India’s First Carbon Neutral Panchayat)
– జమ్ముకశ్మీర్ సరిహద్దు జిల్లా అయిన సాంబా ఏప్రిల్ 24న భారతదేశ ఆధునిక చరిత్రలో చోటు సంపాదించింది. సాంబా జిల్లాలోని పల్లి గ్రామం దేశంలోనే తొలి కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా గుర్తింపు పొందింది.
– ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 24న పల్లి గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించడంతో ఆ గ్రామానికి కార్బన్ న్యూట్రల్ విలేజ్‌గా ఘనత దక్కింది.
కీలక అంశాలు
– కార్బన్ న్యూట్రల్ విలేజ్‌గా గుర్తింపు పొందడం ద్వారా పల్లి గ్రామం దేశానికి ఒక మార్గాన్ని చూపించిందని ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తంచేశారు.
-అదేవిధంగా ప్రధాని నరేంద్రమోదీ తమ గ్రామానికి రావడంపట్ల పల్లి గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తంచేశారు. ఏప్రిల్ 24ను రెడ్ లెటర్ డే గా అభివర్ణించారు.
మనిషిలో తొలిసారి H3 N8 బర్డ్ ఫ్లూ
(China reports First Human Case of H3 N8 Bird Flu)
– సాధారణంగా H3 N8 రకం బర్డ్ ఫ్లూ లేదా బ్రెయిన్ ఫ్లూ పక్షుల్లో కనిపిస్తుంది. కానీ చైనాలో ఒక మానవునిలో ఈ రకం బర్డ్ ఫ్లూ వైరస్ ను గుర్తించారు. ప్రపంచంలో మనుషుల్లో ఈ రకం బర్డ్ ఫ్లూ కేసు నమోదవడం ఇదే తొలిసారి. అంటే ఇదే తొలి కేసు అన్నమాట.
-అయితే మనుషుల్లో H3 N8 రకం బర్డ్ ఫ్లూ కనిపించినా.. దానిలో ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే శక్తి తక్కువగానే ఉందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఏప్రిల్ 26న ఒక ప్రకటనలో పేర్కొన్నది.
– హెనాన్ సెంట్రల్ ప్రావిన్స్‌లోని నాలుగేండ్ల బాలుడిలో H3 N8 రకం బర్డ్ ఫ్లూ బయటపడిందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 5న బాలుడికి జ్వరం వచ్చి తగ్గకపోవడంతో ఐదు రోజుల తర్వాత కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారని, వైద్యపరీక్షల్లో అతనికి H3 N8రకం బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలిందని ఆరోగ్య అధికారులు వెల్లడించారు. బాలుడు ఇంట్లో పెంపుడు కోళ్లు, కాకులతో ఎక్కువ కలిసి ఉండటంవల్ల వైరస్ సోకిందన్నారు.
-బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ వైరస్లలో చాలా రకాలు మానవులపై ఎలాంటి దుష్ప్రభావం చూపవని ఆరోగ్య నిపుణులు తెలిపారు. అయితే, H5 N1, H7 N9 రకాలు మాత్రం మనుషుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్లను కలుగజేస్తాయని చెప్పారు.
– H3 N8 రకం బర్డ్ ఫ్లూను మొదటిసారి 2002లో ఉత్తర అమెరికాకు చెందిన నీటి పక్షిలో గుర్తించారు. ఆ తర్వాత గుర్రాలు, కుక్కలు, సీల్స్‌లో కూడా ఈ వైరస్ సోకింది. కానీ మానవుల్లో మాత్రం ఇప్పుడే తొలిసారి కనిపించింది.
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
గోబర్ ధన్ ప్లాంటును ఎక్కడ ఏర్పాటు చేశారు? (Groups Special)
తెలంగాణ చిత్రకళాకారులు – ఘనతలు
విద్యా సంస్కరణలతో వికాసం (groups special)
ఖనిజాల కాణాచి అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? (Groups Special)
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం (Groups Special)
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)