సంక్లిష్ట ఆహారం.. సరళ పదార్థాలుగా… ( పోటీ పరీక్షల ప్రత్యేకం)
మనం తీసుకునే ఆహారంలోని సంక్లిష్ట కర్బన పదార్థాలను (కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులను) సరళ పదార్థాలుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటారు. జీర్ణవ్యవస్థలో నోరు, ఆస్యకుహరం, గ్రసని, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్ద పేగు పురీషనాళం, పాయువు అనే భాగాలుంటాయి. ఇవి కాకుండా లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, అంతఃస్రావక గ్రంథులతో పాటు కాలేయం, క్లోమం వంటి జీర్ణగ్రంథులు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
జీర్ణక్రియ
ఆస్యకుహరం
నోటి లోపలి కుహరాన్ని ఆస్యకుహరం అంటారు. దీనిలో నాలుక, లాలాజల గ్రంథులు ఉంటాయి. నోటిలోకి తీసుకున్న ఆహారం ఇక్కడే లాలాజలంలో కలుస్తుంది. మానవుడిలో మూడు జతల లాలాజల గ్రంథులు ఉంటాయి.
నోట్: ఆహారాన్ని నోటిలోకి తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు.
ఎ. పెరోటిడ్ గ్రంథులు
బి. అధో జంబికా గ్రంథులు
సి. అధో జిహ్వకా గంథులు
నోట్: కుందేలులో నిమ్ననేత్ర కోటర గ్రంథి అదనంగా ఉంటుంది.
ఎ. పెరోటిడ్ గ్రంథులు: ఇవి చెవిడొప్ప(పిన్నా) పీఠభాగంలో ఉంటాయి. ఒక్కొక్క గ్రంథి పైదవడలోని కుంతకాల వెనుక స్టెన్సన్ నాళం ద్వారా ఆస్యకుహరంలోకి తెరుచుకుంటాయి.
బి. అధో జంబికా గ్రంథులు: ఇవి రెండు దవడల సంధిస్థానంలో ఉంటాయి. ఇవి కింది దవడపై గల కుంతకాలకు సమీపంలో ఆస్యకుహరానికి వార్టన్నాళం ద్వారా తెరుచుకుంటాయి.
సి. అధోజిహ్వకా గ్రంథులు: ఇవి నాలుక కింది భాగంలో ఉంటాయి. ఇవి అనేక చిన్న నాళాల ద్వారా నాలుకకు కింద ఆస్యకుహరంలోకి తెరుచుకుంటాయి.
డి. నిమ్న నేత్ర కోటర గ్రంథులు: ఇవి నేత్రకోటరాలకు దిగువన ఉంటాయి. ఇవి కేవలం కుందేలులో మాత్రమే ఉంటాయి. మానవుడిలో ఉండవు.
#మానవుడు రోజుకు సుమారు 1.5 లీటర్ల లాలాజలాన్ని స్రవిస్తాడు. ఇది కొద్దిగా ఆమ్లయుతంగా (ph 6.9) ఉంటుంది. దీనిలో నీరు, ఖనిజలవణాలు, శ్లేష్మంతోపాటు టయలిన్ (లాలాజల ఎమైలేజ్) అనే ఎంజైమ్ ఉంటుంది.
# టయలిన్ ఎంజైమ్ మనం తీసుకున్న ఆహారంలోని పిండిపదార్థాలను (కార్బోహైడ్రేట్లు) చక్కెరలుగా మారుస్తుంది.
# తీసుకున్న ఆహారం ఆస్యకుహరంలో లాలాజలంతో కలిసి ముద్దగా మారుతుంది. దీన్ని బోలస్ అంటారు.
ఆహార వాహిక
# ఇది కండరయుతమైన గోడలు కలిగిన సన్నని పొడవైన నాళం. ఆహారవాహిక లోపలి పొర నిలువుగా ముడతలు పడి ఉంటుంది. దీనిలో అనేక శ్లేష్మగ్రంథులుండి శ్లేష్మాన్ని స్రవిస్తాయి. తద్వారా ఆహారం సులువుగా జారుతుంది. దీనిలో జరిగే పెరిస్టాలిటిక్ చలనాలు ఆహారాన్ని జీర్ణాశయంలోకి నెట్టడానికి తోడ్పడతాయి. ఆహారవాహిక ప్రథమ భాగంలో రేఖిత కండరాలు, చివరి భాగంలో అరేఖిత కండరాలు, మధ్యభాగంలో రేఖిత, అరేఖిత కండరాలుంటాయి.
జీర్ణాశయం
#ఇది పెద్దగా ఉండే కండరయుతమైన సంచి వంటి నిర్మాణం. జీర్ణాశయం ఉదరకుహర పూర్వభాగంలో ఎడమవైపున అమరి ఉంటుంది. దీన్ని హార్థిక భాగం, ఫండిక్ భాగం, జఠరనిర్గమ భాగం అనే మూడు భాగాలుగా విభజించారు. జఠర నిర్గమ భాగంలో ఉండే జఠర నిర్గమ సంవరిణి ద్వారా ఆహారం జీర్ణాశయం నుంచి చిన్నపేగు మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి ప్రవేశిస్తుంది. జీర్ణాశయం గోడలో నాలుగు పొరలుంటాయి. అవి వెలుపలి సీరస్ పొర, కండరస్తరం, అధఃశ్లేష్మస్తరం, లోపలి శ్లేష్మస్తరం. జీర్ణాశయపు లోపలి ఉపకళ అనేక ముడుతలుపడి ఉంటుంది. వీటిని రూగే అంటారు. ఇవి జీర్ణాశయం విస్తరించడానికి తోడ్పడతాయి. జీర్ణాశయపు గోడల్లో ఉండే గ్రంథులను జఠర గ్రంథులు అంటారు. ఇవి జఠర రసాన్ని స్రవిస్తాయి.
#జీర్ణాశయంలో ఆహారం జఠర గ్రంథుల నుంచి విడుదలయ్యే జఠర రసంతో బాగా కలుస్తుంది. జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCl), మ్యూసిన్, పెప్సినోజన్, లైపేజ్, ప్రోరెనిన్ ఉంటాయి.
#మానవుడి జీర్ణాశయంలో సుమారు 35 మిలియన్ల జఠర గ్రంథులు ఉంటాయి.
పెప్సినోజన్—-HCl——పెప్సిన్
పోరెనిన్—–HCl——రెనిన్
# ఆహారంతో పాటు జీర్ణాశయంలోకి చేరిన బ్యాక్టీరియా, ఇతర హానికర సూక్ష్మజీవులను HCl చంపుతుంది. అలాగే HCl పెప్సినోజన్ను పెప్సిన్గా, ప్రోరెనిన్ను రెనిన్గా మారుస్తుంది.
ప్రొటీన్లు—- పెప్సిన్——-పెప్టోన్లు, ప్రోటియోజ్లు
# ఆమ్ల మాధ్యమంతో పెప్సిన్ ఎంజైమ్ ఆహారంలోని మాంసకృత్తులను (ప్రొటీన్లు) పెప్టోన్లు, ప్రొటియోజ్లుగా జీర్ణం చేస్తుంది.
#జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. ఈవిధంగా పాక్షికంగా జీర్ణమైన ఆమ్ల లక్షణాలున్న ద్రవరూప ఆహారాన్ని కైమ్ అంటారు. ఇది జఠర నిర్గమ సంవరిణి ద్వారా ఆంత్రమూలంలోకి ప్రవేశిస్తుంది.
చిన్నపేగు
# ఇది సుమారు 4-7 మీటర్ల పొడవుండే సన్నని మెలికలు పడిన నాళం. దీన్ని 3 భాగాలుగా విభజించారు.
ఎ. ఆంత్రమూలం
బి. జెజునం
సి. ఇలియం
# ఆంత్రమూలం సమీప్య భాగంలోకి కాలేయం నుంచి వచ్చే పైత్యరసనాళం, దూరస్థ భాగంలోకి క్లోమం నుంచి వచ్చే క్లోమనాళం తెరుచుకుంటాయి.
# ఆంత్రమూలం మినహా మిగిలిన చిన్నపేగు భాగాన్ని శేషాంత్రికం అంటారు.
# చిన్నపేగు గోడల్లో ఉన్న వేళ్లలాంటి నిర్మాణాలను సూక్ష్మ చూషకాలు అంటారు. ఇవి చిన్నపేగు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. తద్వారా జీర్ణమైన ఆహారం అధికమొత్తంలో రక్తంలోకి శోషణం చెందుతుంది.
# చిన్నపేగులోని లిబర్కున్ పుటికలు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి. వీటితోపాటు పైత్యరసం, క్లోమరసం ఆంత్రమూలంలోకి చేరుతాయి.
#క్లోమరసం Ph-8.0
# ఆంత్రరసం Ph-7.6
# పైత్యరసం Ph- 7.0- 7.6 మధ్య ఉంటుంది.
# పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు.
#క్లోమరసంలో ట్రిప్సిన్, కీమోట్రిప్సిన్ అనే ఎంజైమ్లు ప్రొటీన్లను పెప్టోన్లు, అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి.
ట్రిప్సిన్
ప్రొటీన్లు——————-అమైనో ఆమ్లాలు
కీమోట్రిప్సిన్
# క్లోమ రసంలోని ఎమైలేజ్ పిండిపదార్థాలను మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్ వంటి చక్కెరలుగా మారుస్తుంది.
పిండిపదార్థాలు—–ఎమైలేజ్——మాల్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్
# కైమ్లోని కొవ్వు పదార్థాలను పైత్యరసంలోని పైత్యరస లవణాలు ఎమల్సీకరిస్తాయి. క్లోమంలోని లైపేజ్ను స్టియాప్సిన్ అంటారు.
ఆంత్రరస లైపేజ్ ఎమల్సీకరించిన సరళ కొవ్వు పదార్థాలను (ట్రైగ్లిజరైడ్లు) కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్గా మారుస్తుంది.
పెద్దపేగు
# పెద్దపేగులో ఎటువంటి జీర్ణక్రియ జరగదు. జీర్ణం కాని వ్యర్థ పదార్థాల్లో శరీరానికి ఉపయోగపడే లవణాలు, నీటిని శోషిస్తుంది.
కొలాన్: జీర్ణం కాని మిగిలిన అవశేష పదార్థంలో ఉన్న నీటిని కొలాన్ శోషణం చేసుకుంటుంది. అంధనాళంలోని సూక్ష్మజీవుల చర్యవల్ల ఏర్పడిన చక్కెరలు, విటమిన్లు కొన్ని ఎంజైమ్లు కూడా మల అవశేష పదార్థంలో ఉంటాయి.
మల విసర్జన
జీర్ణంకాని మల పదార్థాన్ని బయటకు పంపడాన్ని మల విసర్జన అంటారు. ఇది పురీషనాళాన్ని చేరి పెల్లెట్ల రూపంలో పాయువు ద్వారా విసర్జితమవుతుంది.
# కుందేలు విసర్జించిన మలాన్ని తానే ఆహారంగా తీసుకుంటుంది దీన్ని మలకబలనం (కాప్రోఫెగి) అంటారు.
జీర్ణగ్రంథులు
కాలేయం
# ఇది దేహంలో అతిపెద్ద గ్రంథి. ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగులో ఉంటుంది. ఇది జీర్ణాశయానికి కుడివైపున విభాజకపటలానికి కింద అమరి ఉంటుంది. కాలేయం పైత్యరసాన్ని స్రవిస్తుంది. పైత్యరసం పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. కాలేయం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెపటాలజీ అంటారు. కాలేయం హీమోగ్లోబిన్ను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా ఏర్పడిన ఉత్పన్నకాలు పైత్యరస వర్ణకాల్లో (బైలురూబిన్, బలువర్డిన్) కలుస్తాయి.
క్లోమం
#ఆది ఆంత్రమూలంలోని శిక్యంలో ఇమిడి ఉంటుంది. క్రమరహితమైన పలుచని బల్లపరుపుగా ఉండే గ్రంథి. ఇది రెండో అతిపెద్ద గ్రంథి. దీన్ని మిశ్రమ గ్రంథి అంటారు. క్లోమరసాన్ని స్రవిస్తుంది. క్లోమం క్షారయుతంగా ఉంటుంది.
ఎంజైమ్లు
జీర్ణక్రియలో ఆహారంలోని ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్లను విశ్లేషణం చేసే రసాయనిక పదార్థాలను ఎంజైమ్లు అంటారు.
#వీటికి ఎంజైమ్లు అని నామకరణం చేసిన శాస్త్రవేత్త ‘కుహ్నే’.
# ఎంజైమ్లను జీవ ఉత్స్రేరకాలు అంటారు.
#ఎంజైమ్లు అన్నీ ప్రొటీన్లే అయినప్పటికీ ఇవి ప్రొటీనేతర పదార్థాలతో కలిసి ఉంటాయి. ఇటివంటి ఎంజైమ్లను సంపూర్ణ ఎంజైమ్లు అంటారు.
# ప్రొటీన్ రూపంలో ఉన్న ఎంజైమ్ను ‘ఎపో ఎంజైమ్’ అని, ప్రొటీనేతర ఎంజైమ్ను ‘సహ ఎంజైమ్’ లేదా ‘కో ఎంజైమ్ అంటారు.
# సహ ఎంజైమ్లు అన్నీ బి-కాంప్లెక్స్ విటమిన్ల నుంచి ఏర్పడతాయి.
#జంతువుల ఆహార నాళంలో మూడు రకాల ఎంజైములుంటాయి. అవి:
1. ప్రొటియేజ్లు
2. కార్బోహైడ్రేజ్లు
3. లైపేజ్లు
—————————————
ప్రాక్టీస్ బిట్స్
1. కుందేలులో లోపించిన దంతాలు ఏవి?
1) కుంతకాలు 2) చర్వణకాలు
3) రదనికలు 4) అగ్రచర్వణకాలు
2. హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం ఫలితంగా ఏర్పడిన వర్ణకాలు ఏవి?
1) యూరోక్రోమ్, బైలురూబిన్
2) బైలురూబిన్, బైలువర్డిన్
3) యూరియా, బైలువర్డిన్
4) యూరోక్రోమ్, బైలురూబిన్
3. జతపరచండి.
1)పైత్యరసం ఎ. ట్రిప్సిన్
2) ఆంత్రరసం బి. పెప్సిన్
3) క్లోమరసం సి. ఎంజైమ్లు ఉండవు
4) జఠర రసం డి. సక్కస్ ఎంటరికస్
1) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
2) 1-డి, 2- బి, 3-సి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4. జీర్ణాశయంలో ప్రోరెనిన్ను రెనిన్గా మార్చేది?
1) పారాకెసిన్ 2) హైడ్రోక్లోరిక్ ఆమ్లం
3) పెప్సిన్ 4) కీమోట్రిప్సిన్
5. కుందేలులో మాత్రమే కనిపించే లాలాజల గ్రంథులు ఏవి?
1) పెరోటిడ్ గ్రంథులు
2) అధోజంబికా గ్రంథులు
3) నిమ్ననేత్ర కోటర గ్రంథులు
4) అధో జిహ్వకా గ్రంథులు
6. పాక్షికంగా జీర్ణమైన ఆమ్ల లక్షణాలున్న ద్రవరూప ఆహారాన్ని ఏమంటారు?
1) ఖైల్ 2) కైమ్
3) బోలస్ 4) కాప్రోఫెగి
7. మానవుడి దంత సూచిక ఏది?
1) 2033/1023 2) 2123/2123
3) 3131/3121 4) 5134/4134
8. కొవ్వుల ఎమల్సీకరణ ఎక్కడ జరుగుతుంది?
1) క్లోమం 2) పిత్తాశయం
3) కాలేయం 4) జీర్ణాశయం
9. ఆంత్రరసం Ph విలువ ఎంత?
1) 15-20 2) 7-6
3) 6-9 4) 8.0
10. సూక్ష్మ చూషకాలు అమరిఉన్న భాగం
1) పెద్దపేగు 2) ఆంత్రమూలం
3) చిన్నపేగు 4) కొలాన్
సమాధానాలు
1. 3 2. 2 3. 1 4. 2 5. 3
6. 2 7. 2 8. 3 9. 2 10. 3
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి
రంగారెడ్డి జిల్లా
9000674747
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?